తెలంగాణ: ఫ్రీ బస్సు ప్రయాణంతో స్త్రీ సాధికారతలో మార్పు వచ్చిందా, మహిళలు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, అల్లు సూరిబాబు
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంలో 2023 డిసెంబరు 9వ తేదీ నుంచి ప్రారంభమైన 'మహాలక్ష్మీ' స్కీమ్... 2025 జులై 23 నాటికి 200 కోట్ల 'జీరో' టికెట్ల మైలురాయిని చేరింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ఉద్దేశించిన ఈ స్కీమ్ విజయవంతంగా కొనసాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'ఎక్స్'లో పోస్టు చేశారు.
మహిళలకు భద్రతను, ఆర్థిక ప్రయోజనాన్నే గాక ఆర్టీసీ దశ కూడా మారిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ తొలిసారిగా దిల్లీలో 2019 సంవత్సరంలో ప్రభుత్వం అమలుచేసింది. తర్వాత తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలుచేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో 2023 డిసెంబరు నెలలో అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం స్కీమ్ అమలుచేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. అది ఎన్నికల హామీ కూడా.

తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మీ స్కీమ్ కొన్ని సత్ఫలితాలు తీసుకొచ్చిందని కొందరు మహిళలు చెబుతున్నారు. గతంలో ప్రయాణ ఖర్చులు భరించలేక స్థానికంగానే విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వెతుక్కునే సామాన్య, మధ్య తరగతి కుటుంబాల వారికి ఇప్పుడీ స్కీమ్‌తో పరిధి పెరిగింది. బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. విద్య, ఉపాధి, ఉద్యోగం, ఇతరత్రా అవసరాల కోసం రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు.
'వైద్యం అవసరమైతే మేము నిజామాబాద్ వెళ్లాలి. గతంలో బస్సులో వెళ్లిరావడానికి రూ.300 వరకూ ఖర్చు అయ్యేది. బంధువుల ఇళ్లకు వెళ్లాలన్నా రూ.500 వరకూ ఖర్చు తేలేది. ఇప్పుడు ఉచిత ప్రయాణంతో మిగులుతున్న ఆ డబ్బులు ఇతరత్రా కుటుంబ అవసరాలకు పనికొస్తున్నాయి. కానీ బస్సులు రద్దీగా ఉంటున్నాయి'' అని బీబీసీతో అన్నారు నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన విజయ.
రవాణా ఖర్చు భారం లేకపోవడంతో మహిళలు మిగిలిన డబ్బును తమ కుటుంబానికి నాణ్యమైన ఆహారం కోసం, లేదా ఇంట్లో పిల్లల చదువుకు ఉపయోగిస్తున్నారు.
ప్రయాణ ఖర్చు లేకపోవడంతో బంధువుల ఇళ్లలో కష్టమైనా, శుభకార్యమైనా మహిళలే వెళ్లివస్తున్నారు. తీర్థయాత్రలు చేస్తున్నారు. గత ఏడాదిన్నర కాలంలో తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలంలో భక్తుల రద్దీ పెరిగింది. ఇలా సామాజిక కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యం కనిపిస్తోందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
''ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం స్కీమ్‌తో పట్టణ ప్రాంతాల్లో వర్కింగ్ విమెన్‌కు బాగా ఉపయోగపడుతోంది. మహిళా ఉద్యోగులకు ప్రయాణ ఖర్చు మిగులుతోంది. ముఖ్యంగా విద్యార్థినులకు కొంత డబ్బులు ఆదా అవుతున్నాయి'' అని హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది పల్లికొండ పద్మ బీబీసీకి చెప్పారు.
''గతంలో బస్సు చార్జీలు బాగా పెరిగాయి. అప్పుడు ప్రయాణమే ఖర్చుగా భావించి కుటుంబం అంతా వెళ్లకుండా కొంతమంది డ్రాప్ అయ్యేవారు. సహజంగా వారిలో మహిళలే ఎక్కువ మంది ఉంటారు. మహాలక్ష్మీ స్కీమ్ వచ్చిన తర్వాత మార్పు వచ్చింది'' అని పద్మ అన్నారు.
ఏమిటీ మహాలక్ష్మీ స్కీమ్?
బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ఆర్టీసీ బస్సుల్లో తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023 డిసెంబరు 8వ తేదీన జీవో నంబరు 47, టీ ఆర్అండ్‌బీ (టీఆర్-2) తీసుకొచ్చింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆ మర్నాడు డిసెంబర్ 9వ తేదీ నుంచే టీజీఎస్ ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమల్లోకి తెచ్చింది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి మహాలక్ష్మీ స్కీమ్ కింద అనుమతిస్తోంది.
బస్సులో ప్రయాణించే మహిళలకు 'జీరో' టికెట్‌ను కండక్టర్ ఇస్తారు. వారి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోరు. అయితే వారు ప్రయాణించే వాస్తవ దూరం ఆధారంగా అయ్యే చార్జీల మొత్తాన్ని టీజీఎస్ ఆర్టీసీకి తెలంగాణ ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది.
ఈ స్కీమ్ కోసం నెలకు దాదాపు రూ.358 కోట్ల వరకూ ఖర్చు అవుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4,305 కోట్లను వార్షిక బడ్జెట్‌లో కేటాయించింది.
స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి 2025 జులై 23 వరకూ జారీ చేసిన జీరో టికెట్ల సంఖ్య 200 కోట్లకు చేరింది. ఈ ప్రకారం మహిళలకు, విద్యార్థినులకు రవాణా చార్జీల రూపేణా ఆదా అయిన మొత్తం దాదాపు రూ.6,680 కోట్లు. ఇందుకు సంబంధించిన చెక్‌ను ఇటీవల రాష్ట్ర మంత్రులు ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందించారు.

ఫొటో సోర్స్, UGC
రద్దీకి తగిన సంఖ్యలో బస్సులున్నాయా?
తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మీ స్కీమ్ ప్రారంభంకావడానికి ముందు ఆర్టీసీ బస్సుల్లో రోజుకు సగటున 45.49 లక్షల మంది ప్రయాణించేవారు.
స్కీమ్ ప్రారంభమైన 2023 డిసెంబర్ 9వ తేదీ నుంచి 2025 జులై 23 వరకూ ప్రయాణికుల సంఖ్య చూస్తే, సగటున రోజుకు ప్రయాణికులు సంఖ్య 60.08 లక్షలకు చేరింది.
ఈ లెక్కన రోజువారీ ప్రయాణికుల సంఖ్య గతంకన్నా 14.59 లక్షలు (సుమారు 24 శాతం) పెరిగింది.
అలాగే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారిలో మహిళల శాతం స్కీమ్ అమలుకు ముందు దాదాపుగా 40 ఉంటే, ఇప్పుడది 66.74కు చేరింది.
టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో 2023 నవంబరు వరకూ 69 శాతం వరకూ ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) ఉండేది. స్కీమ్ అమలు తర్వాత ఏకంగా 97 శాతానికి పెరిగింది.
సగటున 97 శాతం ఓఆర్ నమోదవుతుందంటే, స్కీమ్ వర్తించే బస్సులన్నీ కిటకిటలాడుతున్నట్లే.
మరీ ఇంతగా పెరిగిన డిమాండుకు తగినస్థాయిలో బస్సుల సంఖ్య పెరిగిందా? అంటే అది స్వల్పమనే చెప్పాలి.
టీజీఎస్ ఆర్టీసీ ద్వారా ప్రస్తుతం 9,703 బస్సులు నడుస్తున్నాయి. వీటిలో 7,913 బస్సుల్లో మహాలక్ష్మీ స్కీమ్ వర్తిస్తుంది.
స్కీమ్ వర్తించేవాటిలో 5,080 ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సులు, సిటీల్లో 2,833 మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులు ఉన్నాయి.
''మహాలక్ష్మీ స్కీమ్ తెలంగాణ మహిళలందరికీ ఉపయోగపడాలి. చాలా పల్లెలు, గ్రామాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం లేదు. మండల, జిల్లా కేంద్రాలకు రావాలంటే ఆటోలే దిక్కు. స్కీమ్ అందరికీ అందుబాటులోకి రావాలంటే బస్సుల సంఖ్య పెంచాలి. కానీ కరోనా తర్వాత వెయ్యి వరకూ బస్సులు తగ్గించేశారు. స్కీమ్‌తో ఉన్న బస్సుల్లోనూ రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. రద్దీకి తగ్గట్లుగా బస్సుల సంఖ్య పెంచాలి'' అని ఐద్వా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి బీబీసీతో అన్నారు.
''నేను కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నా. నిజామాబాద్ నుంచి రోజూ 10 కిలోమీటర్లు ప్రయాణం. మా రూట్లో కొంతమంది డ్రైవర్లు మహిళలను చూస్తే బస్సు ఆపడం లేదు. కొన్ని బస్సులు ఆగినా ఫుల్ రష్‌గా ఉంటున్నాయి. నిలబడటానికి కూడా చోటు ఉండట్లేదు. అందుకే తోటి ఉద్యోగులమంతా కలిసి ప్రతి నెలా ఒక్కొక్కరు రూ.1800 చొప్పున చెల్లిస్తూ ఆటో పెట్టుకున్నాం. అదే రద్దీకి తగ్గట్లుగా బస్సులు నడిపితే మాకు ఆ డబ్బులు మిగులుతాయి కదా? అవి పిల్లల చదువుకో, కుటుంబ అవసరాలకో ఉపయోగపడేవి'' అని నిజామాబాద్‌కు చెందిన ఓ మహిళ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, UGC
అందరికీ 'మహాలక్ష్మి' స్కీమ్ అందుతుందా?
''మహిళల ఆధార్ కార్డులో అడ్రస్ చూసి బస్సులో కండక్టర్ జీరో టికెట్ ఇస్తున్నారు. ఉచితంగా ప్రయాణించేవారిలో చాలామంది పరిశ్రమల్లో దినసరి కార్మికులు, ఇళ్లలో పనిచేసేవారు ఉంటున్నారు. వారిలో కొంతమంది నిరక్షరాస్యత వల్ల ఆధార్ కార్డులో అడ్రస్ కూడా మార్చుకోవట్లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆధార్ తీసుకున్నవారే. అడ్రస్‌లో ఆంధ్రప్రదేశ్ అని ఉంటే కండక్టర్లు వారిని బస్సు ఆపి కిందకు దించేస్తున్నారు. హైదరాబాద్‌లో వారి సమస్యను అధికారులు పరిష్కరించాలి'' అని పద్మ అన్నారు.
''ప్రజారవాణా వ్యవస్థను విస్తృతం చేయాలి. లింగబేధం లేకుండా విద్యార్థులందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి. అప్పుడే మహాలక్ష్మి స్కీమ్ ప్రజలందరికీ ప్రయోజనకరమవుతుంది'' అని అరుణజ్యోతి అభిప్రాయపడ్డారు.
మహాలక్ష్మీ స్కీమ్ స్వల్పకాలంలోనే మహిళలకు ఎంతో చేరువైందని, 200 కోట్ల ఉచిత టికెట్లు జారీతో టీజీఎస్ ఆర్టీసీ మరో మైలురాయిని దాటిందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ పథకంతో చిరు ఉద్యోగులు, టీచర్లు, విద్యార్థులు, చిరువర్తకులు, కూరగాయల వ్యాపారులు, కార్మికులు, పేషెంట్లు, తీర్థయాత్రికులు లబ్ది పొందుతున్నారని అన్నారు.
''ఆర్టీసీపై ఎలాంటి భారం పడకుండా ఈ స్కీమ్ కింద ఇప్పటికే ప్రభుత్వం దాదాపు రూ.6,700 కోట్లు విడుదల చేసింది. ఈ పథకంతో మహిళలకు కేవలం ఉచిత రవాణా సౌకర్యం ఒక్కటే కాదు వారు పల్లెల నుంచి పట్టణాలకు వెళ్లి విద్యా, ఉద్యోగ, వ్యాపార, ఉపాధి అవకాశాలను పొందే అవకాశం కలుగుతోంది'' అని మంత్రి బీబీసీతో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













