నేపాల్‌లో మళ్లీ రాచరికం కావాలని, హిందూ దేశంగా ప్రకటించాలని వస్తున్న డిమాండ్లు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయి?

నేపాల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మార్చి 9న నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర షా కఠ్మాండూకు వచ్చినప్పుడు, ఆయనకు స్వాగతం పలికేందుకు వేలాది మంది విమానాశ్రయానికి వచ్చారు.

నేపాల్ రాజధాని కఠ్మాండూ వీధుల్లో మాజీ రాజు జ్ఞానేంద్ర షా పేరు ప్రతిధ్వనిస్తోంది. ఈ పేరు 2006లోనూ అక్కడి వీధుల్లో మారుమోగింది, 2025లో మరోసారి వినిపిస్తోంది.

2006లో వీధుల్లో నిరసనకారులు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ, భిన్నమైన డిమాండ్లతో రోడ్లపైకి వచ్చారు. అప్పట్లో రాచరికం అంతం కావాలని డిమాండ్ చేయగా, ఇపుడు అదే రాచరికం కావాలని కోరుతున్నారు.

తాజా నిరసనలలో వందలాది మంది గాయపడ్డారు. రాచరికంతో పాటు నేపాల్‌ను మళ్లీ హిందూ దేశంగా ప్రకటించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.

నేపాల్‌ ఘటనలతో పొరుగున ఉన్న భారతదేశంపై పడే ప్రభావమేంటి ? రాచరికం తిరిగి వస్తే ఇండియాకు ఏదైనా ప్రయోజనం ఉంటుందా?. అకస్మాత్తుగా రాచరికం డిమాండ్ ఎందుకు తెరపైకి వచ్చింది?.

'ది లెన్స్' కార్యక్రమంలో కలెక్టివ్ న్యూస్‌రూమ్‌ జర్నలిజం డైరెక్టర్ ముఖేష్ శర్మ దీనిపై చర్చించారు.

ఇటీవల నేపాల్ నుంచి తిరిగి వచ్చిన బీబీసీ కరస్పాండెంట్ దిల్‌నవాజ్ పాషా, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫెలో శివం షెఖావత్, నేపాల్ రాజధాని కఠ్మాండూలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ యువరాజ్ ఘిమిరే ఈ చర్చలో పాల్గొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ముఖేష్ శర్మ
ఫొటో క్యాప్షన్, 'ది లెన్స్' కార్యక్రమంలో కలెక్టివ్ న్యూస్‌రూమ్‌ జర్నలిజం డైరెక్టర్ ముఖేష్ శర్మ దీనిపై చర్చించారు.

నేపాల్‌లో నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి?

నేపాల్‌లో రాచరికానికి మద్దతుగా నిరసనలు జరుగుతున్నాయి. మాజీ రాజు జ్ఞానేంద్ర షా వార్షిక ప్రసంగం అక్కడి ముఖ్యాంశాల్లో నిలిచింది.

నేపాల్ ప్రస్తుత పాలనా వ్యవస్థ దారుణమైన స్థితిలో ఉంది. మెరుగైన జీవితం, ఉపాధి కోసం యువత విదేశాలకు తరలివెళుతున్నారు. దీంతో రాచరిక వ్యవస్థ మద్దతుదారులు నేపాల్‌లో మళ్లీ రాచరికం, హిందూ దేశం రావాలంటూ నిరసనలు చేస్తున్నారు.

"నేపాల్‌లో ఎవరితో మాట్లాడినా అక్కడి పాలనా వ్యవస్థపై వారికి తీవ్ర నిరాశ ఉందని అర్థమవుతుంది. దేశంలో అవినీతి, గందరగోళ వ్యవస్థ ఉంది. ప్రభుత్వం అంచనాలకు తగ్గట్లుగా పనిచేయలేకపోతోంది. రాచరికంలోనే పాలన మెరుగ్గా ఉండేదని కొందరు చెబుతున్నారు" అని బీబీసీ కరస్పాండెంట్ దిల్‌నవాజ్ పాషా అన్నారు.

"2006లో నేపాల్ పార్లమెంటు పునరుద్ధరణ జరిగింది. ఎటువంటి చర్చ లేకుండానే నేపాల్‌ను లౌకికవాద దేశంగా ప్రకటించారు. రాచరికాన్ని కూడా రద్దు చేశారు" అని సీనియర్ జర్నలిస్ట్ యువరాజ్ ఘిమిరే గుర్తుచేశారు.

"ఎటువంటి చర్చ లేకుండా రాజును అధికారం నుంచి దించినపుడు, ప్రజలు ఆయన పట్ల సానుభూతి చూపారు" అని ఘిమిరే అభిప్రాయపడ్డారు

నేపాల్‌లో అవినీతి, గందరగోళం ఎక్కువయ్యాయని, వాటిని ఆపగల ఏదైనా ఒక శక్తి ఉండాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.

నేపాల్ ఆందోళనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నేపాల్‌లో రాచరికానికి మద్దతుగా ప్రదర్శనలు జరుగుతున్నాయి.

భారత్, నేపాల్ సంబంధాలు

"నేపాల్‌లో అశాంతి, అస్థిరత భారతదేశం కోరుకోదు" అని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫెలో శివం షెకావత్ అన్నారు.

"భారత్, నేపాల్ మధ్య సంబంధం పాతది. ఎవరు అధికారంలో ఉన్నారనేది పట్టింపు లేదు. రాచరికంతో మంచి సంబంధం ఉంది. గత దశాబ్ద కాలంగా పరిశీలిస్తే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయి. కొన్నిసార్లు కొన్ని సమస్యలపై ఉద్రిక్తత కనిపిస్తుంది కానీ, రెండు వైపులా ప్రజాస్వామ్యం ఉంది" అని శివం షెకావత్ అన్నారు.

నేపాల్‌లో ఎవరు అధికారంలోకి వచ్చినా భారత్ వారితో కలిసి పనిచేయాల్సి ఉంటుందని షెకావత్ అభిప్రాయపడ్డారు.

చైనా ఈ పరిస్థితిని ఎలా చూస్తుందనే ప్రశ్నకు జర్నలిస్ట్ యువరాజ్ ఘిమిరే సమాధానమిస్తూ.. 'నేపాల్‌కు ఒక వైపు చైనా మరోవైపు భారత్ ఉన్నాయి. దీంతో రెండు దేశాలతో సత్సంబంధాలను కొనసాగించుకునేలా విదేశాంగ విధానం ఏర్పాటు చేసుకున్నారు' అని అన్నారు.

చైనా, భారత్ మధ్య ఏదైనా వివాదం తలెత్తితే గతంలో నేపాల్ రాచరిక వ్యవస్థ భారతదేశానికి మద్దతు ఇచ్చిందని ఘిమిరే అన్నారు. అయితే, 2006లో రాజకీయ మార్పుల తర్వాత నేపాల్‌లో చైనా పెట్టుబడులు పెరిగాయని, ఇది ఇపుడు ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

నేపాల్‌లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, అది తమకు ప్రయోజనం చేకూరుస్తుందని చైనా భావిస్తోందని ఘిమిరే అన్నారు.

హిందూ దేశం

ఫొటో సోర్స్, Getty Images

హిందూ దేశ డిమాండ్ ప్రభావం?

"నేపాల్ మళ్లీ హిందూదేశంగా మారొద్దనుకునే వారు అక్కడ చాలా తక్కువమంది ఉంటారు. నేపాల్ ప్రజలకు హిందూదేశం పట్ల భావోద్వేగ అనుబంధం ఉంది. వారికి హిందూ దేశం ఒక గుర్తింపు, కానీ దాన్నే తీసేశారు" అని దిల్‌నవాజ్ పాషా అన్నారు.

"హిందూ దేశమనేది సాంస్కృతిక, చారిత్రక గుర్తింపుకు సంబంధించినది. ప్రజలు ఈ గుర్తింపును తిరిగి కోరుకుంటున్నారు" అని దిల్‌నవాజ్ పాషా అభిప్రాయపడ్డారు.

అక్కడ కొంతమంది ముస్లింలతో మాట్లాడానని, నేపాల్ హిందూ దేశమైతే ఎటువంటి సమస్యా లేదని, ఇంతకుముందు కూడా హిందూ దేశమని వారు చెప్పారని దిల్‌నవాజ్ అన్నారు.

"రాచరికం కోసం ఆందోళన చేస్తున్న పార్టీలు నేపాల్‌లో హిందూ దేశానికి ఎక్కువ మద్దతు ఉందని గ్రహించాయి. అందుకే హిందూ దేశ డిమాండ్‌ను ముందుకు తెచ్చారు" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక నేపాల్ పెట్టుబడుల గురించి అడగగా.. ఇపుడు నేపాల్‌లో రాజకీయ మార్పు వస్తే, పెట్టుబడిదారులు తమ విశ్వాసాన్ని తిరిగి పొందడానికి సమయం పడుతుందని షెకావత్ అభిప్రాయపడ్డారు. పాలన ఎంత స్థిరంగా ఉంది? వ్యవస్థ ఎలా పనిచేస్తుందనే దానిపై కూడా ఇది ఆధారపడి ఉంటుందని తెలిపారు.

"పెట్టుబడిదారులు ప్రజాస్వామ్య ప్రభుత్వం కంటే రాచరికంలో ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారని భావిస్తున్నాను" అని షెకావత్ అన్నారు.

మాజీ రాజు జ్ఞానేంద్ర షా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాజీ రాజు జ్ఞానేంద్ర షా

మాజీ రాజు జ్ఞానేంద్ర ఏం చేస్తున్నారు?

"మార్చి 28 తర్వాత మాజీ రాజు జ్ఞానేంద్ర ఎటువంటి కార్యాచరణను ప్రకటించలేదు. కానీ, నేపాలీ నూతన సంవత్సర సందర్భంగా ఒక సందేశాన్ని విడుదల చేశారు. నేపాల్‌లో రాజ్యాంగబద్ధమైన రాచరికం, బహుళ పార్టీ రాజకీయ వ్యవస్థను కోరుకుంటున్నానని ఆయన స్పష్టంచేశారు" అని బీబీసీ ప్రతినిధి దిల్‌నవాజ్ పాషా అన్నారు.

"ఫిబ్రవరిలో జ్ఞానేంద్ర దాదాపు 10 నిమిషాల సందేశాన్ని విడుదల చేశారు. అందులో ఆయన ప్రస్తుత రాజకీయ వ్యవస్థలోని లోపాలను ఆయన ఎత్తిచూపారు" అని దిల్‌నవాజ్ అన్నారు.

ప్రస్తుత వ్యవస్థ కంటే నేపాల్‌కు రాచరికం మంచిదని ఈ సందేశంలో ఆయన చెప్పడానికి ప్రయత్నించారని దిల్‌నవాజ్ అభిప్రాయపడ్డారు.

బీరేంద్ర బీర్ బిక్రమ్ షా కుటుంబం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2001లో రాజు బీరేంద్రతో పాటు రాజకుటుంబంలోని పలువురు హత్యకు గురయ్యారు.

2001లో నేపాల్‌లో జరిగిన దర్బార్ హత్యాకాండలో రాజు బీరేంద్ర బీర్ విక్రమ్ సింగ్ షా దేవ్‌తో పాటు రాజకుటుంబంలోని పలువురు హత్యకు గురయ్యారు. దీంతో జ్ఞానేంద్ర షాను రాజుగా ప్రకటించారు.

2005లో నేపాల్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, అధికారాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు రాజు జ్ఞానేంద్ర.

మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడానికి ఈ చర్య అవసరమని ఆయన పేర్కొన్నారు.

ఇది రాజుకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలకు దారితీసింది. ఏడు రాజకీయ పార్టీలు కలిసి 2007లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

2008లో రాచరికాన్ని రద్దు చేస్తూ నేపాలీ పార్లమెంట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ విధంగా నేపాల్ హిందూ దేశం నుంచి లౌకిక గణతంత్ర రాజ్యంగా మారింది. 2007 తరువాత 18 సంవత్సరాల వ్యవధిలో నేపాల్‌లో 14 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)