చైనాలో సామాన్యుడు.. కంబోడియాలో కోటీశ్వరుడెలా అయ్యాడు, ఇప్పుడెందుకు అదృశ్యమయ్యాడు?

ఫొటో సోర్స్, Prince Group/Getty images
- రచయిత, జొనాథన్ హెడ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చెన్ ఝీ. వయసు జస్ట్..37 ఏళ్లు. అంతే.
"మనుషుల కష్టాల మీద నేరమయ వ్యాపారాన్ని, సైబర్ మోసాల సామ్రాజ్యాన్ని సృష్టించడం వెనుక మాస్టర్ మైండ్" అని ఆయనపై ఉన్న ఆరోపణలు.
పసిపిల్లాడిలా కనిపించే అమాయకపు మొహం, మేకపోతు గడ్డాన్ని పోలిన గడ్డంతో ఆయన తన అసలు వయసు కంటే చిన్నగా కనిపిస్తారు. కానీ చాలా తక్కువ కాలంలోనే అపర కుబేరుడయ్యారు.
కంబోడియాలో స్కామ్ కేంద్రాలన నడుపుతూ ప్రపంచవ్యాప్తంగా అనేకమంది నుంచి క్రిప్టో కరెన్సీ రూపంలో కోట్ల రూపాయలు దోచుకున్నారని గత వారం అమెరికన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఆయనపై అభియోగాలు మోపింది.
చెన్ ఝీకి చెందినవిగా భావిస్తున్న 14 బిలియన్ డాలర్ల విలువైన బిట్ కాయిన్లను అమెరికన్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ జప్తు చేసింది.
క్రిప్టో కరెన్సీ జప్తుకు సంబంధించి ఇప్పటి వరకు ఇదే పెద్ద మొత్తమని ట్రెజరీ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

చెన్ ఝీ సొంత కంపెనీ ప్రిన్స్ గ్రూప్ ఆయనను "గౌరవనీయుడైన పారిశ్రామికవేత్త, ప్రముఖ దాత" అని పేర్కొంది.
చెన్ ఝీ మీద వచ్చిన ఆరోపణల గురించి తెలుసుకునేందుకు ప్రిన్స్ గ్రూప్‌ను బీబీసీ ప్రతినిధి సంప్రదించినప్పుడు "ఆయన దూరదృష్టి, నాయకత్వం వల్ల ప్రిన్స్ గ్రూప్, కంబోడియాలో అంతర్జాతీయ ప్రమాణాలతో పని చేస్తోంది" అని గ్రూప్ ప్రతినిధి చెప్పారు.
అక్రమాల సామ్రాజ్యాన్ని నడుపుతున్న అంతు చిక్కని వ్యక్తి గురించి మనకు ఏం తెలుసు?

ఫొటో సోర్స్, Getty Images
చిన్న గేమింగ్ కంపెనీతో మొదలు పెట్టి..
చైనాలోని ఫ్యూజియాన్ ప్రావిన్స్‌లో చిన్న ఇంటర్నెట్ గేమింగ్ కంపెనీని ప్రారంభించిన చెన్ ఝీ 2010 చివరి నాళ్లలో కంబోడియా వెళ్లారు.
అక్కడ అప్పుడే విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ రంగంలో పని చేయడం మొదలు పెట్టారు.
కంబోడియాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటున్న రోజుల్లోనే చెన్ ఝీ యాదృశ్చికంగా ఆ దేశంలో అడుగు పెట్టారు.
రాజకీయాల్లో ఉన్న బలమైన నాయకుల చేతుల్లో ఉన్న భూముల లభ్యత, చైనా నుంచి వచ్చే పెట్టుబడులతో కంబోడియాలో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు తీయడం మొదలైంది.
చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ అమలులో భాగంగా జిన్‌పింగ్ ప్రభుత్వం కంబోడియాలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేసింది.
ఇదే సమయంలో చైనాలో రియల్ ఎస్టేట్ పడకేయడంతో ఈ వ్యాపారంలో ప్రత్యామ్నాయ దారుల కోసం ఎదురు చూస్తున్న చైనా సంస్థలు కంబోడియాలో అడుగు పెట్టాయి.
కంబోడియాను సందర్శించే చైనా టూరిస్టుల సంఖ్య వేగంగా పెరిగింది.
కంబోడియా రాజధాని నామ్‌ఫెన్ రూపు రేఖలు నాటకీయంగా మారిపోయాయి.
నామ్‌ఫెన్‌లో ఒకటి రెండు అంతస్తుల్లో ఉండే ఫ్రెంచ్ కాలనీలు ఉక్కు, గాజుతో నిర్మించే భారీ ఆకాశహర్మ్యాలతో నిండిపోయాయి.
సముద్ర తీరంలో ప్రశాంతంగా, నిశబ్ధంగా ఉండే రిసార్ట్‌ను తలపించే సిహనౌక్‌విల్లేలో ఈ మార్పు చాలా వేగంగా, తీవ్రంగా జరిగింది.
ఇక్కడకు చైనా పర్యటకులే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, జూదరులు వచ్చారు. చైనాలో జూదంపై నిషేధం ఉంది. సిహనౌక్‌విల్లేలో కొత్త క్యాసినోలు పుట్టుకొచ్చాయి.
వాటితో పాటు ఆడంబరాలకు వేదికైన విలాసవంతమైన హోటళ్లు, అపార్ట్‌మెంట్లు వెలిశాయి.
దీంతో అక్కడ డబ్బు తాండవించడం మొదలైంది. ఇది చెన్ ఝీ జీవితంలోకి వెలుగుల్ని తీసుకొచ్చింది.
2014లో ఆయన చైనా పౌరసత్వాన్ని వదిలేసి కంబోడియా పౌరుడిగా మారారు.
దీంతో ఆయనకు తన పేరు మీద ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం దక్కింది.
అయితే అక్కడ ఆస్తి కొనుగోలు చేయాలంటే కనీసం రూ. 2 కోట్ల 20లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం లేదా అంతే మొత్తాన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
కంబోడియా ప్రధానికి సలహాదారుగా..
చెన్ ఝీకి ఆ రూ.2.20 కోట్లు ఎక్కడ నుంచి ఎలా వచ్చిందనే దానిపై స్పష్టత లేదు.
2019లో ఆయన ఐల్ ఆఫ్ మ్యాన్‌లో బ్యాంక్ ఖాతా కోసం దరఖాస్తు చేసినప్పుడు, 2011లో రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రారంభించేందుకు తన మావయ్య తనకు కోటి 60 లక్షల రూపాయలు ఇచ్చారని పేర్కొన్నారు. కానీ, అందుకు ఆధారాలేవీ చూపించలేదు.
2015లో చెన్ ఝీ ప్రిన్స్‌గ్రూప్ ఏర్పాటు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టారు. అప్పుడు ఆయనకు 27 ఏళ్లు.
ప్రిన్స్ బ్యాంక్ ఏర్పాటు చేసేందుకు 2018లో ఆయనకు కమర్షియల్ బ్యాంకింగ్ లైసెన్స్ వచ్చింది. అదే ఏడాది ఆయన సైప్రస్‌లో 3కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడంతో ఆ దేశ పాస్‌పోర్ట్ కూడా వచ్చింది.
దీంతో చెన్ ఝీ యూరోపియన్ యూనియన్ దేశాల్లో అడుగు పెట్టేందుకు అవకాశం చిక్కింది. ఆ తర్వాత చెన్ ఝీ వనౌటు పౌరసత్వాన్ని కూడా తీసుకున్నారు.
కంబోడియాలో మూడో ఎయిర్‌లైన్ సంస్థను ప్రారంభించిన చెన్ ఝీ 2020లో 4వ ఎయిర్‌లైన్ కంపెనీని నడిపేందుకు అనుమతి తీసుకున్నారు.
ప్రిన్స్ ప్రాపర్టీస్ నామ్‌ఫెన్‌లో విలాసంతమైన మాల్స్, సిహనౌక్‌విల్లేలో ఫైవ్ స్టార్ హోటళ్లు నిర్మించింది.
సిహనౌక్‌లోనే 16 బిలియన్ డాలర్ల ఖర్చుతో 'బే ఆఫ్ లైట్స్' పేరుతో ఎకో సిటీని నిర్మించనున్నట్లు ప్రకటించింది.
కంబోడియా ప్రభుత్వానికి కనీసం రూ.4 కోట్లు విరాళంగా ఇచ్చిన వారికి కంబోడియా రాజు ఇచ్చే దేశ అత్యున్నత పురస్కారం "నీక్ ఓన్హా"ను 2020లో చెన్ ఝీకి ప్రదానం చేశారు.
2017 నుంచి ఆయన కంబోడియా హోం మంత్రి సార్ ఖెంగ్‌కు అధికారిక సలహాదారుగా ఆయన కుమారుడు సర్ సోఖాకు వ్యాపార భాగస్వామిగా ఉన్నారు.
కంబోడియా రాజకీయాల్లో అత్యంత శక్తిమంతుడైన హున్‌సెన్‌కు కూడా అధికారిక సలహాదారుగా వ్యవహరించారు.
2023లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన హున్‌సెన్ కుమారుడు హున్ మనేట్‌కు అడ్వైజర్‌గా పని చేశారు.
పేద పిల్లలకు స్కాలర్‌షిప్పులు ఇవ్వడం, కోవిడ్ సమయంలో ప్రజలకు సాయం చేశారని అందుకే ఆయన గొప్ప దాత అని కంబోడియన్ మీడియా ప్రస్తుతించింది
దేశవ్యాప్తంగా ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు ఉన్నప్పటికీ చెన్ ఝీ పెద్దగా బయటకు కనిపించడం, బహిరంగ ప్రకటనలు ఇవ్వడం లాంటివి చేసేవారు కాదు.
"ఆయనతో కాస్త సమయం గడిపిన వాళ్లు, ఆయనకు సన్నిహితంగా మెలిగిన వాళ్లు, ఆయనతో కలిసి పని చేసిన వాళ్లంతా చెన్ ఝీ చాలా మర్యాదస్తుడు, ప్రశాంతంగా ఉంటారు. ఆచి తూచి మాట్లాడతారు" అని చెన్ ఝీ గురించి మూడేళ్ల సుదీర్ఘ పరిశోధన చేసిన జాక్ అడమోవిక్ డేవిస్ చెప్పారు.
డేవిస్ పరిశోధనను గతేడాది రేడియో ఫ్రీ ఆసియా ప్రచురించింది.

ఫొటో సోర్స్, US District Court EDNY
అంత సంపద, అధికారం ఎక్కడ నుంచి వచ్చింది?
"అంతర్జాతీయ నేరాల జాబితా"
2019లో సిహనౌక్‌విల్లేలో రియల్ ఎస్టేట్ బుడగ పేలిపోయింది. కానీ అక్కడి గ్యాంబ్లింగ్ బిజినెస్ చైనాలో నేరగాళ్ల ముఠాలను ఆకర్షించింది.
గ్యాంబ్లింగ్ బిజినెస్ మీద పట్టు కోసం ముఠాలు ఆధిపత్య పోరుకు దిగడంతో ప్రశాంతంగా ఉండే నగరంలో హింస మొదలైంది. ఫలితంగా పర్యటకులు రావడం తగ్గిపోయింది.
దీంతో చైనా నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రధానమంత్రి హున్ సెన్ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌పై నిషేధం విధించారు. వ్యాపారం మూత పడటంతో దాదాపు నాలుగున్నర లక్షల మంది చైనీయులు నగరం వదిలి వెళ్లారు.
దీంతో ప్రిన్స్ గ్రూప్ నిర్మించన హోటళ్లు, అపార్ట్‌మెంట్లు ఖాళీ అయ్యాయి.
అయినప్పటికీ చెన్ ఝీ తన వ్యాపార విస్తరణ, విలాసవంతమైన జీవితాన్ని ఎక్కడా ఆపలేదు.
2019లో దక్షిణ లండన్‌లో 140 కోట్ల రూపాయలతో పెద్ద మాన్షన్‌ను, నగరంలోనని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 11వందల కోట్ల రూపాయలతో కార్యాలయాన్ని కొనుగోలు చేసినట్లు బ్రిటన్ అధికారులు చెప్పారు.
చెన్ ఝీ, అతని సహచరులు న్యూయార్క్‌లోనూ ఆస్తులుకొన్నారని, అక్కడ వారికి ప్రైవేట్ జెట్ విమానాలు, లగ్జరీ యాచ్‌లు ఉన్నాయని, పికాసో చిత్రాలు కూడా కొనుగోలు చేసినట్లు అమెరికా చెబుతోంది.
ప్రస్తుతం ఆసియన్ దేశాల్లో బాగా లాభసాటి వ్యాపారంగా ఉన్న ఆన్‌లైన్ మోసాలు, మానవ అక్రమ రవాణా, మనీ లాండరింగ్ ద్వారా చెన్ ఝీ వద్ద సంపద పోగు పడినట్లు అమెరికా, బ్రిటన్ ఆరోపిస్తున్నాయి.
చెన్ ఝీ ప్రిన్స్ గ్రూప్‌కు చెందిన 128 సంస్థల మీద అమెరికా, బ్రిటన్ ఆంక్షలు విధించాయి.
చెన్ ఝీ అక్రమాలకు సహకరించిన 17 మంది వివిధ దేశస్తుల మీద కూడా ఈ ఆంక్షలు అమలవుతున్నాయి. అమెరికా, బ్రిటన్‌లో అతని ఆస్తుల్ని అక్కడి ప్రభుత్వాలు స్తంభింపజేశాయి.
చెన్ ఝీ డబ్బును వివిధ దేశాలకు తరలించేందుకు డొల్ల కంపెనీలను స్థాపించారని క్రిప్టో కరెన్సీ ద్వారా నిధులను మళ్లించారని ఆంక్షలు విధించిన ప్రభుత్వాలు ప్రకటించాయి.
"వ్యభిచారంతో పాటు మానవ అక్రమ రవాణా వంటి వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రిన్స్ గ్రూప్ లాభాలు ఆర్జిస్తోంది. కంబోడియాలో పది సెంటర్ల నుంచి మైనర్లను వ్యభిచారంలోకి దించడం, బ్లాక్ మెయిలింగ్, మనీ లాండరింగ్, వివిధ రకాల మోసాలు, అవినీతి, ఆన్‌లైన్‌లో అక్రమ జూదం, అక్రమ రవాణా, హింస, శ్రమ దోపిడీ లాంటి వాటిని నిర్వహిస్తోంది"అని అమెరికా బ్రిటన్ ఆంక్షలు విధించిన ప్రకటనలో తెలిపాయి.

ఫొటో సోర్స్, AFP via Getty Images
అక్రమాల సామ్రాజ్యం
ప్రిన్స్ గ్రూప్ అక్రమాలపై చైనా ప్రభుత్వం 2020 నుంచి రహస్యంగా దర్యాప్తు చేస్తోంది. సంస్థ ఆన్‌లైన్‌లో మోసపూరిత వ్యాపారాలు చేస్తోందనే ఆరోపణల మీద కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి.
ప్రిన్స్ గ్రూప్‌పై విచారణ జరిపేందుకు బీజింగ్ మున్సిపల్ పబ్లిక్ సెక్యూరిటీ బయూరో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది.
వియత్నాం సరిహద్దులకు సమీపంలోని చెరీ థోమ్‌లో ప్రిన్స్ గ్రూప్ నిర్మించిన గోల్డెన్ ఫార్చ్యూన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్‌లోనూ ఆన్ లైన్ జూదానికి సంబంధించిన అక్రమాలు జరుగుతున్నట్లు అమెరికా, బ్రిటన్ ఆరోపించాయి.
అయితే తాము ఎలాంటి అక్రమాలు, స్కాములకు పాల్పడటం లేదని ప్రిన్ గ్రూప్ గతంలో ప్రకటించింది. గోల్డెన్ ఫార్చ్యూన్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. అయితే గోల్డెన్ ఫార్చ్యూన్, ప్రిన్స్ గ్రూప్ మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయని, అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయని అమెరికా, బ్రిటన్ దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.
చెన్ ఝీపై పరిశోధనలో భాగంగా గోల్డెన్ ఫార్చ్యూన్‌లో కొంతమందిని అడమోవిక్ డేవిస్ ఇంటర్వ్యూ చేశారు. ఆన్‌లైన్ స్కాములు నిర్వహిస్తున్న ఆ కాంపౌండ్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన తమను తీవ్రంగా కొట్టారని అనేకమంది చైనీయులు, వియత్నాం వాసులు, మలేషియన్లు చెప్పారు.
అమెరికా, బ్రిటన్ ఆరోపణలతో ప్రిన్స్ గ్రూప్‌తో నిన్న మొన్నటి వరకు అంటకాగిన అనేక సంస్థలు ఇప్పుడు దూరం జరుగుతున్నాయి.
ప్రిన్స్ బ్యాంక్ ఖాతాదారులు తమ సొమ్మును విత్ డ్రా చేసుకోవచ్చంటూ కంబోడియన్ సెంట్రల్ బ్యాంక్ ఇచ్చిన హామీ డిపాజిటర్లలో ఆందోళన రేకెత్తించింది.
సౌత్ కొరియన్ బ్యాంకుల్లో ప్రిన్స్ బ్యాంక్ డిపాజిట్ చేసిన 64 మిలియన్ డాలర్ల నిధుల్ని సౌత్ కొరియా స్తంభింప జేసింది.
తమ దేశంలో ప్రిన్స్ గ్రూప్ పెట్టుబడుల గురించి విచారణకు పూర్తి సహకారం అందిస్తామని సింగపూర్, థాయిలాండ్ ప్రభుత్వాలు అమెరికా, బ్రిటన్‌కు హామీ ఇచ్చాయి. అమెరికా, బ్రిటన్ దర్యాప్తు చేస్తున్న 18 మంది వ్యక్తుల్లో ముగ్గురు సింగపూర్‌కు చెందినవారు.
అమెరికా, బ్రిటన్ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు చూపించాలని కంబోడియా ప్రభుత్వం కోరింది.
అయితే చాలా కాలంగా చెన్ ఝీతో స్నేహంగా ఉన్న కంబోడియా పాలకులకు ప్రస్తుతం అతని నుంచి దూరంగా జరగడం కష్టమైన వ్యవహారం.
ఆన్‌లైన్ స్కామ్ వ్యాపారాలకు అండగా నిలుస్తోందని కంబోడియా ప్రభుత్వం మీద ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో సగభాగం ఇలాంటి వ్యాపారాల ద్వారానే వస్తోందని కొంత మంది అంచనా వేస్తున్నారు.
ఇప్పుడు చెన్ ఝీ పరిస్థితేంటి?
అమెరికా, బ్రిటన్ ఆంక్షలు విధించినప్పటి నుంచి ఇప్పటి వరకు చెన్ ఝీని చూసింది లేదా అతని గురించి విన్నది లేదు.
కంబోడియాలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తులలో ఒకరిగా వెలుగొందిన ఈ వ్యాపార వేత్త ఇప్పుడు అదృశ్యమైనట్లు కనిపిస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














