చైనా విక్టరీ పరేడ్: పుతిన్ వెళ్లారు, షాబాజ్ వెళ్లారు, మరి మోదీ ఎందుకు వెళ్లలేదు?

ఫొటో సోర్స్, Press Information Bureau (PIB)/Anadolu via Getty Images
- రచయిత, మొహమ్మద్ షాహిద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చైనా బుధవారం 'విక్టరీ డే పరేడ్'లో తన సైనిక బలాన్ని ప్రదర్శించింది. ఈ పరేడ్‌లో సైనిక కవాతుతో పాటు కొత్త ఆయుధాలను కూడా ప్రదర్శించింది.
రెండో ప్రపంచ యుద్ధం చివర్లో చైనాకు జపాన్ లొంగిపోయి 80 ఏళ్లయిన సందర్భంగా చైనా ఈ విక్టరీ పరేడ్‌ను నిర్వహించింది.
అయితే, పరేడ్ కంటే కూడా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ కలిసి కనిపించడమే అందరి దృష్టిని ఆకర్షించింది.
పరేడ్‌లో ఈ నాయకులతో పాటు 20కి పైగా దేశాల అధినేతలు కూడా పాల్గొన్నారు. వీరిలో పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా ఉన్నారు.
కానీ, షీ జిన్‌పింగ్, పుతిన్, కిమ్ జోంగ్ ఉన్‌ల గురించే ఎక్కువగా చర్చ జరిగింది.
ప్రపంచంలో అత్యధిక ఆంక్షల్ని ఎదుర్కొంటున్న పుతిన్, కిమ్ జోంగ్ ఉన్‌లు షీ జిన్‌పింగ్‌తో కలిసి బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి.


ఫొటో సోర్స్, SPUTNIK/KREMLIN POOL/EPA/Shutterstock
అమెరికా, భారత్‌ల మధ్య సంబంధాలు ఒడిదొడుకుల్లో ఉన్న సమయంలో, అయిదేళ్ల తర్వాత చైనాతో భారత్ సంబంధాలు కాస్త మెరుగుపడ్డాయి.
2020లో గల్వాన్ లోయలో జరిగిన సైనిక ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ, డోనల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ వార్ తర్వాత ఈ సంబంధాల్లో కొంత మెరుగుదల కనిపించింది.
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి గత నెలలో భారత్‌కు వచ్చారు. అలాగే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా చైనా పర్యటనకు వెళ్ళారు.
మరోవైపు, ఏడేళ్ల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా చైనాలో పర్యటించారు.
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశంలో పాల్గొనడంతో పాటు, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మోదీ ద్వైపాక్షిక సమావేశం కూడా నిర్వహించారు.
భారత్-చైనా సంబంధాల్లో ఇది చాలా ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
పరేడ్‌లో మోదీ ఎందుకు భాగం కాలేదు?
ఎస్‌సీఓ సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ, షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య స్నేహపూర్వక వాతావరణం కూడా కనిపించింది.
ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరిగిన ఎస్‌సీఓ సదస్సులో దాని 10 సభ్య దేశాలతో పాటు భాగస్వామ్య దేశాల అధినేతలు కూడా పాల్గొన్నారు.
వీరిలో చాలామంది సెప్టెంబర్ 3న జరిగిన విక్టరీ డే పరేడ్‌లోనూ పాల్గొన్నారు. పుతిన్ మొత్తం నాలుగు రోజుల పాటు చైనా పర్యటనలో ఉన్నారు.
అయితే, ఈ పరేడ్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనకపోవడం చాలా చర్చనీయాంశమైంది.
ప్రధాని మోదీ చైనా పరేడ్‌లో ఎందుకు పాల్గొనలేదు?
ఈ ప్రశ్నకు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని చైనా, ఆగ్నేయాసియా అధ్యయన కేంద్రం అసోసియేట్ ప్రొఫెసర్ అరవింద్ యెలేరి, బీబీసీతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
''చైనా నిర్వహించిన ఫాసిస్ట్ వ్యతిరేక పరేడ్, రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ దురాక్రమణ వైఖరికి వ్యతిరేకంగా జరిగింది. భారత్ ఈ పరేడ్‌లో పాల్గొని జపాన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకోలేదు. భారత్, బ్రిటిష్ సామ్రాజ్యావాదాన్ని వ్యతిరేకిస్తుంది. జపాన్‌కు వ్యతిరేకి కాదు'' అని ఆయన చెప్పారు.
ఈ పరేడ్‌లో పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ పాల్గొన్నారు. కానీ ప్రధాని మోదీ ఇందులో భాగం కాలేదు.
''విక్టరీ డే పరేడ్‌లో పాల్గొనాలని అందరికీ ఆహ్వానం పంపారు. కానీ, ప్రధాని మోదీ వెళ్ళలేదు. జపాన్ సైన్యంపై సాధించిన విజయానికి ఉత్సవంగా ఈ పరేడ్‌ను చైనా నిర్వహించింది. జపాన్, భారత్‌కు మంచి మిత్రదేశం. చైనాకు భారత్‌పై అప్పుడు నమ్మకం లేదు, ఇప్పుడు కూడా లేదు'' అని బీబీసీ పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో ఓపీ జిందాల్ యూనివర్సిటీలో చైనా స్టడీస్ ప్రొఫెసర్ శ్రీపర్ణా పాఠక్ అన్నారు.
అరవింద్, శ్రీపర్ణా పాఠక్ అభిప్రాయాలతో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ రష్యన్ అండ్ సెంట్రల్ ఏషియన్ స్టడీస్ అసోసియేట్ ప్రొఫెసర్ అమితాబ్ సింగ్ కూడా ఏకీభవించారు.
భారత్ ఉదారవాద, ప్రజాస్వామ్య దేశాలు కాని శక్తులతో కలిసి ఉన్నట్లు కనిపించకుండా ఉండాలని కోరుకుంటుందని ప్రొఫెసర్ అమితాబ్ సింగ్ అన్నారు.
''జపాన్, చైనాల మధ్య వైరం ఉంది. చైనాలో జాతీయవాద భావనను పెంచడానికి జపాన్, రెండవ ప్రపంచ యుద్ధం గురించి తరచూ ప్రస్తావిస్తారు. అలాంటి పరిస్థితుల్లో చైనా, ఉత్తర కొరియాతో కలిసి వేదిక పంచుకుంటే భారత్ ఇబ్బంది పడేది'' అని అమితాబ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
మనకు జపాన్ ఫాసిస్ట్ శక్తి కాదు అని, అందుకే భారత్ ఈ పరేడ్‌కు దూరంగా ఉందని అరవింద్ యెలెరీ అన్నారు.
భారత్ ఈ పరేడ్‌లో పాల్గొని ఉంటే, చైనా సైనిక ప్రదర్శనకు మద్దతు ఇచ్చినట్లు అయ్యేదని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Reuters
ట్రంప్ కారణంగానే మోదీ, పరేడ్‌కు వెళ్లలేదా?
అమెరికా విధించిన సుంకాల తర్వాత భారత్, అమెరికా మద్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
భారత్‌పై ట్రంప్ 50% సుంకాన్ని విధించారు.
ప్రధాని మోదీ చైనా పర్యటన, ఎస్‌సీఓ సమావేశంలో షీ జిన్‌పింగ్, పుతిన్‌లతో ఆయన సాన్నిహిత్యం అమెరికాకు ఇచ్చిన ఒక సందేశంగా పరిగణిస్తున్నారు.
చైనా సైనిక పరేడ్‌లో పాల్గొని ట్రంప్‌కు మరింత కోపం తెప్పించకూడదని మోదీ భావించారా?
ట్రంప్ కారణంగానే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తాను భావించడం లేదని అమితాబ్ సింగ్ అన్నారు.
''ఇది చైనా వరల్డ్ ఆర్డర్‌లో చేరాలనుకుంటున్న దేశాల సమావేశం. అందుకే భారత్ ఇందులో పాల్గొనలేదు. ఈ పరేడ్‌లో పాల్గొన్న దేశాల జాబితాను చూస్తే, అవి ఉదారవాదం, ప్రజాస్వామ్యం, పౌరుల హక్కుల విషయంలో అన్ని ప్రమాణాల పరంగా వెనుకబడి ఉన్నాయి. ఈ పరేడ్ శక్తి ప్రదర్శనతో పాటు ఒక ప్రత్యామ్నాయ ప్రపంచ వ్యవస్థను కూడా చూపుతోంది" అని అమితాబ్ వివరించారు.
భారత్ ఉదారవాద, ప్రజాస్వామ్య ప్రపంచంతో కలిసి ఉండాలని కోరుకుంటుందని ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














