గుజరాత్: వీళ్లు మృతదేహాలను నెలలపాటు తమతోనే ఉంచుకుంటారు

చడోతరూ ఆచారం

ఫొటో సోర్స్, BHARGAV PARIKH

ఫొటో క్యాప్షన్, మృతదేహంపై ఐస్ పెడుతున్న కుటుంబం
    • రచయిత, భార్గవ్ పారిఖ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఒక కుటుంబం ఉదయం లేవగానే రోజువారీ పనుల్లో పడకుండా.. తమ కూతురి మృతదేహం పాడవకుండా దాని చుట్టూ ఐస్ పెట్టడంతో మొదలెడుతుంది.

అక్కడికి కాస్త దూరంలో మరో తల్లి వేకువ జామునే ఇంటి బయటకు వచ్చి చెట్టుకు వేలాడదీసిన తన కొడుకు మృతదేహాన్ని పక్షులు తినకుండా కాపలా కాస్తుంటుంది.

ఈ ఘటనలు సాబర్కాంఠా దగ్గర ఉన్న రెండు గ్రామాల్లో జరిగాయి. న్యాయం కోసం ఒక కుటుంబం తమ కూతురి మృతదేహాన్ని పాడవకుండా ఐస్‌లో ఉంచితే...

అదే న్యాయం మరో తల్లి చెట్టుకు వేలాడిన కొడుకు మృతదేహం కుళ్లిపోతున్నా దానిని రాత్రి రాత్రింబవళ్లూ కాపాడుకుంటోంది.

ప్రస్తుతం ఈ రెండు గ్రామాల్లోని గిరిజన తెగలు 'చడోతరూ' అనే ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి.

సాబర్కాంఠాలోని పంచ్‌మహుదా గ్రామంలో ఉన్న ఛత్రంజీ గామర్ ఇంట్లో రోజంతా ఐస్ కరుగుతూ ఉంటుంది.

అర్థరాత్రి ఒక తల్లి ఉలిక్కిపడి లేస్తే, సోదరి హత్య కేసులో న్యాయం కోసం చీకటిపడగానే ఆమె సోదరుడు, సోదరి దేవతకు పూజలు ప్రారంభిస్తారు.

చడోతరూ ఆచారం

ఫొటో సోర్స్, BHARGAV PARIKH

నిశ్శబ్దంలో గ్రామం

బీబీసీ ఆ గ్రామానికి చేరుకునేసరికి అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. అది హైవే నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.

గ్రామం చుట్టూ పొలాల్లో ఆముదం పంట కనిపిస్తుంది. కానీ ఆ పొలాల్లో ఒక్క మనిషి కూడా కనిపించరు.

తెల్లవారుజామునే ఛత్రజీ కుటుంబ సభ్యులు ఇంటి వరండాలో చాపలు పరుచుకుని కూర్చునే ఏర్పాట్లు చేసుకుంటారు.

గ్రామస్తులు వాళ్లను కలవడానికి వస్తుంటారు. వాళ్లను ఓదారుస్తారు. కొందరు మోడాసా నుంచి ఐస్ బ్లాకులు కూడా తెస్తుంటారు.

రెండు గదులున్న ఇంట్లో కూతురు మృతదేహాన్ని వారు ఒక మూల చెక్కపెట్టెలో ఉంచారు. దానిపై ప్లాస్టిక్ కవర్ కప్పారు. అది పాడవకుండా ఎప్పటికప్పుడు దాని చుట్టూ ఐస్ పెడుతూనే ఉంటారు..

గత 25 రోజులుగా ఆ ఇంట్లో ఉదయం టీ పెట్టుకుని కూడా తాగలేదు.

కూతురిని హత్య చేసిన వారిని అరెస్ట్ చేసేవరకూ టీ కూడా తాగకూడదని ఆ ఇంట్లో వారు నిర్ణయించుకున్నారు.

చడోతరూ ఆచారం

ఫొటో సోర్స్, BHARGAV PARIKH

రాత్రిళ్లు దేవతకు పూజలు

మృతదేహం దగ్గరి వరకూ ఎవరూ వెళ్లలేరు. మరో గదిలో రాత్రిళ్లు దేవతను పూజిస్తారు. ఆ పూజ నాలుగు గంటలు జరుగుతుంది.

ఆ ఇంట్లో వంటలు చేయడం లేదు. ఇంటి బయట ఒక తాత్కాలిక వంటగది ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ వేరే మహిళలు కొందరు వచ్చి ఆ కుటుంబం కోసం వంట చేస్తుంటారు.

గత 35 రోజులుగా ఇక్కడ ఇదే జరుగుతోంది.

ఛత్రంజీ చుట్టూ బంధువులు ఉన్నారు. ఆయనకు చదువు రాదు. గతంలో ఆయన ఆర్మీలో పనిచేశారు. ఇప్పుడు పొలం పనులు చేస్తుంటారు.

బీబీసీతో మాట్లాడిన ఆయన "నాకు ఏడుగురు పిల్లలు. నేను నా కూతురిని చదివించాలనుకున్నా. ఆమెను ఆఫీసర్ చేయాలనుకున్నా. అందుకే ఆమెను కాలేజీలో చేర్చా. కాలేజీ ఫంక్షన్ కోసం వెళ్లిన తను తిరిగి రాలేదు. మూడు రోజుల తర్వాత పోలీసులు వచ్చి ఆమె మృతదేహం కనిపించిందిఅని చెప్పారు."

పోలీసులకు మృతదేహం పక్కనే ఖాళీ మద్యం బాటిళ్లు, సిగరెట్ పీకలు కూడా దొరికాయి.

"మేం నా కూతురు పింకీ మృతదేహాన్ని చూసినపుడు, ఆమె ఉరి వేసుకుని ఉంది. కానీ తన కాళ్లు మాత్రం నేలకు తగులుతున్నాయి. ఎవరో ఆమెను చంపి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారు" అన్నారు.

చడోతరూ ఆచారం

ఫొటో సోర్స్, BHARGAV PARIKH

ఎవరో మా సోదరిని హత్య చేశారు

ఛత్రంజీ కొడుకు రాజేష్ కూడా బీబీసీతో మాట్లాడాడు.

"ఎవరో నా సోదరిని హత్య చేశారు. పోలీసులు మాత్రం దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు కూడా సంతృప్తికరంగా లేదు. అందుకే మేం రెండోసారి పోస్టుమార్టం చేయాలని డిమాండ్ చేశాం. అహ్మదాబాద్‌లో అది చేస్తున్నప్పుడు మాకు రకరకాల నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. కానీ వారు మా గోడు పట్టించుకోలేదు" అన్నారు.

"న్యాయం కోసం నేను మా అమ్మ, మా చెల్లితో కలిసి దేవతకు ప్రతి రోజూ సాయంత్రం నాలుగు గంటలపాటు పూజ చేస్తాను. మా నాన్న కూడా దీన్ని వదల్లేదు. ఆయన గాంధీ మార్గంలో 'చడోతరూ' చేస్తున్నారు. కానీ మేం గ్రామస్థులందరితో కలిసి 'చడోతరూ' చేస్తే, దోషులను పట్టుకోడానికి, మా సోదరికి న్యాయం లభించడం సులభం అవుతుంది".

కానీ తడి విర్దీలో భాటియా గమర్ కేసులో జరిగినట్టు మేం మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీయం.. తను చనిపోయి 39 రోజులైంది. తన అంత్యక్రియలు కూడా చేయలేదు. గ్రామస్థులు కూడా వారిని కలవడం లేదు.

మాకు మా సమాజం మద్దతు ఉంది. మా నాన్న ఒప్పుకుంటే, నేను పంచాయతీ సమావేశం ఏర్పాటు చేయగలను. 'చడోతరూ' కొనసాగించి న్యాయం పొందగలం.

చడోతరూ ఆచారం

ఫొటో సోర్స్, BHARGAV PARIKH

శాంతియుతంగా 'చడోతరూ'

టీ తాగకుండా, ఇంట్లో వండకుండా ఇలా 25 రోజులుగా ఎదురుచూస్తూ ఉండాలని మాకు కూడా లేదు.

రాజేశ్ మాటల మధ్యలో ఛత్రాజీ కల్పించుకుని "సర్, మేం మా సమాజంతో కలిసి చడోతరూ చేస్తే, జనం ఆయుధాలు తీసుకొస్తారు, హింస జరుగుతుంది. అందుకే మేం న్యాయం కోరుతూ శాంతియుత పోరాటం చేస్తున్నాం" అన్నారు.

గ్రామస్థులు ఉదయాన్నే వాళ్లకు ఐస్ తీసుకొచ్చి ఇస్తారు. ఇంట్లో వాళ్లు దానిని ముక్కలు చేసి మృతదేహం చుట్టూ పెడతారు.

మృతదేహాన్ని ఐస్ లోనే ఉంచారు. దాని చుట్టూ అగరుబత్తులు గానీ, వేరే వస్తువులుగానీ పెట్టలేదు.

న్యాయం కోసం ఎప్పుడూ దేవత పూజలో మునిగే ఆ కుటుంబం గత 27 రోజులుగా కడుపునిండా కూడా తినలేదు. గ్రామస్థులు పట్టుబడితే అప్పుడప్పుడూ కాస్త తింటున్నారు.

చడోతరూ ఆచారం

ఫొటో సోర్స్, BHARGAV PARIKH

ఫొటో క్యాప్షన్, చెట్టుకు మంచంలో వేలాడదీసిన భాటియా మృతదేహం

చెట్టుకు వేలాడదీసిన మృతదేహం

మరోవైపు ఒళ్లు జలదరించేలా భటియా గమర్ మృతదేహాన్ని మంచంలో ఉంచి 39 రోజులుగా చెట్టుకు వేలాడదీశారు.

తర్వాత మేం పోషినా దగ్గర విర్దీ గ్రామం చేరుకున్నాం. అది రాజస్థాన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ మాకు భాటియా ఇల్లు చూపించడానికి ఎవరూ ముందుకు రాలేదు.

చాలాసేపు అందరినీ అడిగిన తర్వాత మేం తడి విర్ది చేరుకున్నాం. చివరకు భాటియా గమర్ అడ్రస్ తెలుసుకోగలిగాం. అతడిని గ్రామం నుంచి బహిష్కరించారు.

ఆ కొండ దారుల్లో కారే కాదు, మోటార్ సైకిల్ కూడా వెళ్లలేదు. చివరికి దాదాపు నాలుగున్నర కిలోమీటర్లు నడిచిన తర్వాత మేం భాటియా గమర్ ఇల్లు చేరాం.

గాలి వీయగానే.. దాదాపు కిలోమీటర్ దూరం నుంచే మాకు మృతదేహం దుర్గంధం వచ్చింది.

చడోతరూ ఆచారం

ఫొటో సోర్స్, BHARGAV PARIKH

ప్రాణం తీసిన ప్రేమ

చాలా కొండలు దాటాక చివరకు మేం అక్కడకు చేరుకోగలిగాం. హఠాత్తుగా మాకు చుట్టూ ఏదో శబ్దం వినిపించింది. మమ్మల్ని ఐదుగురు మహిళలు చుట్టుముట్టారు.

చాలా కష్టంగా వాళ్లకు మేం ఎవరిమో అర్థమయ్యేలా చెప్పాం. భాటియా తల్లి హీరా గమర్‌తో మాట్లాడాం.

ఇంటి బయట మృతదేహాన్ని ఒక మంచంలో చెట్టుకు వేలాడదీశారు. దానికి కాస్త దూరంలో భాటియా తల్లి కూచుని ఉన్నారు.

"నా కొడుకు భాటియా మాకు దగ్గర్లోనే ఉన్న గ్రామంలో మష్రూ భాయ్ గమర్ కూతురిని ప్రేమించాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. గత ఏడాది 'చిత్ర విచిత్ర జాతర'లో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ తనకు ఉద్యోగం లేకపోవడంతో భాటియా దానికి ఒప్పుకోలేదు" అని ఆమె చెప్పారు..

"వాళ్ల ప్రేమ గురించి మా సమాజంలో, మా కులంలో అందరికీ తెలిసిపోయింది. కానీ నా కొడుకు, మష్రూ కూతురు ప్రేమ చాలా గట్టిపడింది. మష్రూ, ఆయన కొడుకులు నా కొడుకును చంపేస్తామని బెదిరించారు. డిసెంబర్ 22న గ్రామ శివార్లలో ఒక చెట్టుకు నా కొడుకు మృతదేహం వేలాడుతూ కనిపించింది" అన్నారు.

చడోతరూ ఆచారం

ఫొటో సోర్స్, BHARGAV PARIKH

దూరంగా ఉంచిన సమాజం

బాధను దిగమింగుతూ హీరా గమర్ తను చెప్పేది కొనసాగించారు. "మేం పోలీసులకు ఫిర్యాదు చేశాం. కానీ వాళ్లు మాత్రం ఆత్మహత్య కేసు నమోదు చేశారు. దానికి వ్యతిరేకంగా నేను 'చడోతరూ' చేస్తున్నా. కానీ గ్రామస్థులు మా కులం వారు కాదు. మృతదేహం 39 రోజులుగా చెట్టుకు ఉన్నా ఎవరూ మాకు ఎలాంటి సాయం చేయడం లేదు".

సాధారణంగా చడోతరూ చేస్తే గ్రామస్థులు, దగ్గర గ్రామాల ప్రజలు కూడా కలుస్తారు. మా తెగ వాళ్లు కూడా నాతో దీన్లో కలిస్తే నాకు న్యాయం లభిస్తుందని ఇంకా ఎదురుచూస్తున్నా. రోజూ ఇక్కడే కూచుంటున్నా. జంతువులు తినేయకుండా మృతదేహాన్ని చెట్టుకే కట్టేశాం. పక్షులు దాన్ని తినేయకుండా నేను ఇక్కడే కూచుంటున్నా" అన్నారు హీరా.

నా భర్త కూడా అప్పుడప్పుడూ చెట్టుపైకి ఎక్కి మృతదేహంపై ఉన్న గుడ్డను సర్దుతుంటాడు. అలా మేం దాన్ని చూసుకుంటున్నాం. పోలీసులు, చట్టంపై నమ్మకం లేకే 'చడోతరూ' చేస్తున్నాం. గత 39 రోజులుగా పొలాల్లో దొరికినవే తింటున్నాం.. మాకు న్యాయం లభించేవరకూ మృతదేహాన్ని కిందకు దించం".

చడోతరూ ఆచారం

ఫొటో సోర్స్, BHARGAV PARIKH

న్యాయం కోరే 'చడోతరూ'

సాబర్కాంఠాలో 'చడోతరూ' అంటే న్యాయం కోసం పాటించే ఒక ఆచారం. గిరిజనుల్లో ఈ సంప్రదాయం శతాబ్దాల నుంచి ఉంది.

పోలీసులు, చట్టం కంటే ఇక్కడి గిరిజనులకు గ్రామ పంచాయతీపైనే ఎక్కువ నమ్మకం ఉంటుంది.

గతంలో చాలా మంది చనిపోయినపుడు 'చడోతరూ' పాటించారు. అలా జరిగితే రెండు గ్రామాల నేతలు కలిసి పంచాయతీ తీర్పు ప్రకారం వారికి న్యాయం జరిగేలా చూస్తారు. పంచాయతీ ఆదేశాల ప్రకారం బాధితులకు పరిహారం అందుతుంది.

గతంలో చడోతరూ చేసినపుడు ఒక మృతదేహాన్ని 72 రోజులు ఒక చెట్టుకు వేలాడదీసే ఉంచారు. సాబర్కాంఠా నుంచి ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రి అమర్ సింగ్ చౌదరి 'చడోతరు' ఆచారంలో 72 రోజులు వేలాడదీసిన మృతదేహాన్ని కిందకు దించడానికి రాజీ కుదర్చగలిగారు. ఆ తర్వాత వాళ్లు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

సాబర్కాంఠాలో చడోతరు ఆచారం గురించి సామాజిక కార్యకర్త మన్హర్ జమీల్ "ఈ ఆచారం సదుద్దేశంతో మొదలైంది. ఒక మహిళ చనిపోతే, అత్తింటివారు ఆ మహిళ కుటుంబాన్ని ఆహ్వానించేవారు. ఆ మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులు పరిశీలించి, తమ కూతురిని ఏదైనా చేశారనే అనుమానం వస్తే న్యాయం జరిగేవరకూ అంత్యక్రియలు చేయకుండా ఆపేసేవారు. ఆ మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి, దానిపై ఒక చీర కప్పి ఉంచేవారు. తర్వాత పంచాయతీ సమావేశం ఏర్పాటు చేసి తమ తీర్పు ప్రకారం వారికి జరిమానా విధించేవారు.

ఇక, హత్యలు జరిగితే పోలీసులు, చట్టం నుంచి తమకు న్యాయం జరగదని గిరిజనులు భావించిపుడు మృతదేహాన్ని అనుమానితుల ఇళ్లలో వదిలేసేవారు. పంచాయతీ తీర్పు తర్వాత నిందితులు జరిమానా చెల్లించాల్సి వచ్చేది.

చడోతరూ ఆచారం

ఫొటో సోర్స్, BHARGAV PARIKH

న్యాయం లభించినా, అంగీకరించకపోతే..

ఒకవేళ న్యాయం లభించినా దానికి వారు ఒప్పుకోకపోతే పరస్పరం కత్తులుదూసేవారు. ఆ గొడవల్లో చాలా మంది గాయపడేవారు.

ఫాల్గుణ మాసంలో అమావాస్య రోజు 'చిత్ర విచిత్ర' అనే జాతర జరుగుతుంది. ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుంటే, అబ్బాయి తను బాగా సంపాదించగలనని, అమ్మాయిని చూసుకోగలనని అత్తమామలకు నిరూపిస్తే వారి సంప్రదాయం ఆ జాతరలో పెళ్లి చేస్తారు. కానీ అబ్బాయి తన మాట నిలబెట్టుకోలేకపోతే అది శత్రుత్వానికి కారణమవుతుంది.

ఇక సాబర్కాంఠాలో జరుగుతున్న ఈ 'చడోతరూ' ఘటనలపై ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే స్పందిస్తూ... "చడోతరూ చేస్తున్నప్పుడు గిరిజనులు మృతదేహాన్ని చెట్టుకు తగిలించే ఆచారం ఉంది. అలా వారు తమకు న్యాయం లభించినప్పుడే అంత్యక్రియలు చేస్తారు" అని చెప్పారు.

గతంలో నేను ఎన్నో 'చడోతరూ' కేసుల్లో రాజీ కుదిర్చాను. ఈ రెండు కేసులను కూడా పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీసుల సాయంతో మేం రెండు కుటుంబాలను ఒక దగ్గరికి పిలిపించి.. ఆ రెండు కేసుల్లో 'చడోతరూ' ముగించేలా చేస్తాం. అంత్యక్రియలు జరిగేలా చూస్తాం’’ అన్నారు.

చడోతరూ ఆచారం

ఫొటో సోర్స్, BHARGAV PARIKH

పోలీసులు ఏమంటున్నారు?

దీనిపై సాబర్కాంఠా ఎస్పీ చైతన్య మండాలిక్ బీబీసీతో మాట్లాడుతూ.. "ఈ రెండు కేసుల్లో మరణాలు ప్రమాదవశాత్తూ జరిగాయి. మేం వారి కుటుంబాల కోరిక మేరకు పోస్టుమార్టం నిర్వహించాం. కానీ అనుమానాలు ఉంటే, వాటి గురించి కూడా చూస్తున్నాం. దీన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని చూస్తున్నాం" అన్నారు.

ఇటు గిరిజనాభివృద్ధి మంత్రి గణపత్ వాసవా మాట్లాడుతూ.. "చడోతరూ ఆచారం లేకుండా చేస్తున్నాం. మేం గతంలో దానికోసం చేపట్టిన కొన్ని అవగాహనా కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ రెండు కేసులను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించాం. భవిష్యత్తులో 'చడోతరూ' ఆచారం అనేదే లేకుండా గిరిజనుల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)