రైసిన్: ఈ ఆముదం విషమేంటి? రసాయన ఆయుధ జాబితాలో ఎందుకుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గుజరాత్ పోలీసులు డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, ఆజాద్ సులేమాన్ షేక్, మహమ్మద్ సుహైల్ మహమ్మద్ సలీమ్ అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. లఖ్‌నవూ, దిల్లీ, అహ్మదాబాద్‌లలో భారీ కుట్రకు వీరు రెక్కీ చేశారని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు చెప్పినట్టు పీటీఐ తెలిపింది.
అయితే, వారు దానికోసం ఎంచుకున్న మార్గం ఇప్పుడు పెద్ద చర్చకు, ఆసక్తికీ కారణమైంది.
మనుషులను చంపడానికి ఆముదం గింజల నుంచి తీసిన విషాన్ని వినియోగించాలని వీరు పథకం వేసినట్టు గుజరాత్ ఏటీఎస్ ఆరోపించింది.
వీరిలో డా. అహ్మద్ మొహియుద్దీన్ చైనాలో ఎంబీబీఎస్ చదివారు. రసాయన శాస్త్రంలో ఆయన తన పరిజ్ఞానాన్ని వాడి ఆముదం గింజల నుంచి విషం సేకరిస్తున్నారన్నది గుజరాత్ పోలీసుల ఆరోపణ. ఆయనకు ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలున్నాయని గుజరాత్ పోలీసులు చెప్పినట్టు పీటీఐ పేర్కొంది.
ఈ మొత్తం వ్యవహారంలో అసలు ఆముదం గింజలతో మనుషులను చంపొచ్చా? అనే ప్రశ్న మొదలైంది.

వారిని అరెస్ట్ చేసిన సమయంలో గుజరాత్ పోలీసులకు వారి వద్ద ఆముదం నూనె లభించింది. ఆముదం గింజల నుంచి రైసిన్ (Ricin - రైజిన్ అని కూడా పిలుస్తున్నారు) తీసే ప్రయత్నం చేసినట్టు అనుమానితుల్లో ఒకరు పోలీసులకు చెప్పినట్టు, దీంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేస్తున్నట్టు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' రాసింది. అయితే ఆ విషాన్ని ఎలా ప్రయోగించాలని వారు అనుకున్నారనే దానిపై విచారణ జరగాల్సి ఉందని రాసింది.
దీంతో భారీ తీవ్రవాద దాడికి వారు ప్రణాళిక రచిస్తున్నట్టు ఏటీఎస్ డీఐజీ ప్రకటించారు. అయితే, ప్రస్తుతానికి వారి వద్ద సిద్ధం చేసిన రైసిన్ విషం దొరకలేదని, వారు తయారీ ప్రయత్నంలో ఉండగానే పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలేంటీ రైసిన్?
రైసిన్ అనేది ఆముదం గింజల నుంచి తీసే ఒక విషపదార్థం.
ఆ మొక్క శాస్త్రీయ నామం రైసినస్ కమ్యూనిస్ (Ricinus communis). ఆ గింజల నుంచి నూనె తీసేసిన తరువాత, మిగిలిన పిప్పి నుంచి దీన్ని తీస్తారు. ఇది చిన్న మోతాదు కూడా ప్రమాదకరంగా మారుతుంది.
ఆముదం నూనె ప్రమాదకరం కాదు. నూనె తీసిన తరువాత వచ్చే పిప్పిని ప్రత్యేకంగా శుద్ధి చేసి, ఈ రైసిన్ తీస్తారు.
భారత్ సహా అనేక దేశాలు సభ్యులుగా ఉన్న 'ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్' సంస్థ ప్రకారం, రైసిన్ ఒక రసాయన ఆయుధ జాబితాలో ఉంది.
అయితే, ఇప్పటి వరకు నిరూపితమైన నేరాలలో.. ప్రపంచంలో ఇంతవరకు రైసిన్‌ను వాడి ఒకరిని హత్య చేసినట్లు తేలింది.
శరీరంలో చొప్పించడం ద్వారా, ఇంజెక్షన్ ద్వారా, నోటితో తీసుకోవడం ద్వారా, చర్మం ద్వారా కూడా రైసిన్ ప్రమాదకరంగా మారుతుంది. దానికి వాసన, రుచి ఉండదు. అందుకే అది ఆహారంలో కలిసిన విషయాన్ని ఎవరూ గుర్తించలేరు.
రసాయన శాస్త్రపరంగా రైసిన్ అనేది ఒక లెక్టిన్. అంటే, కార్బో హైడ్రేట్‌తో బైండ్ అయి ఉన్న ప్రొటీన్.

ఫొటో సోర్స్, Getty Images
‘కొందరు దుర్వినియోగం చేస్తున్నారు...’
''దీన్ని కేన్సర్ చికిత్సకు కూడా వాడతారు. కానీ కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ విషం ఇన్హేలేషన్, ఇంజెషన్, ఇంజెక్షన్.. ఇలా మూడు రకాలుగా ఇచ్చి హాని కలిగించవచ్చు. అయితే, ఇది సెల్ డెత్.. అంటే మనిషి శరీరంలోని కణాల్లో ప్రొటీన్ తయారు కానివ్వకుండా చేస్తుంది. దాంతో 36 నుంచి 72 గంటల్లో మనిషి చనిపోతాడు'' అని బీబీసీతో చెప్పారు సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ అనస్థీషియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మాదాల.
అమెరికా ప్రభుత్వపు సీడీసీ (సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) సంస్థ తన వెబ్ సైట్లో పేర్కొన్న ప్రకారం...
రైజిన్ తెల్లని పిండిలా ఉంటుంది. ద్రవ, ఘన రూపాల్లో కూడా చేయవచ్చు. ఆముదం నూనె తీసిన తరువాత వచ్చే పిప్పి నుంచి దీన్ని తీయవచ్చు. మనుషుల శరీర కణాల్లో ప్రొటీన్ తయారుకాకుండా ఇది ఆపుతుంది. దీంతో పాటు రకరకాల అలర్జీలు రావచ్చు. చాలా చిన్న మొత్తం కూడా ప్రాణాంతకం.
గాలి, నీరు, ఆహారంలో కలిసి.. నోటి ద్వారా, ఇంజెక్షన్ ద్వారా, ఇంజెషన్ ద్వారా, పీల్చడం ద్వారా, కంటి ద్వారా, గాయాల ద్వారా కూడా ఇది శరీరంలోకి వెళ్లగలదు.
రైసిన్ శరీరంలోకి ఇంజెషన్ చేస్తే తీసుకున్న కొన్ని గంటలు లేదా రోజుల వరకూ ఏ భౌతిక లక్షణమూ కనిపించకపోవచ్చు. ఆ తరువాత ప్రభావం మొదలవుతుంది. తీసుకున్న 6 గంటల్లోపు జీర్ణకోశంపై ప్రభావం కనిపిస్తుంది.
సాధారణంగా విష ప్రయోగం జరిగిన 2 నుంచి 5 రోజుల తర్వాత కాలేయం, కేంద్ర నాడీ వ్యవస్థ (CNS), మూత్రపిండాలు, అడ్రినల్ గ్రంథులపై ప్రభావం కనిపిస్తుంది. వీటిపై సైటోటాక్సిక్ ప్రభావం ఉంటుంది. ఈ సైటోటాక్సిక్ ప్రభావ లక్షణాలు కనిపించడానికి ముందు బాధితుల్లో ఎటువంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు.
రైసిన్ విష ప్రభావం మొదలైన తర్వాత 3 నుంచి 5 రోజుల మధ్య మరణించే అవకాశం ఉంది. ఇక ఆ రైసిన్ శరీరానికి ఏ రూపంలో వెళ్లింది, ఎంత మోతాదు వెళ్లింది, ఏ భాగంలోకి వెళ్లింది అనే దానిపై దాని ప్రభావాలు ఆధారపడి ఉంటాయి.
దీనికి నేరుగా విరుగుడు (antidote) లేదు. అయితే ప్రథమ చికిత్స చేసి వీలైనంత తొందరగా వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లాలి. పరిస్థితి తీవ్రతను బట్టి చికిత్స అందించాలి.
''ఆముదం నూనె ప్రమాదకారి కాదు. నేరుగా కొద్ది మొత్తంలో గింజలు తిన్నా మరీ ప్రమాదకరం కాదు. కానీ ఆ గింజలను ప్రొసీజర్ ప్రకారం రిఫైన్ చేస్తేనే రైసిన్ వస్తుంది. ఒకే గింజలో అంత మొత్తంలో రైసిన్ ఉండదు. కానీ, ఒకేసారి ఎక్కువ మొత్తంలో గింజలు తింటే మాత్రం విషపూరితం అవుతుంది'' అని వివరించారు డాక్టర్ కిరణ్ మాదాల.

ఫొటో సోర్స్, Getty Images
రైసిన్‌తో జరిగిన ఫేమస్ హత్య
బల్గేరియా కమ్యూనిస్టు పాలన నుంచి తప్పించుకుని లండన్‌లో జీవిస్తున్న జార్జి మార్కోవ్ అనే వ్యక్తి హత్య రైసిన్ ద్వారా చేసిన ఏకైక హత్యగా తెలుస్తోంది. ఇది 1978లో జరిగింది. బీబీసీ కథనం ప్రకారం.. లండన్‌లోని వాటర్లూ బ్రిడ్జ్‌పై జరిగిన ఈ హత్యనే అంబ్రెల్లా అసాసినేషన్ లేదా అంబ్రెల్లా మర్డర్ అని కూడా పిలుస్తారు.
1960ల నాటికి జార్జి మార్కోవ్ బల్గేరియాలో ప్రముఖ రచయిత. 1969లో కమ్యూనిస్టు పార్టీ ఇబ్బంది పెట్టడంతో లండన్‌లో స్థిరపడ్డారు. బీబీసీ ఎక్స్‌టర్నల్ సర్వీసుల్లో కూడా పనిచేశారు. ఆయన ఇతర సంస్థల కోసం ఇచ్చిన నివేదికలు కమ్యూనిస్టు పాలకులకు కోపం తెప్పించి హత్యకు దారితీశాయి.
ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక గొడుగుతో ఆయన్ను గుచ్చాడు. తొడలో నొప్పి అనిపించింది. రాత్రికి జ్వరం వచ్చింది. నాలుగు రోజుల తర్వాత మరణించారు. అప్పటికి ఆయన మరణానికి కారణం అర్థం కాలేదు.
రైసిన్ విషంతో నింపిన చాలా చిన్న లోహపు గొట్టం లేదా గుళిక (pellet) ఆయన మరణానికి కారణమని విచారణలో తేలింది. బల్గేరియాతో పాటు సోవియట్ కేబీజీ ఇందులో భాగస్వామి అని ఆరోపణలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా రైసిన్ కేసులు
మొదటి ప్రపంచ యుద్ధం నాటికే ఈ రైసిన్ వాడకం ఉంది. అనేకమార్లు రైసిన్‌ని ఉపయోగించి ప్రత్యర్థులను చంపాలని, హాని చేయాలని ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరిగాయి. అలాంటి ఎన్నో కుట్రలను ప్రపంచవ్యాప్తంగా పోలీసులు భగ్నం చేశారు.
అమెరికాలో ఒబామా, ట్రంప్ సహా పలువురు రాజకీయ నాయకులకు ఈ రైసిన్ పౌడర్ పంపిన ఘటనలున్నాయి. గుజరాత్ తరహాలో 2018లో జర్మన్ పోలీసులు కూడా రైసిన్ తయారు చేస్తున్న వారిని పట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి రైసిన్ కేసులు అనేకం నమోదయ్యాయి.
డిటెక్టివ్ పేరుతో తెలుగులో విడుదలైన తమిళ హీరో విశాల్ సినిమాలో ఈ రైసిన్‌తో చంపడం గురించిన సన్నివేశాలు ఉన్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














