పాశ్చాత్య ప్రపంచంలో జ్యోతిష్యంపై మొగ్గు పెరిగిందా, ప్రపంచ సంక్షోభాలకు జ్యోతిష్యంలో సమాధానం వెదుకుతున్నారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లెబో డిసెకో
- హోదా, బీబీసీ ప్రతినిధి
మన స్నేహితుల్లో ఎవరో ఒకరు వారి నక్షత్రం ఆధారంగా, కాబోయే బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్, భార్య, భర్తో ఒకరితో ఒకరు ఎలా ఉంటారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.
మామూలుగా ఇది సరదాగా ఉంటుంది కానీ, కొంతమంది జ్యోతిష్య శాస్త్రాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. వ్యక్తి పుట్టిన సమయంలోని గ్రహాలు, నక్షత్రాల స్థానం వాస్తవానికి వారి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, ఇతరులతో పరస్పర చర్యలను ప్రభావితం చేస్తాయని నమ్ముతారు.
చైనా, భారత్ వంటి దేశాలలో శతాబ్దాలుగా జ్యోతిష్య శాస్త్రం విస్తృతంగా ఉంది. భారతదేశంలోని కొంతమంది రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలిచే అవకాశాలను తెలుసుకోవడానికి జ్యోతిష్కులను కూడా సంప్రదిస్తారు.
అయితే జ్యోతిష్య శాస్త్రాన్ని మూఢనమ్మకమని, అశాస్త్రీయమని కొట్టిపారేసేవారూ ఉన్నారు.
పశ్చిమ దేశాలలో కొంతమంది ఇప్పుడు రాజకీయాలను, ప్రపంచ సంఘటనలను అర్థం చేసుకోవడానికి ఆస్ట్రాలజీ సహాయం తీసుకోవడం ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ఈ ధోరణి యూరప్, అమెరికాలో పరిమితమే కావచ్చు కానీ, దానిపై ప్రజలకు ఆసక్తి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.


ఫొటో సోర్స్, ANTHONY WALLACE/AFP via Getty Images
ఉత్తర అమెరికాలో..
టిక్‌టాక్‌లో లెక్కలేనన్ని జ్యోతిష్కుల వీడియోలు కనిపిస్తున్నాయి, వాటిలో చాలావరకు ఉత్తర అమెరికాకు సంబంధించినవి. ఈ వీడియోలలో జ్యోతిష్కులు భౌగోళిక రాజకీయాలపై అంచనాలు వేస్తున్నట్లు ఉంది. తరచుగా వారు చార్టుల ముందు కూర్చుంటున్నారు. అమెరికా, ఇరాన్, యూరప్ దేశాలు ఏర్పడిన సమయంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏ స్థానంలో ఉన్నాయో ఈ చార్టులు వివరిస్తాయని వారు చెబుతున్నారు.
అలాంటి ఒక వైరల్ వీడియోలో జ్యోతిష్కుడు మాట్లాడుతూ "డోనల్డ్ ట్రంప్‌కు ఇరాన్‌లో యురేనస్ తిరోగమన రేఖలో ఉంది. ఇది అస్థిర సంబంధాలను సూచిస్తుంది" అని చెప్పారు.
ఇరాన్‌పై అమెరికా దాడి చేసిన తర్వాతి రోజు ఈ వీడియో పోస్ట్ చేశారు. అదే రోజు, ఇరాన్ జూలై 1 లేదా 2 తేదీల్లో ప్రతీకారం తీర్చుకుంటుందని మరొక ఇన్‌ప్లుయెన్సర్ ఒక వీడియోలో ఆరోపించారు. ఇటువంటి అంచనాలు తరచుగా తప్పుగా తేలాయి. కానీ అలాంటి కంటెంట్‌కు కొరత లేదు.
గత ఐదు సంవత్సరాలుగా గూగుల్ ట్రెండ్స్‌లో "జ్యోతిష్య శాస్త్రం", "యుద్ధం" వంటి పదాలతో కూడిన శోధనలు పెరిగాయి. కోవిడ్, రష్యా-యుక్రెయిన్ యుద్ధం, భారత్-పాకిస్తాన్ వివాదం, ఇరాన్‌పై అమెరికా దాడి సమయంలో ఇటువంటి పోకడలు కనిపించాయి.

ఫొటో సోర్స్, Majority World/Kuldeep Singh Rohilla/Universal Images Group via Getty Images
తెహ్రాన్‌లో 2025 జూన్‌లో బాంబు దాడి జరిగినప్పుడు లండన్‌లో నివసిస్తున్న ఒక ఇరానియన్ మహిళ తాను ఒక జ్యోతిష్కుడిని సంప్రదించానని చెప్పారు. ఇరాన్‌లో నివసిస్తున్న ఆమె సోదరి కూడా అదే చేసినట్లు చెప్పారు. ఇద్దరూ భవిష్యత్తు గురించి భరోసా, స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు.
"ప్రధాన భౌగోళిక రాజకీయ సంక్లిష్టతలను అర్థం చేసుకోవడానికి జ్యోతిష్య శాస్త్రాన్ని ఉపయోగించడమనే ది అంత మంచి ఆలోచన కాదు" అని కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయంలో కల్చరల్ సోషియాలజీ, రిలీజియన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గాలెన్ వాట్స్ అన్నారు.
న్యూయార్క్‌కు చెందిన జ్యోతిష్కురాలు అలీజా కెల్లీ తన పనిపై పెరుగుతున్న ఆసక్తిని స్వాగతిస్తున్నారు. కానీ, సోషల్ మీడియాలో తాను చూసే కొంత సమాచారం నైతికత గురించి ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు.
"అణు దాడి లేదా మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం విషయానికి వస్తే, 90 సెకన్ల వీడియో చూపించడం నైతిక మార్గం కాదు" అని కెల్లీ అభిప్రాయపడ్డారు.
"ఇటువంటి వీడియో క్లిప్‌లు సంచలనాత్మకంగా ఉంటాయి కాబట్టి ఆకర్షిస్తాయి" అని ఆమె అన్నారు.
అయితే, ప్రజలు తమ దేశంలోని రాజకీయ సంఘటనలను అర్థం చేసుకోవడానికి నక్షత్రాల వైపు మొగ్గు చూపుతుండటం కెల్లీ గమనించారు.
ట్రంప్ 2016లో హిల్లరీ క్లింటన్‌ను ఓడించి అమెరికా అధ్యక్ష పదవిని గెలుచుకున్నప్పుడు ఆమెకు మొదటిసారిగా ఇలా అనిపించింది. ఆ సమయంలో ఆమె ఒక వాచ్ పార్టీలో ఉన్నారు, అక్కడ అతిథులందరూ టీవీకి అతుక్కుపోయారు.
"నేను జ్యోతిష్కురాలిని కాబట్టి, జనం నా దగ్గరకు వచ్చారు. ఇపుడేం జరుగుతుంది, హిల్లరీ చార్ట్ ఏం చెబుతుంది, ట్రంప్ చార్ట్ ఏం చెబుతుంది? అని అడగడం ప్రారంభించారు. భౌగోళిక రాజకీయ సంఘటనలను ఇంత స్పష్టంగా, నిర్దుష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రజలు జ్యోతిష్యశాస్త్రాన్ని ఆశ్రయించడం మొదటిసారి చూశాను" అని కెల్లీ అన్నారు.

ఫొటో సోర్స్, Cassie Leventhal
కోవిడ్ మార్చేసిందా?
కోవిడ్ కూడా ఒక మలుపు, అప్పుడు చాలామంది జ్యోతిష్య శాస్త్రం వైపు మొగ్గు చూపారు. ఈ సమయంలోనే కాస్సీ లెవెంతల్ అనే మహిళ జ్యోతిష్య శాస్త్రం సహాయం తీసుకోవడం ప్రారంభించారు. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నారు.
తన తల్లిదండ్రులు ఎప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవడానికి గ్రహ స్థానాలను మార్గదర్శకంగా ఉపయోగించానని కాస్సీ తెలిపారు.
అమెరికన్ రాజకీయాలను అర్థం చేసుకోవడానికి కూడా కాస్సీ జ్యోతిష్యాన్ని ఉపయోగించడం ప్రయత్నించారు. "భావోద్వేగాలు, వివరణలతో ముడిపడి ఉన్న డోనల్డ్ ట్రంప్ జాతకం ప్రకారం ధనురాశిలో చంద్రుడు ఉన్నాడు. ఇది అగ్ని రాశి. అందుకే ట్రంప్ భావోద్వేగాలు తక్షణ ప్రతిస్పందనలుగా కనిపిస్తుంటాయి.
ఆధ్యాత్మికత లేదా మతం?
"సాంకేతికంగా చెప్పాలంటే, జ్యోతిష్య శాస్త్రం ఆధ్యాత్మికమైనది, మతపరమైనది కూడా" అని డాక్టర్ గాలెన్ వాట్స్ అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా జ్యోతిష్య శాస్త్రం గురించి భిన్నమైన అభిప్రాయాలున్నాయి. భారతదేశంలో చాలామంది జ్యోతిష్య శాస్త్రాన్ని సీరియస్‌గా పరిగణిస్తారు. వివాహానికి ముందు జాతకాలను సరిపోల్చుతారు. జ్యోతిష్కుడి సలహా ఆధారంగా కుటుంబ సభ్యులు వివాహ సంబంధాన్ని ఏర్పరచుకోవాలా, వద్దా అని నిర్ణయించుకుంటారు.
అయితే, పాశ్చాత్య దేశాలలో మాత్రం జ్యోతిష్య శాస్త్రాన్ని స్వీయ అవగాహన కోసం ఉపయోగిస్తున్నారని డాక్టర్ వాట్స్ చెప్పారు.

ఫొటో సోర్స్, Photo by Morteza Nikoubazl/NurPhoto via Getty Images
'సంక్లిష్ట సమస్యలకు సులభమైన సమాధానాలు'
పశ్చిమ దేశాలలో జ్యోతిషశాస్త్రానికి పెరుగుతున్న ప్రజాదరణ గురించి వార్తలు ఉన్నప్పటికీ, ప్యూ సెంటర్ నుంచి వచ్చిన డేటా ప్రకారం, అమెరికాలో దీనిని ఉపయోగించే వారి సంఖ్య దాదాపు స్థిరంగా ఉంది. 2017, 2024లలో దాదాపు 27 శాతం మంది అమెరికన్లు జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతామని చెప్పారు.
గణాంకాలు భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నప్పటికీ, నమ్మకం పెరిగిందనే ఎందుకు అనుకుంటున్నారు?
మతం, ఆధ్యాత్మికతను గతంలో చర్చనీయాంశంగా పరిగణించలేదని, ముఖ్యంగా మీడియాలో ఈ ధోరణి లేదని డాక్టర్ వాట్స్ చెప్పారు. కానీ, 2016లో ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత, "భౌగోళిక రాజకీయ దృశ్యంలో భారీ మార్పు"వచ్చిందని తెలిపారు.
"గతంలో చర్చించడం అసాధ్యమని భావించిన విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. అందుకే ప్రజలు ఇప్పుడు జ్యోతిష్య శాస్త్ర గణనలను చూస్తారనే వాస్తవం గురించి మరింత బహిరంగంగా ఉన్నారు" అని అన్నారు.
అయితే, చాలామందికి జాతకాలు వినోదం, ఓదార్పు లేదా మార్గదర్శకత్వాన్ని అందించగలవని డాక్టర్ వాట్స్ అన్నారు.
ప్రపంచ సంఘటనలు చాలా క్లిష్టంగా ఉండటం వలన నిపుణులు కూడా వాటిని పూర్తిగా అర్థం చేసుకోలేరు. కానీ, సంక్షోభాలను అర్థం చేసుకోవడానికి జ్యోతిషశాస్త్రంపై ఆధారపడటం వల్ల ఇప్పటికే విభజితమైన సమాజం మరింతగా చీలిపోతుందని అభిప్రాయపడ్డారు.
అయినప్పటికీ, వారు దాని ఆకర్షణను తిరస్కరించరు.
"సులభమైన పరిష్కారాలు లేని క్లిష్టమైన సమస్యలు మన చుట్టూ ఉన్నాయి. జ్యోతిషశాస్త్రం సహజంగానే ప్రజలు సులభమైన సమాధానాలను కోరుకునేలా చేస్తుంది" అంటారు వాట్స్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














