చైనాలో 'క్రైస్తవ వ్యతిరేక' తిరుగుబాటు అణచివేతలో భారత సైనికుల పాత్ర ఏమిటి?

బాక్సర్ తిరుగుబాటు, భారత్, చైనా, సిక్కులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అవతార్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆగస్టు 4, 1900. ఎనిమిది దేశాల పెద్ద సంకీర్ణంలో భాగమైన సిక్కు, పంజాబీ రెజిమెంట్ల బృందాలు తియాంజిన్ నుంచి బయలుదేరాయి.

తిరుగుబాటుదారుల ముట్టడికి గురైన ప్రాంతంలో సహాయం కోసం ఈ దళాలను పంపారు.

ఆ సమయంలో చైనాలో 'బాక్సర్ తిరుగుబాటు' జరుగుతోంది. చర్చిలను, క్రైస్తవ మిషనరీలను రక్షించడానికి బ్రిటిష్ ఇండియన్ సైనికులను అక్కడికి పంపారు.

ఇటీవల, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చైనాలోని తియాంజిన్‌లో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఈ నగరం మరోసారి వార్తల్లో నిలిచింది.

ఈ యుద్ధంలో భాగమైన ఠాకుర్ గదాధర్ సింగ్ తన 'థర్టీన్ మంత్స్ ఇన్ చైనా' పుస్తకంలో బీజింగ్‌ను విముక్తి చేయడానికి 3 వేల మంది బ్రిటిష్ సైనికులను పంపారని రాశారు.

వీరిలో ఒకటవ సిక్కు పదాతిదళానికి చెందిన 500 మంది సైనికులు, 7వ రాజ్‌పుత్ బెటాలియన్‌కు చెందిన 500 మంది సైనికులు, 24వ పంజాబ్ బెటాలియన్ (పదాతిదళం)కు చెందిన 250 మంది సైనికులు, 1వ బెంగాల్ లాన్సర్స్‌కు చెందిన 400 మంది సైనికులు, రాయల్ వెల్ష్ ఫ్యూసిలియర్స్ వైట్ బెటాలియన్‌కు చెందిన 300 మంది సైనికులు, హాంకాంగ్ హిందుస్తానీ బెటాలియన్‌కు చెందిన 100 మంది సైనికులు ఉన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బాక్సర్ తిరుగుబాటు, భారత్, చైనా, సిక్కులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1903లో ధోర్థా డోక్‌లో 23వ సిక్ క్యాంప్

బాక్సర్ తిరుగుబాటు అంటే ఏంటి?

బాక్సర్ తిరుగుబాటును ప్రపంచ చరిత్రలో ఒక ప్రధాన సంఘటనగా భావిస్తారు. బాక్సర్లు తమ దేశంలోని క్రైస్తవ మిషనరీలను లక్ష్యంగా చేసుకున్నారు.

ఎనిమిది దేశాల కూటమి -బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, జపాన్, అమెరికా, ఇటలీ, ఆస్ట్రియా-హంగేరీలతో కూడిన కూటమి చైనాకు సైన్యాన్ని పంపింది.

బీబీసీ నివేదిక ప్రకారం, 1899, 1901 మధ్య ఉత్తర చైనాలో జరిగిన "బాక్సర్ తిరుగుబాటు" చైనా చింగ్ రాజవంశం పాలనలో జరుగుతున్న సంస్కరణలను ఆపడానికి, విదేశీయులను తరిమికొట్టి సంప్రదాయ పాలనను తిరిగి స్థాపించడానికి చేసిన ప్రయత్నం.

విదేశీ జోక్యం కారణంగా తిరుగుబాటు విఫలమైంది. ఆ తరువాత పాశ్చాత్య శక్తులు, రష్యా, జపాన్, బలహీనపడిన చింగ్ రాజవంశం నుంచి మరిన్ని రాయితీలు, ప్రయోజనాలను పొందాయి.

ఉత్తర చైనాలో, రైతు తిరుగుబాటుదారులు తమను తాము ‘బాక్సర్లు’ అని పిలుచుకున్నారు. వారు క్రైస్తవ మిషనరీలు, మతమార్పిడి చేసే సంస్థలకు చెందిన వారిని చంపాలని భావించేవారు. వారిని చైనాకు ద్రోహులుగా చూశారు.

ప్రారంభంలో చైనా రాజస్థానం వారికి మద్దతు ఇచ్చింది. ఇది చాలామంది చైనీస్ క్రైస్తవుల హత్యకు దారితీసింది. కానీ చివరికి తిరుగుబాటు అణచివేశారు.

"మా 7వ రాజ్‌పుత్ బెటాలియన్ చైనాకు చేరుకున్న మొదటి భారతీయ సైన్. అందువల్ల, మాకు చాలా హృదయపూర్వక స్వాగతం లభించింది" అని గదాధర్ సింగ్ రాశారు.

ఆ సమయంలో పరిస్థితుల గురించి ఆయన ఇలా రాశారు.

"తియాంజిన్ ఉత్తర చైనాలో ఉన్న ఒక పెద్ద సంపన్న నగరం. పేరుకు నగరమేగానీ అక్కడ ఎవరూ నివసించడం లేదు. ఇళ్ళు ఉన్నాయి, కానీ వాటిలో ఎవరూ లేరు! శరీరాలు ఉన్నాయి, కానీ జీవం లేదు! అప్పుడు ఏమీ లేదు’’ అని రాశారు.

‘‘తియాంజిన్‌లో దాదాపు 800 మంది విదేశీయులు హత్యకు గురయ్యారు. నేను మాట్లాడిన ప్రతి అమెరికన్ కూడా జపనీయులపై ప్రశంసల జల్లు కురిపించారు. తియాంజిన్‌కు వెళ్లడం, విజయం సాధించడం జపాన్ వల్లే సాధ్యమైంది’’అని ఆయన రాశారు.

బాక్సర్ తిరుగుబాటు, భారత్, చైనా, సిక్కులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రధాని మోదీ పర్యటనతో తియాంజిన్ ఇటీవల మళ్లీ వార్తల్లో నిలించింది.

సిక్కు సైనికుల ధైర్యసాహసాలు

తిరుగుబాటును అణచివేసిన తర్వాత శాంతిని కాపాడటానికి భారత సైన్యాన్ని అక్కడ మోహరించారని బ్రిటిష్ సివిల్ సర్వీస్ నుంచి రిటైర్డ్ అయిన గుర్‌ముఖ్ సింగ్ తన పుస్తకం ‘ఆంగ్లో-సిఖ్ రిలేషన్స్ అండ్ ద వరల్డ్ వార్స్’ లో రాశారు.

"1904 జూన్ 13న, 47వ సిక్కు రెజిమెంట్‌ను ఉత్తర చైనాలో విధులకు వెళ్లాలని ఆదేశించారు. బాక్సర్ తిరుగుబాటు తర్వాత శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి మిత్రరాజ్యాల దళాలలో భాగంగా వారిని అక్కడ మోహరించారు" అని ఆయన రాశారు.

"ఈ రెజిమెంట్ 1905 మే ప్రారంభం నుంచి 1908 ఏప్రిల్ వరకు మూడు సంవత్సరాలు చైనా నగరాలు తియాంజిన్, లుతాయిలో ఉంది. ఆ ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడటానికి వారు చాలా ధైర్యంగా సేవలందించారు. ఉత్తర చైనా దళ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ డబ్ల్యు.హెచ్. వాల్టర్స్ అక్కడినుంచి వెళ్లిపోతూ, "మీరు మహారాజా సైన్యంలోని ఏ యూనిట్ కంటే తక్కువ కాదు" అని చెప్పారు’’ అని గుర్ముఖ్ సింగ్ రాశారు.

అలాగే, జర్మన్ ఫీల్డ్ మార్షల్ వాన్ వాల్డర్సీ షాంఘైలో సిక్కుల కవాతును పరిశీలించి, వారి శరీరాకృతిని, సైనిక సామర్థ్యాన్ని ప్రశంసించారని రాశారు.

కానీ కేవలం ఆరు సంవత్సరాల తరువాత, అదే 47వ సిక్కు రెజిమెంట్ ఫ్రాన్స్‌లో తన అత్యుత్తమ జర్మన్ దళాలను ఓడిస్తుందని ఆయనకు తెలియదు.

సిక్కు సైనిక అధికారులు సైనిక శిక్షణ, ఆయుధాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, ఈ యుద్ధంలో వారు ప్రముఖంగా ఉండటానికి ఇదే కారణమని సైనిక చరిత్రకారుడు మన్‌దీప్‌ సింగ్ బాజ్వా చెప్పారు.

"సిక్కు సైనికుల నాయకత్వం చాలా బాగుంటుంది. పంజాబీ సైనికులలో సిక్కులు, ముస్లింలు, పఠాన్లు కూడా ఉన్నారు. భారత్, పాకిస్తాన్ విభజన తరువాత, ఈ సైనికులలో ఎక్కువ భాగం పాకిస్తాన్‌కు వెళ్లారు" అని ఆయన చెప్పారు.

బాక్సర్ తిరుగుబాటు, భారత్, చైనా, సిక్కులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టిబెట్ గోడను సిక్కు సైనికులు ధ్వంసం చేశారు.

బాక్సర్లకు సానుభూతి

ఆ సమయంలో చైనా స్వతంత్ర దేశం. అక్కడి ప్రజలు కూడా ఈ పోరాటానికి మద్దతు ఇచ్చారు.

"తిరుగుబాటు అనేది ఒకరి సొంత దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలెత్తే విషయం. కానీ బాక్సర్లు వారి సొంత దేశంలో యుద్ధం చేస్తున్నారు" అని మన్‌దీప్ బాజ్వా అన్నారు.

"వారు తమ దేశం నుంచి విదేశీ ప్రభావాన్ని తొలగించాలనుకున్నారు. వాణిజ్యంపై విదేశీ నియంత్రణను తొలగించడానికి వారు యుద్ధం చేశారు. కానీ ఈ యుద్ధాన్ని ఎనిమిది దేశాలు కలిసి అణచివేశాయి" అని బాజ్వా అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)