ప్రకృతి విపత్తులను వాతావరణశాఖ ముందుగానే ఎలా గుర్తిస్తుంది, అసలు భారత వాతావరణశాఖ ఎప్పుడు ఏర్పాటైంది?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
"ఇప్పుడు వాతావరణం తెలుసుకునేందుకు ఆకాశం వైపు చూడనవసరం లేదు. అరచేతిలో ఉన్న సెల్‌ఫోన్ స్క్రీన్ చూస్తే చాలు."
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) 150 ఏళ్ల పుట్టినరోజు సందర్భంగా ఆ శాఖ విడుదల చేసిన ప్రకటన ఇది.
ఐఎండీ, వాతావరణ విశేషాలను వార్తల రూపంలో అందించడం ప్రారంభమై జనవరి 15, 2025కి 150 ఏళ్లు పూర్తయ్యాయి.
భారత్‌లో తొలి వాతావరణ వార్తల రిపోర్టును అందించింది హెన్రీ ఫ్రాన్సిస్ బ్లాన్‌ఫోర్డ్. ఈయనే ఐఎండీకి తొలి డైరెక్టర్ జనరల్.
150 ఏళ్ల చరిత్ర ఉన్న భారత వాతావరణ శాఖ 2025లో 150 ఏళ్ల సంబరాలు జరుపుకుంటోంది. ఐఎండీని 1875లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఆకాశంలో మేఘం, నేలపై నీడ, సముద్రంలో అలల తాకిడిని చూసి వాతావరణాన్ని తెలుసుకునే రోజుల నుంచి తుఫాన్లు, భారీ వర్షాలు, పిడుగుపాటుల గురించి ముందుగానే అంచనా వేసి, సమాచారం అందిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది ఐఎండీ.


భారత వాతావరణశాఖ మాత్రమే...
మన దేశంలో వాతావరణ విశేషాలంటూ రేడియోలో చెప్పినా, వెదర్ రిపోర్టు అంటూ గ్రాఫిక్స్ చూపిస్తూ టీవీల్లో వివరించినా, మరికొద్దిసేపట్లో పిడుగులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రాలు సమాచారం అందిస్తున్నా, తాజా వాతావరణ సమాచారం సెల్‌ఫోన్ల స్క్రీన్లపై పాప్ అప్ అవుతున్నా వీరందరికి ఆ వివరాలు, లెక్కలు, మ్యాపులతో కూడిన పూర్తి సమాచారాన్ని అందించేది భారత వాతావరణ శాఖ మాత్రమే.
ప్రస్తుతం వాతావరణ ముచ్చట్లు కూడా మన దైనందిక జీవితంలో భాగమైపోయాయి. సోషల్ మీడియా పుంజుకోవడంతో భారత వాతావరణ శాఖ అందరికీ బంధువైపోయింది.
అసలు ఐఎండీ ఎలా పుట్టింది? ఎలా ఎదిగింది? ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంది? ఈ 150 ఏళ్లలో ప్రజలకు ఎంత చేరువైందనే విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆ వివరాలను భారత వాతావరణ శాఖ విశాఖ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్, ఆయన బృందం బీబీసీకి వివరించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం.

161 ఏళ్ల కిందట...
ఐఎండీ 1875లో కలకత్తా (ప్రస్తుతం కోల్‌కతా)లో ప్రారంభమైంది. ఇది ఎలా ఏర్పాటైందో తెలుసుకోవాలంటే అప్పటికి మరో 11 ఏళ్లు, అంటే 161 ఏళ్లు వెనక్కి వెళ్లాలి.
అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం, భారత వాతావరణ శాఖకు అధికారికంగా పునాది వేసింది. మొదట్లో ఈ శాఖ నుంచి వాతావరణ విశేషాలను పోస్టు కార్డుల ద్వారా దేశంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు అందించేవారు. అక్కడ నుంచి ఆ సమాచారం ప్రజలకు చేరేది.
"1864లో కలకత్తాలో 80 వేలమంది ప్రాణాలను తీసిన తుఫాను, ఆ తర్వాత 60 వేల మంది ప్రాణాలను బలి తీసుకున్న 1866-1868 మధ్య ఏర్పడిన కరవుతో వాతావరణ ప్రాధాన్యాన్ని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది. దీంతో 1875 జనవరి 15న ఐఎండీని ఏర్పాటు చేశారు" అని ఐఎండీకి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆ శాఖ విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు.
1875లో 77 రెయిన్ గేజులతో ఐఎండీ ప్రస్థానం ప్రారంభమైంది. కలకత్తాలో 1875లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసినా, 1944 నాటికి ఐఎండీ ప్రధాన కేంద్రాన్ని దిల్లీకి మార్చారు. 1949లో ప్రపంచ వాతావరణ సంస్థలో ఐఎండీ సభ్యత్వం పొందింది.
ఐఎండీ ప్రస్తుతం ఆరు ప్రాంతీయ వాతావరణ కేంద్రాలను (ముంబయి, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, నాగ్‌పూర్, గువాహటి) నిర్వహిస్తోంది. అలాగే వాతావరణ సేవలు అందించేందుకు మరికొన్ని ఉప కేంద్రాలు కూడా ఉన్నాయి. ఇవి విశాఖ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఉన్నాయి.
వాతావరణ వివరాలను అందించడమే కాకుండా భూకంపాలను గుర్తించడం, వాతావరణ కాలుష్యాన్ని రికార్డ్ చేయడం వంటి పనులు కూడా ఐఎండీ చేస్తుంది.
అలాగే గ్రౌండ్ అబ్జర్వేటరీలు, నౌకలు, వెదర్ బెలూన్స్, శాటిలైట్లతో పాటు వివిధ వనరుల నుంచి వెదర్ డేటాను సేకరించే వ్యవస్థను ఐఎండీ నిర్వహిస్తుంది.

ఆయనే తొలి వెదర్ రిపోర్టర్
వాతావరణ పరిస్థితుల గురించి మనకెందుకులే అనుకునే గతకాలపు రోజులు కావు ఇవి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ అంశాలకు ప్రాధాన్యం పెరిగింది.
ప్రతి మూడు గంటలకు ఒకసారి ప్రపంచంలో ఉన్న అన్ని వాతావరణ కేంద్రాలు ఒకే సమయానికి కోడింగ్ రూపంలో సమాచారాన్ని నిక్షిప్తం చేస్తుంటాయి. ఆ డేటాను ఐఎండీ డీకోడ్ చేసి ఇతర కేంద్రాలకు అనుసంధానం చేస్తుంది. ఆ సమాచారమే అందరికీ అందుబాటులోకి వస్తుంది. అందుకే ఐఎండీ ప్రధాన కేంద్రంతో పాటు ఇతర ప్రాంతీయ కేంద్రాలు కూడా ఎంతో చురుకుగా పని చేస్తుంటాయి. అన్ని కేంద్రాల నుంచి వచ్చే సమాచారంతో ప్రజలకు అవసరమైన సమాచారాన్ని సులభంగా అందిస్తూ వారి దినచర్యలో ఐఎండీ భాగమవుతోంది.
1875 జనవరి 15న 77 రెయిన్ గేజులతో ఐఎండీ ఏర్పాటైంది. ఈ రెయిన్ గేజుల నుంచి సేకరించిన సమాచారంతో అప్పటి బ్రిటిష్ అధికారి హెన్రీ ఫ్రాన్సిస్ బ్లాన్ ఫోర్డ్ తొలిసారి భారతదేశపు వర్షపాత పటాన్ని రూపొందించారు. భారత ప్రభుత్వానికి వాతావరణ పరిస్థితులను వివరించే తొలి వాతావరణ సమాచార అధికారిగా ఆయన పని చేశారు. అంటే భారత్‌లో ఆయనే తొలి వాతావరణ వార్తల రిపోర్టర్ అని చెప్పుకోవచ్చు.

ఐఎండీ వద్ద ఏమున్నాయంటే...
సముద్రంలో ఏర్పడిన తుఫాన్ల జాడను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసేందుకు మొదట కోల్‌కతా, చెన్నై, సిమ్లా, పుణే కేంద్రాలుగా ఐఎండీ శాఖలు ఏర్పాటయ్యాయి.
ఆ తర్వాత క్రమంగా భారత వాతావరణ శాఖ ప్రాంతీయ కేంద్రాలను దేశవ్యాప్తంగా విస్తరించారు.
దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో వెదర్ అబ్జర్వేటరీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
తుఫాన్లు, భారీవర్షాలు, ఉష్ణోగ్రతలపై ఎప్పటికప్పుడు వెదర్ బులెటిన్లను జారీ చేసేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఐఎండీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఐఎండీ కేంద్రాలను ఆటోమేషన్ చేయడం ద్వారా ప్రతి 10 నిమిషాలకు వాతావరణ పరిస్థితులపై బులెటిన్లను విడుదల చేయగలుగుతున్నారు.
2010 వరకు భారత వాతావరణ శాఖ పరిమిత వనరులతో అంచనాలు వేసేది. అయితే, 2023 నాటికి అమెరికా నేషనల్ హరికేన్ సెంటర్ కంటే మన అంచనా 30 శాతం మెరుగ్గా ఉంది. ప్రస్తుతం ఐఎండీ అంచనాలు అనేక అభివృద్ధి చెందిన దేశాలతో పోటాపోటీగా లేదా మెరుగ్గా ఉన్నాయి.

ఐఎండీ అందిస్తున్న నిరంతర వాతావరణ విశేషాలను తెలుసుకుంటూ ప్రజల్లో వాతావరణంపై మంచి అవగాహన పెరిగిందనడంలో సందేహం లేదు.
1988లో నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ ఏర్పాటు, 1989లో సూపర్ కంప్యూటర్ కొనుగోలు చేయడం ఐఎండీ ఉన్నతికి బాగా ఉపయోగపడ్డాయి. వీటి సహకారంతో 2020 నాటికి ప్రతి పది నిమిషాలకు వాతావరణ సమాచారం అందించే స్థాయికి ఐఎండీ చేరుకుంది.
ఐఎండీని ప్రపంచ వాతావరణ సంస్థ (World Meteorological Organization) గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెంటర్‌గా గుర్తించింది.
ఐఎండీ ఇప్పుడు 39 డాప్లర్ వాతావరణ రాడార్లను ఉపయోగిస్తోంది. ఇన్ శాట్ (INSAT 3D/3DR) ఉపగ్రహ సాయంతో 15 నిమిషాల క్లౌడ్ అప్‌డేట్లను అందించగలుగుతోంది. ఐఎండీ ఆధ్వర్యంలో 806 ఆటోమేటిక్ వాతావరణ స్టేషన్లు, 200 అగ్రో స్టేషన్లు, 5896 రెయిన్ సూపర్వైజేషన్ స్టేషన్లు, 83 లైట్నింగ్ సెన్సార్లతో పాటు 63 పైలెట్ బెలూన్ స్టేషన్లు ఉన్నాయి.

ఇంకా ఐఎండీ నెట్‌వర్క్‌లో 2,000 కంటే ఎక్కువ ఉపరితల అబ్జర్వేటరీలు, 100 కంటే ఎక్కువ అప్పర్ ఎయిర్ అబ్జర్వేటరీలు, 6,000 రెయిన్ గేజ్‌లు, 40 రిమోట్ సెన్సింగ్ డాప్లర్ రాడార్లు, అధునాతన ఉపగ్రహ వ్యవస్థలు ఉన్నాయి.
అడ్వాన్స్‌డ్ న్యూమరికల్ వెదర్ ప్రెడిక్షన్ మోడల్స్, హైరిజల్యూషన్ గ్లోబల్ మోడల్స్ కూడా ఐఎండీ వద్ద ఉన్నాయి.
వీటి సహాయంతో వాతావరణశాఖ అంచనాల కచ్చితత్వం పెరిగింది. 2014తో పోల్చితే 2023లో వాతావరణ వివరాల అంచనా కచ్చితత్వం సుమారు 50 శాతం మెరుగుపడింది. ఇది ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించింది.
దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంభవించే వాతావరణ మార్పులపై కచ్చితమైన సమాచారాన్ని అందించి, దేశం వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా స్మార్ట్‌గా మార్చడమే ఐఎండీ దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకుంది.

ఐఎండీ దేశ పురోగతికి నిదర్శనం: ప్రధాని మోదీ
ఐఎండీ 150 ఏళ్ల సంబరాల సందర్భంగా 'మిషన్ మౌసమ్' మొబైల్ అప్లికేషన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు.
"ఈ 150 సంవత్సరాల్లో ఐఎండీ కోట్లాది మంది భారతీయులకు సేవ చేయడమే కాకుండా భారతదేశ వైజ్ఞానిక ప్రయాణానికి చిహ్నంగా మారింది. ఐఎండీ 150 సంవత్సరాల ప్రయాణం శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ సాధించిన పురోగతికి అద్దం పడుతుంది" అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా అన్నారు.
వాతావరణ సమాచారాన్ని సాధారణ భాషలో ప్రజలకు అందుబాటులో ఉంచడానికి, దేశంలోని ప్రతి ప్రదేశానికీ వాతావరణ సూచనలను అందించే 'మిషన్ మౌసమ్'సహా అనేక మొబైల్ అప్లికేషన్‌లను ఐఎండీ తీసుకొచ్చింది.
మోడలింగ్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి అధునాతన పద్ధతుల్లో వాతావరణ అవగాహన, అంచనాలను మెరుగుపరచడానికి ఐఎండీ 'మిషన్ మౌసమ్' ను అందుబాటులోకి తెచ్చింది.
మేఘాలను కృత్రిమంగా అభివృద్ధి చేయడానికి ప్రయోగశాలను రూపొందించడం, రాడార్‌ల సంఖ్యను 150 శాతానికి పైగా పెంచడం, కొత్త ఉపగ్రహాలు, సూపర్ కంప్యూటర్ల ఆవిష్కరణలు ఈ మిషన్‌లో ఉన్నాయి.

తుఫాన్ల పైనే ఐఎండీ దృష్టి: డైరెక్టర్ జనరల్
తుఫాన్లు తీరానికి దగ్గరవుతుండగా వాటి వేగం తగ్గుతుంది. అయితే ఆ కదలికలు ఇటీవల కాలంలో మరింత తగ్గాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర అన్నారు.
అంతకు ముందు తుఫాను తీరం దాటేందుకు మూడు గంటల సమయం పట్టేది. ఇప్పుడు అయిదు గంటలకు పైగా సమయం పడుతోందని మహాపాత్ర చెప్పారు.
"ఇప్పటికీ తుఫానులు తీరం దాటే సమయంలో ఎందుకు నెమ్మదిగా కదులుతున్నాయో తెలియలేదు. కానీ ఇటీవల పసిఫిక్ మహాసముద్రం, బంగాళాఖాతంలో ఈ విషయాలను గమనించాం. ఊహించని వాతావరణ మార్పుల వల్ల కావచ్చు. కానీ ఓ లింక్ ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాం. దీనిపై ఐఎండీ దృష్టి పెట్టింది" అని మృత్యుంజయ్ మహాపాత్ర అన్నారు.
గతంలో రాబోయే 3 నుంచి 6 గంటల్లో వాతావరణం (Nowcast) ఎలా ఉంటుందనేది చెప్పగలిగే వాళ్లం. ఆ తర్వాత రాబోయే 5 రోజుల వాతావరణం (Medium Range), ఇప్పుడు రాబోయే 4 వారాల వాతావరణం (Extended Range) కూడా కచ్చితమైన అంచనాలతో చెప్పగలుగుతున్నామని ఆయన అన్నారు.
ఇవన్నీ ఐఎండీ సాధించిన విజయాలేనని మహాపాత్ర తెలిపారు. దేశంలోని వ్యవసాయం, వైద్య, ఆర్థిక, సాంకేతిక, క్రీడలు, మైనింగ్ ఇలా అన్ని రంగాల్లో ఐఎండీ సేవలందిస్తూ దేశ వనరులకు ముఖ్యంగా నింగి, నేల, నీటికి సంరక్షకురాలిగా మారిందన్నారు.

వైఫల్యాలూ ఉన్నాయి
"వాతావరణ వివరాలను వంద శాతం కచ్చితత్వంతో అందించాలని ఐఎండీ నిరంతరం ప్రయత్నిస్తుంది. కానీ వాతావరణాన్ని అంటే ప్రకృతిని కచ్చితంగా అంచనా వేయగలిగే స్థాయిలో మానవ మేధస్సు, టెక్నాలజీ కూడా ఎదగలేదనే చెప్పాలి" అని కేవీఎస్ శ్రీనివాస్ అన్నారు.
"వాతావరణాన్ని ఇప్పుడు 80 శాతం వరకు కచ్చితంగా అంచనా వేయగలుగుతున్నాం. కానీ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తుఫాన్లు తీరం దాటే ప్రాంతాన్ని కచ్చితంగా తెలుసుకోవడంలో కొన్నిసార్లు అంచనాలు తప్పుతుంటాయి. అంటే ముందుగా అనుకున్న ప్రాంతంలో కాకుండా మరో చోట తుఫాన్లు తీరాన్ని తాకుతుంటాయి. దీనివల్ల ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమవుతుంటాం.
తాజాగా బుడమేరులో వరదల సమయంలో కూడా కాస్త అయోమయ పరిస్థితి ఏర్పడింది. వరదలను అంచనా వేసినా దాని తీవ్రతను అంచనా వేయడంలో ఐఎండీతో పాటు స్థానిక వాతావరణ కేంద్రాలు కూడా కచ్చితమైన సమచారాన్ని పొందలేకపోయాయి. ఇలా కొన్ని అనుకోని పరిస్థితుల్లో వాతావరణం ఎవరి ఊహలకు, అంచనాలకు అందదు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ఐఎండీ, లోకల్ వెదర్ స్టేషన్ల అంచనాలు కచ్చితత్వంతో ఉన్నప్పుడే నష్టాన్ని తగ్గించగలుగుతాం" అంటూ ఐఎండీ ఎదుర్కొంటున్న వాతావరణ సవాళ్లను కేవీఎస్ శ్రీనివాస్ వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














