నేపాల్: వరదలు, కొండ చరియలు విరిగి పడిన ఘటనల్లో 150 మంది మృతి

నేపాల్ వరదలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అలెక్స్ ఫిలిప్స్, సంజయ్ ధాకల్
    • హోదా, కాఠ్‌మాండూ నుంచి బీబీసీ కోసం

నేపాల్‌లో భారీ వరదలు, కొండ చరియలు విరిగిపడటంతో 150 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. రాజధాని కాఠ్‌మాండూ చుట్టుపక్కల ప్రాంతాలను రెండు రోజుల పాటు భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షాల వరదలు పోటెత్తడంతో పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు.

కొంతమంది ఇళ్ల పైకప్పుల మీదకు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. వీరిని సహాయ సిబ్బంది పడవల ద్వారా తరలిస్తున్నారు.

నదుల సమీపంలో వేల కొద్దీ ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. రహదారుల్ని వరద నీరు ముంచెత్తడంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి.

మంగళవారం వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించినప్పటికీ ఆదివారం తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న 3వేల మందిని రక్షించినట్లు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు చెప్పారు.

ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల అనేక మంది మరణించారు.

కాఠ్‌మాండూకు తూర్పున ఉన్న భక్తపూర్‌లో కొండచరియలు విరిగిపడి ఒక ఇల్లు కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఆ ఇంట్లోని గర్భిణీ స్త్రీ, నాలుగేళ్ల బాలికతో సహా ఐదుగురు మరణించారని ప్రభుత్వ మీడియా తెలిపింది.

నేపాల్ వరదలు

ఫొటో సోర్స్, APF

కాఠ్‌మాండూ పశ్చిమాన ఉన్న ధాడింగ్‌లో కొండ చరియలు బస్సుపై పడిన సంఘటనలో ఇద్దరు మరణించారు. బస్సులో డ్రైవర్‌తో సహా 12 మంది ఉన్నట్లు తెలిసింది.

మక్వాన్‌పూర్‌లో ఆల్ నేపాల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న శిక్షణా కేంద్రం వద్ద కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు ఫుట్‌బాల్ ఆటగాళ్లు చనిపోయారు.

దక్షిణ కాఠ్‌మాండూ లోయలోని నక్కు నదిలో నలుగురు వ్యక్తులు కొట్టుకుపోయారు.

"గంటల తరబడి, వారు సహాయం కోసం వేడుకుంటూనే ఉన్నారు. మేము ఏమీ చెయ్యలేకపోయాం" అని జితేంద్ర భండారీ అనే ప్రత్యక్ష సాక్షి బీబీసీకి చెప్పారు.

కాఠ్‌మాండూలో హరిఓం మల్లాకు చెందిన ట్రక్కు వరద నీటిలో కొట్టుకుపోయింది.

శుక్రవారం రాత్రి వర్షం తీవ్రరూపం దాల్చడంతో క్యాబిన్‌లోకి నీరు వచ్చిందని ఆయన బీబీసీకి తెలిపారు.

"మేము బయటకు దూకాం, ఈత కొట్టుకుంటూ ఎత్తైన ప్రాంతానికి చేరుకున్నాము. అయితే నా పర్సు, బ్యాగ్, మొబైల్ ఫోన్ నదిలో కొట్టుకుపోయాయి. నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. మేము రాత్రంతా చలిలో ఉండిపోయాము’’ అని హరిఓంమల్లా చెప్పారు.

కాఠ్‌మాండూలో భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లుతున్న బాగ్మతి నది ఒడ్డున ఉన్న స్థానికుల్ని సహాయ సిబ్బంది పడవల ద్వారా తరలించారు.

నేపాల్ వరదలు, భారీ వర్షాలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇప్పటి వరకు 2వేల మందికి పైగా బాధితుల్ని రక్షించిన సహాయ బృందాలు

వరదల వల్ల వాటర్‌పైపులు పగిలిపోయాయని, టెలిఫోన్ లైన్లు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు ప్రభుత్వ ప్రతినిధి పృథ్వీ సుబ్బా గురుంగ్ నేపాల్ టెలివిజన్ కార్పోరేషన్‌కు తెలిపారు.

గల్లంతైన వారిని వెతకడం, బాధితుల్ని రక్షించేందుకు 10వేల మంది పోలీసు అధికారులు, వలంటీర్లు, సైనికులను నియమించిట్లు నేపాల్ ప్రభుత్వ మీడియా తెలిపింది.

ప్రజలు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కాఠ్‌మాండూ లోయలో రాత్రిపూట ప్రయాణాల్ని నిషేధించారు.

కాఠ్‌మాండూను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిపే రహదారులతో పాటు అనేక ఇతర హైవేలను బ్లాక్ చేశారు.

నేపాల్, భారీ వర్షాలు, వరదలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మంగళవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో మృతుల సంఖ్య పెరగవచ్చని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.

భారీ వర్షాల కారణంగా అనేక విమానాల రాకపోకలను రద్దు చేశారు. కొన్ని సర్వీసుల్ని పూర్తిగా నిలిపివేశారు.

నేపాల్‌లో వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఇలాంటి సమస్యలు సహజంగా మారాయి.

వాతావరణ మార్పుల వల్ల వర్షపాతం చాలా తీవ్రంగా ఉంటోందంటున్నారు శాస్త్రవేత్తలు

వేడి వాతావరణంలో తేమ అధికంగా ఉంటుందని, సముద్ర జలాలు వేడెక్కడం వల్ల తుపానుల వేగం పెరుగుతుందని, అవి మరింత తీవ్రంగా విరుచుకుపడతాయని, ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

( బీబీసీ తెలుగు కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)