తురకపాలెం: 'వారానికి ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారు, మాకు భయమేస్తోంది'

ఎస్సీ కాలనీకి చెందిన సీతమ్మ, తురకపాలెం
ఫొటో క్యాప్షన్, ''ఊళ్లో వారానికి ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారు, నా తమ్ముడు కూడా చనిపోయాడు. ఇలా ఎందుకు జరుగుతుందో మాకైతే తెలియదు. చాలా భయంగా ఉంది'' అని గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన సీతమ్మ బీబీసీతో అన్నారు.
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరానికి ఆనుకుని ఉండే రూరల్‌ మండలం తురకపాలెం గ్రామంలో.. ప్రత్యేకించి ఆ గ్రామ దళిత వాడలో అకాల మరణాలు కలకలం రేపుతున్నాయి.

ఐదు నెలల వ్యవధిలోనే ఈ గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన 29 మంది మృత్యువాత పడినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు.

అయితే, ఈ సంఖ్య ఎక్కువే ఉండొచ్చని గ్రామస్థులు అంటున్నారు.

తురకపాలెం, వైద్య శిబిరం, గుంటూరు
ఫొటో క్యాప్షన్, తురకపాలెంలో అంతుచిక్కని మరణాల కారణంగా ప్రభుత్వం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయించి, అందరికీ రక్త పరీక్షలు నిర్వహిస్తోంది.

జులై, ఆగస్టు నెలల్లో మరణాలు ఎక్కువగా సంభవించాయని, యువకుల నుంచి వృద్ధుల వరకు ఉన్నట్టుండి చనిపోతున్నారని ఎస్సీ కాలనీవాసులు బీబీసీ వద్ద భయాందోళన వ్యక్తం చేశారు.

అయిదు రోజుల కిందట స్పందించిన ప్రభుత్వం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయించి, అందరికీ రక్త పరీక్షలు నిర్వహిస్తోంది.

జ్వరం, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, x.com/ncbn

ఫొటో క్యాప్షన్, ఏపీ సీఎం చంద్రబాబు (ఫైల్)

వారంలో గుర్తించండి : సీఎం చంద్రబాబు

తురకపాలెంలో ప్రస్తుత పరిస్థితిని హెల్త్‌ ఎమర్జెన్సీగానే పరిగణించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.

అమరావతిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌, అధికారులతో సీఎం అత్యవసర సమావేశం నిర్వహించారు. గ్రామంలో అందరికీ 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని, అనుమానిత లక్షణాలపై లోతైన అధ్యయనం చేసి వారం రోజుల్లో వ్యాధిని గుర్తించాలని చంద్రబాబు ఆదేశించారు.

ఈ నేపథ్యంలో గ్రామంలో ఎవరూ వంట చేయొద్దనీ, అక్కడి ఆహారం కానీ, నీరు కానీ వినియోగించవద్దని సీఎం సూచించారు.

గ్రామస్థులకు కొద్దిరోజుల పాటు మూడు పూటలా ఆహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.

విజయరామరాజు, తురకపాలెం
ఫొటో క్యాప్షన్, తన తల్లికి కిడ్నీలు పాడయ్యాయని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు చెప్పారని తురకపాలెం గ్రామస్థుడు విజయరామరాజు చెప్పారు.

అకస్మాత్తుగా చనిపోయారు: గ్రామస్థులు

''రెండు నెలల కిందట అమ్మకి ఒంట్లో బాగోలేకపోతే స్థానికంగా ఉన్న డాక్టర్‌ వద్దకు తీసుకువెళ్తే చిన్నపాటి జ్వరమే అని మందులిచ్చారు. ఆ తర్వాత తగ్గకపోతే గుంటూరులోని ప్రైవేటు హాస్పిటల్‌కి తీసుకువెళ్లగా అక్కడ.. మీ అమ్మకు ఇన్ఫెక్షన్‌ వచ్చింది కిడ్నీలు పాడయ్యాయి, వెంటనే డయాలసిస్‌ చేయాలన్నారు. రూ. 50 వేలు ఖర్చయింది. ఖర్చులు భరించలేక తర్వాత గవర్నమెంట్‌ హాస్పిటల్‌కి తీసుకువెళ్లగా, అక్కడ గుండె ఆగి చనిపోయారు. అంతా మాడురోజుల్లోనే జరిగిపోయింది'' అని తురకపాలెం ఎస్సీ కాలనీకి చెందిన విజయరామరాజు బీబీసీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

తురకపాలెం, వైద్య శిబిరం
ఫొటో క్యాప్షన్, ఐదు నెలల వ్యవధిలోనే తురకపాలెం గ్రామంలోని 29 మంది మృతి చెందినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి చెప్పారు.

''నా భర్తకి సుస్తీ చేస్తే హాస్పిటల్‌కి వెళ్లాం, అక్కడికి వెళ్లిన తర్వాత ట్రీట్మెంట్‌ ఇస్తూనే ఉన్నారు. చేరిన వారంలోనే ఆయన చనిపోయారు. ఆ తర్వాత ఊళ్లో చాలామంది చనిపోయారు. నాకూ ఒంట్లో బాగోలేదు. ఊళ్లో పరిస్థితులు చూస్తే భయమేస్తోంది'' అని తురకపాలెం దళితవాడకు చెందిన కుమారి బీబీసీ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.

''ఊళ్లో వారానికి ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారు, నా తమ్ముడు కూడా చనిపోయాడు. ఇలా ఎందుకు జరుగుతుందో మాకైతే తెలియదు. చాలా భయంగా ఉంది'' అని గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన సీతమ్మ బీబీసీతో అన్నారు.

తురకపాలెం, వైద్య శిబిరం
ఫొటో క్యాప్షన్, తురకపాలెం

చిన్న పిల్లలకూ జ్వరాలు

ఊళ్లోని ఎస్సీ కాలనీలో చాలామంది జ్వరం, కీళ్ల నొప్పులు ఇతర సమస్యలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. సుమారు 230 ఇళ్లు, వెయ్యికి పైగా దళిత జనాభా ఉన్న తురకపాలెం ఎస్సీ కాలనీలో వీధికొకరు మంచాన పడ్డారు.

''గత రెండు నెలల నుంచి మా ఊరిలో అంతా జ్వరాలతో బాధపడుతున్నారు. కొందరు చనిపోతున్నారు. నాలుగో తరగతి చదువుతున్న మా బాబుకి జ్వరంగా ఉంటే స్కూల్‌ మాన్పించి ఇంట్లోనే ఉంచి చికిత్స చేస్తున్నాం'' అని గ్రామానికి చెందిన అనూష చెప్పారు.

''చాలా ఆందోళనగా ఉంది. ఎవరికి ఏం జరుగుతుందో, తెల్లారితే ఏం వినాల్సి వస్తుందోనని భయమేస్తోంది'' అని ఆమె అన్నారు.

జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి
ఫొటో క్యాప్షన్, గుంటూరు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి

తురకపాలెంలో అకాల మరణాలపై మీడియాల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం ఐదురోజుల కిందట ఊళ్లోని చర్చిలో వైద్యశిబిరం ఏర్పాటు చేసింది.

ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, ఆ శాఖ కమిషనర్‌ వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, వివిధ శాఖల అధికారులు గ్రామాన్ని పరిశీలించారు.

అసలెందుకు అకాలమరణాలు సంభవిస్తున్నాయి? గ్రామస్థులు ఒక్కసారిగా ఎందుకు ఆస్పత్రుల పాలవుతున్నారనే కారణాలను కనుగునేందుకు ఊళ్లో వాళ్లకు పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను వైద్య సిబ్బంది సేకరిస్తున్నారు.

తురకపాలెంకి సంబంధించి ఒక ప్రత్యేక యాప్‌ క్రియేట్‌ చేసి ఊళ్లో అందరి ఆరోగ్య వివరాలను నమోదు చేస్తున్నామని గుంటూరు డీఎంహెచ్‌వో విజయలక్ష్మి బీబీసీకి చెప్పారు.

గ్రామ మాజీ సర్పంచ్‌ నక్కా శ్రీనివాస్‌, తురకపాలెం
ఫొటో క్యాప్షన్, గ్రామ మాజీ సర్పంచ్‌ నక్కా శ్రీనివాస్‌

నీటి కాలుష్యమా?

గ్రామంలోకి, ప్రత్యేకించి దళితవాడలోని ఇళ్లకు కొన్నాళ్లపాటు సమీపంలోని క్వారీ వద్దనున్న చెరువు నుంచి నీళ్లు సరఫరా అయ్యేవని, అవి కాలుష్యం కావడం వల్లనే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చిందని పలువురు గ్రామస్థులతో పాటు ఆ గ్రామ మాజీ సర్పంచ్‌ నక్కా శ్రీనివాస్‌ ఆరోపించారు.

''ఆ ఓపెన్‌ క్వారీ గుంట నుంచి నీళ్లు పంపింగ్‌ చేయడం అనేది పెద్ద తప్పిదం. అవి కలుషిత నీళ్లు, ఆ నీరు వాడటం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని భావిస్తున్నాం'' అని శ్రీనివాస్‌ బీబీసీతో అన్నారు.

ఈ ఆరోపణలపై గుంటూరు రూరల్‌ ఎంపీడీవో శ్రీనివాస్‌ బీబీసీతో మాట్లాడుతూ.. ''ఇప్పుడు ఆ నీళ్లు ఉపయోగించడం లేదు'' అని చెప్పారు.

ఆరునెలల కిందటే ఆ క్వారీ గుంట నుంచి ఊరికి నీటి సరఫరా నిలిపివేశామని, కేవలం బోర్‌వెల్స్‌ నీటినే ఇప్పుడు గ్రామస్థులు వినియోగిస్తున్నారని ఎంపీడీవో చెప్పారు.

అయినా సరే, నీటి కలుషితం వల్ల ఏమైనా జరిగిందా అనే అనుమానంతో గ్రామస్థులకు నీరు అందించే వాటర్‌ ట్యాంకులను పూర్తిగా క్లీన్‌ చేశామని ఆయన తెలిపారు.

పత్తిపాడు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు

ఫొటో సోర్స్, Facebook/Burla Ramanjaneyulu

ఫొటో క్యాప్షన్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు

మద్యం కూడా కారణం కావొచ్చు: ఎమ్మెల్యే

ఊళ్లో మద్యం వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయని ప్రాథమికంగా భావిస్తున్నామని, పరీక్షల నివేదిక తర్వాతే అసలు నిజం తేలుతుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు బీబీసీతో అన్నారు.

''గ్రామంలో కొందరు మద్యానికి బానిసై విపరీతంగా తాగారు. ఇప్పుడు ఆగింది కానీ, గతంలో చీప్‌ లిక్కర్‌ అందుబాటులో ఉండేది. అప్పట్లో అది తాగడం వల్లనే ఇప్పుడు ప్రభావం చూపించిందని అనుకుంటున్నాను'' అని అన్నారు.

''గ్రామంలో 5,600 కుటుంబాలు ఉంటే అందరికీ ప్రభావం చూపాలి కదా? కానీ, కొన్ని కుటుంబాల మీద కొంతమంది వ్యక్తుల మీదే పనిచేస్తోందంటే, అది మద్యం వల్లే అనుకుంటున్నాను. వైద్య పరీక్షల తరువాత కారణాలు తెలుస్తాయి'' అని ఎమ్మెల్యే అన్నారు.

వైద్య పరీక్షలు, తురకపాలెం, వీర పాండ్యన్
ఫొటో క్యాప్షన్, ఆరోగ్యశాఖ కమిషనర్‌ వీర పాండ్యన్‌

నివేదిక వచ్చే వరకూ చెప్పలేం: హెల్త్ కమిషనర్

నీటి కలుషితం వల్ల మరణాలు సంభవిస్తున్నాయా లేదా మద్యమా? ఇంకేవైనా కారణాలు ఉన్నాయా అనే విషయంపై అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నామనీ ఆరోగ్యశాఖ కమిషనర్‌ వీర పాండ్యన్‌ మీడియాతో అన్నారు.

'' ఏ కారణం వల్లనో అనేది పరీక్షల నివేదిక వచ్చే వరకూ చెప్పలేమని స్పష్టంచేశారు. మద్యం వల్లనే అయితే 29 మంది మరణాల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. కాబట్టి అలా చెప్పలేం. నీటి నమూనాలు పరీక్షిస్తే కాలుష్యం కాలేదని తేలింది. కాబట్టి తుది నివేదిక వచ్చే వరకూ ఒక నిర్ణయానికి రాలేం'' అని ఆయన వ్యాఖ్యానించారు.

డాక్టర్ కల్యాణ్

ఫొటో సోర్స్, Kalyan

ఫొటో క్యాప్షన్, ఇది బర్ఖోల్డేరియా సూడోమాలీ అనే బాక్టీరియా వల్ల వచ్చే ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్‌ అని డాక్టర్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

వైద్యం చేసిన వారేమంటున్నారు?

బాధితులకు మెలియాయిడోసిస్‌(Melioidosis) సోకిందని తురకపాలెం నుంచి వెళ్లిన ఇద్దరు రోగులకు చికిత్స చేసిన గుంటూరుకి చెందిన చర్మవ్యాధుల వైద్య నిపుణుడు డాక్టర్‌ కల్యాణ్‌ బీబీసీతో చెప్పారు. ఇది బర్ఖోల్డేరియా సూడోమాలీ(Burkholderia pseudomallei) అనే బాక్టీరియా వల్ల వచ్చే ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్‌ అని అన్నారు.

బ్లడ్‌ కల్చర్‌ ద్వారా దీన్ని నిర్ధరించినట్లు ఆయన చెప్పారు.

షుగర్, లివర్, కిడ్నీకి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిలో ఇది ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని కల్యాణ్ తెలిపారు. రోగికి జ్వరం, దగ్గు, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు ఉండి టీబీ అని తేలకపోతే మెలియాయిడోసిస్‌గా అనుమానించాలన్నారు. తన వద్దకు వచ్చిన ఇద్దరిలో ఒక పేషెంట్‌ సీరియస్‌ కండిషన్‌లో రావడంతో చనిపోయారని డాక్టర్ కల్యాణ్ చెప్పారు.

అయితే, 29 మంది నుంచి తాము సేకరించిన బ్లడ్‌ శాంపిల్స్‌లో బ్లడ్‌ కల్చర్‌ చేయగా, మెలియాయిడోసిస్‌గా తేలలేదని గుంటూరు డీఎంహెచ్‌వో విజయలక్ష్మి బీబీసీకి తెలిపారు.

విచారణకు కమిటీ: మంత్రి సత్యకుమార్‌

తురకపాలెంలో అసాధారణంగా నమోదైన మరణాలను గుర్తించడంలో గానీ, ఉన్నతాధికారులకు తెలియజేయడంలో గానీ జాప్యం జరిగిన మాట వాస్తవమేనని మంత్రి సత్యకుమార్‌ అంగీకరించారు.

ఆయన గ్రామంలో పర్యటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సమాచార లోపంపై సమగ్ర విచారణ చేయిస్తామని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)