ఒకే చోట కొద్ది గంటల్లోనే కుంభవృష్టి కురుస్తోంది ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
వాన పడితే.. ఒక్కచోటే ముంచేస్తోంది.
ఒకటి, రెండు.. పది సెంటిమీటర్లు కాదు, ఏకంగా 40 నుంచి 50 సెంటిమీటర్ల వర్షపాతం రికార్డు అవుతోంది. అది కూడా 12 నుంచి 24 గంటల వ్యవధిలోనే.
ఇటీవల కాలంలో అతిభారీ వర్షాలను పరిశీలిస్తే, ఒకే ప్రాంతంలో కొద్ది సమయంలో పడిన వర్షపాతమే ఎక్కువగా ఉంటోంది.
అది కూడా ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న 'క్లౌడ్ బరస్ట్' తరహా పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
మరి, ఇంతగా అతిభారీ వర్షం ఒకేచోట కురవడానికి కారణమేంటి..? ఒక మండలంలో వర్షం పడినప్పుడు పక్కనే ఉన్నమరో మండలంలో ఎందుకు కురవడం లేదు?
దీని వెనుక అనేక కారణాలున్నాయని చెబుతున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు.
''తేమ, గాలులు ప్రభావం చూపిస్తున్నాయి'' అని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ కె.నాగరత్న బీబీసీతో చెప్పారు.


ఫొటో సోర్స్, ugc
ఇటీవల కొన్ని సంఘటనలు
ఈ ఏడాది ఆగస్టు 28న కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అర్గొండలో 24 గంటల్లో 43.35 సెం.మీ. వర్షం కురిసినట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ లెక్కలు చెబుతున్నాయి.
అదే రోజు కామారెడ్డిలో కేవలం 12 గంటల్లోనే 33.8 సెం.మీ. వర్షపాతం రికార్డైంది.
2023 జులైలో ములుగు వెంకటాపూర్ లో 64.9 సెం.మీ వర్షపాతం నమోదైంది.
అంతకుముందు 2020 అక్టోబరు 13న ఒకేరోజు హైదరాబాద్‌లో 30 సెంటిమీటర్ల వర్షం కురిసింది.
2016 సెప్టెంబరులో హైదరాబాద్ శివారు కుత్బుల్లాపూర్‌లో 24 గంటల సమయంలో 23.02 సెం.మీ. వర్షం పడింది.
ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివి ఈ మధ్య కాలంలో మరిన్ని నమోదవుతున్నాయి.

ఫొటో సోర్స్, ugc
'క్లౌడ్ బరస్ట్' అని పిలవొచ్చా...?
సాధారణంగా ఒకే ప్రాంతంలో అంటే 20 చదరపు కిలోమీటర్ల నుంచి 30 చ.కి.మీ పరిధిలో గంటలో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవడాన్ని 'క్లౌడ్ బరస్ట్'గా పరిగణిస్తారని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
ప్రస్తుతం రికార్డు అవుతున్న వర్షపాతం 'క్లౌడ్ బరస్ట్' తరహాలో ఒక గంటలోనే రికార్డు కాకపోయినప్పటికీ, 24గంటలు, 12 గంటల వ్యవధిలో నమోదవడం కారణంగా కాలనీలు, ఊళ్లలో వరదలు పోటెత్తుతున్నాయి. ముంపునకు గురవుతున్నాయి.
సాధారణంగా తుపానులు, అల్పపీడనాలు ఏర్పడినప్పుడు భారీ వర్షాలు పడుతుంటాయి. అయితే, అలాంటి పరిస్థితులు లేకపోయినా వర్షాలు కురుస్తుండటం వెనుక పట్టణీకరణ, గ్లోబల్ వార్మింగ్ ప్రభావం కూడా ఉందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఎర్త్, ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్ విభాగం ప్రొఫెసర్ కారుమారి అశోక్ బీబీసీతో చెప్పారు.
''పడమటి గాలుల ప్రభావం కూడా ఈ సీజన్‌లో ఎక్కవగా కనిపిస్తోంది. తాజా అధ్యయనాల ప్రకారం, ప్రస్తుత సీజన్‌లోనే ఐదు సార్లు పడమటి గాలుల ప్రభావం ఏర్పడింది.
సాధారణంగా రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన తర్వాత పడమటి గాలుల ప్రభావం తగ్గిపోతుంది. ఈసారి గాలుల ప్రభావం కనిపిస్తోంది’’ అని అశోక్ వివరించారు.
మరోవైపు, ఈ ఏడాది(2025)లో రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని చెబుతున్నారాయన.

ఫొటో సోర్స్, ugc
స్థిరత్వం దెబ్బతినడంతోనే ఇబ్బంది
సముద్రాలపై నుంచి వచ్చే ఉపరితల గాలుల ఆధారంగా భూమిపై పడే వర్షాల స్థితిగతులు ఆధారపడి ఉంటాయని వివరించారు నాగరత్న.
''సముద్రాల నుంచి గాలులు భూమి ఉపరితలంపైకి చేరిన తర్వాత తేమ, ఉష్ణోగ్రతలతో మేఘాలుగా మారి వర్షిస్తుంటాయి. నదులు, రిజర్వాయర్లు, అడవులు, కొండ లేదా పర్వత ప్రాంతాల్లో మేఘాలు చల్లబడి అతి భారీ వర్షాలు పడుతుంటాయి. తెలంగాణలో పర్వత ప్రాంతాలు పెద్దగా లేనప్పటికీ, అడవులు, నీటి వనరులు దీనికి కారణమవుతున్నాయి’’ అని ఆమె చెప్పారు.
''తేమ, గాలులు కలిసి ఉష్ణోగ్రతల్లో మార్పులకు కారణమవుతున్నాయి. దీనివల్ల మేఘాలు వర్షించడంలో స్థిరత్వం దెబ్బతింటోంది'' అని నాగరత్న వివరించారు.
స్థిరత్వం దెబ్బతినడం మేఘాలు ఒకేచోట భారీగా వర్షించడానికి కారణమవుతోందని ఆమె చెబుతున్నారు.
సాధారణంగా కొండ ప్రాంతాలు, నదులు లేదా వాగులు, పట్టణీకరణ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మేఘాల స్థిరత్వం దెబ్బతింటోందన్నది శాస్త్రవేత్తల అంచనా.
ఇటీవల కాలంలో అరేబియా సముద్రం నుంచి వచ్చే గాలుల ప్రభావానికి తేమ కలిసి అతి భారీ వర్షాలకు కారణమవుతోందని నాగరత్న వివరించారు.
అది కేవలం కామారెడ్డి, మెదక్, ములుగు, హైదరాబాద్‌కే పరిమితం అవుతుందా అంటే.. ఆ సమయానికి గాలులు, తేమ కలిసే ప్రదేశంలో ఇలా జరుగుతుందని తెలిపారు.

'ఒకే ప్రాంతానికి పరిమితమని చెప్పలేం'
అయితే, అతి భారీ వర్షాలు అనేవి ఒకే ప్రాంతానికి ఒక సమయంలో పరిమితం అవుతున్నాయి. తర్వాత అదే ప్రాంతంలో తిరిగి భారీ వర్షం కురవడం లేదు. వాతావరణ పరిస్థితులను బట్టి, సమయానుసారం వేర్వేరు ప్రాంతాలకు మారుతున్నాయి.
''అది తేమ, గాలుల కలయికపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఇలా జరుగుతుంటుంది.
కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, ములుగు.. ఇలా వివిధ ప్రాంతాల్లో ఒకే రోజున అత్యధిక వర్షపాతం నమోదయింది'' అని నాగరత్న చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














