నేపాల్: హింసాత్మకంగా మారిన 'జెన్ జడ్' నిరసనలు, 19 మంది మృతి.. అసలేం జరుగుతోంది?

నేపాల్, నిరసనలు, సోషల్ మీడియా బ్యాన్, జెన్ జడ్ ఉద్యమం
ఫొటో క్యాప్షన్, నేపాల్‌లోని పార్లమెంట్ భవనం వెలుపల నిరసనకారులపై పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగిస్తున్నారు.

సోషల్ మీడియాపై నిషేధంతో నేపాల్ రాజధాని కఠ్మాండూలో నిరసనలకు దిగిన యువతకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 17 మంది వరకూ చనిపోయినట్లు కథనాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 19 మంది మరణించారు.

కఠ్మాండూతో పాటు తూర్పున ఉన్న ఇటాహరి నగరంలో మరో ఇద్దరు మరణించినట్లు పోలీసులు చెప్పినట్లు బీబీసీ నేపాలీ సర్వీస్ కరస్పాండెంట్ తెలిపారు.

క్షతగాత్రులను న్యూ బనేశ్వర్‌లోని సివిల్ సర్వెంట్స్ ఆసుపత్రికి తరలించారు.

కఠ్మాండూకు చెందిన స్థానిక జర్నలిస్ట్ నరేశ్ గవాలీ బీబీసీ హిందీ కరస్పాండెంట్ దిల్‌నవాజ్ పాషాతో ఫోన్‌లో మాట్లాడుతూ, "కనీసం 150 మంది గాయపడ్డారు. వారిని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు" అని చెప్పారు.

నేపాల్ నిరసనల నేపథ్యంలో, హోంమంత్రి రమేశ్ లేఖక్ రాజీనామా చేశారు. తన రాజీనామాను ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీకి సమర్పించారు.

"చాలా చోట్ల కర్ఫ్యూ విధించారు, సైన్యం కూడా వీధుల్లో ఉంది, భారీ ఘర్షణలు జరిగాయి. అయినప్పటికీ, నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. కొంతమంది ప్రాణాలు కోల్పోయారని తెలిసిన తర్వాత కూడా నిరసనలు కొనసాగుతున్నాయి" అని ఆయన అన్నారు.

తమను తాము 'జెన్ జడ్'గా పిలుచుకుంటున్న నిరసనకారులు వ్యవస్థ అవినీతిమయమైందని కూడా ఆరోపణలు చేస్తున్నారు.

జెన్ జడ్ అంటే, 1990 నుంచి 2010 మధ్య జన్మించిన వారిని ఇంగ్లిష్‌లో జనరేషన్ జెడ్ (Generation Z లేదా Gen Z)గా చెబుతారు. వీరినే జెన్ జడ్‌గా పిలుస్తారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

యువత నిరసన, వీధుల్లోకి సైన్యం

సోమవారం ఉదయం కఠ్మాండూలోని సింహ్ దర్బార్ దగ్గరకు వేలాది మంది నిరసనకారులు చేరుకున్నారు. అక్కడి నుంచి న్యూ బనేశ్వర్‌లోని పార్లమెంట్ భవనం వైపు ప్రదర్శనగా వెళ్లారు.

కొంతమంది నిరసనకారులు బారికేడ్లను దాటి పార్లమెంట్ భవన సముదాయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని, ఈ సమయంలో ఘర్షణలు చెలరేగడంతో బలగాలను ప్రయోగించారని బీబీసీ ప్రతినిధి కేశవ్ కొయిరాలా చెప్పారు.

రాష్ట్రపతి భవన్, శీతల్ నివాస్, నారాయణ్ దర్బార్ మ్యూజియం, ప్రధాన మంత్రి నివాసం పార్లమెంట్ హౌస్ చుట్టూ రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. నిరసనకారులు, నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తున్నారని ఓ ప్రతినిధి తెలిపారు.

కర్ఫ్యూ పొడిగింపు ప్రకటన వెలువడిన వెంటనే, నేపాల్ సైన్యాన్ని వీధుల్లో మోహరించారు. "లిఖితపూర్వక ఆదేశాలు అందిన తర్వాత, శాంతి భద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా ఒక చిన్న సైనిక దళాన్ని పంపాం" అని నేపాల్ ఆర్మీ ప్రతినిధి అసిస్టెంట్ జనరల్ రాజారామ్ బస్నెత్ అన్నారు.

నేపాల్, నిరసనలు, సోషల్ మీడియా బ్యాన్, జెన్ జడ్ ఉద్యమం
ఫొటో క్యాప్షన్, నిరసనకారులు ప్రభుత్వ భవనానికి నిప్పుపెట్టారు.

‘భూకంపం అవసరం లేదు’

కొంతమంది నిరసనకారులు పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని అధికారులు తెలిపారు. ఈ సమయంలో హింస జరిగినట్టు సమాచారం అందుతోంది. గాయపడిన చాలామందిని ఆసుపత్రికి తరలించారు.

నేపాల్ నుంచి వస్తున్న ఫోటోలు, వీడియోల్లో వేలాది మంది నిరసనకారులు కనిపిస్తున్నారు. "ఇక్కడ భూకంపాలు రావాల్సిన పనిలేదు, నేపాల్ నిత్యం అవినీతితో వణికిపోతోంది" అని రాసి ఉన్న బ్యానర్‌ను నిరసనలో పాల్గొన్న ఒక విద్యార్థి పట్టుకుని ఉన్నారు.

యువత అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నేపాల్‌లో రాచరికాన్ని పునరుద్ధరించాలని కోరుతూ కొన్ని నెలల కిందట ఒక ఉద్యమం జరిగింది. ఆ సమయంలో కూడా నిరసనకారులు వ్యవస్థలో ప్రబలంగా అవినీతి పేరుకపోయిందన్న ఆరోపణలు చేశారు.

నేపాల్, నిరసనలు, సోషల్ మీడియా బ్యాన్, జెన్ జడ్ ఉద్యమం
ఫొటో క్యాప్షన్, సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా యువతి ప్రదర్శన

సోషల్ మీడియాపై నిషేధం

నేపాల్ ప్రభుత్వం గత వారం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించింది. వీటిలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్రముఖ సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి.

దేశంలోని చట్టాలను పాటించడానికి, స్థానిక కార్యాలయాలను తెరవడానికి, గ్రీవెన్స్ అధికారులను నియమించడానికి సోషల్ మీడియా కంపెనీలకు వారం సమయం ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది.

చైనా సోషల్ మీడియా కంపెనీ టిక్‌టాక్ ఈ షరతులను సకాలంలో పాటించిందని, దీంతో టిక్‌టాక్‌ను నిషేధించలేదని తెలిపింది.

నేపాల్, నిరసనలు, సోషల్ మీడియా బ్యాన్, జెన్ జడ్ ఉద్యమం

ఫొటో సోర్స్, BBC / Bijay Gajmer

ఫొటో క్యాప్షన్, నేపాల్‌లో టిక్‌టాక్‌పై నిషేధం విధించలేదు. నిరసనల వీడియోలు టిక్‌టాక్‌లో షేర్ అవుతున్నాయి.

నిషేధం తర్వాత నిరసనలు

నేపాల్‌ ప్రజలు పెద్దసంఖ్యలో విదేశాల్లో నివసిస్తున్నారు. మెసేజింగ్ యాప్‌లు, సోషల్ మీడియాపై నిషేధం తర్వాత, విదేశాలలో నివసిస్తున్న నేపాలీలు తమ కుటుంబాలను కాంటాక్ట్ అవ్వడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సోషల్ మీడియా వెబ్‌సైట్లపై నిషేధం తర్వాత యువత నిరసనలకు పిలుపునిచ్చారు.

టిక్‌టాక్ ప్రస్తుతం నేపాల్‌లో ట్రెండింగ్‌లో ఉంది. నిర్వాహకులు టిక్‌టాక్‌లో అనేక వీడియోలను షేర్ చేసి, నిరసనలో చేరాలని యువతకు విజ్ఞప్తి చేశారు.

నేపాల్, నిరసనలు, సోషల్ మీడియా బ్యాన్, జెన్ జడ్ ఉద్యమం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, నేపాల్‌ వ్యవస్థలో అవినీతి పేరుకుపోయిందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు.

టిక్‌టాక్‌లో 'నెపో బేబీ' ట్రెండ్

టిక్‌టాక్‌లో 'నెపో బేబీ' ట్రెండ్ కూడా ప్రారంభమైంది. ఇందులో రాజకీయ నాయకుల పిల్లల విలాసవంతమైన జీవితానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. రాజకీయ నాయకులు తమ పిల్లలకు ప్రయోజనం చేకూరుస్తున్నారు గానీ దేశం కోసం పని చేయడం లేదని నిరసనకారులు ఆరోపించారు.

నేపాల్‌లోని మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజల కష్టతరమైన జీవితాలను, నాయకుల సౌకర్యవంతమైన జీవితాలను పోలుస్తూ కూడా అనేక వీడియోలు కనిపిస్తున్నాయి.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై గత గురువారం(సెప్టెంబరు 4) నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. అప్పటి నుంచి, యువత దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.

నేపాల్, నిరసనలు, సోషల్ మీడియా బ్యాన్, జెన్ జడ్ ఉద్యమం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పార్లమెంట్ ఆవరణలో గోడపైకి ఎక్కుతున్న నిరసనకారులు

దేశవ్యాప్తంగా పోలీసుల నిఘా

నేపాల్ పోలీసులు కఠ్మాండూలోనే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాలపై కూడా నిఘా పెట్టారు.

సోమవారం ఉదయం నుంచి కఠ్మాండూతో పాటు అనేక ప్రధాన నగరాల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయని పోలీసు ప్రతినిధి వినోద్ ఘిమిరే చెప్పారు.

"కఠ్మాండూలోనే కాకుండా అనేక ఇతర నగరాల్లో కూడా నిరసనలు జరుగుతున్నాయి. పోలీసు బలగాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు వీలుగా అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని ఒక ప్రణాళిక రూపొందించామని, బలగాలను మోహరించాం" అని ఘిమిరే బీబీసీ న్యూస్ నేపాలీతో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)