కాళేశ్వరం కేసు: సీబీఐ విచారణ జరిపించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఎవరేమన్నారంటే..

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండేళ్లుగా తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం.. తాజాగా మరో మలుపు తిరిగింది.
''వ్యాప్కోస్, పీఎఫ్‌సీ, ఆర్ఈసీ వంటి సంస్థలు పాలు పంచుకున్నందున కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటోంది'' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం అర్ధరాత్రి తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించారు.
ఈ విషయాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుండగా, బీజేపీ మాత్రం స్వాగతిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేసును నీరుగార్చే ప్రయత్నమేనని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది.


ఫొటో సోర్స్, TelanganaCMO
అసలేం జరిగింది?
కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘన, ప్రజాధనం దుర్వినియోగం ఆరోపణలపై జ్యుడిషియల్ విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్‌ను నిరుడు మార్చి 14న తెలంగాణ ప్రభుత్వం నియమించింది.
ఈ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ ఈటల రాజేందర్ సహా వివిధ శాఖల అధికారులు, నీటి పారుదల రంగ నిపుణులు, మాజీ ఇంజినీర్లను విచారించడంతో పాటు పలు వివరాలు సేకరించింది. దాదాపు 16 నెలలకు పైగా కమిషన్ విచారణ సాగింది.
2025 జూలై 31న పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికను ఆగస్టు 4న మంత్రి మండలి ఆమోదిందించింది. నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో ఆగస్టు 31, సెప్టెంబరు 1(ఆగస్టు 31వ తేదీ అర్ధరాత్రి)వ తేదీలలో చర్చించారు.
ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేదు.
''పీసీ ఘోష్ కమిషన్ తమ నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలు గుర్తించింది. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకలు వంటి అంశాలను ప్రస్తావించింది'' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మూడు బరాజ్‌ల నిర్మాణంలో తప్పు జరిగిందని, అసలు ప్లానింగ్ లేదని తేల్చి చెప్పిందని రేవంత్ రెడ్డి అన్నారు.
''నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ప్రకారం, మేడిగడ్డ బరాజ్ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది'' అని సీఎం చెప్పారు.
ఈ నేపథ్యంలో, కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకుముందు 2023 అక్టోబరు 21న మేడిగడ్డ బరాజ్‌లో బ్లాక్ నం.7లోని కొన్ని పిల్లర్లు కుంగడంతో వివాదం మొదలైంది.

ఫొటో సోర్స్, FB/revanthofficial
ప్రభుత్వం, బీఆర్ఎస్ వాదనలు ఇలా..
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయమైంది.
తెలంగాణ అసెంబ్లీలో మొదట చర్చ జరిగినప్పుడు పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సభలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రూ.87,449 వేల కోట్లతో మొదలైన ఈ ప్రాజెక్టు, 2022 నాటికి రూ.1.27 లక్షల కోట్లకు, ఇప్పుడు ఆ మొత్తం రూ.1.47 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు.
''ఏడాదికి 195 టీఎంసీల నీరు ఎత్తిపోస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం నిర్మించింది. ప్రాజెక్టు కట్టినప్పట్నుంచి మేడిగడ్డ బరాజ్ కుంగిన నాటికి(2023 అక్టోబరు) కేవలం 162 టీఎంసీల నీరే ఎత్తిపోశారు. అందులోనూ సముద్రంలోకి వదిలేసిన నీరు, ఆవిరి(ఎవాపరేషన్ లాస్) కలుపుకొని ఉపయోగపడింది కేవలం 101 టీఎంసీలే'' అని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. పీసీ ఘోష్ కమిషన్‌ను తీవ్రంగా విమర్శించారు.
''తెలంగాణ వచ్చాక తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కోసం ఎంతో ప్రయత్నం చేశాం. మహారాష్ట్ర నీళ్ల మంత్రిని కలిసి అడిగినం. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోనందునే మేడిగడ్డకు బరాజ్ మార్చాం'' అని చెప్పారు.
''ప్రాజెక్టు నిర్మాణ స్థలం మార్పు, అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ నిర్మాణం అంతా రిటైర్డ్ ఇంజినీర్లు సూచించింది'' అని ఆయన చెప్పారు.
''మేడిగడ్డలో ఏడో బ్లాకులోని రెండు పిల్లర్లు కుంగటం తప్ప, ఈ వ్యవస్థ అంతా అద్భుతంగా ఉంది. ఏడు బ్లాకుల్లో ఒక బ్లాకు మొత్తం తీసినా రూ.300-400 కోట్లే ఖర్చు అవుతుంది'' అని హరీష్ రావు అన్నారు.
అసెంబ్లీలో తమను మాట్లాడనివ్వడం లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి గన్ పార్కుకు చేరుకొని నిరసన తెలిపారు. అక్కడ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను చెత్తబుట్టలో పడేస్తూ నిరసన తెలిపారు.
''ముఖ్యమంత్రితో సహా ఎనిమిది మంది మంత్రులు 33 సార్లు మా ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు'' అని హరీష్ రావు ఆరోపించారు.

ఫొటో సోర్స్, facebook/Harish Rao Thanneeru
జస్టిస్ ఘోష్ కమిషన్ కాళేశ్వరంపై అత్యంత పారదర్శకంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తూ వ్యక్తిగతంగానూ వార్తాపత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చి విచారణ చేసిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.
''ప్రభుత్వానికి ఎలాంటి పొలిటికల్ మోటివేషన్ లేదు. కక్ష్య సాధింపు ఉంటే.. అప్పుడే ఏం చేయాలో అదే చేసేది. కానీ మేం అలా చేయలేదు. అత్యంత ప్రజాస్వామికంగా నివేదికను సభలో పెట్టి చర్చించి ముందుకు వెళుతున్నాం'' అని అన్నారు.
''న్యాయవ్యవస్థపై, ప్రజలపై మాకు పూర్తి నమ్మకం ఉంది'' అని భట్టి చెప్పారు.
పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తదుపరి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ హైకోర్టులో పిటిషిన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Bandi Sanjay Kumar/Facebook
వెంటనే లేఖ పంపించాలి: బండి సంజయ్
ఈ వ్యవహారంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు. సీబీఐ విచారణను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
''కాళేశ్వరం అవినీతికి పూర్తిగా బీఆర్ఎస్ బాధ్యత వహించాల్సిందే. కాళేశ్వరం అవినీతి, అక్రమాలపై మొదటి నుంచీ మేం సీబీఐ విచారణ కోరుతున్నాం'' అని ఆయన చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం వెంటనే సీబీఐకి లేఖ పంపాలని డిమాండ్ చేస్తున్నామని బండి సంజయ్ తెలిపారు.
మరోవైపు కమిషన్ నివేదికపై ఎంఐఎం శాసన సభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. మేడిగడ్డకు ఎందుకు మరమ్మతులు చేయలేదని ప్రశ్నించారు.
''పీసీ ఘోష్ కమిషన్ ఇన్ని నెలల విచారణలో ఏం చేసిందో అర్థం కావట్లేదు'' అని అన్నారు ఒవైసీ.
సీబీఐ విచారణపై కేటీఆర్ ఏమన్నారంటే..
కాళేశ్వరం కేసును సీబీఐకు అప్పగించడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
''ఎలాంటి కుట్రలు చేసినా న్యాయపరంగా, రాజకీయంగా పోరాడతాం'' అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకు అప్పగించడంపై తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటే విజిలెన్స్ కమిషన్ నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకోవచ్చని అసోసియేషన్ ప్రెసిడెంట్ మేరెడ్డి శ్యాం ప్రసాద్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
''కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో కమిటీ వేసి విచారించాలి. వారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలి'' అని డిమాండ్ చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














