Fact Check: కుంభమేళాలో పుణ్యస్నానం చేసిన మొదటి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అనే ప్రచారంలో నిజమెంత?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్యాక్ట్ చెక్ టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
మితవాద వైఖరి ప్రదర్శించే సోషల్ మీడియా గ్రూపుల్లో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కుంభమేళాలో గంగా స్నానం చేసిన ఫొటోలు షేర్ చేస్తున్నారు.
ఇలా కుంభ్ స్నానం చేసిన మొట్ట మొదటి యూపీ ముఖ్యమంత్రి ఆయనే అని చెబుతున్నారు.
వీరిలో చాలా మంది సీఎం యోగీ ఆదిత్యనాథ్ హిందువుల ప్రతిష్ఠను పెంచారని రాశారు. ఇప్పటివరకూ ఆ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రీ అలా చేయలేదని అంటున్నారు.
చాలా ఫేస్‌బుక్ గ్రూప్స్‌లో ఉత్తర ప్రదేశ్ సీఎం ఫొటోలను అదే మాట చెబుతూ షేర్ చేస్తూ వస్తున్నారు. మంగళవారం

ఫొటో సోర్స్, Getty Images
యోగీ ఆదిత్యనాథ్ కుంభమేళాలో యూపీ మంత్రి మండలి సభ్యులతో కలిసి పవిత్రంగా భావించే సంగమ తీరంలో స్నానం చేశారు.
స్నానం చేసిన తర్వాత కొంతమంది సాధువులతో కలిసి ఆయన గంగా ఆరతి కూడా ఇచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
యోగీ ఆదిత్యనాథ్ అధికారిక ట్వీట్ ప్రకారం మంగళవారం ఆయన సంగమ తీరంలోని కోటలో ఉన్న 'అక్షయవట్' కూడా సందర్శించారు.
కానీ సీఎం యోగీ మద్దతుదారులు మాత్రం ఆయన అలా చేసిన మొదటి ముఖ్యమంత్రి అని చెబుతున్నారు. అది నిజం కాదు.

ఫొటో సోర్స్, SAMAJWADIPART.COM
2007 కుంభమేళాలో
ఆదిత్యనాథ్ కంటే ముందు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ కూడా అలహాబాద్ అర్థ కుంభమేళాలో స్నానం చేశారని మా పరిశోధనలో తెలిసింది.
ములాయం సింగ్ యాదవ్ మూడోసారి సీఎం అయినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో 2007లో అలహాబాద్ అర్థ కుంభమేళాలో స్నానం చేశారు. ఆరోజు తేదీ జనవరి 20, శనివారం.
కొన్ని పాత మీడియా కథనాల ప్రకారం అప్పటి ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కుంభమేళాలో స్నానం చేయడానికి ప్రత్యేక విమానంలో అలహాబాద్ చేరుకున్నారు.
అర్థకుంభ మేళా ఏర్పాట్లను తనిఖీ చేసేందుకు ముఖ్యమంత్రి ఈ పర్యటన చేశారు.
ఆ పర్యటనలో ములాయం సింగ్ యాదవ్ మొత్తం 13 అఖాడాలను సమన్వయ పరిచే అఖిల భారతీయ అఖాడా పరిషత్ అప్పటి అధ్యక్షుడు మహంత్ జ్ఞానదాస్‌ను కూడా కలిశారు.
ఆ తర్వాత గంగా, యమున, కల్పిత సరస్వతి నదుల సంగమం దగ్గరున్న వీఐపీ ఘాట్‌లో ములాయం సింగ్ యాదవ్ స్నానం కూడా చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇది కొత్త ట్రెండ్ కాదు
ప్రయాగరాజ్(అలహాబాద్)లో సంబంధం ఉన్న కొంతమంది సీనియర్ జర్నలిస్టులు 2001లో ఉత్తర ప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా అలహాబాద్ కుంభమేళాలో స్నానం చేశారని చెప్పారు.
అయితే అప్పట్లో ఇంటర్‌నెట్, సోషల్ మీడియా ఈ స్థాయిలో లేవు. అందుకే ఆ సమయంలో ఆన్‌లైన్ రిపోర్ట్స్ ఇంటర్నెట్‌లో లభించలేదు.
సీనియర్ జర్నలిస్ట్ రామదత్త్ త్రిపాఠీ "అలహాబాద్‌లో కుంభమేళా జరిగే సమయంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వారు స్నానం చేయడం కొత్త ట్రెండ్ కాదని" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"పాత ఆర్కైవ్ వీడియోలు ఉన్నాయి. వాటిలో సంయుక్త రాష్ట్రానికి(ఉత్తర ప్రదేశ్ విడిపోక ముందు) తొలి ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ కూడా మహాకుంభమేళాలో పాల్గొని, స్నానం చేయడం మనం చూడచ్చు. కానీ ఇప్పుడు దానికి రాజకీయ ప్రచారం ఎక్కువైంది" అన్నారు.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కంటే ముందు జనవరి 27న ఆదివారం యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా కుంభ్‌లో స్నానం చేశారు.
కేంద్ర మంత్ర స్మృతి ఇరానీ కుంభమేళాలో స్నానం చేసిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి.
న్యూస్ ఏజెన్సీ ఐఎఎన్ఎస్ ప్రకారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఫిబ్రవరి 4న కుంభమేళా స్నానం చేయడానికి వెళ్లనున్నారు.
ఇవి కూడా చదవండి:
- Fact Check: కనీస ఆదాయ పథకం ప్రపంచంలో మరెక్కడా లేదా?
- ప్రధాని మోదీకి వచ్చిన గిఫ్టులు మీకు కావాలా?
- ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం సాధ్యమేనా.. కేసీఆర్ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుంది?
- మోదీ కోటి ఉద్యోగాల హామీ నిజమా? అబద్ధమా? BBC REALITYCHECK
- మోదీ ప్రభుత్వంలో రాజీనామాలు ఎందుకు జరగవు?
- ప్రధాని మోదీ కుంభమేళాలో స్నానం చేయడం నిజమేనా?
- సింగపూర్‌కి ఇంత తక్కువ సమయంలో అంత సంపద ఎలా వచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








