‘కేరళ లాటరీ తగిలిందంటూ ఫోన్ ’ తరువాత ఏం జరిగిందంటే..?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త ఆన్‌లైన్ మోసం పెరుగుతోంది. కేరళ లాటరీ పేరుతో ఆన్‌లైన్‌లో డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు కొందరు మోసగాళ్లు.
ఈ మధ్య కాలంలో బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు లక్షల రూపాయలు పోగొట్టుకోగా, దాన్నుంచి త్రుటిలో తప్పించుకున్నారు మరికొందరు.
కేరళలో అక్కడి ప్రభుత్వమే అధికారికంగా లాటరీ నిర్వహిస్తుంది. దీన్ని గెలిస్తే వచ్చే బహుమతులు కూడా కోట్ల రూపాయల్లోనే ఉంటాయి. వంద రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకూ ఎక్కువ మందికి బహుమతులు అందేలా అక్కడ లాటరీ వ్యవస్థ ఉంటుంది.
లాటరీ టికెట్ల ప్రింట్, అమ్మకం, లాటరీ డ్రా ప్రకటన, గెలిచిన వారికి డబ్బు అప్పగించడం.. ఇదంతా ప్రభుత్వమే నిర్వహిస్తుంది.
ఆ టికెట్లు కూడా కేరళ పరిధిలో, అది కూడా పేపర్ టికెట్లు అమ్ముతారు తప్ప, ఆన్‌లైన్‌లో అమ్మరు.


ఇతర రాష్ట్రాల వారు స్వయంగా కేరళ వెళ్లి కొనుక్కోవాలి. అంతేగానీ ఆన్‌లైన్‌లో దొరకవు. ఏజెన్సీలు కూడా అలా అమ్మడం నిషేధం. ఒకవేళ డ్రాలో డబ్బు గెలుచుకున్నా, దాన్ని తీసుకోవడానికి పన్నులు, ప్రాసెసింగ్ ఫీజులు వంటి రూపంలో ముందుగా ఎదురు డబ్బు కట్టక్కర్లేదు.
ఈ విషయం తెలియని చాలామంది మోసపోతుంటారు. ఇటువంటి ఆన్‌లైన్ సంస్థలపై 2024లో కేరళ పోలీసులు చర్యలు తీసుకున్నారు. కానీ, అవి మళ్లీ మొదలయ్యాయి. అచ్చంగా కేరళ ప్రభుత్వ వెబ్‌సైట్‌ని పోలిన వెబ్‌సైట్ ద్వారా, అనధికారిక యాప్‌లు, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈ మోసాలు జరుగుతున్నాయి.
కేరళ లాటరీ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఒక హైదరాబాదీ మహిళకు కాల్ చేసిన వ్యక్తులు ఆమె నుంచి ఏడున్నర లక్షలు దోచేశారు.

'మీరు రూ.56 లక్షలు గెలుచుకున్నారు' అని చెబుతూ ఒక ఆన్‌లైన్ లింక్ పంపారు. తరువాత డబ్బు పొందడానికి ప్రాసెసింగ్ ఫీ, పన్నులు కట్టాలంటూ రెండు మూడు విడతలుగా ఆమె నుంచి డబ్బు వసూలు చేశారు.
ఫోర్జరీ చేసిన లేఖలు, నకిలీ టికెట్ కూడా ఆమెకు పంపారు. మొత్తం డబ్బు పంపిన తరువాత తాను మోసపోయానని ఆమె తెలుసుకున్నారు. ఇది ఈ ఏడాది మేలో జరిగింది.
మేలోనే హైదరాబాద్‌లో మరో మోసం జరిగింది.
ఆన్‌లైన్‌లో కేరళ లాటరీ టికెట్లంటూ కొందరు ఒక ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి అయిన వృద్ధుడితో మూడు టికెట్లు కొనిపించారు. వాటిలో రెండు టికెట్లకు రూ.5 లక్షలు, రూ.12 లక్షల చొప్పున లాటరీ తగిలిందంటూ నమ్మించి, తిరిగి వచ్చే టాక్స్ (రిఫండబుల్) కింద రూ.3 లక్షలకు పైగా వసూలు చేసి, ఫోన్లు స్విచాఫ్ చేసేశారు.
అంతకుముందు హైదరాబాద్‌కే చెందిన మరో వ్యక్తి కూడా కేరళ లాటరీ తగిలిందని ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చూసి రూ.2 లక్షల వరకూ పోగొట్టుకున్నారు.
ఈ ఆగస్టులో బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఇలానే మోసపోయారు. ఆమె కేసులో అయితే, 'ముందుగా చార్జీల నిమిత్తం ఫలానా మొత్తం పంపాలి' అని కోరారు. తరువాత 'అలా డబ్బు పంపడం నేరం అనీ ఆ కేసు మాఫీ నిమిత్తం' అంటూ దిల్లీ పోలీసుల పేరుతో రూ.11 లక్షలకు పైగా దోచేశారు.

నేరం ఎలా చేస్తారు?
నేరుగా కాల్ చేసి మీకు లాటరీ తగిలిందని చెబుతారు. అందుకు సాక్ష్యంగా నకిలీ పత్రాలు, మెసేజీలు పంపుతారు. ఆ డబ్బు అందుకోవడానికి చార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు, పన్నులు, ఖర్చులు అంటూ ఎదురు డబ్బు చెల్లించమంటారు. లక్షల రూపాయల కోసం వేలు పెట్టడం తప్పులేదని నమ్మిస్తారు.
కొందరు తామే టికెట్లు అమ్ముతారు. అంటే అచ్చంగా కేరళ లాటరీ టికెట్లను పోలినవి ఆన్‌లైన్‌లో అమ్ముతారు. కొన్ని సందర్భాల్లో కేరళలో కాలం చెల్లిన ఒరిజినల్ టికెట్లనే స్కాన్ చేసి మరీ అమ్మజూపుతారు. ఆ టికెట్లు కూడా నకిలీవే.
కేరళ ప్రభుత్వ టికెట్లు అనేసరికి చాలామంది కొంటారు.
కొన్న తరువాత, తిరిగి వాళ్లే కాల్ చేసి.. మీరు కొన్న టికెట్‌కి బహుమతి వచ్చింది అంటారు. ఫలానా నంబర్ టికెట్ మీ దగ్గరే ఉంది కదా అంటూ కబుర్లు చెబుతారు.
కావాలంటే మీ నంబరును వెబ్‌సైట్‌లో చెక్ చేసి చూసుకోమంటారు. నకిలీ వెబ్ సైట్ లింక్ ఇస్తారు. అచ్చంగా కేరళ ప్రభుత్వ సైట్‌నే పోలిన దాన్ని చూసి చాలామంది నిజమేనని నమ్ముతారు.
దానికి పన్ను కట్టాలి, ముందుగా ఇంత మొత్తం చెల్లించండి అంటూ డబ్బు వసూలు చేసి, ఆ ఫోన్ నంబర్లు ఆపేస్తారు.
ఫోన్ ద్వారానే కాకుండా సోషల్ మీడియా అంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ యాప్‌లు వాట్సాప్, టెలిగ్రామ్ వంటి వాటి ద్వారా కూడా ఈ మోసాలు జరుగుతాయి.

ఇది కాకుండా మరో తరహా వ్యాపారం ఉంది.
కేరళ బయట నివసిస్తున్న ఆ రాష్ట్రం వారు, లేదా ఆ లాటరీ గురించి తెలిసిన ఇతర రాష్ట్రాల వారి కోసం తాము ఆ టికెట్లు కొనిపెడతామని కొందరు చెబుతారు. ఇది పూర్తిగా నమ్మకం మీద ఆధారపడి నడుస్తుంది.
చట్ట ప్రకారం కాకపోయినా, వ్యక్తిగత నమ్మకం మీద స్నేహితులో, బంధువులో కేరళలో ఉంటే వారిచేత టికెట్ కొనుగోలు చేయించుకునే వారు ఉంటారు. అలా ఎవరూ లేనివారు కొందరు ఇలాంటి వ్యాపారులపై ఆధారపడతారు. తమ పేరిట టికెట్ కొని, వారే దాచి ఉంచుతారు. టికెట్ ఫోటో పంపుతారు. డబ్బు ఆన్‌లైన్‌లో తీసుకుంటారు.
కానీ బహుమతి వచ్చినప్పుడు ఆ టికెట్ కొన్న వారికే నిజాయతీగా ఇస్తారా లేదా అన్నది మాత్రం పరస్పర నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.
వాట్సాప్ గ్రూపులు, ఇతరత్రా మార్గాల్లో ఈ వ్యాపారం జరగుతుంది. ఇది పూర్తిగా మోసం అనలేం. అయితే ఈ తరహాలో కొన్న టికెట్లలో జరిగే మోసాలకు కేరళ లాటరీ విభాగం బాధ్యత వహించదు.

కేరళ లాటరీ ఎలా పనిచేస్తుంది?
ఈ మోసాల బారిన పడకూడదంటే ముందుగా కేరళ లాటరీ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి.
కేరళలో లాటరీ టికెట్లను ప్రభుత్వమే ముద్రించి ఏజెన్సీల ద్వారా అమ్ముతుంది. గెలిచిన వారికి పన్ను, కమిషన్లు మినహాయించి మిగిలిన డబ్బు ఇస్తారు. టికెట్ అమ్మిన ఏజెన్సీకి గెలిచిన మొత్తంలో కొంత వాటా వస్తుంది.
ప్రతి రోజూ తీసే లాటరీతో పాటు పండుగ సందర్భాల్లో తీసే లాటరీలు కూడా ఉంటాయి. కేరళ ప్రభుత్వానికి పన్ను రూపంలో ఆదాయం లభించడంతో పాటు, వాటితో వచ్చే లాభాలను అనేక సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తుంది.
రోజూ లైవ్‌లో డ్రా తీసి ప్రకటిస్తారు. రోజువారీ తీసే లాటరీ మొదటి బహుమతే కోటి రూపాయలు ఉంటుంది. అందులో పన్నులు, కమిషన్లు పోనూ దాదాపు రూ.60 లక్షలు చేతికి వస్తుంది. ప్రతిరోజూ లాటరీలో ఎక్కువ మందికి ఎంతో కొంత బహుమతి వచ్చే ఏర్పాటు ఉంటుంది కాబట్టి టికెట్లు కూడా లక్షల్లో అమ్ముడవుతాయి.
రోజువారీ మొదటి బహుమతి కోటి రూపాయలు అయితే, బంపర్ డ్రాలు రూ.10 కోట్లు, రూ.25 కోట్లు కూడా ఉంటాయి. అలా ఏడాదికోసారి రూ.25 కోట్ల వరకూ గెలిచేవారూ ఉంటారు. ఆటో డ్రైవర్‌కు పాతిక కోట్లు, చేపలమ్మే వ్యక్తికి 70 లక్షల లాటరీ, ఫలానా వారికి పది కోట్ల లాటరీ తగిలిందనే వార్తలు కేరళలో సర్వసాధారణం. అలాగే ఎన్నిసార్లు లాటరీ టికెట్లు కొన్నా, ఒక్కసారీ బహుమతి గెలుచుకోని వారూ ఉంటారు.
లక్షలు, కోట్ల రూపాయల టికెట్లు కొని వేల రూపాయలు కూడా రాని వారు కేరళలో కనిపిస్తుంటారు.
చాలా కుటుంబాలు లాటరీ టికెట్ల అమ్మకంతో ఉపాధి పొందుతుంటే, ప్రభుత్వం ఆ సొమ్ములో కొంత మొత్తాన్ని పేదలకు ఖర్చు చేయడం ద్వారా మరికొన్ని కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి.

బహుమతి తీసుకోవడం ఎలా అంటే...
గెలిచిన లాటరీ తీసుకోవడానికి కూడా ప్రక్రియ ఉంటుంది. బాగా చిన్న మొత్తాలు అయితే నేరుగా టికెట్ అమ్మిన ఏజెంట్ దగ్గర తీసుకోవచ్చు. సొమ్ము మొత్తం పెరిగేకొద్దీ చట్టపరమైన అన్ని ప్రక్రియలూ పాటిస్తారు. కొన్ని పత్రాలు సమర్పించి, ఒరిజినల్ టికెట్ (కాగితపు టికెట్) అధికారులకు ఇచ్చి, ఆ డబ్బు పొందాలి. లక్షల్లో గెలిస్తే బ్యాంకు నుంచి పత్రాలు ఇవ్వడం వంటివి ఉంటాయి. దానికి అనేక ఫామ్‌లు ఉంటాయి. గెలిచిన మొత్తంలో నుంచి పన్నులన్నీ వారే మినహాయించుకుని మిగిలిన డబ్బు ఇస్తారు.
ఈ లాటరీ వ్యాపారం కేరళ ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతోంది. దీనికి జీఎస్టీ అదనం. ఐఏఎస్ అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో చాలా పకడ్బందీగా నడిచే వ్యవస్థ ఇది.
దీన్ని ఆసరా చేసుకుని సైబర్ మోసాగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. కేరళ లాటరీ అనే పదాలు వచ్చే అనేక నకిలీ వెబ్‌సైట్ యూఆర్ఎల్‌లు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ చూడటానికి కేరళ ప్రభుత్వ సైట్లలానే కనిపించేలా డిజైన్ చేశారు. వాటిలో ఏది అసలుదో, ఏది నకిలీదో పోల్చుకోవడం కష్టం.

జాగ్రత్తగా ఉండడమే మార్గం!
ఇటువంటి కేసుల విషయంలో ముందు జాగ్రత్త మాత్రమే రక్ష అంటున్నారు సైబర్ నిపుణులు. డబ్బు పోయిన తరువాత తీసుకురావడం చాలా క్లిష్టమైనదని అనేక కేసుల అనుభవాలు చెప్తున్నాయంటున్నారు పోలీసులు.
హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ విభాగ పోలీసులు, సైబర్ నిపుణులు ఇచ్చిన సూచనలు:
https://statelottery.kerala.gov.in/ అధికారిక వెబ్ సైట్.
కానీ https://results.keralalotteryonline.in, https://keralalotterymegaresulte.com వంటి ఎన్నో సైట్లు అచ్చంగా ప్రభుత్వ సైట్లను పోలినవే ఉంటాయి.
ప్రభుత్వ అధికారులు ఎప్పుడూ ముందుగా డబ్బు పంపమని అడగరు. అలాగే, తగినంత డాక్యుమెంట్ వర్క్ చేయకుండా ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్‌లు తీసుకోరు.
బ్యాంకులు, ప్రముఖ సంస్థలూ వాట్సాప్ ద్వారా, కాల్స్ ద్వారా ఓటీపీలు, ఇతర వివరాలు అడగవు.
మోసపోయినా, అనుమానం వచ్చినా 1930 నంబరుకు కానీ, https://cybercrime.gov.in/ వెబ్ సైట్లో కానీ వెంటనే ఫిర్యాదు చేయాలి. ఎంత తొందరగా ఫిర్యాదు చేస్తే అంత మంచిది.
కేరళ నుంచి ప్రత్యక్షంగా కొన్న టికెట్లు, అది కూడా ఆ టికెట్ మీ చేతిలో ఉంటేనే చెల్లుతుంది.
అధికారిక వెబ్ సైట్‌తో పాటు, అధికారిక యూట్యూబ్ చానెల్‌లో రిజల్ట్ ప్రకటిస్తారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో లాటరీలపై నిషేధం ఉంది.
''నువ్వే ఆ డబ్బు మినహాయించుకుని మిగిలిన డబ్బు నా అకౌంట్లో వేయి అనడం అన్నింటికంటే శ్రేయస్కరం'' అంటున్నారు సైబర్ నిపుణులు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














