జపాన్: ఫుకుషిమా ప్లాంట్‌లో ఆనాడు ఏం జరిగింది, తాజా సునామీ వార్నింగ్‌కు జనం ఎందుకు తీవ్రంగా భయపడ్డారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, యివెట్ టాన్
- హోదా, బీబీసీ న్యూస్
- సునామీ హెచ్చరికలతో ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్‌లో కార్మికులందరినీ తరలించిన అధికారులు, తర్వాత సునామీ హెచ్చరికలను జపాన్ ఉపసంహరించుకుంది.
- 2011లో జపాన్‌లో భారీ భూకంపం, సునామీతో దెబ్బతిన్న ఫుకుషిమా ప్లాంట్
- ఆ సునామీ వల్ల ప్లాంట్‌లో పలు రసాయనిక విస్ఫోటనాలు
- ఇప్పుడిప్పుడే న్యూక్లియర్ ఎనర్జీలోకి మారుతోన్న జపాన్
- ప్రపంచంలో భూకంపాలు అత్యధికంగా వచ్చే 'రింగ్ ఆఫ్ ఫైర్'లో జపాన్
జపాన్‌లో సునానీ హెచ్చరికల నేపథ్యంలో ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్‌లోని కార్మికులందర్ని అక్కడి నుంచి ఖాళీ చేయించారు.
4వేల మంది ఉద్యోగులను ఖాళీ చేయించినట్లు ప్లాంట్ ఆపరేటర్ తెలిపారు. ప్రస్తుతానికి ప్లాంట్‌లో ఎలాంటి ఇబ్బందులు కనిపించలేదని అన్నారు.
రష్యా తూర్పు తీరంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో రష్యా, జపాన్, అమెరికాలలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
బుధవారం స్థానిక కాలమాన ప్రకారం 11 గంటల 25 నిమిషాలకు రష్యాలోని తూర్పు కమ్చట్కా ద్వీపకల్పంలో ఈ భూకంపం సంభవించింది.
ఇప్పటి వరకు ప్రపంచం చూసిన అత్యంత విపత్కర అణు ప్రమాదాల్లో ఒకటైన 2011 నాటి ఫుకుషిమా అణు విద్యుదుత్పత్తి కేంద్రంలో జరిగిన ప్రమాదాన్ని ఈ సునామీ హెచ్చరికలు మరోసారి గుర్తు చేశాయి.
ఫుకుషిమా పరిధిలోని చాలామందికి, సునామీ హెచ్చరికలతో నాటి సంఘటనలే మదిలో మెదులుతున్నాయి.
అయితే, జపాన్ ప్రభుత్వం తరువాత సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకుంది.

2011 మార్చిలో జపాన్‌లో 9.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ భూకంపం తర్వాత వచ్చిన సునామీతో 18 వేల మందికి పైగా మరణించారు.
ఈ భూకంప తీవ్రత వల్ల ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లోకి ఒక భారీ అల రక్షణ వలయాలను ఛేదించుకుని ప్లాంటులో ఉన్న రియాక్టర్లను ముంచేసింది. ఎమర్జెన్సీ జనరేటర్లు పనిచేయలేదు.
కరెంటును పునరుద్ధరించడం కోసం కార్మికులు ప్రయత్నించారు. కానీ, ఒక రియాక్టర్లో ఉన్న న్యూక్లియర్ ఇంధనం వేడెక్కిపోయి వాటి ముఖ్య భాగాలను కొంత వరకు కరిగించేసింది. దీనినే న్యూక్లియర్ మెల్ట్ డౌన్ అని అంటారు.
దెబ్బతిన్న ఫుకుషిమా రియాక్టర్‌లో వందలాది టన్నుల ప్రమాదకర పదార్థాలు ఇప్పటికీ ఉన్నాయి.
ఆ సునామీ వచ్చి 14 ఏళ్లు దాటినా, ఇప్పటికీ ఆనాటి వ్యర్థ జలాల చుట్టూ ఎన్నో సవాళ్లు, వివాదాలు నెలకొన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఫుకుషిమా న్యూక్లియర్ సైట్‌లో ఏం జరిగింది?
2011 మార్చి 11న స్థానిక సమయం 14:46 గంటలకు సంభవించిన గ్రేట్ ఈస్ట్ జపాన్ ఎర్త్ క్వేక్, పవర్ ప్లాంటుకు 97 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెండై నగరపు తూర్పు భాగాన్ని కుదిపేసింది. సునామీ తీరాన్ని తాకుతుందన్న హెచ్చరిక అక్కడి ప్రజలకు కేవలం 10 నిమిషాల ముందే తెలిసింది.
రిక్టర్ స్కేల్‌పై 9.1 మాగ్నిట్యూడ్‌తో వచ్చిన ఈ భారీ భూకంపం కారణంగా భూమి తన అక్షం నుంచి పక్కకు కూడా జరిగింది. అది భారీ సునామీకి కూడా కారణమైంది.
భూకంపం, సునామీ కారణంగా హైడ్రోజన్ పేలుళ్ల సంభవించి ఫుకుషిమా రియాక్టర్ బిల్డింగ్స్ దెబ్బతిన్నాయి. ప్లాంట్‌లో పలు రసాయనిక విస్ఫోటనాలు జరిగాయి. దీని వల్ల ప్లాంటు భవనాలన్నీ నాశనమయ్యాయి.
ఈ పరిస్థితి మరింత దిగజారి, వాతావరణంలోకి, పసిఫిక్ మహా సముద్రంలోకి రేడియో యాక్టివ్ పదార్ధాలు వెలువడటం ప్రారంభమైంది.
ప్లాంటు నుంచి వెలువడే రేడియషన్ పెరుగుతూ ఉండటంతో అధికారులు ఆ చుట్టు పక్కల ఉండే మినహాయింపు ప్రాంత పరిధిని 30 కి.మీల వరకు పెంచుతూ వెళ్లారు.
దీంతో, ఆ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి సుమారు 1,50,000 మందిని తరలించాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
న్యూక్లియర్ వ్యర్థాలను శుభ్రపరచడం ఎందుకంత కష్టం?
ఆ సునామీ ధాటికి కరిగిన న్యూక్లియర్ ఫ్యూయల్, రియాక్టర్ స్ట్రక్చర్లతో కలిసిన టన్నులకొద్దీ ప్రమాదకర పదార్థాలు ఇంకా ఫుకుషిమా ప్లాంట్ లోపలే ఉన్నాయి.
రియాక్టర్ల నుంచి ఈ వ్యర్థాలను తొలగించడం అతిపెద్ద సవాలుగా మారింది.
ఇక్కడ పేరుకుపోయిన న్యూక్లియర్ వ్యర్ధాలను, ఫ్యుయల్ రాడ్లను, లక్షల టన్నుల రేడియో యాక్టివ్ పదార్ధాలతో నిండిన నీటిని తొలగించడానికి రానున్న 30 - 40 సంవత్సరాలలో కొన్ని వేల మంది కార్మికులు అవసరమవుతారు.
వీటిని శుభ్రపరించేందుకు సుమారు 21.5 ట్రిలియన్ యెన్లు (రూ.12,68,000 కోట్లు) అవసరం పడతాయని అంచనా.
2037 వరకు లేదా ఆ తర్వాత నాటికి కరిగిన ఇంధన వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగించే ప్రక్రియను ప్రారంభిస్తామని ఈ వారం మొదట్లోనే టెప్కో (టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ హోల్డింగ్స్) చెప్పింది.
వ్యర్థాలను తొలగించే ప్రక్రియకు సన్నద్ధమవ్వడానికి కనీసం 12 నుంచి 15 ఏళ్లు పడుతుందని తెలిపింది.
వ్యర్థాలను తొలగించే ప్లాన్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.
''భారీ ఎత్తున వ్యర్థాలను 2037 నుంచి 2051 మధ్య 14 ఏళ్లలో తొలగించడం సాధ్యమవుతుందని నిజంగా ఎవరు నమ్ముతారు? ఫుకుషిమా పునరుద్ధరణకు, ఇలాంటి అసాధ్యమైన లక్ష్యాలు అంత మంచిది కాదు'' అని వసేదా యూనివర్సిటీలోని ఎన్విరాన్‌మెంటల్ ఎకనామిక్స్, పాలసీ స్టడీస్ ప్రొఫెసర్ షుంజి మాత్సౌకా స్థానిక న్యూస్ అవుట్‌లెట్ ఆసాహికి చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
జపాన్ తిరిగి న్యూక్లియర్ పవర్‌లోకి మారుతోందా?
ఫుకుషిమా విపత్తు తర్వాత జపాన్ న్యూక్లియర్ ఎనర్జీ సమకూర్చుకోవాలన్న ప్రయత్నాల నుంచి బయటకి వచ్చింది. కానీ, ప్రభుత్వం నెమ్మదిగా తన విధానాన్ని మారుస్తోంది.
అత్యధికంగా విద్యుత్ అవసరం ఉన్న ఏఐ, సెమీ కండక్టర్లు వంటి రంగాల నుంచి పెరుగుతోన్న డిమాండ్‌ను చేరుకునేందుకు న్యూక్లియర్‌పై ఆధారపడాల్సి ఉందని ఈ ఏడాది ప్రారంభంలో జపాన్ చెప్పింది. దీనికోసం ఒక ఎనర్జీ ప్లాన్‌ను కూడా విడుదల చేసింది.
ఫుకుషిమా నేపథ్యంలో తమ ప్రాజెక్టును రద్దు చేసిన యుటిలిటీ కంపెనీ కాన్సాయ్ ఎలక్ట్రిక్ పవర్, కొత్త రియాక్టర్‌ను ఏర్పాటు చేయాలా? వద్దా? అని చూస్తున్నట్లు ఈ వారం తెలిపింది.
అయితే, ఇలాంటి ప్లాన్లకు స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తోంది. బుధవారం జారీ అయిన సునామీ హెచ్చరికలు మరింత ఆందోళనను రేకెత్తించింది. అయితే, తర్వాత ప్రభుత్వ వాటిని ఉపసంహరించుకుంది.
దేశంలోని తీర ప్రాంతంలో ఫుకుషిమాతో పాటు పలు ప్రాంతాలను సునామీ అలలు తాకాయని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.
ఆ ప్రాంతాల్లో 3 మీటర్ల వరకు అలలు ఎగిసిపడుతుండొచ్చని తెలిపింది. వేలమందిని వారి సురక్షితం కోసం ఆ ప్రాంతాల నుంచి తరలివెళ్లాలని ఆదేశించింది.
ప్రపంచంలో భూకంపాలు అత్యధికంగా వచ్చే 'రింగ్ ఆఫ్ ఫైర్' అనే ప్రాంతంలో ఈ దేశం ఉండటమే దీనికి కారణం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














