ట్రంప్ మెత్తబడ్డారా? ఇది మరో వ్యూహమా?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మొదట భారత్‌ను చైనాకు కోల్పోయాం అని అన్నారు. కొన్ని గంటల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని మంచి స్నేహితుడు అని అన్నారు.
ట్రంప్ మాటలను హృదయపూర్వకంగా స్వాగతించిన ప్రధాని మోదీ పూర్తి మద్దతు ప్రకటించారు .
ఇద్దరి ప్రకటనలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ, అమెరికాతో భాగస్వామ్యానికి ప్రధాని మోదీ ఎంతో ప్రాముఖ్యం ఇస్తారని అన్నారు.
ఒకవైపు ప్రధాని మోదీని స్నేహితుడు అని పిలుస్తూ వ్యక్తిగత సంబంధాల గురించి ట్రంప్ మాట్లాడుతోంటే మరోవైపు ఆయన ప్రభుత్వంలో ఉన్నవారు, అధికారులు భారత్‌పై నిరంతరం ఆరోపణలు చేస్తున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
అమెరికా మెత్తబడిందా?
భారత్‌పై అమెరికా విధించిన 50 శాతం సుంకం అమలవుతోంది. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడి నుంచి స్నేహపూర్వక ప్రకటన వచ్చింది.
మోదీ గొప్ప ప్రధానమంత్రని ట్రంప్ అన్నారు, కానీ రష్యా నుంచి ముడి చమురు కొనడంపై అసంతృప్తి కూడా వ్యక్తంచేశారు.
"నేను ఎప్పుడూ మోదీకి స్నేహితుడిగానే ఉంటాను. ఆయన గొప్ప ప్రధానమంత్రి. రష్యా నుంచి భారత్ చమురు కొనడం నాకు నిరాశ కలిగించింది. 50 శాతం సుంకం విధించడం ద్వారా నేను భారత్‌కు ఈ విషయం చెప్పాను" అని ట్రంప్ అన్నారు.
అయితే.. ఒకే సమయంలో రెండు విరుద్ధమైన ప్రకటనలు ఇవ్వడం ట్రంప్ విదేశాంగ విధానం అని వ్యూహాత్మక వ్యవహారాల ప్రముఖ విశ్లేషకులు బ్రహ్మ చెలానీ అంటున్నారు.
"ట్రంప్ తన వైఖరిని అకస్మాత్తుగా మార్చుకోవడం -ముందు చైనా వైపు భారత్ మళ్లిందని చెప్పడం, ఆ తర్వాత అమెరికా, భారత్ చాలా ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉన్నాయని చెప్పడం - విదేశాంగ విధానం విషయంలో ఆయన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఇలాంటి ప్రకటనలు ఒకేసారి ఎక్కువమందికి తను చెప్పదలుచుకుంది చెప్పే వీలు కల్పిస్తాయి. ఆయన స్వదేశంలో తన మద్దతుదారులకు బలంగా కనిపిస్తారు. అదే సమయంలో తన మిత్రదేశాలతో సంబంధాలను కొనసాగిస్తారు'' అని బ్రహ్మ చెలానీ ఎక్స్‌లో పోస్టు చేశారు.
"ఈ భిన్నమైన ప్రకటనలు పొరపాటున వచ్చినవి కాదు. ట్రంప్ రాజకీయాల తీరు ఇదే. మీడియాలో చర్చ, ఒత్తిడి సృష్టించే ఉద్దేశంతో ఆయన ప్రకటనలుంటాయి. ఒక రోజు ఆయన కఠినంగా మాట్లాడతారు. తర్వాతిరోజు ఎలాంటి వివరణ ఇవ్వకుండానే తన మాటలను మార్చగలరు" అని బ్రహ్మ చెలానీ అంటున్నారు.
"ముందు చేసిన బెదిరింపు ప్రకటన ఒత్తిడిని పెంచడానికి. తర్వాత బలహీనంగా కనిపించకుండా సంబంధాన్ని కొనసాగించడానికి భరోసా ఇచ్చే ప్రకటన చేశారు" అని ఆయన విశ్లేషించారు.

ఫొటో సోర్స్, ani
ట్రంప్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన జవాబు సరైనదేనా?
"మా అనుబంధం గురించి అధ్యక్షుడు ట్రంప్ భావాలను, ఆయన సానుకూల అభిప్రాయాలను నేను అభినందిస్తున్నా. భారతదేశం, అమెరికా చాలా సానుకూలమైన, సంబంధాలను ముందుకు తీసుకెళ్లే సమగ్రమైన, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి" అని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ప్రధాని మోదీ పోస్టు తర్వాత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా స్పందించారు .
"అమెరికాతో మన భాగస్వామ్యానికి ప్రధాని మోదీ ఎంతో ప్రాముఖ్యమిస్తున్నారని ఎస్ జైశంకర్ అన్నారు. ట్రంప్‌తో ప్రధాని మోదీకి వ్యక్తిగతంగా చాలా మంచి సంబంధాలున్నాయి. అమెరికాతో చర్చలు జరుపుతున్నాం. ఈ సమయంలో నేను ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేను" అని ఆయనన్నారు.
ట్రంప్‌కు సానుకూల స్పందన ఇవ్వాలన్న ప్రధాని మోదీ నిర్ణయాన్ని సరైన చర్యగా మాజీ దౌత్యవేత్త కేపీ ఫేబియన్ భావిస్తున్నారు.
"ప్రధాని మోదీ దౌత్యపరంగా సరైన అడుగు వేశారు. ట్రంప్ పోస్టుకు దౌత్యపరమైన రీతిలో అద్భుతంగా స్పందించారు. కానీ ఈ రెండు పోస్టుల వల్ల ఈ సమయంలో పెద్ద మార్పు కలుగుతుందని నేను అనుకోవడం లేదు'' అని ఫేబియన్ ఏఎన్ఐతో చెప్పారు.
ఇద్దరు నాయకుల మధ్య చర్చలకు ఒక ఫోన్ కాల్ అయితే ప్రభావవంతంగా ఉండేదని బ్రహ్మ చెలానీ అభిప్రాయపడ్డారు.
"ద్వైపాక్షిక సంబంధాలలో ట్రంప్ సృష్టించిన ఉద్రిక్తతలను తగ్గించడానికి ఒక ఫోన్ కాల్ బాగా పనికొచ్చేది. నేరుగా మాట్లాడడం వల్ల అమెరికా-భారత్ మధ్య సంబంధాలు ఎంత ముఖ్యమని, వాటిని బలోపేతం చేయడానికి, ట్రంప్‌తో కలిసి పనిచేయడానికి ప్రధాని మోదీ సిద్ధంగా ఉన్నారనే స్పష్టమైన సందేశం అందేది.
ట్రంప్ అహంకారంతో వ్యవహరిస్తున్నప్పటికీ, ఈ ముఖ్యమైన భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి, ముందుకు తీసుకెళ్లడానికి వ్యక్తిగత సమీకరణాలకు అతీతంగా మోదీ సిద్ధంగా ఉన్నారని కూడా ఇది చూపించేది" అని బ్రహ్మ చెలానీ విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Getty Images
టారిఫ్‌ల సంగతేంటి?
మోదీని ట్రంప్ ప్రశంసిస్తుండొచ్చుగానీ ఆయన సన్నిహితులు భారత్‌ను నిరంతరం లక్ష్యంగా చేసుకుంటున్నారు.
శుక్రవారం(సెప్టెంబరు 5)రాత్రి, పీటర్ నవారో తన పాత ఎకౌంట్‌లో భారత్ గురించి ఒక పోస్ట్ రాశారు.
"భారత అధిక సుంకాల రేట్లు అమెరికా ఉద్యోగాలను ప్రభావితం చేస్తున్నాయి. భారతదేశం లాభాలు ఆర్జించడానికి మాత్రమే రష్యా నుంచి చమురు కొంటోంది. ఈ డబ్బు రష్యా యుద్ధ యంత్రానికి వెళ్తోంది. అమెరికనా పన్ను చెల్లింపుదారులు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. నిజాన్ని భారత్ అంగీకరించదు. అసలు విషయాన్ని మళ్లిస్తుంది" అని ఆ పోస్టులో పీటర్ నవారో ఆరోపించారు.
"విషయమేంటంటే ... భారత్, అమెరికా సంబంధాలపై ట్రంప్ నుంచి వచ్చిన తాజా సానుకూల ప్రకటనతో 50 శాతం సుంకాలను తొలగించడం, భారతీయులను బలవంతంగా అమెరికా నుంచి పంపించివేయడం, వీసా నిషేధం ముగియడం, అవుట్‌సోర్సింగ్, పెట్టుబడి పరిమితులు ఆగిపోవడం, ఆపరేషన్ సిందూర్ వంటి సమస్యలకు సమాధానం లభిస్తుందా?'' అని ది హిందూలో దౌత్యవ వ్యవహారాల ఎడిటర్ సుహాసినీ హైదర్ ఎక్స్‌లో ప్రశ్నించారు.
"భారత్‌ను అమెరికా నిర్లక్ష్యం చేయకూడదు. అధ్యక్షుడు ట్రంప్, ప్రధానమంత్రి మోదీ మధ్య మంచి సంబంధాలున్నాయి. అమెరికాలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అమెరికాకు భారత్ ముఖ్యమనే సందేశాన్ని ట్రంప్ ఇవ్వాలనుకుంటున్నారు" పశ్చిమాసియా వ్యవహారాల నిపుణులు వాయల్ అవ్వాద్ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
‘ఆగస్ట్ కన్నా సెప్టెంబర్ మెరుగ్గా ఉంటుంది’
"కానీ అధ్యక్షుడిగా, ఆయన సృష్టించిన కొన్ని సమస్యలున్నాయి. ఇప్పుడు ఆయన వాటిని పరిష్కరించాలి. అప్పుడే భారతీయ కంపెనీలు ఎలాంటి సమస్య లేకుండా ఎలాంటి సుంకం లేకుండా అమెరికాకు ఎగుమతి చేయగలవు" అని అన్నారు.
అమెరికా, రష్యా మధ్య భారత్ అవకాశాలను చూసుకోవాల్సిఉంటుందని అమెరికా ఆర్థిక మంత్రి హోవార్డ్ లుట్నిక్ అన్నారు.
"రష్యా చమురు కొనడం ఆపండి. బ్రిక్స్‌లో భాగం కావడం మానేయండి. అమెరికాకు, డాలర్‌కు మద్దతు ఇవ్వండి, లేదా 50 శాతం సుంకాన్ని ఎదుర్కోవాలి" అని బ్లూమ్‌బెర్గ్‌తో మాట్లాడుతూ లుట్నిక్ అన్నారు.
నీతి ఆయో మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగాడియా తాజా పరిణామాలపై స్పందిస్తూ.. "ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షునికి చాలా అందమైన, సంక్షిప్త సమాధానం ఇచ్చారు, అది స్నేహపూర్వకంగా కూడా ఉంది. ప్రపంచంలోని రెండు ముఖ్యమైన దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించడంలో ఇది చాలా దూరం వెళ్తుందని ఆశిస్తున్నాను" అని రాశారు .
ఆగస్ట్ కంటే సెప్టెంబర్ మెరుగ్గా ఉంటుందని పాకిస్తాన్‌లో భారత మాజీ హైకమిషనర్ అజయ్ బిసారియా అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














