కన్నులో పన్ను: వైద్యశాస్త్రంలోనే అరుదైన కేసుగా చెబుతున్న డాక్టర్లు

ఫొటో సోర్స్, SHAHNAWAZ AHMAD/BBC
- రచయిత, సీటూ తివారీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
పట్నాలోని ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఇటీవల ఒక ప్రత్యేకమైన కేసు వెలుగులోకి వచ్చింది.
ఇక్కడకు వచ్చిన ఓ రోగికి కంటిలో పన్ను పెరుగుతున్నట్టు వైద్యులు గుర్తించారు.
ఇది వైద్య శాస్త్రంలో అరుదైన కేసని ఈ రోగికి ఆపరేషన్ చేసిన డాక్టర్ చెప్పారు.
ఆ రోగికి ఆగస్ట్ 11న సర్జరీ చేసి పంటిని తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు.
కంటి లోపల పన్ను రావడం, అది పెరగడం గురించి తెలుసుకునేందుకు సర్జరీ చేసిన డాక్టర్‌తో పాటు పేషంట్‌ను బీబీసీ సంప్రదించింది.
ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్‌ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిబంధనల ప్రకారం, రోగి గోప్యత కోసం ఆయన పేరు మార్చాం.


ఫొటో సోర్స్, SHAHNAWAZ AHMAD/BBC
కంటిలో పన్ను ఎలా వచ్చింది?
42 ఏళ్ల రమేశ్ కుమార్‌ది( పేరు మార్చాం) బిహార్‌లోని సివాన్ జిల్లా. తన పైదంతాలలో ఒక దాని నుంచి రక్తం కారుతున్నట్టు 2024 అక్టోబర్‌లో ఆయన గుర్తించారు.
గ్రామంలోని స్థానిక వైద్యుని దగ్గర చికిత్స తీసుకోవడంతో 2024 డిసెంబర్ నాటికి పూర్తిగా కోలుకున్నారు.
అయితే, 2025 మార్చిలో రమేశ్‌కు తన కుడి కన్ను, పళ్ల మధ్య.. అంటే బుగ్గపై గడ్డ ఉన్నట్టు అనిపించింది.
దీంతో ఆయన మళ్లీ స్థానిక వైద్యుడిని సంప్రదించారు. ఆయన పట్నా ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా సూచించారు.
"ఆ గడ్డ కారణంగా నా చూపు మసకబారింది. తలలో కుడి వైపు నొప్పి వచ్చేది. తల తిరగడం, నీరసంగా ఉండేది. దీంతో ఎప్పుడూ నిద్రపోవాలని అనిపించేది" అని రమేశ్ బీబీసీకి వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
"నా పని ఆగిపోయింది. ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో దంత వైద్యుడిని జూన్‌లో సంప్రదించా. ఆయన నాకు కోన్‌బీమ్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ (సీబీసీటీ) స్కాన్ చేయించారు. దీంతో నా కంట్లో పన్ను ఉందని తేలింది. ఆగస్ట్ 11న వైద్యులు నాకు ఆపరేషన్ చేశారు. నేనిప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నా" అని రమేశ్ కుమార్ తెలిపారు.
సీబీసీటీ గురించి సరళంగా చెప్పాలంటే ఇదో రకమైన ఎక్స్‌రే. మాక్సిల్లో ఫేషియల్ ప్రాంతాన్ని ( మాక్సిల్లో ఫేషియల్ ప్రాంతం అంటే పైదవడ పైప్రాంతం, చెంపల కింద ఎముకల నిర్మాణం) ఎక్స్‌రే తీసి త్రీడీ చిత్రాలను రూపొందిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
కంట్లో పన్ను ఎలా పెరుగుతుంది?
రమేశ్‌కు డెంటల్ డిపార్ట్‌మెంట్‌తో పాటు మాక్సిల్లోఫేషియల్, ఓఎంఆర్( ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ), అనస్థీషియా విభాగాలకు చెందిన వైద్యులు చికిత్స అందించారు.
మాక్సిల్లోఫేషియల్ సర్జన్ అంటే.. మెదడు, కళ్లు, చెవుల లోపలి భాగాలతో పాటు నుదుటి నుంచి గొంతువరకు ఉన్న ప్రాంతంలో సర్జరీ చేస్తారు.
ఎక్స్‌రేలో కూడా కనిపించని దంతాలు, నోరు, దవడ, ముఖంలో సమస్యలను ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ విభాగం గుర్తిస్తుంది.
"ఇదొక అసాధారణ పరిస్థితి. కడుపులో బిడ్డ పెరిగేటప్పుడు శరీరంతో పాటు దంతాలు అభివృద్ధి చెందుతాయి. ఆ సమయంలో ఈ పన్ను సాధారణంగా కాకుండా వేరే ప్రాంతంలో పెరగడం మొదలైంది" అని పట్నాలోని ఐజీఐఎంఎస్ ఓఎంఆర్ విభాగం అధిపతి నిమ్మీసింగ్ చెప్పారు.
"మానవ శరీరంలో అనేక అవయవాలు, సాధారణంగా అవి ఉండవలసినచోట కాకుండా వేరే ప్రాంతాల్లో ఏర్పడతాయి" అని సర్జరీలో పాల్గొన్న మాక్సిల్లోఫేషియల్ సర్జన్ ప్రియాంకర్ సింగ్ చెప్పారు.
"బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు లేదా ముఖం పెరుగుతున్నప్పుడు, దంతాలను తయారు చేసే మూలకం చెల్లాచెదురై శరీరంలో వేరే చోటకు వెళితే.. అది అక్కడ పెరుగుతుంది. ఈ కేసులో కూడా అదే జరిగింది. దీంతో అది 'ఫ్లోర్ ఆఫ్ ది ఆర్బిట్'లో(కంటి దిగువ భాగం) పెరిగింది" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కళ్ల కింద పళ్ల మూలాలు
మనిషి పుర్రెలో కళ్లు ఉన్న ఎముక సెల్‌ను ఆర్బిట్ అని పిలుస్తారు. తేలికైన పదాల్లో చెప్పాలంటే కళ్లను పరిరక్షించే సాకెట్. కళ్ల దిగువ భాగాన్ని 'ఫ్లోర్ ఆఫ్ ది ఆర్బిట్' అంటారు.
రోగి రమేశ్ కుమార్ సీబీసీటీ చేయించుకున్నప్పుడు, పంటి మూలాలు ఫ్లోర్ ఆఫ్ ది ఆర్బిట్‌లో ఉన్నట్టు గుర్తించారు.
"పన్ను మూలాలు ఫ్లోర్ ఆఫ్ ది ఆర్బిట్‌లో ఉన్నాయి. దానిపై భాగం (దంతంలోని తెల్లటి భాగం) మాక్సిలరీ సైనస్‌లో ఉంది. ఈ పన్ను సాధారణ స్థితిలో ఏర్పడనందున, శరీరానికి అది పరాయి భాగంలా అనిపిస్తుంది'' అని ప్రియాంకర్ చెప్పారు.
"శరీర రక్షణ వ్యవస్థ ఈ పరాయి భాగం చుట్టూ ఒక తిత్తి (ఒక రకమైన సంచి)ని సృష్టించి దానిని రక్షించింది. ఈ తిత్తి మాక్సిలరీ సైనస్ మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టింది, దీని వల్ల ముఖంపై వాపు వచ్చింది. పై దవడ ఎముక కరిగిపోతోంది."
మాక్సిలరీ సైనస్ అనేది , పై దవడకు మధ్య ఉన్న ప్రాంతం. ఇది బుగ్గలో ఒక భాగం.
ఫ్లోర్ ఆఫ్ ది ఆర్బిట్ దిగువ భాగంలో పన్ను ఏర్పడడంతో అక్కడ అనేక నరాలు బయటకు వస్తాయి. కాబట్టి, ఇది చాలా కష్టమైన శస్త్రచికిత్స.

ఫొటో సోర్స్, SHAHNAWAZ AHMAD/BBC
పన్ను ఎంత ఉంది?
నేను రోగి రమేశ్ కుమార్‌ను చూసినప్పుడు, ఆయన మామూలుగా కనిపించారు. ఆయన ముఖంలో ఎలాంటి గుర్తులూ లేవు.
నిజానికి, శస్త్రచికిత్స ఆయన నోటి లోపల జరిగింది. దవడను కోసి చేశారు. 10 నుంచి 12 కుట్లు పడ్డాయి.
సర్జన్ ప్రియాంకర్ సింగ్ మొదట కంటి దగ్గర కోసి ఈ ఆపరేషన్ చేయాలనుకున్నారు. కానీ రమేశ్ వయసు, ఆయన వృత్తిని దృష్టిలో పెట్టుకుని నోటి లోపల నుంచి ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు.
ఈ ఆపరేషన్ తర్వాత, రోగి కంటి చూపు బాగైంది. ఆపరేషన్ చేసి తొలగించిన పన్ను పరిమాణం ఎంత?
ఈ పన్ను పరిమాణం రోగి ప్రీమోలర్ పన్ను అంత ఉందని నిమ్మీసింగ్ చెప్పారు.
ప్రీమోలార్ దంతాలు మన నోటి వెనుక భాగంలో ఉంటాయి. అవి ముందు నుంచి కనిపించే దంతాలు, నోటి వెనుక భాగంలో ఉన్న మోలార్ దంతాల మధ్య ఉంటాయి.
"రోగికి సరిపడా దంతాలున్నాయి. అన్ని పళ్లు ఉన్నప్పుడు కూడా కొత్త దంతాలు ఏర్పడినప్పుడు, దానిని సూపర్ న్యూమరరీ టూత్ అని పిలుస్తాం" అని ప్రియాంకర్ సింగ్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇది చాలా అరుదైన కేసు
ఇది చాలా అరుదైనదని నిమ్మీ సింగ్, ప్రియాంకర్ సింగ్ ఇద్దరూ అంటున్నారు.
"భారత్‌లో ఇలాంటి కేసులు రెండు లేదా మూడు మాత్రమే నమోదయ్యాయి. ప్రముఖ సర్జన్ ఎస్ఎం బాలాజీ చెన్నైలో ఇలాంటి ఆపరేషన్ 2020లో చేశారు. ఆ పేషెంట్‌కు కూడా ఈ రోగికి ఉన్నట్టుగానే పన్ను చాలా ముఖ్యమైన శరీర నిర్మాణానికి దగ్గరగా ఉంది" అని ప్రియాంకర్ సింగ్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
మళ్లీ ఇలాంటి పళ్లు వస్తాయా?
"అలాంటి దంతాలు మళ్లీ ఏర్పడే అవకాశం లేదు. కానీ, మేము రోగి పరిస్థితిని పరిశీలిస్తుంటాం. తిత్తిని చాలా జాగ్రత్తగా తొలగించాం. కానీ కొంతభాగం అలాగే ఉండొచ్చనుకుంటున్నాం" అని ప్రియాంకర్ సింగ్ అంటున్నారు.
"మేం ఆ ప్రాంతాన్ని, అంటే మాక్సిలరీ సైనస్‌ను కాటరైజ్ చేశాం, అంటే భవిష్యత్తులో ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి తిత్తిలోని మిగిలిన భాగాన్ని కాల్చివేశాం" అని చెప్పారు.
బీబీసీ బృందం రమేశ్‌ను కలిసినప్పుడు, కుట్లు కారణంగా ఆయన మాట్లాడడానికి, నవ్వడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు. కానీ, చికిత్సతో ఆయన సంతోషంగా ఉన్నారు.
"నా భార్య ఏడుస్తూనే ఉంది. ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామస్తులంతా నా క్షేమసమాచారాల గురించి తెలుసుకోవాలనుకున్నారు. కానీ, ఇప్పుడు నేను ఎక్కువగా మాట్లాడటం మంచిది కాదు. మళ్లీ నా జీవితాన్ని ప్రారంభించి, నా భార్యాబిడ్డలను కలవాలని ఆత్రుతగా ఉన్నా" అని రమేశ్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














