బ్రెయిన్ స్ట్రోక్‌ అంటే ఏమిటి, దానిని ముందే పసిగట్టవచ్చా, ఏ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాలి?

బ్రెయిన్ స్ట్రోక్, వైద్యం

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, శరీరంలోని ఏదైనా అవయవం లేదా భాగం నుంచి మెదడుకు సంకేతాలు చేరుకోలేనప్పుడు, ఆ భాగం పక్షవాతానికి గురవుతుంది.
    • రచయిత, చందన్ కుమార్ జజ్‌వాడే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మానవ శరీరంలో మెదడును అతి ముఖ్యమైన భాగంగా పరిగణిస్తుంటారు. ఇది మొత్తం శరీరాన్ని నియంత్రిస్తుంది. శరీరంలోని ప్రతి భాగం నుంచి సంకేతాలు మెదడుకు చేరుకుంటాయి. అవసరానికి అనుగుణంగా మెదడు ఆ భాగానికి ప్రతిస్పందన కోసం సందేశాన్ని పంపుతుంది.

మెదడుకు జరిగే రక్త ప్రవాహంలో అడ్డంకి ఏర్పడినప్పుడు దానిని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు.

బ్రెయిన్ స్ట్రోక్ శరీరంలో ఏ భాగానికైనా లేదా అవయవానికి సంబంధించినదైనా కావచ్చు. శరీరంలోని ఏ అవయవం నుంచైనా లేదా ఏదైనా భాగం నుంచి మెదడుకు సంకేతాలు చేరుకోనప్పుడు, ఆ భాగం పక్షవాతానికి గురవుతుంది.

ఇంతకీ ఒక వ్యక్తికి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఉంటే, ఆ సంకేతాలను గుర్తించడం ఎలా? దాని నివారణకు ఏం చేయాలి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బ్రెయిన్ స్ట్రోక్, వైద్యం, లక్షణాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
బ్రెయిన్ స్ట్రోక్

బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు

బ్రెయిన్ స్ట్రోక్ ఓ ఆకస్మిక సంఘటన. ఆరోగ్యవంతుడైన వ్యక్తికి భవిష్యత్తులో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందా లేదా అనేది కొన్ని ప్రారంభ లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు.

సాధారణంగా వైద్యులు దీనిని బీఫాస్ట్ (BEFAST) అని పిలుస్తారు.

  • Balance (బ్యాలెన్స్): ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి అకస్మాత్తుగా తన బ్యాలెన్స్ కోల్పోవడం. కొంత సమయం తర్వాత దాన్ని తిరిగి పొందడం.
  • Eye (కన్ను): అకస్మాత్తుగా కళ్ల ముందు చీకటి ఏర్పడుతుంది. ఆకస్మిక అస్పష్టత, ఆపై సాధారణంగా కనిపించడం ప్రారంభిస్తాయి.
  • Face (ముఖం): మాట్లాడేటప్పుడు ముఖం అకస్మాత్తుగా ఒకవైపు వాలిపోతుంది, ఆ తర్వాత వెంటనే సరి అవుతుంది.
  • Arms (చేతులు): చేయి అకస్మాత్తుగా పడిపోతుంది, తర్వాత కోలుకుంటుంది.
  • Speech (మాట): నాలుక అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోతుంది. అంటే ఆ వ్యక్తి కొంత సమయం పాటు మాట్లాడలేరు.
  • Time (సమయం): ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే, వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.

ఈ లక్షణాలు కొంత సమయం తర్వాత తగ్గినప్పటికీ, వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఎందుకంటే, ఈ సంకేతాలు మెదడుకు రక్త ప్రవాహంలో అడ్డంకి ఉందని సూచిస్తున్నాయి. ఇది భవిష్యత్తులో స్ట్రోక్ ప్రమాదానికి దారితీస్తుంది.

"ఇటువంటి లక్షణాల వెనుక ఏదైనా ఇతర వ్యాధి కూడా కారణం కావొచ్చు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలో ఈ లక్షణాలు కనిపిస్తే భవిష్యత్తులో బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. వారికి వెంటనే నయం కాకపోతే, ఆ వ్యక్తికి అప్పటికే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని అర్థం" అని దిల్లీలోని బీఎల్ కపూర్ మాక్స్ హాస్పిటల్‌లోని న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రతీక్ కిషోర్ అన్నారు.

బ్రెయిన్ స్ట్రోక్

ఫొటో సోర్స్, Getty Images

బ్రెయిన్ స్ట్రోక్

లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి?

"బ్రెయిన్ స్ట్రోక్‌ వచ్చిన నాలుగున్నర గంటలలోపు చికిత్స ప్రారంభించడం ముఖ్యం. ధమనులలో అడ్డంకులు ఏర్పడినప్పుడు లేదా అది పగిలిపోయినప్పుడు, రక్తం మెదడుకు చేరుకోలేనప్పుడు ఇది జరుగుతుంది" అని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) న్యూరాలజీ విభాగానికి చెందిన డాక్టర్ మంజరి త్రిపాఠి చెప్పారు.

వైద్యుల అభిప్రాయం ప్రకారం, బ్రెయిన్ స్ట్రోక్ తర్వాత మొదటి నాలుగున్నర గంటలను 'గోల్డెన్ అవర్స్' అంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఆరు నుంచి ఎనిమిది గంటలలోపు చికిత్స ప్రారంభించినా, రోగి కోలుకోవచ్చు.

"ధమనిలో రక్తం గడ్డకడితే ఇంజెక్షన్ ద్వారా దానిని కరిగించడానికి ప్రయత్నిస్తారు. అవసరమైతే, థ్రోంబెక్టమీ (శస్త్రచికిత్స) చేస్తారు" అని డాక్టర్ మంజరి త్రిపాఠి అన్నారు.

"గడ్డకట్టిన రక్తాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చు కానీ, దీనికి పరిమితులు ఉన్నాయి. పెద్ద ధమనిలో రక్తం గడ్డకడితేనే ఇలా చేయగలం" అని మెట్రో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సోనియా లాల్ గుప్తా అన్నారు.

సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి పరీక్షల ద్వారా, బ్రెయిన్ స్ట్రోక్ తీవ్రతను గుర్తిస్తారు. తద్వారా మెరుగైన చికిత్స అందించవచ్చు. చాలాసార్లు బ్రెయిన్ స్ట్రోక్ కేసులలో ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటారు, అందుకే రోగి పూర్తిగా కోలుకోవడం కష్టమవుతుంది.

"బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతంతో బాధపడుతున్న రోగులు కోలుకోవడానికి మొదటి మూడు నెలలు చాలా కీలకం. ఈ కాలంలో ఫిజియోథెరపీ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది" అని డాక్టర్ సోనియా లాల్ గుప్తా చెప్పారు.

బ్రెయిన్ స్ట్రోక్ , వైద్యం, నిపుణులు

ఫొటో సోర్స్, Getty Images

బ్రెయిన్ స్ట్రోక్

బ్రెయిన్ స్ట్రోక్ కారణాలు

ఎవరికైనా, ఏ వయసువారికైనా బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. కానీ, కొంతమందికి ఎక్కువ ప్రమాదం ఉంటుంది. అనియంత్రిత, నిరంతర అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, ధూమపానం, మద్యం సేవించడం, ఊబకాయం దీనికి ప్రధాన కారణాలు. చాలాసార్లు, జన్యుపరమైన కారణాల వల్ల, యువతలో రక్తం చిక్కగా మారుతుంది. ఇది బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

"ఇది సాధారణంగా వృద్ధులకు ఎక్కువగా జరుగుతుంది. అనారోగ్యకరమైన జీవనశైలి, జిమ్‌లో వ్యాయామం చేసేటప్పుడు గాయాలవడం, మెడ మసాజ్ వల్ల కూడా మెదడులో రక్తస్రావం జరగవచ్చు" అని డాక్టర్ మంజరి త్రిపాఠి చెప్పారు.

శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరుగుతాయి. భారత్ వంటి దేశాలలో ఆహారపు అలవాట్లు దీనికి అతిపెద్ద కారణంగా పరిగణిస్తుంటారు.

శీతాకాలంలో ప్రజలు సాధారణంగా ఎక్కువ కొవ్వు ఉన్న ఆహారాన్ని తీసుకుంటారు. అలాగే, ఈ సీజన్‌లో రక్తపోటును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

"సాధారణంగా, 60-65 సంవత్సరాల వయస్సు గల వృద్ధులకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో మా వద్దకు వస్తున్న బ్రెయిన్ స్ట్రోక్ రోగులలో 40-45 శాతం మంది 50 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గలవారే" అని డాక్టర్ ప్రతీక్ కిషోర్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)