ఉత్తుత్తి ట్యాంకులు, చెక్క ఫిరంగులు, అట్ట డ్రోన్లు..వీటిని ఏ యుద్ధంలో వాడుతున్నారంటే..

ఫొటో సోర్స్, Na Chasi
- రచయిత, విటాలీ షెవ్‌చెంకో
- హోదా, బీబీసీ ప్రతినిధి
2023 జూన్‌లో రష్యాలో యుద్ధ అనుకూల సోషల్ మీడియా చానల్స్‌లో ఓ వీడియో వైరల్ అయింది. అందులో యుక్రేనియన్ ట్యాంక్‌ను ఓ డ్రోన్ పేల్చి వేస్తున్న దృశ్యాలున్నాయి.
రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కనిస్తున్నదంతా నిజం కాకపోవచ్చు.
ఇంకా ఆ వీడియోలో కాలిపోతున్న శకలాలను చూపిస్తూ "వాళ్లు నా చెక్క ట్యాంకును కొట్టారు" అని యుక్రేనియన్ సైనికుడు నవ్వుతున్న దృశ్యాలున్నాయి.
అదసలు ట్యాంకేనా అన్న ప్రశ్నకు రష్యన్లను బోల్తా కొట్టించేందుకు యుక్రెయిన్ బలగాలు ఉపయోగించిన ప్లైవుడ్ ట్యాంక్ అని చెప్పాల్సి వస్తుంది.
శత్రు సైనికుల విలువైన సమయం, ఆయుధాలు, ప్రయత్నాలను వృథా చేసేందుకు యుక్రెయిన్, రష్యా ఉపయోగిస్తున్న వేలకొద్దీ సైనిక పరికరాలలో ఇది కూడా ఒకటి.
యుద్ధ క్షేత్రంలో కనిపించేది ఏదైనా కావచ్చు.. చిన్న చిన్న రాడార్లు, గ్రనేడ్ లాంచర్లు, జీపులు, ట్రక్కులు, ట్యాంకులు, సైనికులు ఏదైనా నకిలీవి కావొచ్చు.
ఈ నకిలీవన్నీ ఒక్కోసారి చెక్క ముక్కలు, గాలితో నింపినవి, 2డీ.. లేదా రాడార్‌లను మోసగించేలా రేడియో తరంగాలను ప్రత్యేక మార్గంలో పంపించడం లాంటివి ఉండవచ్చు.
యుక్రెయిన్‌లో మోహరించిన కొన్ని రకాల ఆయుధాల్లో, కనీసం సగం ఆయుధాలు ఉత్తుత్తివే.


ఫొటో సోర్స్, Apate
ప్లైవుడ్‌తో చేసిన యుద్ధ ట్యాంకులు
యుక్రెయిన్ సైన్యం వినియోగిస్తున్న ఉత్తుత్తి ఆయుధాల్లో బ్రిటన్ తయారు చేసిన ఎం777 హోవిడ్జర్‌ను పోలినవి ఎక్కువగా ఉన్నాయి.
యుక్రెయిన్ సైనికులు "త్రీ యాక్సెస్" అని పిలుచుకునే హోవిడ్జర్ ట్యాంకులు ఖచ్చితత్వంతో దాడులు చేస్తాయి.
పశ్చిమ దేశాలు యుక్రెయిన్‌కు 150 ఎం777 హోవిడ్జర్ ట్యాంకులను సరఫరా చేసినట్లు తెలుస్తోంది.
యుక్రెయిన్ సైన్యం ఉపయోగిస్తున్న ఇతర రకాల ఉత్తుత్తి ఆయుధాలను సరఫరా చేయడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.
'నా ఛాసి' అనే వలంటీర్ గ్రూప్‌కు చెందిన రుస్లాన్ కిలిమెంకో మాట్లాడుతూ.. యుక్రెయిన్ సైనికులకు ఎం777 మోడల్ నకిలీ ఫిరంగులు 160 తయారు చేసి ఇచ్చామని చెప్పారు.
తాము తయారు చేసిన చెక్క మోడల్స్‌ను యుద్ధక్షేత్రంలో మూడు నిముషాల్లో ఇద్దరు వ్యక్తులు ఎలాంటి పరికరాలు అవసరం లేకుండానే ఫిరంగుల మాదిరిగా అమర్చవచ్చని కిలిమెంకో చెప్పారు.
"ఎన్ని తయారు చేసి ఇచ్చామని కాదు, అన్నీ ఉపయోగపడతాయా లేదా అన్నదే ముఖ్యం" అని ఆయన బీబీసీతో చెప్పారు.
రియాక్టివ్నా పోష్టా అనే వలంటీర్ల బృందానికి చెందిన పావ్లో నరోజ్నీ ఎప్పుడైనా సరే పది నుంచి పదిహేను నకిలీ ఎం777లను సిద్ధంగా ఉంటాయని చెప్పారు.
రియాక్టివ్నా పోష్టా ప్లైవుడ్‌తో ఉత్తుత్తి ఆయుధాలు తయారు చేస్తుంది. ఈ గ్రూప్ సరఫరా చేసే ఉత్తుత్తి ఆయుధాలలో ఒక్కొక్కటి తయారీకి 500 నుంచి 600 డాలర్లు ఖర్చవుతాయి.
అయితే.. యుక్రెయిన్ ఉపయోగిస్తున్న నకిలీ ఎం777 ఆయుధాలను ధ్వంసం చేసేందుకు రష్యా 35 వేల డాలర్ల విలువ చేసే లాన్సెట్ కామికాజ్ డ్రోన్లు ఉపయోగిస్తోంది.
"మీరే లెక్కేసుకోండి" అని నరోజ్నీ చెప్పారు.
ఆయన తయారు చేసిన నకిలీ ఎం777 ఫిరంగికి టోల్యా అని పేరు పెట్టారు.
ఈ ఉత్తుత్తి ఆయుధం ఏడాది పాటు 14 లాన్సెట్ డ్రోన్ల దాడుల నుంచి తప్పించుకుందని ఆయన చెప్పారు.
యుక్రెయిన్ సైనికులు "ఈ చెక్క ముక్కలను టేపులు, చిన్న చిన్న నట్లతో కలిపి బిగిస్తున్నారు. వాటిని యుద్ధక్షేత్రంలోకి తీసుకెళుతున్నారు" అని నరోజ్నీ చెప్పారు.

ఫొటో సోర్స్, Back and Alive
టైర్ల గుర్తులు, టాయిలెట్లు
ఈ ఉత్తుత్తి ఆయుధాల మోహరింపు కూడా కీలకం.
శత్రువుల దృష్టిని ఆకర్షించేలా ఈ ఆయుధాలు ఉంచిన ప్రాంతానికి చేరుకునే దారిలో టైర్ల గుర్తులు, ఆయుధాలు వాడిన అవశేషాలు, టాయిలెట్లు లాంటివి పెడతారు.
ఇది శత్రువుల్నే కాదు ఒక్కోసారి యుక్రెయిన్ సైనికాధిరులను కూడా మభ్యపెట్టేలా ఉంటుంది.
"ఒకసారి మా బ్రిగేడ్ చూసేందుకు వచ్చిన కమాండర్ మేం ఏర్పాటు చేసిన ఉత్తుత్తి ఆయుధాలను చూసి నిజమేననుకున్నారు. ఆయన మాతో "ఫిరంగుల్ని మోహరించేందుకు మీకు అధికారం ఎవరిచ్చారు? ఈ ఎం777 ఫిరంగులు మీకు ఎక్కడ నుంచి వచ్చాయి? అని అడిగారు" అని యుక్రెయిన్ 33వ డిటాచ్డ్ మెకనైజ్డ్ బ్రిగేడ్ అధికారి ఒకరు చెప్పారు.
ఇందులో మరో తరహా మోసం కూడా ఉంది.
ముందుగా నిజమైన ఆయుధాలను మోహరించి వాటితో మోర్టార్లను ప్రయోగించి, ఆ వెంటనే వాటి స్థానంలో నకిలీవి ఉంచడం మరో వ్యూహం అని ఆయన వివరించారు.
"శత్రువును మోసం చేయడానికి ఇవి బాగా సరిపోతాయి. వీటిని చూసి వాళ్లు దాడులు చేయడం వల్ల విలువైన ఆయుధాల్ని నష్టపోతారు. నకిలీ ఆయుధాలు పని చేస్తున్నాయి. అవి మాకు చాలా కావాలి" అని ఆయన చెప్పారు.
రష్యా దగ్గర కూడా ఇలాంటి నకిలీ ఆయుధాలు ఉన్నాయి. అవి చాలా వైవిధ్యంతో కూడుకున్నవి.
రష్యా ఇటీవల జరిపిన వైమానిక దాడుల్లో పాల్గొన్న డ్రోన్లలో సగానికి పైగా నాసి రకానికి చెందినవని యుక్రెయిన్ సైన్యం తెలిపింది.
"ఇప్పుడిది సగం- సగంగా ఉంది. యాభై శాతం నిజమైనవి ఉంటే 50 శాతం నకిలీవి ఉంటున్నాయి. నకిలీ డ్రోన్లను ప్రయోగించడం ద్వారా రష్యన్లు మా గగనతల వ్యవస్థల్ని తప్పుదారి పట్టించి పైసాకు పనికి రాని డ్రోన్ల మీద మేము క్షిపణుల్ని ప్రయోగించేలా చేస్తున్నారు" అని యుక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ అధికార ప్రతినిధి యూరి ఇన్‌హాంట్ చెప్పారు.
"కొన్ని సార్లు చూస్తే అది ప్లైవుడ్‌తో తయారు చేసింది. స్కూలు పిల్లలు వాటిని తయారు చేసినట్లు అనిపిస్తుంది" అని ఆయన అన్నారు.
అయితే, గాల్లో ఉన్నప్పుడు యుక్రేనియన్ రాడార్లకు ఇది ప్రాణాంతకమైన షాహెద్ డ్రోన్ లాగా కనిపిస్తుందని కల్నల్ ఇహ్నాత్ వివరించారు.

ఫొటో సోర్స్, People's Front Novosibirsk
ఉత్తుత్తి ఆయుధాలు, ఉత్తుత్తి సైనికులు
రష్యాకు చెందిన రస్బాల్ అనే సంస్థ గగనతలం, అంతరిక్షం నుంచి సమచార సేకరణను తప్పుదారి పట్టించేందుకు 2డీ డెకాయ్‌లు, సైనికుల వాకీటాకీల నుంచి వచ్చే రేడియో తరంగాలు, శత్రువుల రాడార్లను మోసం చేసే రిఫ్లెక్టర్ల వంటి వాటికి నకిలీలను తయారు చేస్తోంది.
సైనికులకు కూడా నకిలీలను తయారు చేస్తున్నారు.
రష్యన్ సైనికుల యూనిఫామ్ వేసుకున్న ఉత్తుత్తి సైనికుల బొమ్మలను నోవోసిబ్రిస్క్‌లోని పీపుల్స్ ఫ్రంట్ మూమెంట్ తయారు చేస్తోంది.
ఈ సంస్థకు రష్యా అధ్యక్ష కార్యాలయం మద్దతుంది.
యుక్రేనియన్ల థర్మల్ కెమెరాలను మోసం చేసేందుకు మనుషుల శరీరంలో ఉష్ణోగ్రత ఉన్నట్లే ఈ బొమ్మల్లోనూ ఉండేలా వాటిని హీటింగ్ వైర్లతో చుడుతున్నారు.
యుద్ధంలో ఇలాంటి మోసాలు, నకిలీ ఆయుధాలు కొత్త ఆలోచనేమీ కాదు.
రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ డమ్మీ ట్యాంకులు, చెక్కతో చేసిన ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పూర్తిగా నకిలీ ఆర్మీ గ్రూప్ ఏర్పాటు చేసింది.
ఇదంతా క్షేత్రస్థాయిలో వాస్తవికతను దాచిపెట్టి మిత్రరాజ్యాలకు దాడిని ప్రారంభించడానికి అవసరమైన ఆశ్చర్యాన్ని కలిగించడానికి చేసిన విస్తృతమైన యుక్తుల్లో భాగం.
రెండ ప్రపంచ యుద్దం తర్వాత మిలటరీ టెక్నాలజీ భారీగా అభివృద్ధి చెందింది. డ్రోన్లు, మానవ రహిత వ్యవస్థలు యుద్ధంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.
అయితే యుద్ధ భూమిలోకి ఎంత విధ్వంసరమైన ఆయుధాలు వచ్చినా నకిలీ ఆయుధాలు, మోసపూరిత వ్యూహాలకు ఎప్పుడూ స్థానం ఉంటుందనే దానికి యుక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం ఉదాహరణగా నిలుస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














