ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన 10 పాములు ఏవి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, భరత్ శర్మ
- హోదా, బీబీసీ ప్రతినిధి
గమనిక: ఈ కథనంలో కొన్ని వర్ణనలు ఆందోళన కలిగించవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏటా 81,410 నుంచి 137,880 మంది పాము కాటు వల్ల మరణిస్తున్నారు.
భారతదేశంలో ఈ సంఖ్య 60వేలకు పైగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఏటా 50 లక్షల పాము కాటు కేసులు నమోదవుతున్నాయి.
వీటిలో 4 లక్షల కేసుల్లో శరీరంలో కొంత భాగాన్ని తొలగించాల్సి రావడంతో శాశ్వత వైకల్యం ఏర్పడుతోంది.
ఈ గణాంకాలన్నీ భయంకరంగా ఉన్నాయి. దీని వెనుక ఉన్న కారణం పాములు.
ప్రపంచంలోని అనేక నాగరికతలు, సంస్కృతులలో పాములది ముఖ్యమైన పాత్ర. కొందరు వాటిని పూజిస్తారు. మరికొందరు భయంతో చంపేస్తారు.
పాముల్లో కొన్ని చాలా ప్రమాదకరమైనవి. మరికొన్ని ఎలాంటి హాని కలిగించవు.
కొన్ని తీగలాగా సన్నగా మరికొన్ని జిరాఫీ కంటే పొడవుగా ఉంటాయి.
పాముల్లో కొన్నిరకాలు పంది, మేకలాంటి జంతువులను కూడా మింగి అరిగించుకోగలవు.
17 కోట్ల సంవత్సరాల క్రితం పురాతన బల్లులు, పరిణామ క్రమంలో కాళ్లను కోల్పోయి పాములుగా మారినట్లు సోఫియా క్లాగ్వియా బీబీసీ ఎర్త్‌లో రాశారు.
చిన్న కాలివేళ్లు, వేళ్లు ఉండి పొడవాటి సన్నటి బల్లి నుంచి పాములు ఏర్పడవచ్చని జన్యు పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి ప్రస్తుతం ఉత్తర అమెరికా, గ్రీన్ ల్యాండ్, యూరప్, ఆసియాగా విడిపోయిన లారేషియా ఖండంలోని ఉష్ణమండల అడవుల్లో నివసించాయి.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3900 రకాల పాములు ఉన్నాయి. అయితే అందులో 725 మాత్రమే విషపూరితమైనవి. వీటిలో 250 రకాల పాములు ఒకే కాటుతో మనిషిని చంపగలవు.
విషం లేని పాములు కూడా మనుషులను చంపగలవు. అయితే అలాంటి సందర్భాలు చాలా అరుదు.
విషం లేని పాముల వల్ల ఏటా ఒకటి లేదా రెండు మరణాలు సంభవిస్తాయి. ఉదాహరణకు, కొండచిలువలు తమ ఆహారాన్ని దాని చుట్టూచుట్టుకుని ఊపిరాడకుండా చేసి చంపుతాయి.


ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలో అత్యంత ప్రమాదరమైన 10పాములు
పాముల్లో విషపూరితం అని చెప్పేటప్పుడు అది రెండు రకాలుగా ఉండవచ్చు.
మొదటిది ఎక్కువమందిని చంపేంత విషమున్న పాము. రెండోది అత్యంత విషపూరితమైన పాము.
ఈ రెండు ఒకేలా కనిపిస్తున్నా భిన్నమైనవి.
అత్యంత విషపూరితమైన లేదా ప్రాణాంతక విషం ఉన్న పాములు మనుషుల మధ్య లేదా దగ్గరగా ఉండకపోవచ్చు.
పాము కరిస్తే మరణం సంభవిస్తుంది. అలాగే కొన్ని పాము కాట్ల వల్ల శరీరం మీద నెక్రోసిస్ టిష్యూకు గాయమవుతుంది. దీని వల్ల శరీర భాగాన్ని తొలగించాల్సి రావచ్చు.
ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన, ప్రమాదకరమైన పాముల గురించి యానిమల్ బిహేవియర్ పరిశోధకురాలు లియోమా విలియమ్స్ బీబీసీ వైల్డ్ లైఫ్ మ్యాగజైన్ డిస్కవర్ వైల్డ్‌లైఫ్‌లో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
1. సా- స్కేల్డ్ వైపర్
మిడిల్ ఈస్ట్, మధ్య ఆసియాలో కనిపిస్తుంది. వేగమెక్కువ.
ప్రతీ ఏటా ఈ పాము కరవడం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు.
జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉంటుంది.
మనుషులకు ప్రమాదకరమైన పాము.
భారతదేశంలో ఈ పాము కాటు వల్ల ఏటా 5వేల మంది చనిపోతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2. ఇన్‌లాండ్ తైపాన్
అత్యంత విషపూరితమైన పాముల జాబితాలో అన్నింటి కంటే ముందుంది ఇన్‌లాండ్ తైపాన్.
మధ్య ఆసియా, ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపించే ఈ పాము ఎలుకల్ని వేటాడుతుంది.
దీని ఒక్క కాటు నుంచి వచ్చే విషంతో వందమంది మనుషులు చనిపోతారు.
అయితే సా-స్కేల్డ్ వైపర్ మాదిరిగా ఇది ఎక్కువమందిని చంపడం లేదు.
ఎందుకంటే ఇది ఎక్కువగా మారు మూల ప్రాంతాలలో, మనుషులకు దూరంగా భూగర్భంలో నివసిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
3. బ్లాక్ మాంబా
దీని ముందు సింహం కూడా తలవంచాల్సిందే.
సబ్ సహారన్ ఆఫ్రికాలో కనిపించే ఈ పాము తైపాన్ కంటే దూకుడుగా ఉంటుంది.
సాధారణంగా మనుషులకు దూరంగా ఉండే ఈ పాము ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు పైకి లేచి మెరుపు వేగంతో దాడి చేస్తుంది.
ఈ పాము కాటు వేసిన వ్యక్తికి అరగంటలోపు చికిత్స అందకపోతే ప్రాణాలు పోయినట్లే.

ఫొటో సోర్స్, Getty Images
4. రస్సెల్ వైపర్
మనకు అసలు ఏ మాత్రం ఎదురు పడకూడదని కోరుకోవాల్సిన పాము ఇది.
ఇండియన్ కోబ్రా, సా-స్కేల్డ్ వైపర్, కామన్ క్రైట్‌తో రస్సెల్ వైపర్ కలిస్తే "బిగ్ ఫోర్" అని చెప్పచ్చు.
భారత ఉపఖండంలో అత్యధిక మరణాలకు కారణం ఈ నాలుగు పాములే.
రస్సెల్ వైపర్ కరిస్తే తీవ్రమైన నొప్పి పుడుతుంది.
ఇది చాలా వేగంగా దాడి చేసి కాటు వేస్తుంది.
భారతదేశంలోని పాము కాట్లలో రస్సెల్ వైపర్ కాట్లు 43శాతం ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
5. కామన్ క్రైట్
"బిగ్ ఫోర్" లో ఒకటిగా భావించే ఈ పాము చాలా విషపూరితమైనది.
ఇది కాటేస్తే చనిపోయే అవకాశం 80 శాతం ఉంటుంది.
దీని విషంలో న్యూరోటాక్సిన్లు ఉంటాయి. ఈ న్యూరోటాక్సిన్ల వల్ల కండరాల పక్షవాతం, శ్వాసకోశ వ్యవస్థ వైఫల్యం, మరణం సంభవిస్తుంది.
ఇది ఇతర పాములు, ఎలుకలు, కప్పలను తింటుంది. కామన్ క్రైట్ మనుషులకు చాలా అరుదుగా ఎదురవుతుంది.
అయితే చీకట్లో దాన్ని తొక్కితే కచ్చితంగా కాటు వేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
6.ఇండియన్ కోబ్రా
భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఇండియన్ కోబ్రా ఒకటి.
గతంలో భారతదేశంలో పాములు పట్టేవారు ప్రతి వీధిలో ఈ పాముతో తిరుగుతూ ఉండేవారు.
ఇది విషపూరితమైనదే కాకుండా వేగంగా కదులుతుంది.
చిన్న పాముల్ని, ఎలుకల్ని తింటుంది. అందుకే మనుషులకు దగ్గరగా ఉంటుంది.
పొలాలు, అటవీ ప్రాంతాల్లో కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
7. పఫ్ ఆడర్
భారత ఉప ఖండానికి దూరంగా వెళితే..
అతి పెద్ద, భయంకరమైన పాము పఫ్ ఆడర్ ఆఫ్రికాలో కనిపిస్తుంది.
వైపర్ కుటుంబానికి చెందిన ఈ పాము ఇతర ఆఫ్రికన్ పాములతో పోలిస్తే ఎక్కువ మరణాలకు కారణమవుతుంది.
దానికి ప్రమాదం ఎదురైతే పారిపోవడానికి బదులు ఎదురు తిరుగుతుంది.
జనావాసాల్లోనే విశ్రాంతి తీసుకుంటుంది.
దాడి చేసే ముందు హెచ్చరిస్తుంది. శరీరాన్ని గాల్లోకి లేపి బుసలు కొడుతూ శబ్దం చేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
8. కామన్ డెత్ ఆడర్
ఇది ఆస్ట్రేలియా అడవులలో కనిపిస్తుంది.
అడవుల్లో ఆకుల్లో, చెట్ల పొదల్లో పచ్చిక బయళ్లలో ఉంటుంది.
తన ఆహారం అందుబాటులోకి వచ్చినప్పుడు దాడి చేస్తుంది.
చెట్ల పొదల్లో ఆకుల్లో దాక్కునే ఈ పాము మనుషులకు చాలా ప్రమాదకరం. తన ఆహారం కోసం చాలా ఓపిగ్గా ఎదురు చూసి, సమీపంలోకి రాగానే దాడి చేస్తుంది.
దీని విషం చాలా శక్తివంతంగా పని చేస్తుంది. డెత్ ఆడర్ కాట్లలో మరణాల రేటు 60 శాతం ఉంది.
వయసులో ఉన్న డెత్ ఆడర్ పాములు విషపూరిత కప్పల్ని తింటాయి. ఈ కప్పల్ని తిన్న పాముల్ని పెద్ద పాములు తినడంతో వాటి శరీరం మీద కూడా విష గ్రంధులు ఏర్పడతాయి.

ఫొటో సోర్స్, Getty Images
9. కింగ్ కోబ్రా
ప్రపంచంలోనే పొడవైన విషపూరితమైన పాము.
సగటున నాలుగు మీటర్ల పొడవు ఉండే ఈ పాము 5.85 మీటర్ల పొడవుతో రికార్డు సృష్టించింది.
ఇండియన్ కోబ్రా లాగే కింగ్ కోబ్రాకు కూడా భారత ఉప ఖండంలో సాంస్కృతిక ప్రాధాన్యత ఉంది.
చైనాలో ఔషధాల తయారీలో ఉపయోగించే విషం కోసం వీటిని వేటాడటం ఎక్కువైంది.
దీంతో పాటు ఈ పాములు ఉండే అడవులు, పొలాల్లో మానవ నివాసాలు పెరుగుతున్నాయి.
భారతదేశంలో కింగ్ కోబ్రాను చంపడం నేరం. ఇందుకు ఆరేళ్ల జైలుశిక్ష విధించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
10. ఈస్టర్న్ డైమండ్‌బ్యాక్ రాటిల్ స్నేక్
అమెరికా నుంచి అత్యంత విషపూరిత పాముల జాబితాలో చేరిన పాము ఇది.
ఆసియాలో పాముల కంటే తక్కువ ప్రమాదకరమైనదే అయినప్పటికీ ప్రతీ ఏటా అమెరికాలో దీని కాటు వల్ల ఐదుగురు చనిపోతున్నారు.
ఇది చాలా పెద్దది, బరువైనది. 15 కేజీల కంటే ఎక్కువ ఉంటుంది.
ఎర్ర రక్త కణాలపై దాడి చేసే హెమోటాక్సిన్ దీని విషంలో ఉంటుంది.
ఈ పదింటితో పాటు టైగర్ స్నేక్, కోస్టల్ తైపాన్, ఈస్ట్ బ్రౌన్ స్నేక్‌లను ప్రమాదకరమైన పాములుగా పరిగణిస్తున్నారు.

ఫొటో సోర్స్, Matt Hunt/Anadolu Agency via Getty Images
పాముల్లో విషం వేర్వేరుగా ఉంటుందా?
పాములకు రెండు రకాల విషాలు ఉంటాయి.
న్యూరోటాక్సిక్ విషం శరీర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. పక్షవాతానికి కారణమవుతుంది
అయితే హెమోటాక్సిక్ విషం రక్త ప్రసరణ వ్యవస్థపై దాడి చేస్తుంది. రక్తాన్ని ప్రభావితం చేస్తుంది. రక్తంలో కణజాలాన్ని ధ్వంసం చేస్తుంది.
కోబ్రా, మాంబా, క్రైట్స్‌లో న్యూరోటాక్సిక్ విషం ఉంటుంది.
రాటిల్‌స్నేక్స్, అడార్ వంటి వైపర్లు హెమోటాక్సిక్ విషంతో ఉంటాయి.
అయితే ఇందులో కొన్ని మినహాయింపులు ఉన్నాయి.
కొన్ని పాముల విషం శరీరంపై మిశ్రమ ప్రభావాలను చూపిస్తుంది. కొన్ని వైపర్లలో న్యూరోటాక్సిక్ విష లక్షణాలు ఉంటాయి.
భారతదేశంలో న్యూరోటాక్సిక్ లక్షణాలు ఉన్న పాము జాతి ఎక్కువగా ఉన్నందువల్లే పాము కాటు వల్ల చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని స్నేక్‌బైట్ హీలింగ్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షురాలు ప్రియాంక కదమ్ చెప్పారు.
"వైపర్ జాతి పాముల విషయం హెమోటాక్సిక్. ఈ జాతి పాములు కాటు వేసినప్పుడు వాటిలోని విషం రక్తాన్ని ప్రభావితం చేస్తుంది. రక్తం పలుచన అయిపోతుంది. ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. రక్త కేశ నాళికలు పగిలిపోతాయి. మూత్ర పిండాలు ప్రభావితం అవుతాయి. వైపర్ల కాటు వల్ల వ్యక్తి వెంటనే చనిపోడు. కానీ కిడ్నీలు దెబ్బ తింటాయి. అవయవాలు దెబ్బ తినవచ్చు" అని ఆమె బీబీసీతో చెప్పారు.
క్రైట్, కోబ్రా వంటి పాముల్లో న్యూరోటాక్సిక్ విషం ఉంటుంది.
ఈ జాతి పాములు కాటు వేస్తే నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. కండరాలు పని చేయవు.
వీటి విషం నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారి మనిషి చనిపోతాడు.
అందుకే ఈ జాతి పాములు కాటు వేసిన వెంటనే చికిత్స అందించడం అవసరం. చికిత్స ఆలస్యం అయ్యే కొద్దీ ప్రాణాలకు ముప్పు పెరుగుతుంది.
"భారతదేశం "బిగ్‌ఫోర్" పై దృష్టి పెట్టింది. వీటి కాటు నుంచి రక్షించేందుకు యాంటీ వెనమ్ తయారు చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలలో వివిధ రకాల పాములు కనిపిస్తాయి. పశ్చిమబెంగాల్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో గ్రేటర్ బ్లాక్ క్రైట్, లెస్సర్ బ్లాక్ క్రైట్ వంటి ఇతర జాతుల పాములు ఉన్నాయి. ఇవి కాటు వేసిన వారికి యాంటీ వెనమ్ సరైన సమయంలో అందదు. అందుకే భారతదేశంలో పాము కాటు మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది" అని ప్రియా కదమ్ వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














