ఘాటీ-మూవీ రివ్యూ: అనుష్క, క్రిష్ మ్యాజిక్ రిపీట్ అయిందా?

ఫొటో సోర్స్, UV Creations/Insta
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
దర్శకుడు క్రిష్, నటి అనుష్క కాంబినేషన్‌లో వచ్చిన ఘాటీపై చాలా అంచనాలున్నాయి. మరి ఘాటీ ఈ అంచనాలను అందుకుందో లేదో చూద్దాం...
తూర్పుకనుమల్లో వున్న ఒక తెగపేరు ఘాటీ. వాళ్లు కొండల్లో గంజాయి సాగు చేస్తూ, క్లిష్టమైన లోయ ప్రాంతాల నుంచి మోసుకొచ్చి, రవాణాకి అనువుగా వున్న ప్రాంతానికి చేరుస్తూ వుంటారు. ఈ పనిలో ప్రాణాలు కూడా కోల్పోతారు. వాళ్లకు బతకడానికి ఈ పని తప్ప ఇంకొకటి చేతకాదు. కోట్ల రూపాయల వ్యాపారాన్ని నాయుడు బ్రదర్స్ నడిపిస్తుంటారు. ఘాటీలు పోలీసు కేసుల్లో ఇరుక్కుంటే కాపాడుతారు. చనిపోతే డబ్బులిస్తారు.
ఘాటీల తెగకే చెందిన శీలావతి (అనుష్క) దేశిరాజు (విక్రమ్ ప్రభు) కలిసి తమ వారి బాగు కోసం ఏం చేశారు? గంజాయి స్మగ్లింగ్‌ని ఎలా మాన్పించారు? సింపుల్‌గా ఇది కథ.


ఫొటో సోర్స్, UV Creations/FB
అనుష్క ప్రతీకారం ఎలా తీర్చుకున్నారు?
ఘాటీల ఇంట్రడక్షన్‌తో సినిమా ప్రారంభమవుతుంది. గంజాయి నిరోధించే అధికారిగా జగపతిబాబు రంగంలోకి దిగి శీలావతి రకం గంజాయిని లిక్విడ్ రూపంలో స్మగుల్ చేస్తున్నారని తెలుసుకుంటారు. తమకి తెలియకుండా ఈ ఆపరేషన్ ఎలా జరుగుతూ వుందని నాయుడు బ్రదర్స్ (రవీంద్ర విజయ్, చైతన్యరావ్) ఆరా తీస్తే చాలా కొత్త విషయాలు తెలుస్తాయి.
బస్ కండక్టర్‌గా పని చేస్తున్న అనుష్క, లాబ్ టెక్నీషియన్‌గా వున్న విక్రమ్ ప్రభు కలిసి కొండ గుహల్లో డెన్ ఏర్పాటు చేసుకుని లిక్విడ్ గంజాయి చేసి స్మగ్లింగ్ చేస్తుంటారు. ఈ రకంగా సంపాదించిన కోట్లాది రూపాయల డబ్బుతో ఘాటీల పిల్లలకి స్కూళ్లు, ఆస్పత్రులు ఏర్పాటు చేస్తుంటారు.
నాయుడు బ్రదర్స్ కలిసి గంజాయి డెన్‌పై దాడి చేసి, చివరికి పార్టనర్స్‌గా వుండడానికి అంగీకరిస్తారు. తర్వాత జరిగిన సంఘటనల్లో అనుష్కకి జరిగిన అన్యాయం ఏమిటి? సెకెండాఫ్‌లో ఆమె ప్రతీకారం ఎలా తీర్చుకుంది. ఇది మిగతా కథ.

ఫొటో సోర్స్, UV Creations/X
క్రిష్ అక్కడే ఆగిపోయాారా...?
సినిమా టేకాఫ్ కరెక్ట్‌గానే వుంది. తర్వాత తడబడుతూ, అక్కడక్కడే తిరుగుతూ, కథనం నెమ్మదించి విసుగు తెప్పిస్తుంది. కథ కొత్తగానే వున్నా, కథనం చాలా పాతది. క్రిష్ అప్‌డేట్ కాకుండా ఎక్కడో ఆగిపోయాడనిపిస్తుంది.
అనేక పాత్రలు, లేయర్స్ లేకపోవడం లోపం. ఇద్దరు విలన్లు, అనుష్క, ప్రభుల మధ్య సీన్స్ రొటీన్‌గా నడుస్తూ వుంటాయి. విలన్లు కూడా మరీ రొటీన్. వాళ్లలో చైతన్యరావు కొంచెం బాగా చేసాడు.

ఘాటీకి వున్న ఇబ్బంది ఏమంటే, ఎర్రచందనంలాగా, గంజాయిని గ్లామరైజ్ చేయడానికి లేదు. గంజాయి రవాణా మాన్పించే దిశగానే కథ వెళ్లాలి. అలాగే వెళుతుంది. అయితే కథలో మార్పు దిశగా ఒక సహజ పరివర్తన వుండాలి. పాత సినిమాల్లో అయితే ఒక పాట పాడితే జరిగిపోయేది. ఇపుడు కాలం మారింది. సన్నివేశాల బలంతో చెప్పాలి. అది లేకపోవడంతో ఎమోషన్ తేలిపోయింది.

స్మగ్లింగ్ డబ్బులతో స్కూళ్లు కట్టించడం జెంటిల్‌మేన్ సినిమాని గుర్తు తెస్తుంది. స్మగ్లింగ్ మాన్పించడం నిన్నమొన్న వచ్చిన దేవరలో వుంది. స్క్రీన్ ప్లేలో దమ్ము లేకపోయే సరికి , కొత్త కథ కూడా పాత వాసన కొట్టింది.
నటించే స్కోప్ లేక, సెకెండాఫ్‌లో కాలు కదపకుండా ఫైట్స్ చేసేసరికి అనుష్కలాంటి గొప్ప నటి ఉండికూడా వృథా అయిపోయింది.

ఫొటో సోర్స్, UV Creations/X
జగపతిబాబు పాత్ర ఎలా ఉందంటే...
పెద్ద బిల్డప్‌తో ఇంట్రో ఇచ్చిన జగపతిబాబు తర్వాత ప్రతిసీన్‌లో ఆబగా తింటూ విసుగు తెప్పిస్తాడు. రాజు సుందరం ఎందుకున్నాడో తెలియదు.
పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ రెండూ వీక్. ఫోటోగ్రఫీ మాత్రం చాలా బావుంది. రెండు గంటల 36 నిముషాల నిడివి సహనాన్ని పరీక్షిస్తుంది. సులభంగా అరగంట తగ్గించి వుండాలి.
క్రిష్ గత సినిమాలతో పోలిస్తే డైలాగులు మరీ బలహీనం. మొత్తంగా ఇది క్రిష్ సినిమానేనా అని అనుమానం వచ్చే విధంగా వుంది.
(అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














