విమానం గాల్లో ఉండగా ఇంజిన్లు ఆపేందుకు ప్రయత్నించిన పైలట్, ఆ తర్వాత ఏమైందంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అలీ అబ్బాస్ అహ్మదీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
విమానం ప్రయాణికులతో వెళ్తున్న సమయంలో, గాల్లో ఉండగానే దాని ఇంజిన్లు ఆపేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ పైలట్ ఫెడరల్ కోర్టులో తన నేరాన్ని అంగీకరించారు.
విధుల్లో లేకపోయినా(ఆఫ్ డ్యూటీ) జోసెఫ్ డేవిడ్ ఎమర్సన్ అలాస్కా ఎయిర్‌లైన్స్ విమానంలోని కాక్‌పిట్‌లో వచ్చి, పైలట్లతో ''నాకేం నచ్చడం లేదు'' అంటూ విమానం గాల్లో ఉండగానే ఇంజిన్లు ఆపేందుకు ప్రయత్నించారని కోర్టు పత్రాలు పేర్కొన్నాయి.
తాను సైకెడెలిక్ మష్రూమ్స్ (మానసిక పరిస్థితిని ప్రభావితం చేసే పుట్టగొడుగులు) తిన్నానని, డిప్రెషన్‌తో బాధపడుతున్నానని ఎమర్సన్ పోలీసులతో చెప్పారు.
ఆయన నేరాంగీకారంతో, ఒక ఏడాది జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు సిఫార్సు చేయొచ్చు. అయితే, ఆయన తరఫు న్యాయవాదులు ఆయనకు అదనపు జైలు శిక్ష పడకుండా వాదించవచ్చు.

''నిర్లక్ష్యంగా ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం, విమానాన్ని ఉద్దేశపూర్వకంగా లేదా నిర్లక్ష్యంగా ప్రమాదంలోకి నెట్టడం వంటి ఆరోపణలను ఎలాంటి వాదనలు లేకుండానే ఆయన ఒరెగాన్ రాష్ట్ర కోర్టులో అంగీకరించారు. అంటే, దోషిగా అంగీకరించనప్పటికీ శిక్ష అనుభవించేందుకు సిద్ధమని చెప్పడం. ఫెడరల్ కోర్టులో మాత్రం దోషిగా అంగీకరించారు'' అని బీబీసీ అమెరికా భాగస్వామి సీబీఎస్ న్యూస్ తెలిపింది.
''రాష్ట్ర కోర్టు ఎమర్సన్‌కు 50 రోజుల శిక్ష విధించింది. ఇప్పటికే ఆయన ఈ శిక్షను అనుభవించారు. అలాగే, ఐదేళ్ల ప్రొబేషన్, 660 గంటల సమాజ సేవ (ఆయన ప్రమాదంలోకి నెట్టిన ప్రతి వ్యక్తికి 8 గంటల చొప్పున), సుమారు రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా తీర్పు వెలువరించింది'' అని సీబీఎస్ న్యూస్ రిపోర్ట్ చేసింది.
"జోసెఫ్ ఎమర్సన్ చర్య నిర్లక్ష్యంతో, స్వార్థంతో కూడుకున్నది, నేరపూరితమైనది" అని ఒరెగాన్‌లోని మల్ట్నోమా కౌంటీ డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఎరిక్ పికార్డ్ అన్నారు. "కేవలం 2059 ఫ్లైట్‌లో ఉన్న 84 మంది జీవితాలను మాత్రమే కాకుండా, వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల జీవితాలను కూడా ఎలా నాశనం చేయబోయాడో గమనించాలి."
ఎమర్సన్ శుక్రవారం కోర్టులో మాట్లాడుతూ, పుట్టగొడుగులు తిన్న తర్వాత ఏం జరుగుతుందో తెలియలేదని, అలాగని "అది సరైనదేమీ కాదు" అని అన్నారు.
"ఈ కష్టతరమైన ప్రమాణం నన్ను మంచి తండ్రిగా, మంచి భర్తగా, ఒక మంచి వ్యక్తిగా మార్చింది" అని ఎమర్సన్ చెప్పారు. "ఇప్పుడే నేను మంచి తండ్రిగా ఉండగలుగుతున్నా. గతంలో మద్యానికి బానిపై ఆ బాధ్యతలను సరిగ్గా పోషించలేకపోయాను."

ఫొటో సోర్స్, Getty Images
ఈ విమానం 2023 అక్టోబర్ 22న వాషింగ్టన్‌లోని ఎవెరెట్ నుంచి కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు 80 మంది ప్రయాణికులతో వెళుతోంది. ఆ తర్వాత దానిని ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌కు మళ్లించారు.
క్రిమినల్ ఫిర్యాదు పత్రాల ప్రకారం, ఎమర్సన్ చర్యను నిలువరించేందుకు ఆయనతో పోరాడాల్సి వచ్చిందని, ఆ తర్వాత ఆయన్ను కాక్‌పిట్ నుంచి బయటకు తీసుకొచ్చినట్లు ఒక పైలట్ తెలిపారు. అందుకు దాదాపు 90 సెకన్లు పట్టింది.
ఎమర్సన్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత విమాన సహాయక సిబ్బందితో ఇలా అన్నారు. "నా చేతులు కట్టేయండి. లేదంటే పరిస్థితి చేయిదాటిపోతుంది."
అనంతరం విమానం దిగే సమయంలో ఎమర్జెన్సీ హ్యాండిల్ దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు అభియోగ పత్రాల్లో పేర్కొన్నారు.
"మొత్తం చిన్నాభిన్నం చేశా, అందరినీ చంపేయాలనుకున్నా" అని అనడం గమనించినట్లు విమాన మహిళా సహాయక సిబ్బందిలో ఒకరు దర్యాప్తు అధికారులతో చెప్పారు.
ఫెడరల్ కేసులో నవంబర్ 17న ఆయనకు శిక్ష ఖరారు కానుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














