ఆ మహిళా డాక్టర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు, తన అరచేతిలో ఆమె ఏం రాశారు?

ఆత్మహత్య

ఫొటో సోర్స్, BBC/getty Images

మహారాష్ట్రలోని సతారా జిల్లా, ఫల్తాన్‌లో ఓ మహిళా వైద్యురాలు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. తన అరచేతిపై ఆమె సూసైడ్ నోట్ రాశారు. అందులో ఓ పోలీసాధికారి, మరో వ్యక్తి గురించి తీవ్రమైన ఆరోపణలు చేశారు.

పోలీసు అధికారి, మరో వ్యక్తి తనను లైంగికంగా వేధించారని ఆమె సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నారు.

ఈ కేసు సతారా జిల్లాలో సంచలనం సృష్టించింది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.అయితే నిందితులు పరారీలో ఉన్నారని, వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలేం జరిగింది?

ఆ మహిళా డాక్టర్ అక్టోబర్ 23వ తేదీ గురువారం, ఫల్తాన్‌లోని ఒక హోటల్‌కి వెళ్లి అక్కడ ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె తన చేతిపై రాసుకున్న సూసైడ్ నోట్‌లో ఒక పోలీసు అధికారి, మరొక వ్యక్తి పేర్లు ఉన్నాయి.

ఒక పోలీసు అధికారి తనపై నాలుగుసార్లు అత్యాచారం చేశాడని, మరొక వ్యక్తి తనను శారీరకంగా, మానసికంగా హింసించాడని మహిళా వైద్యురాలు రాశారు.

నకిలీ పోస్ట్‌మార్టం నివేదికలను తయారు చేయమని ఆ మహిళా వైద్యురాలిపై రాజకీయ, పోలీసు వర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని ఆమె సోదరుడు తెలియజేశారు.

ఆమెకు ఎంపీ వ్యక్తిగత సహాయకుడి నుంచి ఇలాంటి నకిలీ నివేదికలు తయారుచేయాలని కాల్స్ వచ్చేవని ఆమె బంధువులు ఆరోపించారు.

మహిళా వైద్యురాలు

"ఏడాదినుంచి, రాజకీయ నాయకులు, పోలీసుల నుంచి తప్పుడు పోస్ట్‌మార్టం నివేదికను తయారు చేయాలన్న ఒత్తిడిని ఆమె ఎదుర్కొన్నారు. తన సోదరికి ఈ విషయాన్ని ఆమె పదే పదే చెప్పేవారు" అని ఆమె సోదరుడు మీడియాకు వెల్లడించారు.

"కానీ, ఆమెపై ఇంత ఒత్తిడి ఉంటుందని అనుకోలేదు. చివరికి, బాధలతో విసిగిపోయి, భరించలేక, ఆమె నిన్న ఆత్మహత్య చేసుకున్నారు " అని ఆయన అన్నారు.

"తనను వేధించిన పోలీసు అధికారుల పేర్లను కూడా ఆమె తన చేతిపై రాసుకున్నారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి ఆమె గత కొంతకాలంగా డిఎస్పీ, ఎస్పీలకు లేఖలు కూడా రాశారు" అని ఆయన అన్నారు.

"ఆమె వచ్చి,వెళ్లిన టైం కూడా నమోదు చేశారు. కానీ ఆమె ఫిర్యాదుపై ఇప్పటివరకు ఎటువంటి చర్యా తీసుకోలేదు. అలాగే, కొంత సమాచారం కోసం ఆర్టీఐ దాఖలు చేసింది, కానీ దానిపై కూడా ఎటువంటి స్పందనా లేదు" ఆయన తెలిపారు.

పరారీలో నిందితులు

బాధితురాలు తన సూసైడ్ నోట్‌లో పేర్లు రాసిన ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ కారణంగా, వారిని సంప్రదించడం సాధ్యం కాలేదు.

తనపై నాలుగుసార్లు అత్యాచారం చేశాడని బాధిత మహిళా వైద్యురాలు ఆరోపించిన పోలీసు అధికారిని సస్పెండ్ చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ తుషార్ దోషి తెలిపారు.

నిందితులిద్దరిపైనా కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన పోలీసు సూపరింటెండెంట్ తుషార్ దోషి, "శుక్రవారం ఉదయం కేసు నమోదు చేశాం. ఈ మహిళా వైద్యురాలు తన చేతిపై రెండు పేర్లు రాసుకుంది. అందులో ఫల్తాన్ రూరల్ పీఎస్ఐతో పాటు మరొక వ్యక్తి పేరు కూడా ఉంది" అని అన్నారు.

" శారీరకంగా, మానసికంగా హింసించడమే కాకుండా అత్యాచారం కూడా చేశారని ఆమె ఆరోపించారు. ఈ కారణాల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసినందున, కేసు నమోదు చేశాం" అని ఆయన తెలిపారు.

"అత్యాచారం, ఆత్మహత్యకు ప్రేరేపించడం అనే రెండు సెక్షన్ల కింద కేసు నమోదైంది. నిందితులను అరెస్టు చేయడానికి ఒక బృందాన్ని పంపించాం. పీఎస్ఐపై కేసు నమోదైనందుకు ఆయన్ని వెంటనే సస్పెండ్ చేశారు" అని తుషార్ దోషి వెల్లడించారు.

అంబులెన్స్, పోలీసులు, నిందితులు

తాము అడిగినట్టుగా రిపోర్ట్ ఇవ్వమని తనపై ఒత్తిడి తెస్తున్నారని ఈ మహిళా డాక్టర్ ఫిర్యాదు చేశారా? అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు "ఆమె పోలీసులపై అప్పటి ఎస్‌డీపీఓకి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెపై జిల్లా సర్జన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రెండు వైపులా పరస్పర ఫిర్యాదులు నమోదయ్యాయి" అని పోలీసులు సమాధానమిచ్చారు.

ఈ మహిళా వైద్యురాలిపై ఎంపీ పీఏ కూడా ఒత్తిడి తెచ్చారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.

రాజకీయ ఒత్తిడిపైన కూడా దర్యాప్తు జరుగుతుందా? అని అడిగినప్పుడు, "ప్రస్తుతం, ఇది అసహజ మరణంలా కనిపిస్తోంది. ప్రాథమికంగా, ఇది ఆత్మహత్యగా కనిపిస్తోంది" అని పోలీసు సూపరింటెండెంట్ తుషార్ దోషి అన్నారు.

"ముందుగా, ఇది ఆత్మహత్య అని నిర్ధరణవ్వాలి. ఆ తర్వాత, ఆత్మహత్యకు గల కారణం ఏంటో తెలుసుకోవాలి. ఆ మహిళా డాక్టర్ అందులో ఏం రాశారో, ఆమె ఇంతకు ముందు ఏమి మాట్లాడారో, ఇవన్నీ దర్యాప్తు చేస్తాం" అని ఆయన బదులిచ్చారు.

'ఫిర్యాదులు ఉన్నప్పటికీ, ఎవరూ పట్టించుకోలేదు'

ఈ మహిళా వైద్యురాలు తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి పదే పదే లిఖితపూర్వకంగా, మౌఖికంగా ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోలేదని ఆమె మామయ్య, సోదరుడు మీడియాకు తెలిపారు.

ఈ మహిళా డాక్టర్ జూన్ 19, 2025న ఈ సంఘటన గురించి ఫిర్యాదు చేస్తూ ఫల్తాన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు అధికారికంగా లేఖ రాశారు.

పోలీసులు, నిందితులు, పరారీ

"రోగి (నిందితుడు) ఆరోగ్యంగా లేకపోయినా ఆరోగ్యంగా ఉన్నట్టుగా సర్టిఫికెట్ ఇవ్వమని వారు పదే పదే ఒత్తిడి తెస్తున్నారు. అసభ్యకరమైన భాషను కూడా ఉపయోగిస్తున్నారు. నేను ఈ విషయాన్ని పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్‌లో చెప్పినప్పుడు, ఆయన 'నాకు దానితో సంబంధం లేదు' అని అస్పష్టమైన సమాధానాలు ఇచ్చారు" అని ఆమె ఆ లేఖలో రాశారు.

ఈ ఫిర్యాదును ఎవరూ పట్టించుకోకపోవడంతో, ఆమె ఆగస్టు 13న సమాచార హక్కు కింద ఆర్టీఐ కూడా ఫైల్ చేశారు.

ఈ ఆర్టీఐ ద్వారా తన ఫిర్యాదుపై దర్యాప్తు ఎంతవరకూ వచ్చిందో తెలుసుకోవడానికి ఆమె ప్రయత్నించారు, కానీ ఆర్టీఐకి కూడా ఎటువంటి స్పందన రాలేదని ఆమె సోదరుడు తెలిపారు.

తరువాత, ఆ వైద్యురాలు మళ్ళీ తన ఫిర్యాదులను సవివరంగా పేర్కొంటూ మరొక లేఖ రాశారు.

‘‘అప్పుడే ఎందుకు స్పందించలేదు?’’

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) ఎంపీ సుప్రియా సూలే ఈ విషయంపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.

"ఒక మహిళా వైద్యురాలి ఆత్మహత్య కేసు చాలా తీవ్రమైనది. ఆ మహిళ రాసిన సూసైడ్ నోట్‌లో, గత కొన్ని రోజులుగా తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని తన ఉన్నతాధికారులకు పదే పదే తెలియజేశారు. కానీ ఆమె ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోలేదు. చివరికి, ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యకు మూల కారణం ఏమిటి? ఈ మహిళ ఫిర్యాదును ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలని" ఆమె రాశారు.

రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రూపాలి చకాంకర్ కూడా ఈ విషయంపై ఒక వీడియో పోస్ట్ చేశారు.

"రాష్ట్ర మహిళా కమిషన్ దీనిని పరిగణనలోకి తీసుకుంది. ప్రస్తుతం, ఈ విషయంలో ఫల్తాన్ సిటీ పోలీస్టేషన్‌లో భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 64 (2), 108 కింద కేసు నమోదు చేశాం. పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేయడానికి ఒక బృందాన్ని పంపారు" అని పేర్కొన్నారు.

"ఆ మహిళా డాక్టర్ ముందే తనపై జరుగుతున్న వేధింపుల గురించి ఫిర్యాదు చేసినప్పటికీ, సహాయం ఎందుకు అందలేదు అనేదానిపై కూడా దర్యాప్తు చేయాలి అని రాష్ట్ర మహిళా కమిషన్ పోలీసులకు సూచించింది. అలాగే, సంబంధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కమిషన్ ఆదేశించింది" అని రూపాలి తెలిపారు.

ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.

సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)