ప్రపంచ యాత్ర చేస్తున్న భారతీయుడి బైక్ బ్రిటన్‌లో చోరీ, ఆ తర్వాత ఏమైందంటే..

బ్రిటన్, భారత్, ప్రపంచ యాత్రికుడు, బైక్ దొంగతనం, యోగేశ్ అలేకారీ

ఫొటో సోర్స్, Yogesh Alekari

ఫొటో క్యాప్షన్, ప్రపంచ యాత్ర కోసం 2025 ఏప్రిల్‌లో బైక్ కొన్నట్లు యోగేశ్ చెప్పారు.
    • రచయిత, అలెక్స్ థోర్ప్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బైక్‌పై ప్రపంచ యాత్రకు బయల్దేరిన భారత్‌కు చెందిన యాత్రికుడి మోటార్‌ సైకిల్‌‌ను బ్రిటన్‌లో చోరీకి గురైంది.

ప్రపంచాన్ని చుట్టి రావాలని దాదాపు 24,140 కిలోమీటర్ల యాత్ర చేపట్టారు భారత్‌కు చెందిన యోగేశ్ అలేకారీ.

అయితే, బైక్ దొంగతనం తర్వాత ఆన్‌లైన్‌ నుంచి వస్తున్న మద్దతు తన "ఆలోచనా ధోరణిని" మార్చేసిందని ఆయన అన్నారు.

గురువారం నాటింగ్‌హామ్‌లోని వొల్లాటన్ పార్క్ వద్ద తన బైక్ పార్క్ చేసిన సమయంలో, దానిని ఎవరో దొంగిలించారని యోగేశ్ అలేకారీ చెప్పారు.

దొంగతనానికి ముందు, కేటీఎం 390 అడ్వెంచర్ బైక్‌పై 33 ఏళ్ల యోగేశ్ 17 దేశాల్లో ప్రయాణించారు.

బైక్‌తో పాటు మొత్తం రూ.17.83 లక్షలకు పైగా విలువైన సామగ్రి కూడా చోరీకి గురైంది.

బైక్ దొంగతనం జరిగిన తర్వాత తనకు దుస్తులు, బైక్ ఇస్తామంటూ ఆఫర్లు వచ్చాయని యోగేశ్ చెప్పారు.

భారత్, బ్రిటన్‌లోని బైకర్ల కమ్యూనిటీల నుంచి తనకు లభిస్తున్న సాయానికి ఆయన ధన్యవాదాలు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బ్రిటన్, భారత్, ప్రపంచ యాత్రికుడు, బైక్ దొంగతనం, యోగేశ్ అలేకారీ

ఫొటో సోర్స్, facebook.com/yogesh.alekari

ఫొటో క్యాప్షన్, బైక్ దొంగతనం తర్వాత యోగేశ్‌కు అనేక మంది డబ్బుతో పాటు దుస్తులు, బైక్ ఇస్తామని ఆఫర్ చేశారు.

"నేను నిజంగా అభినందిస్తున్నా" అని ఆయన అన్నారు.

"వారు (శ్రేయోభిలాషులు) నా ఆలోచనా దృక్పథాన్నే మార్చేశారు. నాకు భారత్‌, యూకే, బైకర్ కమ్యూనిటీల నుంచి కూడా భారీగా మద్దతు వస్తోంది."

"బ్రిటిష్ బైకర్ల నుంచి అనేక మెసేజ్‌లు వస్తున్నాయి. 'మేము మీతో ఉన్నాం. మీకు అండగా ఉంటాం' అని బ్రిటిష్ పౌరులు చెబుతున్నారు" అని యోగేశ్ వివరించారు.

యూరప్ వెళ్లడానికి ముందు యోగేశ్ నేపాల్, చైనా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లో ప్రయాణించారు. యూరప్‌లో జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ ‌చుట్టేసి బ్రిటన్ చేరుకున్నారు.

నాటింగ్‌హామ్‌ నుంచి ఆక్స్‌ఫర్డ్ వెళ్తూ ఆగస్ట్ 28న వొల్లాటన్ పార్క్ వద్ద తన బైక్ పార్క్ చేశారు.

అక్కడ టిఫిన్ చేసి బయటకు వచ్చి చూసేప్పటికి, తన బైక్‌తో పాటు మిగిలిన వస్తువులనూ ఎవరో దొంగిలించినట్లు గుర్తించారు.

ఇద్దరు స్కూటరిస్టులు బైక్‌ను తీసుకెళుతున్న దృశ్యాలు పార్క్ దగ్గర ఓ సందర్శకుడు తీసిన వీడియోలో రికార్డయ్యాయి.

బైక్ దొంగతనం గురించి కథనాలు ప్రసారం కావడంతో తనకు మద్దతుగా మెసేజ్‌లు వెల్లువెత్తాయని యోగేశ్ చెప్పారు.

"ప్రజల్లో మానవత్వం ఉంది" అని ఆయన అన్నారు.

"అనేక మంది తమ రైడింగ్ దుస్తులు ఇస్తామని చెప్పారు. వాళ్ల మోటార్ సైకిల్ కూడా ఇస్తామని అన్నారు" అని యోగేశ్ తెలిపారు.

బ్రిటన్, భారత్, ప్రపంచ యాత్రికుడు, బైక్ దొంగతనం, యోగేశ్ అలేకారీ

ఫొటో సోర్స్, Getty/Dave Bennett

ఫొటో క్యాప్షన్, యోగేశ్‌కు లాంగ్ వే హోమ్ టీవీ సిరీస్ నిర్మాణ సంస్థతో పాటు నటుడు ఇవాన్, టీవీ ప్రెజెంటర్ బూర్మన్ మద్దతుగా నిలిచారు.

యోగేశ్‌కు మద్దతు తెలిపిన వారిలో లాంగ్‌వే హోమ్ టీవీ సిరీస్ నిర్మాణ సంస్థ , నటుడు ఇవాన్ మెక్ గ్రెగర్, టీవీ ప్రెజెంటర్ చార్లే బూర్మన్ ఉన్నారు.

యోగేశ్ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌కి స్పందించిన లాంగ్‌వే టీవీ అకౌంట్ మోటార్ సైకిల్‌ను విరాళంగా అందిస్తామని ప్రకటించింది.

"నాటింగ్‌హామ్‌లో మీ బైక్ చోరీకి గురవడం బాధాకరం" అని లాంగ్‌వే టీవీ తన పోస్ట్‌లో తెలిపింది.

"గత సిరీస్ చిత్రీకరణ సమయంలో మేం ఉపయోగించిన కేటీఎం మా వద్ద ఉంది. అది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటే, దానిని మీకు ఇవ్వాలని అనుకుంటున్నాం" అని ఆ పోస్ట్‌లో రాసింది.

కొత్త బైక్ ఆఫర్‌ను అంగీకరించడాని కంటే ముందు.. పోలీసులు తన బైక్‌ను కనిపెడతారని ఆశిస్తున్నట్లు యోగేశ్ చెప్పారు.

"నా బైక్‌తో నాకు చాలా జ్ఞాపకాలున్నాయి. అది నాకు తిరిగి ఇప్పించండి. నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా. దొంగతనం బాధించింది" అని యోగేశ్ చెప్పారు.

తాము "విస్తృతంగా దర్యాప్తు" చేస్తున్నామని, అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, బైక్‌ను కనిపెట్టలేదని నాటింగ్‌హామ్ పోలీస్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)