20 రోజుల శిశువు కడుపులో కవల పిండాలు.. ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు

శిశువుకు పొత్తికడుపులో రెండు వికృత పిండాలు ఉండటంతో ఉబ్బిపోయి ఆహారం తీసుకోలేకపోయింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శిశువుకు పొత్తికడుపు ఉబ్బిపోయి ఆహారం తీసుకోలేకపోయింది
    • రచయిత, చెరీలాన్ మొలాన్
    • హోదా, బీబీసీ న్యూస్, ముంబయి
    • నుంచి, ముంబయి

(హెచ్చరిక: ఈ వార్తలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు)

కేవలం 20 రోజుల వయసున్న నవజాత శిశువు కడుపులో పెరుగుతున్న రెండు పిండాలను భారతీయ వైద్యులు శస్త్ర చికిత్స చేసి విజయవంతంగా తొలగించారు.

వైద్యశాస్త్రంలో ఇలాంటి పరిస్థితిని 'ఫీటస్ ఇన్ ఫీటు' (ఎఫ్‌ఐఎఫ్)గా పిలుస్తారు. ఇది చాలా అరుదు.

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సుమారు 200 కేసులు నమోదయ్యాయి. గతంలో భారత్‌లోనూ కొన్ని కేసులు రికార్డయ్యాయి.

ఈ కేసులో, ఆ మహిళ మూడు పిండాలతో గర్భందాల్చారు. అందులో రెండు పిండాలు మూడో పిండం(శిశువు) ఉదరంలో పెరగడం ప్రారంభించాయి.

''ఈ శస్త్రచికిత్స సవాలుతో కూడినదే. కానీ శిశువు ఆరోగ్యంగానే ఉంది, బాగానే ఉంది'' అని ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ ఆనంద్ సిన్హా బీబీసీతో చెప్పారు.

శస్త్రచికిత్స చేసిన తర్వాత ఆ శిశువును ఆసుపత్రి నుంచి నెల కిందట డిశ్చార్జ్ చేశామని, ఇప్పటివరకూ ఎలాంటి సమస్యలు రాలేదని డాక్టర్ ఆనంద్ సిన్హా అన్నారు.

ఆ శిశువు శస్త్రచికిత్స తర్వాత కోలుకునే కాలం కూడా చాలా కీలకమని, ఆ సమయంలో ఇన్ఫెక్షన్, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తితే శిశువుకు ప్రాణాంతకమవుతాయని డాక్టర్ వివరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
శిశువు ఉదరంలో వికృత పిండాలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, శిశువు పొత్తికడుపులో పెరుగుతున్న పిండాలు (ప్రతీకాత్మక చిత్రం)

భారత్‌లో కనిపిస్తున్న ఎఫ్ఐఎఫ్ కేసులు...

2024లో, కోల్‌కతాలోని ఒక ఆసుపత్రిలో మూడు రోజుల వయసున్న శిశువు ఉదరం నుంచి రెండు పిండాలను డాక్టర్లు తొలగించారు. కానీ శస్త్రచికిత్స చేసిన తర్వాత ఒక రోజులోనే ఆ శిశువు చనిపోయింది.

ఇప్పుడీ కేసులో, గత జులైలో 20 రోజుల శిశువును తల్లిదండ్రులు గురుగావ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో చేర్పించారు.

''ఆ శిశువు పొత్తికడుపు ఉబ్బి ఉంది. ఏడుస్తూ ఉంది. ఆహారమేమీ తీసుకోలేకపోయింది'' అని డాక్టర్ ఆనంద్ చెప్పారు.

స్కాన్ చేస్తే, ఆ శిశువు కడుపులో కణితుల లాంటివి రెండు కనిపించాయి. వాస్తవానికి అవి పిండాలు.

కానీ వెంటనే శస్త్రచికిత్స చేయలేమని, ఎందుకంటే డీహైడ్రేషన్, పోషకాహార లోపంతో బాధపడుతున్న ఆ శిశువు ఆరోగ్య పరిస్థితి స్థిరమవ్వాల్సి ఉంటుందని డాక్టర్ ఆనంద్ వివరించారు.

రెండు రోజుల తర్వాత ఆ శిశువు ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో, సుమారు 15 మంది వైద్యుల బృందం శస్త్రచికిత్స చేసింది.

ఈ శస్త్రచికిత్సకు దాదాపు రెండు గంటల సమయం పట్టిందని డాక్టర్ ఆనంద్ వెల్లడించారు. శిశువు చాలా సున్నితమైన పరిస్థితిలో, చిన్నగా ఉండటంతో ప్రత్యేక పరికరాలను ఉపయోగించాల్సి వచ్చిందని చెప్పారు.

అలాగే, శిశువు కాలేయం, మూత్రపిండాలు, పేగులకు ఆ పిండాలు అనుసంధానమై ఉండటం వల్ల ఆ అవయవాలు, రక్తనాళాలు దెబ్బతినకుండా వాటిని జాగ్రత్తగా తొలగించారు.

పిండంలో పిండం ఏర్పడటమనేది గర్భధారణ సమయంలోనే నిర్ధరణ అవుతుందని డాక్టర్ ఆనంద్ చెప్పారు. కానీ బాల్యంలో ఈ పరిస్థితి గుర్తించకపోతే, కొన్నిసార్లు పెద్దల్లోనూ పారసైటిక్ కవల పిండాలు కనిపిస్తాయని ఆయన వివరించారు.

ఒకవేళ ఈ పిండాలను ప్రారంభ దశలోనే తొలగించకపోతే, శిశువు వయసు పెరిగే కొద్దీ ఇవీ పెరుగుతూనే ఉంటాయని డాక్టర్ ఆనంద్ చెప్పారు. ఇవి సాధారణంగా క్యాన్సర్‌గా మారకపోయినా, ఆ వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యలను కలిగించే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పారు.

ఫిబ్రవరిలో, మహారాష్ట్రలో మూడు రోజుల వయసు గల శిశువు కడుపు నుంచి రెండు పిండాలను వైద్యులు తొలగించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)