Intermittent Fasting‌ వల్ల గుండె జబ్బులతో చనిపోయే ప్రమాదం పెరుగుతోందా, కొత్త అధ్యయనంలో ఏం తేలింది?

అన్నం, ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆహారానికి విరామం (రోజులో కొన్ని గంటలు లేదా వారంలో కొన్ని రోజులు ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం) దశాబ్దకాలంగా ఓ డైట్ ట్రెండ్‌గా మారింది.

క్యాలరీలను లెక్క ప్రకారం తీసుకోవడం, లేదా పిండిపదార్థాలలో కోత విధించడం వంటి విధానాలతో శ్రమ లేకుండా ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చన్న భావనతో ఇది ప్రాచుర్యం పొందింది.

మనం ఏం తినాలనేది కాకుండా, ఎప్పుడు తినాలనే విషయంలో మార్పులు చేసుకుంటే సరిపోతుందని, తాము స్లిమ్‌గా ఉండడానికి ఈ విధానం సాయపడిందని టెక్ నిష్ణాతులు, హాలీవుడ్ స్టార్‌లు చెప్పారు.

బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్ కూడా తన వారం 36 గంటల ఉపవాసంతో మొదలవుతుందని గతంలో చెప్పారు.

ఆహారానికి విరామం విధానానికి శాస్త్రీయ ఆమోదముంది. రాత్రి పూట ఉపవాసం ఉండటం జీవక్రియను మెరుగుపరుస్తుందని, శరీరం తనను తాను మరమ్మతు చేసుకోవడానికి సాయపడుతుందని, జీవితకాలం కూడా పెరగొచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

కానీ పోషకాహార నిపుణుల హెచ్చరికలు మరోలా ఉన్నాయి.

ఆహారం తీసుకోకపోవడం సరైన పరిష్కారం కాదని, ఆరోగ్య సమస్యలున్నవారికి ప్రమాదకరంగా కూడా మారుతుందని వారంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆహారం, ఉపవాసం, గుండె, రోగాలు, ఆరోగ్యం

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, దశాబ్దకాలంగా పరిమిత సమయం ఆహారం ట్రెండింగ్‌లో ఉంది.

పెరిగిన గుండె సంబంధిత సమస్యలు

ఆహారానికి విరామం అంటే రోజులో కొంత సమయం మాత్రమే ఆహారం తీసుకోవడం.

ఇందులో 8 గంటల వ్యవధిలో మాత్రమే ఆహారం తీసుకోవాలి. మిగిలిన 16 గంటలు ఏమీ తినకూడదు. మరో విధానంలో 5:2 డైట్. అంటే కొన్ని గంటలకు పరిమితమవ్వడం కాకుండా ప్రత్యేకించిన కొన్నిరోజుల్లో అంటే రెండురోజులపాటు క్యాలరీలు తీసుకోకపోవడం, మిగిలిన ఐదురోజుల్లో మామూలుగా తినడం.

అయితే ఈ విధానంపై నిర్వహించిన ఓ కొత్త అధ్యయనం హెచ్చరిక చేసింది.

ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 19,000మందిని పరిశీలించారు. 12 నుంచి 14 గంటల వ్యవధిలో తినేవారితో పోలిస్తే రోజులో 8 గంటల కన్నా తక్కువ వ్యవధిలో తింటున్నవారు హృదయ, రక్తనాళాల వ్యాధుల వల్ల మరణించే ప్రమాదం 135 శాతం ఎక్కువగా ఉందని తేలింది.

ఓ వ్యక్తి ఆరోగ్యం, జీవనవిధానం, మెడికల్ డేటా ఆధారంగా, మిగిలిన వారితో పోలిస్తే హార్ట్ ఎటాక్ వంటి గుండె సంబంధిత సమస్యలు పెరిగినట్టు అధ్యయనంలో తేలింది.

ఉపవాసాలకు, మరణాలకు మధ్య సంబంధంపై సరైన స్పష్టత లేదు. కానీ అన్ని వయసుల వారిలో గుండె సంబంధిత ప్రమాదాల స్థాయి ఒకేలా ఉంది.

వివిధ రకాల వయసు వారు, ఆడ, మగ, జీవనవిధానం, జాగ్రత్తగా పరీక్షలు చేయించుకోవడం వంటివాటి తర్వాత కూడా ఆ రిస్క్ ఒకేలా ఉంది.

ఆహారం, ఉపవాసం, గుండె, రోగాలు, ఆరోగ్యం
ఆహారం, ఉపవాసం, గుండె, రోగాలు, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎక్కువ సమయం పాటు ఏమన్నా తినకుండా ఉండడం మంచిది కాదనే అభిప్రాయముంది.

‘8 గంటల పాటే తినడం అంత మంచిది కాదు’

మరోలా చెప్పాలంటే పరిమిత సమయంలో ఆహారం తీసుకోవడానికి, మరణాలకు మధ్య సంబంధంపై స్పష్టత లేదు. కానీ గుండె సంబంధిత రోగాలతో మరణించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది.

ఉపవాసంవల్లే ఈ ప్రమాదం పెరిగిందని అధ్యయనంలో తేలినట్టు పరిశోధకులు గట్టిగా చెప్పడం లేదు. కానీ ‘మంచి ఆరోగ్యానికి ఉపవాసం’ అనే నమ్మకాన్ని ప్రశ్నించడానికి సరిపడా సంకేతాలు ఈ ఫలితాల్లో కనిపిస్తున్నాయి.

అమెరికా ప్రజలను పరిశోధకులు ఎనిమిదేళ్లపాటు పరిశీలించారు. వారి ఆహార అలవాట్లు అర్ధం చేసుకునేందుకు అధ్యయనంలో పాల్గొన్నవారిని రెండు వేర్వేరు రోజుల్లో ప్రశ్నించారు. రెండు వారాల విరామంతో వారు ఏం తిన్నది, తాగింది గుర్తుచేసుకుని చెప్పమన్నారు. ఇలా వారు చెప్పినదాని ప్రకారం వారి ఆహారపు అలవాట్లను రోజువారీ కార్యక్రమంలో భాగంగా అంచనావేశారు.

ఎనిమిదిగంటల వ్యవధిలో తినేవారు 12నుంచి 14గంటల వ్యవధిలో తినేవారితో పోలిస్తే గుండె సంబంధింత రోగాలతో చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం తేల్చింది.

గుండె సంబంధిత రోగాల ప్రమాదం అన్ని వర్గాల ప్రజల్లో ఉంది. పొగ తాగే అలవాటు, డయాబెటిస్, ఇప్పటికే గుండె సంబంధిత రోగాలున్నవారిలో ఇది ఎక్కువగా కనిపించింది.

ఇలాంటివారు ఆహార విరామం పాటించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అధ్యయనం సూచించింది.

ఆహారం, ఉపవాసం, గుండె, రోగాలు, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎక్కువ సమయంపాటు ఏమీ తినకపోవడం వల్ల అనేక దుష్ప్రభావాలున్నాయని అధ్యయనంలో తేలింది.

అధ్యయనాల్లో ఏం తేలింది?

హృదయ సంబంధ మరణాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో మొత్తం మరణాల సంఖ్య అలా లేదు. నిజంగానే ఇలాగే జరుగుతోందా లేక డేటాలో ఏమన్నా లోపాలున్నాయా అని పరిశోధకులను ప్రశ్నించాను.

ఆహారపు అలవాట్లు డయాబెటిస్, హృదయ సంబంధిత రోగాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని, కాబట్టి గుండె సంబంధ ప్రమాదాలు పెరగడం ఊహించగలిగిందేనని విక్టర్ వెంజ్ జోంగ్ చెప్పారు. ఈ అధ్యయానికి ఆయన నేతృత్వం వహించారు.

''ఊహించని విషయమేంటంటే ఏళ్లపాటు ఎనిమిదిగంటల కన్నా తక్కువ వ్యవధిలో ఆహారం తీసుకోవడానికి, గుండె సంబంధిత రోగాలతో మరణించే ప్రమాదం పెరగడానికి సంబంధముండటం'' అని చైనాలోని షాంఘై జియో టాయం యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ఎపిడెమాలజిస్ట్ ప్రొఫెసర్ జోంగ్ చెప్పారు.

పరిమిత సమయంలో ఆహారం తీసుకోవడం గుండె ఆరోగ్యాన్ని, జీవప్రక్రియను మెరుగుపరుస్తుందనే నమ్మకానికి ఇది విరుద్ధంగా ఉంది. కొన్నినెలలు లేదా ఓ సంవత్సరంపాటు పరిశీలించి జరిపిన అధ్యయనాలకు ఇది భిన్నమైన ఫలితం.

అదే జర్నల్‌లో ప్రచురితమైన ఎడిటోరియల్ వ్యాసంలో అనూప్ మిశ్రా అనే ఎండోక్రొనాలజిస్ట్ ఆహార విరామం ఉపయోగాలను, లోపాలను విశ్లేషించారు.

బరువు తగ్గడానికి, శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకునేలా చేయడానికి, రక్తపోటును తగ్గించడానికి, కొలెస్ట్రాల్ వంటివి నియంత్రణలో ఉండడానికి పరిమిత సమయపు ఆహార విధానం ఉపయోగపడిందని అనేక విశ్లేషణల్లో తేలింది.

క్యాలరీలు లెక్కించాల్సిన అవసరం లేకుండా రక్తంలో చక్కెరస్థాయిని నియంత్రించడానికి, అలాగే మతపరమైన ఉపవాసాలకు, తేలిగ్గా ఆచరించడానికి కూడా ఈ విధానం బాగుంటుందని తేలింది.

ఆహారం, ఉపవాసం, గుండె, రోగాలు, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పరిమిత సమయం ఆహారం విధానంపై చాలా ఏళ్లగా విమర్శలున్నాయి.

‘దుష్ప్రభావాలు చాలానే ఉన్నాయి’

అయితే పోషకాహారలోపాలు, కొలెస్ట్రాల్ పెరగడం, ఆకలి ఎక్కవకావడం, చిరాకు, తలనొప్పి వంటివాటివల్ల ఈ అలవాటు ఎక్కువరోజులుకొనసాగించడం కష్టమమవుతుందని ప్రొఫెసర్ మిశ్రా చెప్పారు.

డయాబెటీస్‌తో బాధపడేవారికి ఇలాంటి ఉపవాసం వల్ల రక్తంలో చక్కెరస్థాయి ప్రమాదకర స్థాయిలో పడిపోయే అవకాశం ఉంది. అలాగే భోజనం సమయంలో జంక్ ఫుడ్‌ను తీసుకునే అలవాటును పెంచుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న వృద్ధులు ఎక్కువసేపు ఉపవాసం ఉంటే వారు మరింత బలహీనపడతారు. కండరాలు పటుత్వం కోల్పోయే అవకాశముంది.

ఆహార అంతరాయం విధానంపై విమర్శలు రావడం ఇదే మొదటిసారి కాదు.

2020లో జామా ఇంటర్నేషనల్ మెడిసిన్‌లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. మూడు నెలల పాటు ఈ అధ్యయనం సాగింది. చాలా తక్కువ బరువు మాత్రమే తగ్గామని, ఆ తగ్గినది కూడా కండరాల బరువని ఆ అధ్యయనంలో పాల్గొన్నవారు చెప్పారు.

పరిమిత సమయంలో ఆహారం తీసుకునే విధానం వల్ల ఆకలి, నీరసం, డీహైడ్రేషన్, తలనొప్పి, ఏకాగ్రతలోపించడం వంటి దుష్ప్రభావాలున్నాయని మరో అధ్యయనం తేల్చింది.

కొత్త అధ్యయనం కొన్ని గ్రూపుల్లో గుండె సంబంధిత రోగాల బారిన పడే ప్రమాదముందని చెప్పడం ద్వారా మరిన్ని ప్రమాద హెచ్చరికలు చేసింది.

ఆహారం, ఉపవాసం, గుండె, రోగాలు, ఆరోగ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏం తింటున్నామనేది చాలా ముఖ్యమని పోషకాహార నిపుణులుంటున్నారు.

‘ఎప్పుడు తింటామనేది కాదు...ఏం తింటున్నామనేది ముఖ్యం’

ఈ తాజా ఫలితాల ద్వారా ప్రజలు, వైద్యులు తెలుసుకోవాల్సిన విషయాలేంటని నేను ప్రొఫెసర్ జోంగ్‌ని అడిగాను.

8 గంటల పరిమిత ఆహార విధానం ఎంచుకోవాలనుకునే డయాబెటిస్, హృద్రోగ బాధితులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పారు. వ్యక్తి ఆరోగ్యం, అందుకు సంబంధించిన విషయాలను పరిశీలించి వ్యక్తిగతంగా ఆహారనియమాలపై సలహా ఇవ్వాల్సిన అవసరం ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది.

''ప్రస్తుతమున్న అధ్యయనాల ప్రకారం ప్రజలు ఎప్పుడు తింటామనేదానికన్నా..ఏం తింటామనేదానిపై దృష్టిపెట్టాల్సిన అవసరముంది. గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండడానికి, ఎక్కువకాలం జీవించడానికి వీలుగా ప్రజలు 8 గంటల ఆహార విధానాన్ని దీర్ఘకాలంపాటు పాటించకుండా ఉండడం మంచిది'' అని అని ప్రొఫెసర్ జోంగ్ చెప్పారు.

స్పష్టంగా చెప్పాలంటే ఉపవాసాన్ని పూర్తిగా ఆపేయాలని కాదు..మన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆచరించాలి. స్పష్టమైన ఆధారాలు లభించేదాకా గడియారం మీద కన్నా మన ప్లేట్ మీద ఎక్కువ దృష్టిపెట్టడం అన్నిటికన్నా మంచిది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)