ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాగరాజ్ కుంభమేళాలో స్నానం చేయడం నిజమేనా?: FactCheck

ఫొటో సోర్స్, SM VIRAL IMAGE GRAB
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
‘‘ప్రధాని మోదీ కుంభమేళా సందర్భంగా నదీసంగమంలో పవిత్ర స్నానం చేశారు’’ అంటూ సోషల్ మీడియాలో నాలుగైదు ఫొటోలు షేరవుతున్నాయి.
మితవాద వైఖరి ఉన్న చాలా ఫేస్‌బుక్ గ్రూప్స్‌లో పోస్ట్ చేసిన ఈ ఫొటోలు కొన్ని వేల సార్లు షేర్ అయ్యాయి. ఈ ఫొటోలను ట్విటర్‌లో కూడా పోస్ట్ చేశారు.
ప్రధాని మోదీని 'హిందూ సింహం'గా వర్ణిస్తూ పోస్టులు చేసిన చాలా మంది ఈ ఫొటోల ఆధారంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రశ్నలు కురిపించారు.
'తాను జంథ్యం ధరించే హిందువునని చెప్పుకొనే రాహుల్ గాంధీ కుంభమేళాలో మునుగుతారా?' అని కామెంట్ పెడుతున్నారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ (అలహాబాద్)లో 12 ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళా ప్రారంభమైంది. దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమంగా చెబుతున్నారు.
49 రోజుల వరకూ జరిగే కుంభమేళా (అర్ధ కుంభమేళా) మొదటి షాహీ స్నాన్ జనవరి 15 (మకర సంక్రాంతి) రోజున ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో ఆరు ముఖ్య పర్వదినాల్లో షాహీ స్నానాలు జరుగుతాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 16న కుంభమేళా ప్రారంభం కావడానికి ముందే ఆ ఏర్పాట్లు పరిశీలించేందుకు ప్రయాగరాజ్(యూపీ) వెళ్లారు.
కానీ ఆయన కుంభమేళాలో స్నానం చేశారని ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం లేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
2016లో ఇవే ఫొటోలు వైరల్
సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న పీఎం మోదీ ఫొటోలను 2016లో మధ్యప్రదేశ్ ఉజ్జయిని కుంభమేళా సమయంలో కూడా షేర్ చేశారు.
2016లో ఏప్రిల్ 22 నుంచి మే 21 వరకూ సింహస్థ కుంభమేళా జరిగింది. చివరి షాహీ స్నానానికి ముందు ప్రధాని మోదీ ఈ కుంభమేళాలో పాల్గొన్నారు.
పాత కథనాల ప్రకారం బీజేపీ దివంగత ఎంపీ అనిల్ మాధవ్ దవే 2016 ఉజ్జయిని కుంభమేళా నిర్వహణ కమిటీ బాధ్యతలు చెపట్టారు.
ప్రధాని మోదీ ఉజ్జయిని కుంభమేళాకు వస్తారు, కానీ షిప్రా నదిలో స్నానం చేయడానికి వెళ్లరు అని దవే ఆ సమయంలో చెప్పారు. అంటే ఈ ఫొటోలు 2016లో తీసినవి కూడా కావు.

ఫొటో సోర్స్, SM Viral Image Grab
కుంభమేళాలో స్నానం చేసిన సీఎం మోదీ
వైరల్ అవుతున్న నరేంద్ర మోదీ ఫొటోలు 2004లో తీసినవిగా మా పరిశీలనలో తేలింది.
నరేంద్ర మోదీ ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉజ్జయినిలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్లారు.
కొన్ని కథనాల ప్రకారం 2004లో ఉజ్జయినిలో జరిగిన సింహస్థ కుంభమేళా సమయంలో జరిగిన ఆర్ఎస్ఎస్ 'ఆదర్శ మహాకుంభ'లో ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. షిప్రా నదిలో స్నానం కూడా చేశారు.
ఈ రిపోర్ట్స్ ప్రకారం 2004 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రచారం చేసిన తర్వాత నరేంద్ర మోదీ ఉజ్జయినిలో పర్యటించారు.
ఇవి కూడా చదవండి:
- Fact Check: రాహుల్ గాంధీని 14 ఏళ్ల అమ్మాయి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టిందా?
- బ్రిటన్ రాణి కంటే సోనియా సంపన్నురాలా...
- సంక్రాంతి ముగ్గుల చరిత్ర: మొదటి ముగ్గు ఎవరు వేశారు? రంగవల్లి ఎలా పుట్టింది?
- రియాలిటీ చెక్: నికితా వీరయ్య నిర్మలా సీతారామన్ కూతురేనా...
- చంద్రుని మీద మొలకెత్తిన చైనా పత్తి విత్తనం
- అమ్మాయిల కన్యత్వానికి, సీసా సీల్‌కు ఏమిటి సంబంధం
- బీబీసీ రియాలిటీ చెక్: అది భార్యాబిడ్డల అమ్మకం కాదు.. ‘ కులాచారం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









