అఫ్గానిస్తాన్‌లో భూకంపం: 800 మందికి పైగా మృతి, 2000 మందికి పైగా గాయాలు, ప్రస్తుతం అక్కడెలా ఉందంటే..

అఫ్గానిస్తాన్, భూకంపం, తాలిబాన్

ఫొటో సోర్స్, Getty Images

తూర్పు అఫ్గానిస్తాన్‌ను తాకిన 6.0 తీవ్రతతో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకు 800 మందికి పైగా మరణించగా, 2,000 మందికి పైగా గాయపడినట్లు సమాచారం అందుతోంది.

ఈ భూకంపం ధాటికి 800 మందికి పైగా మరణించగా, 2 వేల మందికి పైగా గాయపడినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

భూకంప కేంద్రం అఫ్గానిస్తాన్‌లోని 5వ అతిపెద్ద నగరమైన జలాలాబాద్ నుంచి 27 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలం నుంచి దాదాపు 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది.

అర్ధరాత్రి సంభవించిన భూకంపం కారణంగా మట్టి, రాతితో నిర్మించిన ఇళ్లు నేలకూలాయి. దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వరకూ భూకంప ప్రకంపనల ప్రభావముంది.

ఫోన్ సిగ్నల్స్ పెద్దగా లేని మారుమూల ప్రాంతాలు భూకంపానికి ప్రభావితమయ్యాయి. కొండచరియలు విరిగిపడడం వల్ల రోడ్లు మూతపడ్డాయి.

శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను కాపాడి, హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'మూడు గ్రామాలు పూర్తిగా నాశనం'

అంతకుముందు, అఫ్గానిస్తాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ 'రేడియో టెలివిజన్ అఫ్గానిస్తాన్' (ఆర్టీఏ) మరణాల సంఖ్యను దాదాపు 500 మందిగా పేర్కొంది. రాజధాని కాబూల్‌లోని ఆరోగ్య అధికారులు, రెస్క్యూ బృందాలు మారుమూల గ్రామాలకు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

కాగా, ఈ ప్రాంతం గతంలో చాలాసార్లు భూకంపాలు, వరదల బారిన పడింది.

"కొన్ని క్లినిక్‌ల నుంచి వచ్చిన డేటా ప్రకారం, 400 మందికి పైగా గాయపడ్డారు. డజన్ల కొద్దీ మరణించారు" అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి షరఫత్ జమాన్ రాయిటర్స్‌తో అన్నారు.

ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అన్నారాయన.

క్షతగాత్రులను హెలికాప్టర్లలో తరలిస్తున్నట్లు, గాయపడిన వారిని అంబులెన్స్‌ వద్దకు తీసుకెళ్లడానికి సైనికులు, వైద్యులకు స్థానిక ప్రజలు సాయం చేస్తున్నట్లు రాయిటర్స్ వార్తాసంస్థ ఫోటోలలో కనిపిస్తోంది.

కునార్ ప్రావిన్స్‌లోని మూడు గ్రామాలు పూర్తిగా నాశనమయ్యాయని, అనేక ఇతర గ్రామాలు కూడా భారీ నష్టాన్ని చవిచూశాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది.

జలాలాబాద్ విమానాశ్రయం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా జలాలాబాద్ విమానాశ్రయానికి తరలిస్తున్నారు.

ఒకే గ్రామంలో 30 మంది మృతి

ఒకే గ్రామంలో 30 మంది మరణించారని, గాయపడిన వందలాది మందిని ఆసుపత్రికి తరలించినట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయని అధికారులు తెలిపారు.

సహాయక బృందాలు పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా సరిహద్దు ప్రాంతాలలో శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం వెతుకుతున్నాయి.

"ఇప్పటివరకు ఏ విదేశీ ప్రభుత్వం సహాయ, రక్షణ కార్యకలాపాలకు సహాయం అందించలేదు" అని తాలిబాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్నారు.

అఫ్గనిస్తాన్ భూకంప బాధితురాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భూకంప బాధితురాలు

వైద్యులు ఏం చెప్పారు?

భూకంపం వల్ల ఎక్కువగా ప్రభావితమైన కునార్ ప్రావిన్స్ నుంచి నష్టానికి సంబంధించిన వార్తలు నిరంతరం వస్తున్నాయి.

కునార్ రాజధాని అసదాబాద్‌లోని ప్రావిన్షియల్ హాస్పిటల్ హెడ్, డాక్టర్ ములాదాద్ రాత్రంతా నిద్ర లేకుండానే పనిచేస్తున్నారు. రోగులకు నిరంతరం చికిత్స అందించడానికి తన సిబ్బందికి సూచనలు ఇస్తున్నారాయన.

ప్రతి ఐదు నిమిషాలకు ఒక రోగిని చేర్చుకుంటున్నారని, మొత్తం ఆసుపత్రి క్షతగాత్రులతో నిండిందని ములాదాద్ చెప్పారు.

గత కొన్నిగంటల్లో మహిళలు, పిల్లలు సహా 188 మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకువచ్చారని చెప్పారు. పడకల కొరత కారణంగా, చాలామంది రోగులు నేలపై పడుకోవలసి వచ్చిందని ఆయన తెలిపారు.

పరిస్థితి తీవ్రంగా ఉందని ములాదాద్ అభిప్రాయపడ్డారు. ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారాయన. గాయపడిన దాదాపు 250 మందిని పొరుగున ఉన్న నంగర్హార్ ప్రావిన్స్‌లోని ప్రధాన ఆసుపత్రికి తరలించారు.

ఇప్పటివరకు, నాలుగు మృతదేహాలను ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. డజన్ల కొద్దీ మృతదేహాలను ఇతర స్థానిక క్లినిక్‌లకు తరలించినట్లు డాక్టర్ ములాదాద్ చెప్పారు.

అఫ్గనిస్తాన్ భూకంప బాధితుడు

ఫొటో సోర్స్, Getty Images

అఫ్గానిస్తాన్ తరచుగా ప్రాణాంతక భూకంపాలకు గురవుతోంది. ముఖ్యంగా భారత, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే హిందూకుష్ పర్వత శ్రేణి ప్రాంతంలో భూకంపాలు ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి.

2023 అక్టోబర్‌లో దేశంలోని పశ్చిమ ప్రావిన్స్ హెరాత్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించడంతో దాదాపు 1,500 మంది మరణించారు. ఇది భూమికి 14 కిలోమీటర్ల లోతులో సంభవించింది, కాబట్టి చాలా విధ్వంసకరమైనదిగా పరిగణించారు.

ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటైన అఫ్గానిస్తాన్, ప్రకృతి వైపరీత్యాలకు ఎంత దుర్బలంగా ఉందో ఇది చూపిస్తుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)