'బ్రాహ్మణులే రష్యా చమురుతో లాభాలు గడిస్తున్నారు'- ట్రంప్ సలహాదారు వ్యాఖ్యలు

ఫొటో సోర్స్, EPA/Shutterstock
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
'బ్రాహ్మణులు' భారతీయులను పణంగా పెట్టి రష్యా చమురుతో లాభాలు గడిస్తున్నారని, దీనిని ఆపాలని ఆయన అన్నారు.
ట్రంప్ ప్రభుత్వంలో సీనియర్ వాణిజ్య సలహాదారుగా ఉన్న నవారో ఆదివారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో "ప్రధాని మోదీ గొప్ప నాయకుడు. ప్రపంచంలోనే అతిపెద్ద అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ నేతలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ఎలా సహకరిస్తున్నారో అర్థం కావడం లేదు" అని అన్నారు.
"కాబట్టి, నేను చెప్పేదేంటంటే.. భారతీయులారా, దయచేసి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. బ్రాహ్మణులు భారతీయులను పణంగా పెట్టి లాభాలు ఆర్జిస్తున్నారు. మనం దానిని ఆపాలి."
డోనల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు, సుంకాల కారణంగా అమెరికా, భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పటి నుంచి, నవారో భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
ట్రంప్ మొదట ఇండియాపై 25 శాతం రెసిప్రోకల్ టారిఫ్స్ విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటంతో మరో 25 శాతం సుంకాలు విధించారు.
అమెరికా తీసుకున్న ఈ నిర్ణయాలను 'అన్యాయం, అహేతుకం' అంటున్న భారత్.. 'చమురు ఎక్కడ చౌకగా లభిస్తే అక్కడ కొనుగోలు చేస్తాం' అని చెబుతోంది.


ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock
చైనా గురించి అడిగినప్పుడు నవారో స్పందనేంటి?
చైనా కూడా రష్యన్ చమురును కొనుగోలు చేస్తుంది, అలాంటప్పుడు కేవలం ఇండియాపైనే అదనపు సుంకాల విధింపుతో పుతిన్‌ను 'నియంత్రించగలరా?' అని నవారోను ప్రశ్నించగా.. "సరే, ఒకటైతే స్పష్టం. ప్రస్తుతం భారత్‌పై 50 శాతం సుంకాలు ఉన్నాయి. చైనాపై 50 శాతానికి కొద్దిగా ఎక్కువగానే సుంకాలు ఉన్నాయి. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, మాకు హాని కలిగించని విధంగా సుంకాలను ఇంకా ఎంత పెంచాలి?" అని అన్నారు.
2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై పుతిన్ దాడికి ముందు, భారత్ రష్యన్ చమురును కొనుగోలు చేయలేదని నవారో అన్నారు.
"తర్వాత ఏమైంది? రష్యన్ శుద్ధి కర్మాగారాలు భారత చమురు కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాయి. ముడి చమురుపై మోదీకి పుతిన్ డిస్కౌంట్ ఇస్తారు. వారు దానిని శుద్ధి చేసి యూరప్, ఆఫ్రికా, ఏషియాకు భారీ ప్రీమియంతో రవాణా చేస్తారు. బాగా ఆర్జిస్తారు" అని ఆయన అన్నారు.
"మరి, ఇందులో తప్పేంటి? నిజానికి, ఇది 'రష్యన్ యుద్ధ తంత్రాన్ని' బలపరుస్తోంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును సమర్థిస్తూనే, తన జాతీయ ప్రయోజనాల కోసమని భారత్ చెబుతోంది."

ఫొటో సోర్స్, Reuters
'ఇది మోదీ యుద్ధం'
"యుక్రెయిన్‌పై దాడి తర్వాత, పశ్చిమ దేశాలు రష్యన్ ముడి చమురుపై ఆంక్షలు విధించాయి. అప్పటి నుంచి, భారత్‌కు రష్యా అగ్రశ్రేణి ఇంధన సరఫరాదారుగా మారింది" అని నవారో అన్నారు.
"ఇది యుక్రెయిన్ ప్రజలను బాధిస్తోంది. పన్ను చెల్లింపుదారులుగా మనం చేయాల్సింది ఏంటంటే, యుక్రెయిన్ తనను తాను రక్షించుకోవడానికి వారికి ఎక్కువ డబ్బు పంపాలి. 50 శాతం సుంకాలలో 25 శాతం ఎందుకంటే, భారత్ సుంకాల 'మహారాజు' కాబట్టి" అని నవారో అన్నారు.
"వారు (భారత్) ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తారు. వారు మనకు చాలా వస్తువులను ఎగుమతి చేస్తారు. కానీ, ఆ దేశానికి మనల్ని అమ్మనివ్వరు. ఇక్కడ ఎవరు నష్టపోతారు? అమెరికన్ వర్కర్లు, అమెరికన్ పన్ను చెల్లింపుదారులు, రష్యన్ డ్రోన్ దాడులలో మరణించే యుక్రెయిన్ ప్రజలు" అని అన్నారాయన.
యుక్రెయిన్ యుద్ధంపై గతంలో భారత్, ప్రధాని మోదీలను విమర్శించారు పీటర్ నవారో. యుక్రెయిన్ సంఘర్షణను 'మోదీ యుద్ధం'గా అభివర్ణించారు. గతవారం, అమెరికా కొత్త సుంకాలు అమల్లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే నవారో భారత్‌పై విమర్శలు గుప్పించారు.
బ్లూమ్‌బెర్గ్ టీవీలో జరిగిన చర్చలో రష్యా-యుక్రెయిన్ యుద్ధం నిజానికి 'మోదీ యుద్ధం' అని నవారో అభివర్ణించారు.
"భారత చర్యలతో అమెరికాలోని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. వినియోగదారులు, వ్యాపారులు నష్టపోతున్నారు. భారత అధిక సుంకాలు మన ఉద్యోగాలను తగ్గిస్తున్నాయి, ఫ్యాక్టరీలు కష్టాల్లో పడుతున్నాయి. ఆదాయం, మెరుగైన జీతం ఇచ్చే అవకాశాలనూ తగ్గిస్తున్నందున కార్మికులు కూడా బాధపడుతున్నారు. ఆపై 'మోదీ యుద్ధం' కోసం మనం చెల్లించాల్సి వస్తోంది కాబట్టి, పన్ను చెల్లింపుదారులు కూడా బాధపడుతున్నారు" అని నవారో అన్నారు.
మీరు మాట్లాడుతోంది 'పుతిన్ యుద్ధం' గురించేనా అని బ్లూమ్‌బెర్గ్ అడిగినప్పుడు నవారో స్పందిస్తూ "నేను మోదీ యుద్ధం అంటున్నా. ఎందుకంటే, అక్కడ శాంతి నెలకొనాలంటే కొంతవరకు భారత్ నుంచే దారి మొదలవ్వాలి" అన్నారు.
"ఈ విషయంలో భారతీయులు అహంకారంతో వ్యవహరిస్తుండడం నన్ను బాధిస్తోంది. 'హే, మాకు అధిక సుంకాలు లేవు. ఇది మా సార్వభౌమాధికారం. మేం కావాలనుకుంటే ఎక్కడి నుంచైనా చమురు కొంటాం' అని వాళ్లంటున్నారు. చూడు భారత్, మీది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఓకే, మరి అలాగే ప్రవర్తించండి" అని అన్నారు నవారో.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














