కరోనావైరస్ వ్యాక్సీన్‌: గుంటూరులో టీకా తీసుకున్న ఆశా కార్యకర్త మృతి - ప్రెస్‌రివ్యూ

కరోనావైరస్

ఫొటో సోర్స్, Ritesh Shukla/NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో కోవిడ్‌ వ్యాక్సీన్ తీసుకున్న ఓ ఆశా కార్యకర్తకు బ్రెయిన్‌ డెడ్‌ అయినట్టు సాక్షి ఓ కథనం ప్రచురించింది. (ఆదివారం తెల్లవారుజామున ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.)

తాడేపల్లి పీహెచ్‌సీ పరిధిలోని ఆరోగ్య కార్యకర్త (ఏఎన్‌ఎం) గొట్టిముక్కల లక్ష్మి (38), ఆశా కార్యకర్త బొక్కా విజయలక్ష్మి (42)కి ఈ నెల 20న కోవిడ్‌ టీకా వేశారు. అనంతరం ఏఎన్‌ఎం లక్ష్మికి తలనొప్పి, ఫిట్స్‌ రాగా.. విజయలక్ష్మి తలనొప్పి, మగత, వాంతులు వంటి లక్షణాలతో స్పృహ కోల్పోయారు. వీరిద్దరినీ ఈ నెల 22న జీజీహెచ్‌లో చేర్చించారు.

ఆందోళన వల్ల ఏఎన్‌ఎం లక్ష్మికి రియాక్షన్‌ వచ్చిందని, చికిత్స అందించిన వెంటనే సాధారణ స్థితికి చేరుకుని డిశ్చార్జి అయ్యేందుకు సిద్ధంగా ఆమె ఉన్నారని జీజీహెచ్‌ వైద్యులు తెలిపారు.

ఆశా కార్యకర్త విజయలక్ష్మి బ్రెయిన్‌ స్టెమ్‌ స్ట్రోక్‌కు గురైనట్టు తేల్చారు. శనివారం రాత్రి ఆమెకు బ్రెయిన్‌ డెడ్‌ అయినట్టు వైద్యులు తెలిపారు.

మరోవైపు విజయలక్ష్మికి వేసిన వయల్‌ నుంచే మరో వైద్యుడికి టీకా వేసినా అతనికి ఎలాంటి రియాక్షన్‌ లేకపోవడం గమనార్హం.

కరోనా టెస్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

5 నెలల్లో ఆమెకు 31 సార్లు కరోనా పాజిటివ్

రాజస్థాన్‌కు చెందిన శారదా దేవి అనే 35ఏళ్ల మహిళకు గత 5 నెలల్లో 31 సార్లు కరోనా పాజిటివ్‌ వచ్చిందని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

గతేడాది ఆగస్టులో ఆమె రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో అప్నా ఆశ్రమ్‌కు వెళ్లారు. ఆశ్రమానికి కొత్తగా రావడంతో నిర్వాహకులు ఆమెకు సెప్టెంబరు 4న తొలిసారి పరీక్ష చేయించగా.. పాజిటివ్‌ వచ్చింది. 14 రోజులు ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స చేయించిన తర్వాత మళ్లీ పరీక్ష చేయిస్తే.. మళ్లీ పాజిటివే వచ్చింది.

ఒకటి కాదు..రెండు కాదు.. మొత్తం 17 సార్లు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష, 14సార్లు యాంటీజెన్‌ పరీక్ష చేయించారు. చివరిసారిగా జనవరి 7న టెస్టు చేయించినా పాజిటివే వచ్చింది.

ఆమెకు అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం.. ఇలా మూడు రకాల చికిత్సలూ చేయించారు. ఏ చికిత్స చేయించినా టెస్టులో ఫలితం మాత్రం మారలేదు. దీంతో ఇలా ఎందుకు జరుగుతోందో అర్థం కాక వైద్యులు తల పట్టుకుంటున్నారు.

విచిత్రమేంటంటే.. పదేపదే పాజిటివ్‌ వస్తు న్నా ఆమెలో ఎలాంటి అనారోగ్య లక్షణాలూ లేవు. పైగా గత 5 నెలల్లో ఆమె 7-8 కిలోల బరువు కూడా పెరిగారని ఆశ్రమానికి చెందిన వైద్యుడు డాక్టర్‌ బీఎం భరద్వాజ్‌ తెలిపారు.

చిరుత పులి

ఫొటో సోర్స్, Prof Anand

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

చిరుతనే చంపి తిన్నారు

కొందరు ఏకంగా చిరుతనే చంపి, దాని మాంసం తిన్న ఘటన కేరళలోని ఇడుక్కి జిల్లాలో చోటుచేసుకుందని నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.

తమ పొలంలోని ఆవులకు ఒక చిరుతపులి హాని తలపెడుతున్నదని భావించిన మంకులం ప్రాంత ప్రజలు దాన్ని పట్టుకోవడానికి ఓ వలను ఏర్పాటు చేశారు.

అందులో చిక్కుకున్న చిరుతను చంపి, దాని మాంసాన్ని ఐదుగురు తిన్నారు. విషయం తెలిసిన అటవీ అధికారులు ఆ ఐదుగురిని శుక్రవారం అరెస్టు చేశారు.

వారి నుంచి చిరుత చర్మం, దంతాలు, గోళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరిశీలించిన అధికారులు చిరుత వయసు 6 నుంచి 7 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు.

తెలంగాణ పరీక్షలు
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో మే 17 నుంచి పది పరీక్షలు

తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు మే 17 నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

9, 10 తరగతులకు ప్రభుత్వం శనివారం విద్యా క్యాలెండర్‌ను విడుదల చేసింది. ప్రధాన పరీక్షలు ఆరు రోజులు, ఓరియంటల్‌ విద్యార్థులకు మూడు రోజులపాటు జరుగుతాయి.

అంటే ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్షే ఉంటుందని స్పష్టమవుతోంది. విద్యాశాఖ మాత్రం ఆ విషయాన్ని ప్రకటించలేదు.

నాలుగు అంతర్గత పరీక్షలకు (ఎఫ్‌ఏ) బదులు ఈసారి రెండే ఉంటాయి. సెప్టెంబరు 1 నుంచి జరుగుతున్న ఆన్‌లైన్‌ పాఠాలు 115 రోజులు.. ఫిబ్రవరి 1 నుంచి మే 26 వరకు (పరీక్ష తేదీలను కలుపుకొని) 89 రోజుల ప్రత్యక్ష బోధన.. మొత్తం 204 పనిదినాలుగా చూపారు.

పిల్లలు ఉల్లాసంగా ఉండేందుకు, మానసిక ఆందోళనను తగ్గించేందుకు చిన్న చిన్న యోగాసనాలను వేయించాలని, భౌతిక దూరం పాటిస్తూ తరగతి గదుల్లోనే సాధన చేయించాలని ప్రభుత్వం పేర్కొంది.

పాఠశాలలకు విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదు. తల్లిదండ్రుల అనుమతితోనే బడులకు రావాలి. ఇంటి దగ్గర నుంచైనా ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)