ఈ ఏడాది వర్షాలెందుకు విపరీతంగా కురుస్తున్నాయి?

వాాతావరణం, గ్లోబల్ వార్మింగ్, పంజాబ్, హర్యానా, రుతుపవనాలు, క్లౌడ్ బరస్ట్

ఫొటో సోర్స్, EPA/Shutterstock

    • రచయిత, నవీన్ సింగ్ ఖడ్కా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారతదేశంలో రుతుపవనాలు తీవ్రంగా మారాయి.

అసాధారణ వర్షాల వల్ల దేశంలోని సగం ప్రాంతం వరదల్లో చిక్కుకుంది.

పంజాబ్‌లో 1988 తర్వాత అత్యంత తీవ్ర స్థాయిలో వరదలు కనిపిస్తున్నాయి.

పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలోనే సాధారణం కంటే 1000 శాతానికి మించి అధికంగా వర్షాలు పడ్డాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

వాయువ్య భారతదేశంలో ఆగస్టు 28 సెప్టెంబర్ 3 మధ్యన వర్షపాతం సగటు కంటే 180 శాతం ఎక్కువగా ఉంది.

దక్షిణ భారతదేశంలో ఇదే కాలంలో కురిసిన వర్షం సగటు వర్షపాతం కంటే 73 శాతం ఎక్కువగా ఉంది.

ఈ వారంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వర్షాలు, వరదల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి.

వరదలు పోటెత్తాయి. గ్రామాలు, పట్టణాలు నీట మునిగాయి. వందల మంది మరణించారు.

ఇంత భారీగా వర్షాలు కురవడానికి కారణం ఏంటి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వాాతావరణం, గ్లోబల్ వార్మింగ్, పంజాబ్, హర్యానా, రుతుపవనాలు, క్లౌడ్ బరస్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారీ వర్షాల కారణంగా యమునానదికి వరద పోటెత్తడంతో దిల్లీలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి

రుతుపవనాల తీరు మారిందా?

పర్యావరణ మార్పుల కారణంగా రుతు పవనాల తీరు మారుతోంది.

ప్రస్తుతం గాలిలో తేమ శాతం పెరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భూతాపం పెరగడం వల్ల హిందూ మహా సముద్రం, అరేబియా సముద్రం నుంచి వేడి గాలులు వస్తున్నాయి. అందుకే గాలిలో తేమ శాతం పెరుగుతోంది.

గతంలో జూన్, జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లో రుతుపవనాలు స్థిరంగా వ్యాపించడం.. వాటి వల్ల వర్షాలు సమానంగా కురవడం జరిగేది.

అయితే ప్రస్తుతం పొడి వాతావరణం కొంతకాలం కొనసాగిన తర్వాత కొద్ది ప్రాంతంలో ఒకేసారి పెద్దమొత్తంలో వర్షాలు కురుస్తున్నట్లు తాము గుర్తించామని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తేమతో నిండిన భారీ మేఘాలు పర్వత ప్రాంతాల్లో కొండలను తాకినప్పుడు చిన్న ప్రాంతంలో పెద్ద వర్షం పడుతోందని నిపుణులు చెబుతున్నారు. దీన్నే క్లౌడ్ బరస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

ఆగస్ట్ మొదటి వారంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కశ్మీర్‌లో భారీ వరదలు వచ్చి కొన్ని ఊళ్లు కొట్టుకుపోవడానికి ఇదే ప్రధాన కారణం.

అయితే హిమాలయ రాష్ట్రాల నుంచి దక్షిణాది వైపు వెళ్తే భారీ వర్షాలు, వరదలకు వేరే కారణాలు కనిపిస్తాయి.

వాాతావరణం, గ్లోబల్ వార్మింగ్, పంజాబ్, హర్యానా, రుతుపవనాలు, క్లౌడ్ బరస్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గ్లోబల్ వార్మింగ్ వల్లే విపరీత వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెస్టర్న్ డిస్టర్బెన్సెస్

ఆగస్ట్‌లో పంజాబ్, హరియాణా, దిల్లీని భారీ, అతి భారీ వర్షాలు ముంచెత్తాయి.

భారత ఉపఖండంలో ఇప్పటికే ఉన్న రుతుపవన వ్యవస్థ, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ (మధ్యధరా ప్రాంతంలో ఏర్పడే అల్పపీడనాలు, తుపానులు) తూర్పు వైపు ప్రయాణించేటప్పుడు కలవడం వల్ల ఇలా జరుగుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ తరచూ పైవాతావరణంలో భారీ మొత్తంలో చల్లని గాలులను మోసుకెళ్తుంది. కింది వాతావరణంలో రుతుపవనాలు మోసుకెళ్లే వేడి గాలులు, తేమ నిండిన గాలులను ఇవి కలిసినప్పుడు వాతావరణం తీవ్రంగా మారిపోతుంది.

"రుతుపవనాలు, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ మధ్య అరుదైన వాతావరణ కలయిక ఫలితం ఇది" అని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌లో వాతావరణ శాస్త్ర విభాగంలో రీసెర్చ్ సైంటిస్ట్ అక్షయ్ దేవరస్ చెప్పారు.

ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ప్రధాన కారణం రుతుపవనాలు, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కలయికేనని భారత వాతావరణ శాఖ నిర్థరించింది.

"రుతుపవనాలు విస్తృతంగా వ్యాపించి ఉన్నప్పుడు ఇలాంటి కలయిక అసాధారణం. ఎందుకంటే ఈ సమయంలో వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఉత్తర దిశగా ప్రయాణిస్తాయి" అని దేవరస్ చెప్పారు.

అయితే అవి ఈ ఏడాది తూర్పు వైపు ఎందుకు వచ్చాయి?

ప్రపంచవ్యాప్తంగా పడమర నుంచి తూర్పుకు వీచే బలమైన గాలులే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ గాలుల మార్గం అనూహ్యంగా మలుపులు తిరుగుతోంది. అంటే ఇవి అంతకు ముందు తమదైన సహజ మార్గంలో వీయడం లేదు.

ఇది మిగతా వాతావరణ వ్యవస్థలపైనా ప్రభావం చూపుతోంది.

గాలులు వీచే దిశ మారడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అసాధారణ వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది.

భారత్‌లోనూ ఇటీవల ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

దిశ మార్చుకున్న గాలులు ఉత్తరం వైపు వెళ్లాల్సిన వెస్టర్న్ డిస్టర్బెన్సెస్‌ను తూర్పు వైపు మళ్లించాయి.

"ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ స్థానిక రుతుపవనాల గతిశీలతను ఎలా మారుస్తుందో చెప్పడానికి ఇది సూచిస్తుంది" అని దేవరస్ చెప్పారు.

వాాతావరణం, గ్లోబల్ వార్మింగ్, పంజాబ్, హర్యానా, రుతుపవనాలు, క్లౌడ్ బరస్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జమ్మూకశ్మీర్‌లో ఆగస్టు 15న కిష్త్వార్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా వరద విరుచుకుపడింది.

పర్వతాల స్థిరత్వం

భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో అధిక వర్షపాతం వల్లనే వరదలు ఏర్పడుతున్నాయి. అయితే ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి.

హిమాలయాలో ఉద్భవించే నదులకు దిగువన ఉన్న ఉత్తర భారతదేశం, పాకిస్తాన్‌లోని అనేక ప్రాంతాలు క్లౌడ్ బరస్ట్, వర్షాలు లేనప్పుడు కూడా వరదల బారిన పడ్డాయి.

హిమనీనదాలు వేగంగా కరగడం, అవి వేగంగా ప్రవహించడం వల్ల భూగర్భ సరస్సులు పైకి వచ్చి ఆ ప్రవాహాలను అడ్డుకోవడం వల్ల కృత్రిమ సరస్సులు ఏర్పడటం, వాటి వల్ల వరదలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.

కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ, గ్లోబల్ వార్మింగ్ వల్ల వేగంగా కరుగుతున్న హిమనీనదాలు, కరిగిపోతున్న మంచు క్షేత్రాలు లాంటివి పర్వత ప్రాంతాల్లో అస్థిర వాతావరణ పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

పర్వతాల్లో వాలుగా ఉండే ప్రాంతాలను స్థిరంగా ఉంచడానికి మంచు సిమెంట్‌లాగా పని చేస్తుంది.

వర్షాలు కురిస్తే ఈ పరిస్థితి మారుతుంది.

భూతాపం కారణంగా ఎత్తైన ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇక్కడ నీరు ఇంకడం వల్ల నేల మెత్తగా మారుతుంది. దీంతో పర్వతాలు గట్టిదనాన్ని కోల్పోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

"వర్షం కురిసి, భారీ మొత్తంలో నీరు వరదగా ప్రవహించినప్పుడు ఒకటి రెండు రోజుల్లో పర్వాతాల్లో మంచు అంతా కరిగిపోవడాన్ని మేం చూస్తున్నాం" అని గ్రాజ్ యూనివర్సిటీలో జియో సైంటిస్ట్ జాకబ్ స్టైనర్ అన్నారు.

వాాతావరణం, గ్లోబల్ వార్మింగ్, పంజాబ్, హర్యానా, రుతుపవనాలు, క్లౌడ్ బరస్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పంజాబ్‌ వరదలు

భూ తాపం పెరగడం వల్ల వాతావరణంలో సంభవిస్తున్న మార్పులకు తోడు మనుషుల చర్యలు కూడా వరదలకు కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

పర్వతాలు, మైదాన ప్రాంతాల్లో నదుల ప్రవాహాన్ని అడ్డుకుంటూ అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. నదీ తీరాల వెంబడి జరుగుతున్న ఆక్రమణలు కూడా దీనికి కారణంగా మారుతున్నాయి.

పర్వత ప్రాంతాల్లో రహదారులు, సొరంగాలు, జల విద్యుదుత్పుత్తి కేంద్రాల నిర్మాణం వంటి వాటి వల్ల పర్వతాలు బలహీనపడుతున్నాయి.

ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ, చాలా చోట్ల నదుల కరకట్టలు, కాల్వల ఆధునికీకరణ లాంటి పనులు చేపట్టలేదు.

పట్టణ ప్రాంతాల్లో వరద ప్రవాహానికి ప్లాస్టిక్ వ్యర్థాలు అడ్డంకిగా మారుతున్నాయి.

భారీ వర్షాలు, వరదల వల్ల నష్టాలను తగ్గించడానికి సమస్యలను ముందే పరిష్కరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)