SCO సదస్సు: మోదీ, పుతిన్, జిన్ పింగ్ మాటామంతీ, ఉగ్రవాదంపై డబుల్ స్టాండర్డ్స్ పనికిరావని సదస్సులో స్పష్టం చేసిన భారత ప్రధాని

ఫొటో సోర్స్, Getty Images
చైనాలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సమావేశంలో వివిధ దేశాధినేతలతో వాణిజ్యం, ఇంధనం, రక్షణ, పరస్పర సహకారం వంటి అనేక కీలక అంశాలపై చర్చించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో భాగంగా మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమయ్యారు.
సమావేశానికి సంబంధించిన చిత్రాలను ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ "టియాంజిన్‌లో సమావేశం కొననసాగుతోంది. మా అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నాం" అని రాశారు.
ఈ సమావేశంలో పహల్గామ్ దాడిని ప్రస్తావించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ "ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కావు" అని అన్ని దేశాలు ఏకగ్రీవంగా చెప్పాల్సి ఉంటుందని అన్నారు.
తన ప్రసంగంలో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
"ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడం సంతోషంగా ఉంది. ఘన స్వాగతం పలికినందుకు అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని చెప్పారు.
"ఎస్‌సీఓ గురించి భారతదేశపు ఆలోచన, ఆచరణ మూడు ప్రధాన స్తంభాలపై ఆధారపడి ఉంది. ఎస్‌సీఓ అంటే భద్రత, కనెక్టివిటీ, అవకాశం" అని ప్రధాని మోదీ అన్నారు.


ఫొటో సోర్స్, x.com/narendramodi
సమావేశంలో ఉగ్రవాదం గురించి ప్రస్తావించిన మోదీ పాకిస్తాన్ పేరు చెప్పకుండానే ఆ దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.
"నాలుగు దశాబ్దాలుగా భారతదేశం క్రూరమైన ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. చాలా మంది తల్లులు పిల్లలను కోల్పోయారు. పిల్లలు అనాథలయ్యారు. ఇటీవల పహల్గామ్‌లో చాలా అసహ్యకరమైన ఉగ్రవాదాన్ని చూశాము. ఆ బాధాకర సమయంలో మాకు అండగా నిలిచిన మిత్ర దేశాలకు కృతజ్ఞతలు" అని చెప్పారు.
"ఈ దాడి భారతదేశ ఆత్మకు దెబ్బ మాత్రమే కాదు, ప్రతి దేశానికి, మానవత్వాన్ని నమ్మే ప్రతి వ్యక్తికి బహిరంగ సవాలు. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇవ్వడం మనకు ఆమోదయోగ్యమా అనే ప్రశ్న తలెత్తడం సహజం" అని అన్నారు.
"ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదని మనం స్పష్టంగా ఏకగ్రీవంగా చెప్పాలి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే మనమంతా వ్యతిరేకించాలి" అని మోదీ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














