భారత్‌ విషయంలో ట్రంప్ వైఖరి మారడంతో ఇజ్రాయెల్‌ ఇరకాటంలో పడిందా?

భారత్, ఇజ్రాయెల్, అమెరికా, ట్రంప్, మోదీ, నెతన్యాహు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రజనీశ్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహును భారత ప్రధాని నరేంద్ర మోదీ స్నేహితులుగా సంభోదిస్తూ ఉంటారు.

విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా చాలాసార్లు ప్రధాని మోదీకి, అధ్యక్షుడు ట్రంప్‌తో 'వ్యక్తిగతంగానూ మంచి సంబంధాలు' ఉన్నాయని చెప్పారు.

కానీ, ట్రంప్‌తో ప్రధాని మోదీకి ఉన్న 'వ్యక్తిగత సంబంధాలు' ఇప్పుడు ప్రశ్నార్థకమయ్యాయి. భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు విధించింది.

బెంజమిన్ నెతన్యాహూకి కూడా ట్రంప్ స్నేహితుడు. మోదీతో తన స్నేహితుడి సంబంధాలు మెరుగవ్వాలని ఆయన కోరుకుంటున్నారు.

ఆసక్తికరంగా, ట్రంప్ విషయంలో ఇజ్రాయెల్, పాకిస్తాన్ ఒకే విధమైన వైఖరి అవలంబించడం చూశాం. ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి పాకిస్తాన్ నామినేట్ చేసింది, కొద్దిరోజుల అనంతరం ఇజ్రాయెల్ కూడా అదే పని చేసింది.

అయితే, పాకిస్తాన్ నేటికీ ఇజ్రాయెల్‌ను సార్వభౌమ దేశంగా గుర్తించలేదనేది వేరే విషయం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

నెతన్యాహు అభిలాష..

ట్రంప్ భారత్‌పై సుంకాలను 50 శాతానికి పెంచుతూ ప్రకటన చేసినప్పుడు.. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తనకు మంచి మిత్రులని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు.

ట్రంప్‌తో వ్యవహరించడానికి సంబంధించి ప్రధాని మోదీకి కొన్ని సూచనలు చేస్తానని, కానీ అది బహిరంగంగా కాదని నెతన్యాహు చెప్పారు.

ఆగస్ట్ 7న, నెతన్యాహు భారతీయ జర్నలిస్టు బృందంతో మాట్లాడుతూ, "భారత్, అమెరికా మధ్య సంబంధాల్లో ఒక ప్రాథమిక అవగాహన ఉంది. రెండు దేశాల మధ్య సంబంధాలకు చాలా బలమైన పునాది ఉంది" అన్నారు.

"భారత్, అమెరికా ప్రయోజనాల దృష్ట్యా.. రెండు దేశాలు ఏకాభిప్రాయానికి వస్తాయి, ఈ సుంకాల సమస్య పరిష్కారమవుతుంది. రెండూ మాకు మిత్రదేశాలు కాబట్టి, అది మాకు కూడా అనుకూలం."

మీకు ఇజ్రాయెల్‌తో మంచి సంబంధాలుంటే, అమెరికాతో కూడా మంచి సంబంధాలే ఉంటాయనేది, జగమెరిగిన సత్యంలా చెబుతుంటారు.

అమెరికాలోని యూదు లాబీ శక్తిమంతమైనది. అమెరికా కూడా దాని ఆవిర్భావం నుంచి ఇజ్రాయెల్‌కు మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది.

ట్రంప్ తన మొదటి పదవీకాలంలో, అబ్రహం ఒప్పందం ద్వారా ఇజ్రాయెల్‌కు అనేక ఇస్లామిక్ దేశాల గుర్తింపు లభించేలా చేశారు.

netanyahu, modi

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 9 నెలల తర్వాత ఇజ్రాయెల్ ఏర్పాటైంది.

ఆ సమయంలో, పాలస్తీనా లేకుండా ఇజ్రాయెల్‌ను జవహర్‌లాల్ నెహ్రూ అంగీకరించలేదు. ఇజ్రాయెల్ ఏర్పడిన రెండేళ్ల తర్వాత నెహ్రూ దానిని సార్వభౌమ దేశంగా గుర్తించారు.

భారత్ వెంటనే ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా గుర్తించాలని అమెరికా కోరుకుంది, కానీ నెహ్రూ అందుకు అంగీకరించలేదు. ఇజ్రాయెల్‌ను గుర్తించినప్పటికీ, ఆ దేశంతో భారత్ దౌత్య సంబంధాలను ఏర్పరచుకోలేదు.

1992, జనవరి 23న, అంటే భారత్ ఇజ్రాయెల్‌ను గుర్తించిన దాదాపు 42 ఏళ్ల తర్వాత ఆ దేశంతో దౌత్య సంబంధాలను ఏర్పరుచుకుంది.

సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత, భారత్ ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను ప్రారంభించింది.

అదే సమయంలో, అప్పటి భారత ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత భారత్‌కు కొత్త భాగస్వామి అవసరం పడింది.

ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. సోవియెట్ యూనియన్ పతనానంతరం, రక్షణ సామగ్రి సరఫరా కోసం భారత్ కూడా నమ్మకమైన భాగస్వామి కోసం వెతికింది.

భారత్, ఇజ్రాయెల్, అమెరికా, ట్రంప్, మోదీ, నెతన్యాహు

ఫొటో సోర్స్, Getty Images

ఇజ్రాయెల్ ఆందోళన..

భారత్‌కు ఇజ్రాయెల్ ఆయుధాలను సరఫరా చేయగలదు, కానీ అందుకు అమెరికా ఆమోదం అవసరం. ఎందుకంటే, వాటిని రెండు దేశాలూ కలిసి ఉత్పత్తి చేశాయి.

ఇజ్రాయెల్‌తో సన్నిహిత సంబంధాలు కావాలనుకుంటే అమెరికాతో స్నేహం కూడా ముఖ్యం. అమెరికాతో సన్నిహితంగా ఉండాలనుకుంటే ఇజ్రాయెల్‌తోనూ మంచి సంబంధాలు కొనసాగించాల్సిన పరిస్థితి.

ప్రస్తుతం అమెరికా, భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతపై ఇజ్రాయెల్‌ ఆందోళన కూడా స్పష్టంగా కనిపిస్తోంది.

భారత్ విషయంలో అమెరికా ప్రవర్తనపై అమెరికన్ యూదు కమిటీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

ఆగస్ట్ 29న, అమెరికన్ యూదు కమిటీ ‘ఎక్స్‌’లో చేసిన ఒక పోస్టులో ఇలా రాసింది. "భారత్‌పై అమెరికన్ అధికారుల వ్యాఖ్యలపై ఆందోళన చెందుతున్నాం. యుక్రెయిన్‌పై రష్యా క్రూరమైన దాడిని వైట్‌హౌస్ సలహాదారు ఒకరు 'మోదీ యుద్ధం' అని సంబోధించారు.''

"ఇంధనం కోసం భారత్ రష్యాపై ఆధారపడడం పెరుగుతూ ఉండడం విచారకరం. కానీ, పుతిన్ యుద్ధ నేరాలకు భారత్ బాధ్యురాలు కాదు."

"భారత్ ఒక ప్రజాస్వామిక దేశం. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామిగా ప్రాముఖ్యం కలిగివుంది. అగ్రరాజ్యాల మధ్య పోటీలో భారత్ చాలా కీలకం. భారత్‌తో సంబంధాలను తిరిగి గాడిలో పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది" అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

భారత్, ఇజ్రాయెల్, అమెరికా, ట్రంప్, మోదీ, నెతన్యాహు

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా, భారత్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతపై ఆమె ఇలా రాశారు. "ట్రంప్, మోదీ ఇద్దరూ తమ దేశంలో తయారీ పెంచడం ద్వారా చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నారు. అయితే, అందుకోసం కలిసి పనిచేయడానికి బదులు.. ఇద్దరూ ఒకరితో మరొకరు ఘర్షణ పడుతున్నారు. ఈ వివాదం భారత్, అమెరికా భాగస్వామ్యానికి పరీక్ష'' అని ఇలాన్ యూనివర్సిటీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న ఇజ్రాయెల్‌కు చెందిన డాక్టర్ లారెన్ డేగన్ అమోస్ బార్ రాశారు.

"మోదీ, ట్రంప్.. ఇద్దరూ తమ దేశాలను బలంగా చూడాలనుకుంటున్నారు. కానీ, ఇది వారి స్వప్నాల మధ్య ఘర్షణ. ఈ ఇద్దరు నాయకుల గురించి తెలిసిన వారికి, ఈ ఘర్షణ అనూహ్యమైనదేమీ కాదు" అని డేగన్ అభిప్రాయపడ్డారు.

"ట్రంప్ అమెరికా ఆధిపత్యాన్ని కోరుకుంటున్నారు. అలాగే ప్రపంచ రాజకీయాల్లో భారత్‌ పాత్రను క్రియాశీలం చేయాలని మోదీ భావిస్తున్నారు. ట్రంప్ లావాదేవీల ఆధారిత విదేశాంగ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు."

"దీనితో పాటు.. రష్యా - యుక్రెయిన్ యుద్ధం.. రష్యన్ చమురు వ్యవహారంలో భారత్‌ను ఒత్తిడి చేసేందుకు ట్రంప్‌కు అవకాశమిచ్చింది. కానీ, ఇలా చేయడం ద్వారా దశాబ్దాలుగా జాగ్రత్తగా నెరుపుతూ వస్తున్న భాగస్వామ్యాన్ని ట్రంప్ దెబ్బతీస్తున్నారు."

అమెరికా భారత్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా చూడకుండా, సుంకాలే లక్ష్యంగా ముందుకెళ్తే.. అది ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీయడంతో పాటు ఇండో పసిఫిక్ వ్యూహాన్ని కూడా ప్రభావితం చేస్తుందని డేగన్ భావిస్తున్నారు.

భారత్, ఇజ్రాయెల్, అమెరికా, ట్రంప్, మోదీ, నెతన్యాహు

యూఏఈకి భారత రాయబారిగా పనిచేసిన నవదీప్ సూరి మాట్లాడుతూ, "ఇజ్రాయెల్ ఇప్పటికే ఒంటరైంది, ట్రంప్ విధానాలు దానిని మరిన్ని ఇబ్బందులకు గురిచేయొచ్చు" అని అన్నారు.

"ఇజ్రాయెల్ ఏం చేయడానికైనా అమెరికా మద్దతిస్తోంది. కానీ, ఇజ్రాయెల్ వెస్ట్‌బ్యాంక్‌ను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే, అదే దానికి రెడ్‌ లైన్ (హద్దు దాటినట్లే) అని యూఏఈ హెచ్చరించింది. అబ్రహం ఒప్పందం ద్వారా ట్రంప్ ఇజ్రాయెల్, యూఏఈ మధ్య దౌత్య సంబంధాలను నెలకొల్పారు. కానీ, ఇప్పుడవి ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది."

"భారత్, ఇజ్రాయెల్ సంబంధాలు అమెరికాపై ఆధారపడి లేవు కానీ.. అమెరికా, భారత్ మధ్య ఉద్రిక్తత ఇజ్రయెల్‌కు అంత అనుకూలం కాదు."

"ఎవరి అండతో ఇజ్రాయెల్ పాలస్తీనాలో ఏది అనుకుంటే అది చేస్తుందో.. ఆ దేశానికి ప్రపంచంలోని అన్ని దేశాలతో సంబంధాలు దెబ్బతింటే, అది నెతన్యాహుకి ఏ విధంగానూ మంచిది కాదని మనం అర్థం చేసుకోవచ్చు."

"భారత్ అమెరికాలోని యూదు లాబీ నుంచి సాయం పొందుతోంది. కానీ ఇప్పుడు యూదు లాబీ కూడా చీలిపోయింది. అది కూడా నెతన్యాహు వల్ల. జోహ్రాన్ మమ్దానీ పాలస్తీనియన్లకు బహిరంగంగానే మద్దతు ఇస్తున్నారు, న్యూయార్క్‌లోని యూదు యువత మమ్దానీకి మద్దతు ఇస్తున్నారు" అని నవదీప్ సూరి చెప్పారు.

ట్రంప్ 50 శాతం సుంకాలపై భారత్ పెద్దగా స్పందించడం లేదు, కానీ తలొగ్గేందుకు కూడా సిద్ధంగా లేదు.

సౌదీ అరేబియాకు భారత మాజీ రాయబారి తల్మీజ్ అహ్మద్ మాట్లాడుతూ, అమెరికా దూకుడుగా ఉన్నప్పటికీ.. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి విషయంలో రాజీపడేందుకు సిద్ధంగా లేదని భారత్ స్పష్టం చేసిందని అన్నారు.

భారత్, ఇజ్రాయెల్, అమెరికా, ట్రంప్, మోదీ, నెతన్యాహు

ఫొటో సోర్స్, Getty Images

యూదు లాబీ ఇప్పుడంత బలంగా లేదు

"యూదు లాబీ అమెరికాలో మునుపటిలా బలంగా లేదిప్పుడు. అమెరికాలోని యూదు లాబీ చీలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో, ట్రంప్ సుంకాల నుంచి ఉపశమనం పొందేందుకు భారత్‌కు ఏ విధమైన సాయం దక్కబోదు" అని తల్మీజ్ అహ్మద్ అన్నారు.

"భారత్ కూడా షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్(ఎస్‌సీవో) సదస్సు ద్వారా, తమ విదేశాంగ విధానం అమెరికా ఆధ్వర్యంలో పనిచేయదని స్పష్టం చేసింది."

"ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడిని ఎస్‌సీవో సదస్సు ఖండించింది. భారత్ కూడా దానితో ఏకీభవించింది. దీనర్థం.. అమెరికాను బుజ్జగించేందుకు, తన విదేశాంగ విధానం విషయంలో భారత్ రాజీపడదు అని."

ట్రంప్ పదేపదే అవమానకరమైన రీతిలో భారత్‌ను టార్గెట్ చేస్తున్న సమయంలో.. ఇజ్రాయెల్‌ను ఖండించే నిర్ణయంతో భారత్ కూడా ఏకీభవించినట్లు కనిపించింది.

భారత్, అమెరికా సంబంధాల్లో యూదు సమాజం పాత్ర ఏంటి? అని అడిగినప్పుడు తల్మీజ్ సమాధానమిస్తూ, "అది గతం. యూదు కమ్యూనిటీకి ఇప్పుడంత బలం లేదు. ట్రంప్‌కు నెతన్యాహుతో వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయి" అన్నారు.

భారత్, ఇజ్రాయెల్, అమెరికా, ట్రంప్, మోదీ, నెతన్యాహు

భారత్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతతో ఐ2యూ2(I2U2‌)కి ఏమవుతుంది?

ఐ2 అంటే ఇండియా, ఇజ్రాయెల్.. యూ2 అంటే యూఎస్, యూఏఈ అని అర్థం.

ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC)కి ఏమవుతుంది?

అది I2U2 అయినా, లేదా IMEC అయినా.. ఈ రెండింటిలోనూ అమెరికాది కీలకపాత్ర. ఇజ్రాయెల్‌కు కూడా ఇది చాలా ముఖ్యం.

"I2U2 అనేది అమెరికా ఏర్పాటు చేసిన వేదిక. దీనికిముందు భారత్, యూఏఈ, ఇజ్రాయెల్ చర్చలు జరిపేవి. ఇందులో అమెరికా బలవంతంగా జోక్యం చేసుకుని I2U2ను ఏర్పాటు చేసింది" అని తల్మీజ్ అహ్మద్ అన్నారు.

"పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్ ఉనికిని పెంచాలని అమెరికా భావించింది. అందులో భాగంగానే I2U2, IMEC ప్రారంభమయ్యాయి."

"I2U2 అనేది ప్రధానంగా వ్యాపార సమాజం కోసం. దీనిలో ప్రభుత్వాల పాత్ర అంతంతమాత్రమే. ఇక IMEC విషయానికొస్తే, పాలస్తీనా దేశంగా ఏర్పడి, పశ్చిమ ఆసియాలో శాంతి తిరిగి నెలకొనేంత వరకూ ఇది ముందుకు సాగే అవకాశం లేదు. అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌ను అంగీకరించేంత వరకూ అది కష్టం" అని ఆయన అన్నారు.

ఇజ్రాయెల్ మాజీ ఎంపీ, మిడిల్ ఈస్ట్ వ్యవహారాల నిపుణురాలు జెనియా స్వెట్లోవా ఈ ఏడాది ఫిబ్రవరిలో, మోదీ - ట్రంప్ సమావేశానికి ముందు.. జెరూసలెం పోస్ట్‌లో 'వై ఇజ్రాయెల్ షుడ్ కేర్ అబౌట్ ది మోదీ - ట్రంప్ మీటింగ్ (మోదీ - ట్రంప్ సమావేశం ఇజ్రాయెల్‌కు ఎందుకు ముఖ్యం)' అనే హెడ్డింగ్‌తో ఓ వ్యాసం రాశారు.

"భారత్, అమెరికా మధ్య మంచి సంబంధాలు IMECకి చాలా ముఖ్యం" అని ఆ వ్యాసంలో ఆమె రాశారు.

"యెమెన్‌లోని హూతీలకు చైనా పరోక్షంగా మద్దతునిస్తోంది. ఇజ్రాయెల్ దీనిపై ఆందోళన చెందుతోంది. ఇరాన్ నుంచి చైనా భారీమొత్తంలో చమురు కొనుగోలు చేస్తోంది. అందువల్ల, భారత్ - అమెరికా కలిసి ఉండడం చాలా ముఖ్యం" అని స్వెట్లోవా రాశారు.

జెరూసలెం పోస్ట్ తన ఒక రిపోర్టులో, "భారత ప్రధాన నాలుగు రక్షణ భాగస్వాములలో ఇజ్రాయెల్ ఒకటి. భారత్‌కు టెక్నాలజీ అందించే విషయంలో ఇజ్రాయెల్ అమెరికా కంటే ముందుంది. ఇరుదేశాల మధ్య అపనమ్మకం అనేదే లేదు" అని పేర్కొంది.

"అందుకే IMEC కీలకం. ఇది భారత ఆర్థిక భవిష్యత్తుకు, ఇజ్రాయెల్‌కు ఆమోదం పెరగడానికి చాలా ముఖ్యమని నిరూపిస్తుంది. IMECకి అవాంతరాలు ఎదురైతే, అది ఇరాన్, చైనాలకు శుభవార్త అవుతుంది."

"చైనా బెల్ట్ అండ్ రోడ్‌కు ప్రతిగా మొదలైన IMEC వాస్తవ రూపం దాల్చడంలో విఫలమైతే చైనాకు సంతోషమే" అని పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)