మోదీ, జిన్‌పింగ్, పుతిన్‌లు ట్రంప్‌కు ఏం చెప్పదలచుకున్నారు?

ఫొటో సోర్స్, @NarendraModi
- రచయిత, జుబేర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గత ఏడాది కజాన్‌లో జరిగిన సమావేశంతో పోలిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య తియాంజిన్‌లో జరిగిన తాజా మీటింగ్ స్నేహపూరిత వాతావరణంలో జరిగింది.
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమావేశం సందర్భంగా జరిగిన ఈ సమావేశాన్ని చరిత్రాత్మకమని చెప్పలేకపోయినప్పటికీ, దీనికి వేరే ప్రాముఖ్యత ఉంది.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలు, సుంకాల యుద్ధాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఇద్దరు నాయకులు సమావేశమయ్యారు.
సంబంధాలను సమతుల్యం చేసుకోవడానికి జాగ్రత్తగా చేసిన ప్రయత్నంగా ఈ సమావేశాన్ని చాలామంది చూస్తున్నారు.
ఉమ్మడి ప్రకటనలో, భారత్, చైనాలు అభివృద్ధిలో భాగస్వాములని, ప్రత్యర్థులు కాదని పేర్కొన్నారు. విభేదాలు వివాదాలుగా మారకూడదని కూడా కోరుకున్నారు.
2020లో గల్వాన్ ఘర్షణల నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో ఇప్పుడు నమ్మకం కలిగించే ప్రయత్నం జరిగింది.
ఇద్దరు నాయకులు వాణిజ్యం, సరిహద్దు గురించి మాత్రమే కాకుండా బహుళ ధ్రువ ఆసియా, బహుళ ధ్రువ ప్రపంచం విస్తృత దృక్పథంపై కూడా దృష్టిపెట్టారు.
అమెరికా ఏకధ్రువ ప్రపంచాన్ని గుర్తించబోమని ఇది స్పష్టంగా తెలియజేస్తోంది.


ఫొటో సోర్స్, Getty Images
సమావేశంపై ట్రంప్ ప్రభావం ఎలా ఉందంటే...
శిఖరాగ్ర సమావేశం నేపథ్యాన్ని విస్మరించడం కష్టం.
ట్రంప్ టారిఫ్ యుద్ధం కారణంగా భారతదేశం పరిమిత ఆప్షన్ల మధ్య పరిష్కారం కోసం తహతహలాడుతోంది.
రష్యా నుంచి తక్కువ ధరలకు చమురు కొంటున్నందుకు శిక్షగా భారత్‌పై అదనపు సుంకాలను అమెరికా సమర్థించుకుంటోంది.
నిజానికి, ఈ చర్యలు భారతదేశాన్ని అమెరికా ఉనికి లేని యురేషియా వేదికల వైపుకు తీసుకెళ్తున్నాయి.
ఇండియానా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ సుమిత్ గంగూలీ భారత విదేశాంగ విధానంపై నిపుణులు.
"చైనా, రష్యాలతో కలిసి పనిచేయడానికి భారత్ సుముఖతను తెలియజేస్తోంది" అని బీబీసీతో అన్నారు.
"ట్రంప్ విధానాల కారణంగా భారత్-అమెరికా సంబంధాలు దాదాపు క్షీణిస్తున్న సమయంలో, ఈ వ్యూహం అర్థం చేసుకోదగినదే. అయితే, ఇది స్వల్పకాలానికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుంది" అని ఆయన అంటున్నారు.
సరిహద్దులో శాంతి, స్థిరత్వం పురోగతికి అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేయడం స్నేహానికి సంకేతమే కాదు, హెచ్చరిక కూడా.
సరిహద్దులో శాంతి గురించి చర్చ, సంభాషణల కొనసాగింపు పెద్ద పురోగతి అన్నట్టుగా చూస్తున్నారు చాలామంది.
ఆర్థిక రంగంలో చూసుకుంటే లోటును తగ్గించడం, వాణిజ్యాన్ని పెంచడంపై చర్చలు మరింత ఆశావహంగా కనిపిస్తున్నాయి. వీటిపై నిర్దిమైన చర్చలు జరగలేదుగానీ చైనాతో వ్యాపారం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందనే రాజకీయ సందేశం కచ్చితంగా ఉంది.
వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని ప్రస్తావిస్తూ, మూడో దేశ అభిప్రాయం అన్న భావనను తిరస్కరిస్తూ చైనాతో సంబంధాలను అమెరికా ఒత్తిడికి లోబడి నిర్ణయించబోమన్న సందేశాన్ని యూఎస్‌కు భారత్ ఇచ్చింది.
"భారత్, చైనా ద్వైపాక్షిక స్థాయిలో, ఎస్‌సీవో వేదికపై బలంగా కలిసి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. తియాంజిన్‌లో జరిగిన మోదీ-జిన్‌పింగ్ సమావేశం దీనికి ఒక ఉదాహరణ" అని దిల్లీలోని ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో చైనా వ్యవహారాల నిపుణులు ప్రొఫెసర్ ఫైజల్ అహ్మద్ అన్నారు.
ఈ సమావేశం పరస్పర నమ్మకాన్ని పెంచుతుందని ప్రొఫెసర్ అహ్మద్ భావిస్తున్నారు.
"మోదీ-జిన్‌పింగ్ మధ్య జరిగిన సమావేశం రెండు దేశాల మధ్య విశ్వాసరాహిత్యాన్ని పూడ్చడంలో ఒక పెద్ద అడుగు" అని ఆయన అన్నారు. ఎస్‌సీఓ స్థాయిలో కూడా, తియాంజిన్ సమావేశం ప్రాంతీయ సమస్యలపై సమన్వయాన్ని పెంచింది. అంతర్జాతీయ నేరాలను ఎదుర్కోవడం, కనెక్టివిటీని పెంచడం, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం వంటివి ఇందులో ఉన్నాయి" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుత పరిస్థితులు, పరిణామాలు
దౌత్య సంబంధాల విషయానికొస్తే, వాస్తవ ఫలితాల కంటే కనిపించే చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది.
తియాంజిన్‌లో ప్రధాని మోదీ, జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్ ఒకే వేదికపై కలిసి కనిపించినప్పుడు, ఈ ఫోటో కేవలం ఎస్‌సీఓ హాల్‌కు మాత్రమే పరిమితమయిందిగా భావించలేం.
ఇది భారతదేశానికి చాలా ముఖ్యమైన సమయం. కొన్ని రోజుల కిందటే, ట్రంప్ భారత ఎగుమతులపై 50 శాతం సుంకాలను విధించారు.
యూఎస్ ఫెడరల్ అప్పీల్ కోర్టు ఈ సుంకాలు చెల్లవని, చట్టవిరుద్ధమని తెలిపింది. అయినప్పటికీ కేసు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్నందున అవి అమలులో ఉంటాయి.
ఈ సందర్భంలో, అమెరికా ఆంక్షలు, ఒత్తిడికి లక్ష్యంగా మారిన జిన్‌పింగ్, పుతిన్‌తో కలిసి ఒకే వేదికపై మోదీ కనిపించడానికి ప్రాముఖ్యత ఉంది.
ఇది ఒక ఫోటో కంటే చాలా ఎక్కువ అని ప్రొఫెసర్ ఫైజల్ అహ్మద్ అంటున్నారు.
ట్రంప్ సుంకాలు చాలా అసహజమైనవని, మోదీ-జిన్‌పింగ్-పుతిన్ తియాంజిన్‌లో ఒకే వేదికపైకి రావడం అమెరికాకు సమాధానం అని, ముగ్గురూ కలిసి అమెరికా విధానాల వల్ల ఏర్పడిన ఒత్తిడిని బలంగా ఎదుర్కోగలరని ఆయన అంటున్నారు.
ఏడు సంవత్సరాల తర్వాత ప్రధాని మోదీ చైనా వెళ్లారు. ఇది ఒక ప్రాంతీయ సమావేశంలో పాల్గొనే కార్యక్రమం మాత్రమే కాదు.
జిన్‌పింగ్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశం సంబంధాలను సమతుల్యం చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించింది. అదే సమయంలో, భారత్‌కు అమెరికా ఆవల భాగస్వాములు, ఇతర మార్గాలు ఉన్నాయని చూపించడానికి ఒక వేదికను ఎస్‌సీఓ సమావేశం అందించింది.
"చైనాలో జరిగిన ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొనడాన్ని వ్యూహాత్మక మార్పుగా కాకుండా ప్రధాన దౌత్య సమతుల్యత కోసం చేసిన ప్రయత్నంగా చూడాలి" అని మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వాల్ సిబల్ ఒక వ్యాసంలో రాశారు.

ఫొటో సోర్స్, @narendramodi
ఎస్‌సీఓ ప్రాముఖ్యత
ఎస్‌సీఓను నియంతృత్వ దేశాల గ్రూప్‌గా అమెరికా చూస్తుంటుంది. కానీ భారత్, ఇతర సభ్య దేశాలు దీనితో ఏకీభవించవు.
భారత్‌కు, దాని ప్రాముఖ్యత మరోలా ఉంది. భారత్ వైపు నుంచి చూస్తే రష్యా, చైనా, మధ్యాసియా దేశాలు, అలాగే ఇరాన్ కూడా ఒకే టేబుల్ వద్ద కూర్చునే వేదిక.
చైనాను భారత్ ప్రత్యర్థిలా కాకుండా భాగస్వామిగా చూడాలనే సందేశాన్ని పంపడానికి ఈ శిఖరాగ్ర సమావేశాన్ని చైనా ఉపయోగించుకుంది.
స్థిరత్వం గురించి తరచుగా జరిగే చర్చలు మరింత విశ్వసనీయ సంబంధంగా మారగలవా అన్న విషయంలో భారత్‌కు ఈ సమావేశం ఒక పరీక్ష లాంటిది.
భారత్‌లోని ప్రజలు వాస్తవాన్ని అర్థం చేసుకున్నారు. సరిహద్దు వివాదం ఇంకా పరిష్కారం కాలేదు. చైనాతో భారతదేశానికి 99 బిలియన్ ( సుమారు 8 లక్షల 72 వేల 470 కోట్లు) డాలర్ల వాణిజ్య లోటు రాజకీయంగా తలనొప్పిలా మిగిలిపోయింది. అయినప్పటికీ ఎంత కష్టమైనా సరే... చర్చలు అవసరమని భావిస్తున్నారు.
"మరొక విషయం.. చైనాతో వ్యవహారశైలి రాబోయే కాలంలో భారతదేశానికి అతిపెద్ద వ్యూహాత్మక సవాలుగా మిగిలిపోతుంది" అని విశ్లేషకులు హ్యాపీమోన్ జాకబ్ అన్నారు.
ఆరు దేశాల చిన్న గ్రూప్‌గా ప్రారంభమైన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) ఇప్పుడు పది సభ్య దేశాలు, ఇద్దరు పరిశీలకులు, 14 చర్చా భాగస్వాములతో కూడిన సమూహంగా ఎదిగింది.
ప్రస్తుతం ఇది ప్రాంతీయ సంస్థకు సంబంధించి అతిపెద్ద భౌగోళిక ప్రాంతానికి, ప్రపంచంలో ఎక్కువమంది జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తోంది.
"ఎస్‌సీఓలోని వైవిధ్యం ప్రశంసనీయం. ఇందులో విభిన్న చరిత్రలు, సంస్కృతులు, రాజకీయ వ్యవస్థలు, అభివృద్ధి స్థాయిలు ఉన్నాయి" అని హాంకాంగ్ సీనియర్ విశ్లేషకులు హెన్రీ లీ అన్నారు.
"అయినప్పటికీ, ఎస్‌సీఓ దాని సభ్య దేశాల అవసరాలను, ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించే సహకార వ్యవస్థను సృష్టించింది" అని ఆయన అన్నారు.
వివిధ దేశాలు ఎలా కలిసి పనిచేయవచ్చో ఎస్‌సీఓ ప్రపంచానికి చూపిస్తోందని ఆయన అంటున్నారు. ఇది ఇంకా పూర్తి కానప్పటికీ, దేశాలు కలిసి వస్తే పరస్పర సహకార పరిస్థితిని బలోపేతం చేయవచ్చనడానికి ఇది రుజువని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, @narendramodi
రష్యా పాత్ర ఏంటి?
ఈ సమీకరణంలో రష్యా పాత్ర తక్కువేం కాదు. రష్యా నుంచి భారత్ చౌకైన ముడి చమురును ఎక్కువగా కొనుగోలు చేసే దేశంగా మారింది. ఇలా చేయడం ద్వారా, భారత్ తన పౌరులను ద్రవ్యోల్బణం నుంచి కాపాడింది.
ఈ సంవత్సరం రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశాన్ని సందర్శించనున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది.
భారత్‌కు సంబంధించి రష్యా కేవలం చమురు, ఆయుధాల సరఫరాదారు మాత్రమే కాదు. ఇది స్వయంప్రతిపత్తికి చిహ్నం. నరేంద్ర మోదీ ప్రభుత్వం అమెరికాకు తలవంచకుండా తన సంబంధాలలో సమతుల్యతను కాపాడుకోగలదనడానికి కూడా ఇది రుజువు.
అయితే "రష్యా బలహీనపడుతోంది. దాని భౌతిక, దౌత్య సామర్థ్యాలు పరిమితం" అని ప్రొఫెసర్ గంగూలీ హెచ్చరిస్తున్నారు.
"యుక్రెయిన్ ఆక్రమణ కారణంగా రష్యా దీర్ఘకాలిక సమస్యలను కూడా ఎదుర్కొంటుంది. యుద్ధంలో పది లక్షలకు పైగా ప్రజలు మరణించారు. ఇప్పుడు రష్యా అత్యాధునిక సాంకేతికత, ఆయుధ భాగాలు, చమురు అమ్మకాలకోసం చైనాపై ఎక్కువగా ఆధారపడి ఉంది" అని ఆయన అంటున్నారు.
''రష్యాకు దగ్గరగా వెళ్లిందంటే అది ప్రేమతో కాదు, ఒక అవసరంతో. అమెరికాతో సంబంధాలు అనిశ్చితంగా ఉన్న సమయంలో భారత్ తనదైన విధంగా ముందుకు సాగడానికి ఇది ఉపయోగపడుతుంది'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
"ఇది బ్యాడ్ చాయిస్, కానీ, ఇదే బెస్ట్ చాయిస్" అని భారత మాజీ రాయబారి జతీంద్ర నాథ్ మిశ్రా ఒక మీడియా ఇంటర్వ్యూలో మరింత నిర్మొహమాటంగా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా ఆవలి ప్రపంచం
ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశానికి మోదీ హాజరుకావడం, భారత్‌లో పుతిన్ పర్యటించనుండడం అమెరికా ప్రభావం నుంచి బయటపడడానికి ఉపయోగపడతాయా?
అది జరక్కపోవచ్చు. నరేంద్ర మోదీ, వ్లాదిమిర్ పుతిన్, జిన్‌పింగ్ కలవడం కచ్చితంగా ఒక ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. అయినప్పటికీ రక్షణ, సాంకేతికత, పెట్టుబడి రంగాలలో అమెరికాపై భారత్ ఆధారపడటం కొనసాగుతుంది.
చైనా దురాక్రమణను ఎదుర్కోవడానికి భారత వ్యూహంలో క్వాడ్ ఇప్పటికీ సజీవంగా ఉంది. కానీ స్వరాన్ని మార్చుతోంది ఏది?
మోదీ గతంలో కంటే ఎక్కువగా సమతుల్యతను పాటిస్తున్నారు. ఏదైనా నిర్ణీత ఫార్మాట్‌కు పరిమితం కావడానికి నిరాకరిస్తున్నారు.
"అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, నరేంద్ర మోదీ, జిన్‌పింగ్ మధ్య అనధికారిక సమావేశ వ్యవస్థను తిరిగి ప్రారంభించాలి. తద్వారా ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మకంగా మారగలవు" అని ప్రొఫెసర్ అహ్మద్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మోదీ, ట్రంప్ చరిత్రలో ఎలా నిలిచిపోతారంటే...
ట్రంప్ తాను ఎక్కువగా భయపడే బహుళధ్రువ ప్రపంచాన్ని రెచ్చగొడుతున్నారు.
భారీ సుంకాలను విధించడం ద్వారా, రష్యాకు, చైనాకు భారత్ దగ్గరయ్యేలా చేస్తున్నారు. కోర్టులో ఓడిపోవడం అంటే ప్రపంచ వాణిజ్య నియమాలను పునర్నిర్వచించాలనే తన హక్కును కూడా ట్రంప్ కోల్పోవడమే.
మిత్రదేశాలను మరింత సంతృప్తిపరిచేందుకు ఆయన అమెరికా ప్రభావాన్ని పణంగా పెడుతున్నారు. అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టాలని ఒత్తిడి రావడంతో జపాన్ వాణిజ్య ఒప్పందం కోసం చర్చలను విరమించుకుంది.
ఇది అమెరికాకు సాంప్రదాయకంగా మిత్రదేశాలుగా ఉన్నవి కూడా ఇప్పుడు దానిని వ్యతిరేకించడం ప్రారంభించాయన్నదానికి నిదర్శనం.
ప్రత్యామ్నాయాలు ఉన్నాయని నిరూపించినందుకు మోదీకి క్రెడిట్ ఇవ్వాలా? భారతదేశం అమెరికాను వదిలిపెట్టడం లేదు. ఇప్పటికిప్పుడైతే అది జరగదు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం చాలా విస్తృతమైనది, లోతైనది.
తమ ముందున్న సవాలు ఒకవైపు ఉండడం కాదు, తన అభీష్టానికి అనుగుణంగా వ్యవహరించడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించుకోవడమని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి తెలుసు.
"భారతదేశం పరిస్థితి కష్టంగా ఉంది. కానీ భారత్ ఎదుర్కొంటున్న చాలా సవాళ్లకు కారణం అదే కాదు. ట్రంప్ అస్థిర ప్రవర్తనను, ఆయన లావాదేవీ ఆధారిత విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడానికి మాత్రమే భారత్‌ను నిందించవచ్చు" అని ప్రొఫెసర్ గంగూలీ అంటున్నారు.
నిజానికి, మోదీ చైనా పర్యటన సందేశం ఇదేనని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు.
భారతదేశానికి అవకాశాలున్నాయని, తలవంచమని భారత్‌ను బలవంతం చేయలేమని ఇది అమెరికాకు గుర్తు చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. దౌత్య స్వయంప్రతిపత్తి తన విదేశాంగ విధానానికి మూలస్తంభం అని కూడా భారత్ సందేశం ఇచ్చింది.
స్నేహితుల నుంచి దూరం కావడం ద్వారా అమెరికా పతనాన్ని వేగవంతం చేసిన అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్‌ను చరిత్ర గుర్తుంచుకుంటే, ఏ ఒక్కశక్తికి తలవంచకుండా భారత్ స్వతంత్రంగా వ్యవహరించే స్వేచ్ఛను కాపాడిన నాయకుడిగా మోదీని గుర్తుంచుకుంటుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














