కన్హయ్య కుమార్ ఇస్లాం మతం 'స్వీకరించారా'- Fact Check

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ బృందం
- హోదా, బీబీసీ న్యూస్
దిల్లీలోని జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ ఇస్లాం మతాన్ని స్వీకరించారని చెబుతున్న ఓ చిన్న వీడియో క్లిప్ కొన్ని మితవాద గ్రూపుల సోషల్ మీడియా పేజీలలో చక్కర్లు కొడుతోంది.
ఆ వీడియోకు క్యాప్షన్లు ఇలా పెడుతున్నారు:
"కన్హయ్య గుట్టు బయటపడింది. అతడొక ముస్లిం. హిందూ పేరు పెట్టుకుని ప్రజలను పిచ్చివాళ్లను చేస్తున్నాడు. ఓ సమావేశంలో అతడు తన మతానికి సంబంధించిన వాస్తవాన్ని బయటపెట్టాడు. అతడు ముస్లిం అన్నది వాస్తవం. ఈ వీడియోను షేర్ చేయండి, అతని బండారాన్ని అందరికీ తెలియజేయండి."
ఇలాంటి సందేశాలతోనే దాదాపు 10కి పైగా మితవాద ఫేస్‌బుక్ పేజీలలో షేర్ చేశారు. ఈ వీడియో అనేక వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Social media
మరి, అందులో నిజమెంత? కన్హయ్య కుమార్ ఆ వీడియోలో మాట్లాడిందేమిటి?
"మన చరిత్ర ఈ భూమితో ముడిపడి ఉంది. మనమంతా (ముస్లింలు) ఏ అరబ్ ప్రపంచం నుంచో రాలేదు. మనం ఇక్కడే పెరిగాం, ఇక్కడే చదువుకున్నాం. శాంతి, సమానత్వం గురించి ఈ మతం (ఇస్లాం) మాట్లాడుతుంది కాబట్టి ప్రజలు దీన్ని ఎంచుకున్నారు. ఈ మతంలో ప్రజల మధ్య ఎలాంటి వివక్షా ఉండదు. అందుకే, మనం దీన్ని స్వీకరించాం. ఇతర మతాల్లో కుల వ్యవస్థ ఉంది, కొందరు అంటరానితనాన్ని పాటించారు. మనల్ని మనమే రక్షించుకుంటాం, సమాజాన్ని, దేశాన్ని కాపాడుకుంటాం. అల్లా.. ఎంతో శక్తిమంతుడు, మనల్ని రక్షిస్తాడు" అని ఆ వీడియోలో ఉంది.
ఈ వీడియో చూసిన ఎవరికైనా కన్హయ్య తాను ఇస్లాం మతాన్ని ఎందుకు స్వీకరించానో వివరిస్తున్నట్లుగా అర్థమవుతుంది.
కానీ, కన్హయ్య ఏం మాట్లాడారన్న పూర్తి సారాంశాన్ని ఆ వీడియో క్లిప్ చెప్పడంలేదని మా పరిశీలనలో వెల్లడైంది. అది "డైలాగ్ విత్ కన్హయ్య కుమార్" పేరుతో జరిగిన ఓ సమావేశానికి సంబంధించిన వీడియో నుంచి కత్తిరించిన క్లిప్ అని తేలింది.
2018 ఆగస్టు 25న "భారత్‌లో మైనారిటీల సంక్షేమం" అనే అంశం మీద జరిగిన సమావేశానికి చెందిన వీడియో అది.

ఫొటో సోర్స్, Reuters
తెలివిగా కత్తిరించారు
ఆ సమావేశంలో మతరపరమైన రాజకీయాల గురించి, భారత్ అందరికీ చెందుతుంది అనడానికి గల కారణాల గురించి కన్హయ్య మాట్లాడారు. ఈ సందర్భంగా భారత తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ చెప్పిన మాటలను ప్రస్తావించారు.
అబుల్ కలాం ఆజాద్ ఏం చెప్పారో ఉటంకిస్తూ కన్హయ్య కుమార్ వివరించారు. అయితే, ఆ మాటలన్నీ కన్హయ్యే అంటున్నట్లు అనిపించే విధంగా చాలా తెలివిగా ఆ వీడియోను కత్తిరించారు.
హిందూ ముస్లిం ఐక్యతను అబుల్ కలాం ఆజాద్ ఎప్పుడూ కోరుకునేవారు. ఆయన దేశ విభజనను కూడా వ్యతిరేకించారు. ఎన్నో శతాబ్దాలుగా హిందువులు, ముస్లింలు కలిసి జీవించారని, ఎప్పటికీ ఆ ఐక్యత అలాగే ఉండాలని ఆయన భావించేవారు.
1946లో ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ముస్లింల కోసం దేశాన్ని విభజించాలన్న మహమ్మద్ అలీ జిన్నా ప్రతిపాదనను తిరస్కరించారు.
కన్హయ్య కుమార్ వీడియోను గతేడాది కూడా చాలా సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేశారు. తాజాగా మరోసారి దాన్ని వైరల్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
బీజేపీ ప్రభుత్వం మీద కన్హయ్య కుమార్ ఎక్కువగా విమర్శలు చేస్తుంటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా పలు సందర్భాల్లో విమర్శించారు.
బీజేపీ ప్రభుత్వం హిందుత్వ వాదానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ, మైనారిటీలను విస్మరిస్తోందంటూ కన్హయ్య ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలను ప్రధాని మోదీ ఖండిస్తూ వస్తున్నారు.
2016 ఫిబ్రవరిలో జేఎన్‌యూలో జరిగిన ఓ నిరసన ప్రదర్శనలో 'భారత వ్యతిరేక' నినాదాలు చేశారని కన్హయ్య మీద ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల అతని మీద దిల్లీ పోలీసులు దేశ ద్రోహం కింద కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 6న ఆ కేసు కోర్టులో విచారణకు రానుంది.
తప్పుడు ఆరోపణలతో పోలీసులు తనమీద కేసు పెట్టారని కన్హయ్య అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- Fact Check: ఈ అద్భుత చిత్రం కుంభమేళా ప్రాంతానిదేనా?
- FactCheck: రాహుల్ గాంధీని గల్ఫ్ మీడియా ‘పప్పూ’ అని పిలిచిందా?
- Fact Check: ఈ వైరల్ ఫొటోలు నిజానికి భారత సైనికులవి కాదు
- ఈవీఎం హ్యాకింగ్: 2014 లోక్సభ ఎన్నికలు రిగ్గయ్యాయంటూ ‘అమెరికా సైబర్ నిపుణుడి’ ఆరోపణ.. ఖండించిన ఈసీ
- ‘శశికళకు బెంగళూరు జైల్లో అదనపు సౌకర్యాల కల్పన నిజమే’
- పక్షులను కాపాడే అమ్మాయి ప్రాణం మాంజాకు బలి
- పంటల బీమా: రైతుల కోసమా - కంపెనీల కోసమా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








