మియన్మార్ భూకంపం: 1600కు పైగా మృతులు, ‘ఉత్త చేతులతో శిథిలాలు తొలగిస్తున్నాం’ అంటున్న స్థానికులు

ఫొటో సోర్స్, Reuters
మియన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం కారణంగా మరణించినవారి సంఖ్య 1600కు పైగా పెరిగింది. కూలిన భవనాల కింద చిక్కుకుపోయినవారిని కాపాడేందుకు, ఉత్త చేతులతో శిథిలాల తొలగించాల్సి వస్తోందని కొంతమంది స్థానికులు బీబీసీకి చెప్పారు.
మియన్మార్ పురాతన రాజధాని, దేశంలోనే రెండో అతిపెద్దదైన మాండలే నగరం భూకంపం కారణంగా తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడ 15 లక్షలమంది ప్రజలు నివసిస్తుంటారని అంచనా.
చీలిపోయిన రోడ్లు, కూలిపోయిన వంతెనలు, వనరుల కొరత, సమాచార వ్యవస్థ దెబ్బతినడం రక్షణ చర్యలకు ఆటంకంగా మారింది.
మియన్మార్ సైన్యం 2021లో అధికారాన్ని చేజిక్కించుకున్నాక, తిరుగుబాటు గ్రూపులు, తిరుగుబాటును అణచే గ్రూపుల మధ్య నాలుగేళ్ల అంతర్యుద్ధం కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలలో నియంత్రణలో లేకుండా పోయింది.


ఫొటో సోర్స్, Supplied
రక్షణ చర్యలకు ఆటంకాలు
మరోపక్క తాము బతికే ఉన్నామని, సహాయం కావాలంటూ ఆర్తనాదాలు రక్షణ సిబ్బంది చెవిన పడుతున్నాయి. అలాంటి కేకలు విన్నప్పుడు మాత్రమే, ఆ కేక ఎక్కడి నుంచి వస్తోందో అర్ధం చేసుకుని తాము వారిని రక్షించగలమని రక్షణ సిబ్బంది ఒకరు చెప్పారు.
మాండలేలోని క్యూక్సే జిల్లాలోని సింత్కై టౌన్ షిప్‌లో శనివారం రక్షణ బృందం ఓ ప్రైవేట్ పాఠశాల శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని బయటకు తీసింది. రక్షణ బృందాలు వచ్చే సరికి వారిలో ఆరుగురు చనిపోయారు. చనిపోయినవారిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది ఉన్నారు.
పరికరాల కొరత కారణంగా రక్షణ చర్యలు ఆలస్యమవుతున్నాయని బీబీసీ బర్మీస్‌కు ఒకరు చెప్పారు. ‘‘మా దగ్గరున్న సాధనాలతో మేం పనిచేస్తున్నాం. నేలమట్టమైన ఓ పాఠశాల శిథిలాల్లో చిక్కుకుపోయిన బాలికను బయటకు తీసేందుకు ఎన్నో గంటల నుంచి ప్రయత్నిస్తున్నాం’’ అని ఆయన వెల్లడించారు.
మాండలేలో మరో కార్మికుడు యాంగాన్‌లో బీబీసీ రిపోర్టర్‌తో మాట్లాడుతూ సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం అసాధ్యంగా మారిందన్నారు.
‘‘ప్రధాన సమస్య ఇంటర్‌నెట్ లైన్స్ లేకపోవడం. మాకు ఫోన్ లైన్లు లేవు. దీంతో ఒకరితో ఒకరు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం కష్టంగా మారింది. రక్షణ బృందాలు వచ్చాయి. కానీ ఫోన్లు పనిచేయకపోవడం వల్ల వారు ఎక్కడకు వెళుతున్నారో మాకు తెలియదు.
ఈ విపత్తు సమయంలో ప్రజలందరూ తమ వంతు కృషి చేస్తున్నారని మాండలే నివాసి ఒకరు తెలిపారు.
‘‘సహాయక చర్యల్లో సమన్వయం కొరవడింది. వారిని నడిపించే వారు లేరు. ఏం చేయాలో చెప్పేవారు కూడా లేకపోవడంతో స్థానికులు తమను తామే కాపాడుకోవాల్సి వస్తోంది. రక్షణ బృందాలకు శిథిలాల్లో శవాలు కనిపిస్తే కనీసం వాటిని ఎక్కడకు పంపాలో కూడా తెలియడంలేదు. ఆస్పత్రులన్నీ బాధితులతో నిండిపోయాయి’’ అని ఓ స్థానికుడు చెప్పారు.
మాండలే ప్రాంతంలో దెబ్బతిన్న భవనాల సంఖ్య 1,500కు పైగా ఉందని జుంటా ప్రభుత్వం పేర్కొంది. విద్యుత్ అంతరాయాలు పరిస్థితిని మరింత దిగజార్చాయని, పునరుద్ధరణకు చాలా రోజులు పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు.
భూకంపం సమయంలో రన్‌వేలు దెబ్బతినడంతో మాండలే విమానాశ్రయం పనిచేయడం లేదు. కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి కృషి చేస్తున్నామని, అక్కడ తాత్కాలిక ఆసుపత్రి, వైద్య సహాయ శిబిరం, షెల్టర్ ఏర్పాటు చేశామని మిలిటరీ కౌన్సిల్ తెలిపింది.

ఫొటో సోర్స్, EPA
కూలిన వంతెనలు
మాండలే, సగైంగ్ ప్రాంతాల మధ్య 25 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలోనే ఈ రెండు ప్రాంతాలను కలిపే రెండు వంతెనలలో పాతవంతెన పూర్తిగా కుప్పకూలిపోగా, కొత్త వంతెన పగుళ్ళు ఇచ్చి సహాయక బృందాలు చేరుకోలేని పరిస్థితిని సృష్టించింది.
‘‘ప్రస్తుతం అత్యవసర రక్షణకు కూడా సరిపడా సిబ్బంది లేరు. కనీసం మృతదేహాలను బయటకు తీసే పరిస్థితి లేదు. శిథిలాల కింద అనేకమంది చిక్కుకుపోయారు. మేం వంతెనను దాటే పరిస్థితిలో లేం. ఇక్కడే చిక్కుకుపోయాం. అత్యవసర రక్షణ సిబ్బంది వచ్చి రక్షించడానికి సహాయం చేయాలి" అని స్థానిక నివాసి ఒకరు బీబీసీ బర్మాతో అన్నారు.

ఆగని ప్రకంపనలు
మిలిటరీ జుంటా ప్రధాన కార్యాలయం ఉన్న కొత్త రాజధాని నగరం నైపీడాలో చిన్నపాటి ప్రకంపనలు సంభవించాయి. ఇక్కడ భారీగా ప్రాణనష్టంతోపాటు, కూలిన భవనాలు, కుంగిపోయిన రోడ్లు కనిపించాయి.
అంతర్జాతీయ సాయం కోసం జుంటా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే అది ఇలా కోరడం చాలా అరుదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














