‘మోదీ గొప్ప ప్రధాని, నేను ఎప్పటికీ ఆయన మిత్రుడినే’ అన్న ట్రంప్ తాజా వ్యాఖ్యలపై మోదీ ఏమన్నారు?

ట్రంప్, మోదీ

ఫొటో సోర్స్, YEARS

అమెరికా, భారత్ మధ్య సంబంధాలు ''చాలా ప్రత్యేకమైనవి'' అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అభివర్ణించారు. తాను, భారత ప్రధాని నరేంద్ర మోదీ మంచి స్నేహితులమని, భారత్, అమెరికా సంబంధాల విషయంలో ఆందోళన చెందాల్సినది ఏమీ లేదని అన్నారు.

ట్రంప్ ప్రకటనను ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు.

అధ్యక్షుడు ట్రంప్ మనోభావాలను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని, ఆయనకు పూర్తిగా మద్దతిస్తున్నానని చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

మోదీ ఏమన్నారంటే..

''మా బంధం గురించి అధ్యక్షుడు ట్రంప్ మనోభావాలు, సానుకూల దృక్పథాన్ని ప్రశంసిస్తున్నాను. భారత్, యునైటెడ్ స్టేట్స్ అత్యంత సానుకూల దూరదృష్టితో కూడిన సమగ్ర, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి" అని ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

భారత్, రష్యాలను చైనాకు కోల్పోయినట్లు గతంలో ట్రంప్ వ్యాఖ్యానించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

పీటర్ నవరో ఏమంటున్నారు?

ట్రంప్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్‌ను ప్రశ్నించగా..''చెప్పడానికి ఏమీ లేదు'' అన్నారు.

మరోవైపు ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరో మరోసారి భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.. భారత్ నిజాన్ని అంగీకరించదని, సమస్యను వక్రీకరిస్తోందని పీటర్ నవారో అన్నారు.

భారత్‌లో రష్యన్ ఆయిల్ ద్వారా 'బ్రాహ్మణులు' లాభాలు ఆర్జిస్తున్నారని ఈ ప్రకటనకు ముందు నవారో ఆరోపించారు. పీటర్ నవరో వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

భారత్-అమెరికా సంబంధాలు మునుపటిలా ఉంటాయా?

ఈ సమయంలో భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నారా అనే ప్రశ్నపై ట్రంప్ స్పందిస్తూ ‘‘నేను ఎప్పటికీ మోదీకి మిత్రుడినే. ఆయన గొప్ప ప్రధాని. నేను ఎప్పుడూ స్నేహితుడిగా ఉంటాను, కానీ ఆయన ఇప్పుడు చేస్తున్నది నాకు నచ్చడంలేదు. కానీ భారత్, అమెరికాల మధ్య సంబంధాలు చాలా ప్రత్యేకమైనవి. ఆందోళన చెందాల్సిన పనిలేదు. అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాలు వస్తూనే ఉంటాయి’’ అన్నారు.

భారత్‌ను చైనాకు వదులుకోవడంపై మీరు ఎవరిని బాధ్యులను చేస్తారు?

ఈ ప్రశ్నకు ట్రంప్ సమాధానమిస్తూ.. 'భారత్‌ను వదులుకున్నామని అనుకోవడం లేదు. రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై నిరాశ చెందాను. 50 శాతం సుంకం విధించడం ద్వారా ఈ విషయాన్ని వారికి చెప్పాను. కానీ మోదీతో నేను బాగా కలిసిపోతాను. భారత్‌, ఇతర దేశాలతో కొనసాగుతున్న వాణిజ్య ఒప్పందాల గురించి అడిగినప్పుడు, "చర్చలు చాలా బాగా జరుగుతున్నాయి. అందరితో బాగానే ఉన్నాం'' అన్నారు.

పీటర్ నవరో

ఫొటో సోర్స్, Getty Images

‘భారత్ నిజాన్ని ఒప్పుకోదు’

శుక్రవారం రాత్రి ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో తన ఎక్స్ అకౌంట్ లో భారత్ గురించి ఒక పోస్ట్ రాశారు. "భారతదేశం అధిక టారిఫ్ రేట్లు అమెరికన్ ఉద్యోగాలను ప్రభావితం చేస్తాయి. భారత్ కేవలం లాభాల కోసమే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది, ఈ డబ్బు రష్యా యుద్ధ తంత్రానికి చేరుతోంది.ఇందులో యుక్రెయిన్, రష్యా ప్రజలు చనిపోతున్నారు. అమెరికన్ పన్ను చెల్లింపుదారులు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. భారత్ సత్యాన్ని అంగీకరించదు. కేవలం కథ అల్లుతుంది' అని వ్యాఖ్యానించారు.

డోనల్డ్ ట్రంప్‌కు అత్యంత విశ్వసనీయ సలహాదారులలో పీటర్ నవారో ఒకరు. ఆయన ఇండియా గురించి, కొన్నిసార్లు మోదీ గురించి దూకుడు వైఖరిని అవలంబిస్తుంటారు.

అంతకుముందు రష్యా,యుక్రెయిన్ యుద్ధాన్ని నవరో 'మోదీయుద్ధం'గా అభివర్ణించారు.

ఆగస్టు 29న ఆయన ఎక్స్‌లో రష్యన్ చమురు నుండి వచ్చే లాభాలు భారతదేశం రాజకీయాలతో సంబంధాలు ఉన్న ఇంధన వ్యాపారులకు, నేరుగా పుతిన్ యుద్ధ నిధికి వెళతాయని రాశారు.

నిర్మల

ఫొటో సోర్స్, Getty Images

భారత ఆర్థిక మంత్రి ఏమన్నారు?

రష్యా చమురు ద్వారా భారత్‌లోని బ్రాహ్మణులు లాభాలు ఆర్జిస్తున్నారంటూ పీటర్ నవారో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.

ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ''బ్రాహ్మణులు లాభాలు ఆర్జిస్తున్నారని చెప్పడం భారత్‌లో బ్రిటిషువారు అమలుచేసిన విభజించు,పాలించు విధానాన్ని పోలి ఉంది'' అన్నారు.

భారత్ చమురు కొనుగోలు ఆర్థిక, వ్యాపార కారణాలపై ఆధారపడి ఉన్నందున రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.

నవారో ప్రకటనపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. 'పీటర్ నవారో నుంచి తప్పుడు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చూశాం. దాన్ని కచ్చితంగా తిరస్కరిస్తాం' అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)