రష్యాలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు

ఫొటో సోర్స్, Getty Images
రష్యా తూర్పు తీరంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత 8.8గా నమోదైంది. దీంతో రష్యా, జపాన్, అమెరికాలలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
బుధవారం స్థానిక కాలమానప్రకారం 11 గంటల 25 నిమిషాలకు రష్యాలోని తూర్పు కమ్చట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది.
కమ్చట్కాలోని కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 13 అడుగులు ఎత్తున అలలతో సునామీ వచ్చినట్టు చెప్తున్నారు.
దీంతో రష్యాలోని సెవరో కురిస్క్ పట్టణాన్ని సునామీ ముంచెత్తిందని ఆ దేశానికి చెందిన ఎమర్జెన్సీస్ మినిస్ట్రీ వెల్లడించింది.
2 వేల మంది జనాభా ఉన్న ఈ చిన్న పట్టణంలో సునామీకి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.


ఫొటో సోర్స్, Reuters
ఉత్తర జపాన్‌లోని హొక్కైడోలోని ఒక నగరంలోకి 30 సెంటీమీటర్ల మేర నీరు చేరింది.
దీని తరువాత అలలు మరింత పెద్ద ఎత్తున రావచ్చని అధికారులు హెచ్చరించారు.
అలాస్కా, హవాయిలకు అమెరికా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
అమెరికా ద్వీప భూభాగమైన గువామ్, మైక్రోనేషియాలోని ఇతర ద్వీపాలకు కూడా సునామీ హెచ్చరికలు అమలులో ఉన్నాయి.
రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో ఈ భూకంపం వచ్చినట్లు యునైటెడ్ స్టేట్స్ జియొలాజికల్ సర్వే నిర్ధరించింది.
ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటివరకు ఎవరూ మరణించినట్లు సమాచారం లేనప్పటికీ ఆస్తి నష్టం జరిగినట్లు కమ్చట్కాలో స్థానిక మంత్రి సెర్గీ లెబదేవ్ చెప్పారు.
ఈ భూకంపం గత కొన్ని దశాబ్దాలలో వచ్చిన అన్ని భూకంపాల కంటే శక్తిమంతమైనదంటూ కమ్చట్కా గవర్నర్ వ్లాదిమిర్ సొలొదోవ్ చెప్పారు.
ఈ మేరకు ఆయన టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, Reuters
సునామీ హెచ్చరికలు ఎక్కడెక్కడ?
- 8.8 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి సునామీ రావొచ్చంటూ వివిధ దేశాల్లో హెచ్చరికలు జారీ చేశారు.
- జపాన్‌లోని హొక్కైడో నుంచి క్యూషూ వరకు తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
- జపాన్‌లోని మరికొన్ని ప్రాంతాలకు ఒక మోస్తరు హెచ్చరికలు జారీ చేశారు.
- అమెరికా పశ్చిమ తీరం మొత్తానికీ సునామీ హెచ్చరికలు అక్కడి ప్రభుత్వాలు జారీ చేశాయి.
- అలాస్కాలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
- హవాయి, గువామీ దీవుల్లోనూ సునామీ హెచ్చరికలు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుత భూకంపం చరిత్రలో నమోదైన పది అత్యంత తీవ్రమైనవాటిలో ఒకటని హవాయి విశ్వవిద్యాలయంలోని జియోఫిజిక్స్ అండ్ టెక్టోనిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ హెలెన్ జానిస్జెవ్‌స్కీ బీబీసీ న్యూస్ డే ప్రోగ్రామ్‌లో చెప్పారు.
ప్రస్తుతం 8.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం చరిత్రలోని అత్యంత భారీ భూకంపాల జాబితాలో ఆరోస్థానంలో ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే చెబుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














