ట్రంప్: ‘భారత్, రష్యాలను చైనాకు వదిలేసుకున్నాం’ అన్న వ్యాఖ్యలను ఎలా అర్ధం చేసుకోవాలి ?

ఫొటో సోర్స్, EPA/Shutterstock
భారత్, రష్యా, చైనా త్రయంపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ స్పందించారు.
‘‘భారత్, రష్యాలను చైనాకు కోల్పోయినట్టు కనిపిస్తోంది. వారి భాగస్వామ్యం దీర్ఘకాలం సుసంపన్నంగా ఉండాలని ఆశిస్తున్నాను" అని ఆయన ట్రూత్ సోషల్‌లో రాశారు.
ట్రంప్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్‌ను స్పందించాలని కోరగా...దీనిపై తానేమీ చెప్పలేనని ఆయన బదులిచ్చారు.
చైనా అధ్యక్షులు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం(సెప్టెంబరు 1) తియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
ఇది భారత్, చైనా మధ్య ఏర్పడ్డ ప్రతిష్టంభన తొలగిపోతున్న సంకేతాలిచ్చింది. దీనికి ప్రధాన కారణం ట్రంప్ విధించిన సుంకాలు భారత్, అమెరికా మధ్య స్నేహంపై ప్రతికూల ప్రభావం చూపడం.
డోనల్డ్ ట్రంప్ 'అమెరికా ఫస్ట్' విధానం ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను కుదిపేసింది.
ప్రత్యర్థులుగా భావించే దేశాలు మారిన పరిస్థితుల్లో ఎలా కలిసి రాగలవో చెప్పడానికి చైనా, రష్యా, భారత్ త్రయంగా కనిపించడం ఒక బలమైన ఉదాహరణ.
అంతకుముందు అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ భారత్-అమెరికా సంబంధాలపై ట్రంప్‌ను మరోసారి తీవ్రంగా విమర్శించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో డోనల్డ్ ట్రంప్‌కు మంచి వ్యక్తిగత సంబంధం ఉందని, కానీ ఇప్పుడు అది ముగిసిపోయిందని అని జాన్ బోల్టన్ అన్నారు.
భారత్‌పై అమెరికా విధించిన సుంకాల విషయంలో అధ్యక్షుడు ట్రంప్‌ను బోల్టన్ విమర్శించడం ఇదే మొదటిసారి కాదు.
ఆంక్షలు పెట్టి చమురు కొనకుండా భారత్‌ను ఆపలేరని బోల్టన్ గతంలో అన్నారు.
బోల్టన్ ట్రంప్‌కు దగ్గర వ్యక్తి. ట్రంప్ మొదటి పదవీకాలంలో ఆయన జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు.
అయితే, ఇప్పుడు ట్రంప్‌ను బోల్టన్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆయన మూర్ఖుడని ట్రంప్ కూడా మండిపడ్డారు.


ఫొటో సోర్స్, truthsocial
'మోదీతో ట్రంప్ సంబంధం ముగిసింది'
చైనా ఇప్పుడు అమెరికాకు ప్రత్యామ్నాయంగా తనను తాను చూపించుకోవడానికి ప్రయత్నిస్తోందని బ్రిటిష్ మీడియా సంస్థ ఎల్‌బీసీకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బోల్టన్ అన్నారు.
''మోదీ చైనా వెళ్లడం పూర్తిగా ట్రంప్ వల్లే అనిపిస్తోంది. కొన్ని నెలలుగా భారత్‌తో ట్రంప్ వ్యవహరించిన తీరు దశాబ్దాల సంబంధాలను వెనక్కి నెట్టింది" అని జాన్ బోల్టన్ అన్నారు.
"రష్యా నుంచి భారత్‌ను దూరం చేయడానికి, భారతదేశానికి చైనా అతిపెద్ద ముప్పు అని స్పష్టం చేయడానికి ప్రయత్నం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది" అని ఆయన అన్నారు.
ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ, పుతిన్, జిన్‌పింగ్ ఒకే వేదికపై కనిపించారు. దీనిని మారుతున్న ప్రపంచ క్రమం( వరల్డ్ ఆర్డర్)గా భావిస్తున్నారా అని బోల్టన్‌ను ప్రశ్నించగా...
"అమెరికాకు లేదా కనీసం ట్రంప్‌కు ప్రత్యామ్నాయంగా తనను తాను బాధ్యతాయుతమైన శక్తిగా చూపించుకునే చైనా ప్రయత్నంలో ఇది కచ్చితంగా భాగమని భావిస్తున్నాను" అని బోల్టన్ బదులిచ్చారు.
ఈ నెల 17 నుంచి 19 వరకు ట్రంప్ బ్రిటన్‌లో పర్యటించనున్నారు. ట్రంప్ పర్యటనకు ముందు ఎల్‌బీసీ జాన్ బోల్టన్‌ను ఇంటర్వ్యూ చేసింది.
"ట్రంప్‌కు మోదీతో చాలా మంచి సంబంధాలున్నాయి. కానీ ఇప్పుడు అది ముగిసిన అధ్యాయం" అని మోదీ, ట్రంప్ మధ్య సంబంధంపై బోల్టన్ వ్యాఖ్యానించారు.
"ఇది అందరికీ ఒక పాఠం. వ్యక్తిగతంగా మంచి సంబంధాలుండడం కొన్నిసార్లు సాయపడుతుంది. కానీ పరిణామాలు దారుణంగా మారినప్పుడు ఎవరూ రక్షించలేరు'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌పై అమెరికా సుంకాలను వ్యతిరేకించిన బోల్టన్
భారత్‌ను అమెరికా లక్ష్యంగా చేసుకుంటోందని ఇంగ్లీషు వార్తాపత్రిక హిందూస్తాన్ టైమ్స్‌కు ఆగస్టులో ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్ బోల్టన్ వ్యాఖ్యానించారు.
"రష్యాపై కొత్త ఆంక్షలు విధించలేదు. రష్యా నుంచి చమురు, గ్యాస్ ఎక్కువగా కొంటున్నప్పటికీ చైనాపై కూడా కొత్త ఆంక్షలు విధించలేదు. కానీ భారత్‌ను ఏకాకిని చేసి లక్ష్యంగా చేసుకున్నారు" అని బోల్టన్ అన్నారు.
" రష్యా నుంచి భారత్ చమురు, గ్యాస్ కొనుగోలు చేయకూడదని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే చైనా నుంచి వచ్చే ముప్పును గుర్తించడం భారత్, అమెరికా రెండింటికీ మంచిదని నేను నమ్ముతున్నాను" అని బోల్టన్ వ్యాఖ్యానించారు.
"చైనా, రష్యా మధ్య పెరుగుతున్న మైత్రిని, అది ప్రపంచానికి కలిగించే ముప్పును కూడా అర్థం చేసుకోవాలి" అని అన్నారు.
భారతదేశానికి అమెరికా అతిపెద్ద ఎగుమతి మార్కెట్. భారత్ తన వస్తువులలో 18 శాతం అమెరికా మార్కెట్‌కు ఎగుమతి చేస్తుంది. ఇది భారతదేశ జీడీపీలో 2.2 శాతం.
"భారత్‌ను ఒంటరిగా చేసి, దానిపై మాత్రమే సుంకాలు విధించడం వల్ల అమెరికా శిక్షించిందని చాలా మంది అనుకుంటారు. ఇది భారత్‌ను రష్యా, చైనాలకు దగ్గర చేస్తుందని నేను ఆందోళన చెందుతున్నాను" అని బోల్టన్ అప్పట్లో అన్నారు.
ట్రంప్ పరిపాలనాయంత్రాంగం అసాధారణ విధానాలలో ఇది భాగమని బోల్టన్ విమర్శించారు. భారత్-అమెరికా సంబంధాలకు ప్రస్తుతం ఇది చాలా హానికరమని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














