కందుకూరు లక్ష్మీ నాయుడు హత్య వివాదంలో కులం ఆరోపణలు ఎందుకు వినిపిస్తున్నాయి?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ హత్య బయటి ప్రపంచానికి తెలిసేందుకు రెండు వారాలకుపైగా పట్టింది.
సరిగ్గా దసరా రోజు జరిగిన ఓ దారుణ హత్య సమాచారం దీపావళి ముందు వరకూ గానీ పూర్తిస్థాయిలో బయటపడలేదు.
నెల్లూరు జిల్లా కందుకూరు డీఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ ఘటన గురించి బీబీసీకి వివరించారు.

అసలేం జరిగింది?
డీఎస్పీ చెప్పిన వివరాల ప్రకారం...
‘‘కందుకూరు నియోజకవర్గ పరిధిలోని గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామానికి చెందిన తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు(25), ఆయన సోదరుడు తిరుమలశెట్టి పవన్, చిన్నాన్న కుమారుడు తిరుమలశెట్టి భార్గవ్ నాయుడులు అక్టోబర్ 2న మధ్యాహ్నం బైక్‌పై వ్యక్తిగత పనుల మీద కందుకూరు బయలుదేరారు.
వారు రాళ్లపాడు గ్రామ శివార్లకు చేరుకున్న సమయంలో అదే గ్రామానికి చెందిన.. ప్రస్తుతం కందుకూరులో నివాసముంటున్న కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ తన ఫార్చ్యూనర్ కారులో ఎదురుపడ్డారు.
ఈ ముగ్గురినీ చూడగానే హరిశ్చంద్ర ప్రసాద్ తన కారుతో వారి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టారు. దీంతో ముగ్గురూ రోడ్డుపై పడిపోయారు’’ అని చెప్పారు.
ఆ ముగ్గురినీ చంపాలనే ఉద్దేశంతో కారుతో ఢీకొట్టి, బైకును అలానే కొంతదూరం ఈడ్చుకెళ్లారని డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు అక్కడికక్కడే మరణించారని డీఎస్పీ బాలసుబ్రమణ్యం చెప్పారు.
లక్ష్మీ నాయుడు చనిపోయాడని నిర్ధరించుకున్న తర్వాతే హరిశ్చంద్ర ప్రసాద్ అక్కడి నుంచి వెళ్లారని, అప్పటికే తీవ్రగాయాలపాలైన పవన్, భార్గవ్ నాయుడును పోలీసులు 108 అంబులెన్స్‌లో కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని డీఎస్పీ వివరించారు.
తర్వాత మెరుగైన చికిత్స కోసం వారిద్దరినీ గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించామని, వారు చికిత్స పొందుతున్నారని డీఎస్పీ తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
హత్యకు కారణమేంటి?
"వాస్తవానికి.. నిందితుడు కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్, మృతుడు తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు స్నేహితులు. లక్ష్మీ నాయుడు వద్ద హరిశ్చంద్ర ప్రసాద్ రూ.2,30,000 అప్పు తీసుకున్నారు. రెండు నెలల క్రితం ఆ సొమ్మును తిరిగి చెల్లించాలని లక్ష్మీ నాయుడు అడిగారు. హరిశ్చంద్ర ప్రసాద్ తన ట్రాక్టర్‌ను అప్పుకు బదులుగా ఇవ్వగా.. ఇంకా రూ.50,000 బకాయి ఉంది. ఈ డబ్బు వివాదంతో పాటు నిందితుడి వ్యక్తిగత ప్రవర్తన వారి మధ్య విభేదాలకు దారితీసింది'' అని డీఎస్పీ తెలిపారు.
"ఇటీవల లక్ష్మీ నాయుడు భార్య ఫోన్‌కి హరిశ్చంద్ర ప్రసాద్ అసభ్యకర మెసేజ్‌లు పెడుతూ వచ్చారు. ఆ విషయం భర్తకి చెప్పి ఆమె బాధపడ్డారు. దీంతో లక్ష్మీ నాయుడు, తన సోదరులు పవన్, భార్గవ్‌తో కలిసి కందుకూరులో ఉంటున్న హరిశ్చంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి ఘర్షణ పడ్డారు. ఈ ఘటనతో తన పరువు పోయిందని, పగ పెంచుకున్న హరిశ్చంద్ర ప్రసాద్, వారిని ఎలాగైనా హత్య చేయాలని పథకం వేశాడు. ఈ క్రమంలో అక్టోబర్ 2న దారకానిపాడు వెళ్తుండగా మధ్యలో ఈ ముగ్గురూ బైక్‌పై కనిపించారు. అదే అదనుగా ముగ్గురినీ తన కారుతో ఢీకొట్టారు. ఘటనా స్థలంలోనే లక్ష్మీనాయుడు చనిపోగా, మిగిలిన ఇద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు'' అని డీఎస్పీ వివరించారు.
మృతుడి సోదరుడు తిరుమలశెట్టి పవన్ ఫిర్యాదు మేరకు నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్‌తో పాటు ఆయన తండ్రి కాకర్ల మాధవ రావును అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపామని డీఎస్పీ బాలసుబ్రమణ్యం తెలిపారు.
ముగ్గురినీ ఈడ్చుకెళ్లిన వాహనాన్ని హరిశ్చంద్ర ప్రసాద్ నడుపుతున్నారని, ఆ సమయంలో ఆయన తండ్రి ఘటనా స్థలానికి దగ్గరగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, UGC
నిందితుల అరెస్టు జాప్యంతో 'కుల' వివాదం
ఈ కేసు దర్యాప్తు విషయంలో పోలీసుల తీరు విమర్శల పాలైంది. ఫిర్యాదు వచ్చినప్పటికీ నిందితుల అరెస్టులో జరిగిన తీవ్ర జాప్యం కుల వివాదాలకు దారితీసిందన్న వాదనలున్నాయి.
తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు బలిజ కులానికి చెందినవారు కాగా, హరిశ్చంద్ర ప్రసాద్ కమ్మ కులానికి చెందినవారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి పార్టీల్లో ప్రధానపక్షమైన తెలుగుదేశంలో కీలక భూమిక పోషించే కమ్మ కులానికి చెందిన హరిశ్చంద్ర ప్రసాద్ అరెస్టు విషయంలో పోలీసులపై ఒత్తిడి వచ్చిందని, అందుకే ఆయన్ను అరెస్టు చేయడం లేదంటూ కాపు, తెలగ, బలిజ జేఏసీ నేత దాసరి రాము ఆరోపించారు. ఆ ఘటనను యాక్సిడెంట్‌గా చిత్రీకరించేందుకు యత్నించారని ఆయన ఆరోపణలు చేశారు.
అయితే, పోలీసులపై వచ్చిన ఆరోపణలను జిల్లా ఎస్పీ డాక్టర్ అజితతో పాటు కందుకూరు డీఎస్పీ బాలసుబ్రమణ్యం ఖండించారు. యాక్సిడెంట్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నించామనడం నిజం కాదని డీఎస్పీ చెప్పారు.
ఘటన 2వ తేదీన జరగ్గా.. నిందితులు పరారయ్యారని, అందుకే అరెస్టు చేయడంలో జాప్యం జరిగిందని బాలసుబ్రమణ్యం బీబీసీతో అన్నారు.
అక్టోబర్ 8న హరిశ్చంద్ర ప్రసాద్‌ను, ఆయన తండ్రిని పోలీసులు అరెస్టు చేసి 9న కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది.
ఆ వాహనంలో వారిద్దరే ఉన్నారా?
ముగ్గురినీ ఈడ్చుకెళ్లిన వాహనంలో హరిశ్చంద్ర ప్రసాద్ డ్రైవింగ్ చేయడంతో పాటు అదే సమయంలో తండ్రి ఘటనా స్థలానికి దగ్గరగా ఉన్నారని చెబుతున్న పోలీసులు వారిద్దరి అరెస్టూ చూపించారు.
కానీ ఆ రోజు ఘటన సమయంలో, ఆ వాహనంలో మరికొందరు ఉన్నారని బీబీసీతో అన్నారు గుడ్లూరు మండలానికి చెందిన బలిజ నేత వంశీ కృష్ణ.
దీనిపై కందుకూరు డీఎస్పీ బాలసుబ్రమణ్యం బీబీసీతో మాట్లాడారు. ఆ రోజున ఆ వాహనంలో ప్రధాన నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్‌తో పాటు ఆయన భార్య రాధిక, నానమ్మ నారాయణమ్మ ఉన్నారని, ఈ ఘటనలో వారి పాత్రపై విచారణ చేస్తున్నామని డీఎస్పీ చెప్పారు.
హత్యకు ముందు పోలీస్ స్టేషన్‌లో పంచాయితీ
ఈ హత్యకు కొద్దిరోజుల ముందు హరిశ్చంద్ర ప్రసాద్, లక్ష్మీ నాయుడు మధ్య వివాదం గుడ్లూరు పోలీస్ స్టేషన్‌కి చేరిందని, అప్పుడే పోలీసులు సీరియస్‌గా స్పందించి ఉంటే హత్య వరకు పరిస్థితి వెళ్లేది కాదని బలిజ నేతలు ఆరోపిస్తున్నారు.
దీనిపై గుడ్లూరు ఎస్‌ఐ వెంకటరావు బీబీసీతో మాట్లాడారు.
"ట్రాక్టర్, డబ్బుల వివాదంపై ఒకరికొకరు ఫిర్యాదు చేసుకున్నారు. నేను ఇరువర్గాలతోనూ మాట్లాడాను. హరిశ్చంద్ర ప్రసాద్ వాదన తప్పుగా అనిపించి నేను ఆయన్ను గట్టిగా మందలించాను. అలాగే, ఇరువర్గాలూ గొడవలకు పోకుండా సర్దుకుపోవాలని సూచించాను. కానీ, హరిశ్చంద్ర ప్రసాద్ ఇలా హత్య చేసేవరకు వెళ్తారని ఊహించలేదు" అని వెంకటరావు చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
మొదట్లో తప్పుడు ప్రచారం చేశారు.. కానీ కుల సంఘాల నేతలు వచ్చాకే...
"వాస్తవానికి అక్టోబర్ 2న హత్య జరిగినా కొంతమంది టీడీపీ నేతల జోక్యంతో కేసును తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. మృతుడి భార్యపైనే తప్పుడు ప్రచారం చేయాలని చూశారు. పోలీసులు నిందితులను అరెస్టు చేయకుండా కాలయాపన చేశారు. కానీ, రాష్ట్ర స్థాయి బలిజ, కాపు నేతలు వచ్చిన తర్వాత పోలీసులు కేసు పెట్టి వారిని అరెస్టు చేశారు" అని బలిజ సంఘం నేత వంశీకృష్ణ బీబీసీతో అన్నారు. ఆ తర్వాత కూడా ఎక్కడా విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారన్నారు.
"కులాల మధ్య వివాదంగా చూపించి అసలు విషయాన్ని పక్కదోవ పట్టించే యత్నం జరిగింది" అని బలిజ, తెలగ, కాపు జేఏసీ దక్షిణ భారత విభాగం అధ్యక్షుడు దాసరి రాము బీబీసీతో అన్నారు.
"ఈ హత్య కేసులో పోలీసుల తీరు దారుణం. కేసు నమోదుకే కాలయాపన చేశారు. మా ఒత్తిడి మేరకు కేసు పెట్టినా.. వాళ్లు కోర్టులో గట్టిగా వాదిస్తారన్న నమ్మకం మాకు లేదు. అందుకే మేం జ్యుడీషియల్ విచారణ లేదా సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం" అని దాసరి రాము బీబీసీతో అన్నారు.
విచారణ పక్కాగా చేస్తున్నాం: డీఎస్పీ
ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు.
"హత్య కేసు దర్యాప్తు సరైన మార్గంలోనే కొనసాగుతోంది. నిందితుల ఆస్తుల జాబితాను బాధితుల పరిహారం కోసం కోర్టుకు సమర్పించాం. దర్యాప్తు సరిగ్గా జరగడంలేదంటూ ఎవరైనా అసత్య ప్రచారం చేస్తూ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తాం" అని డీఎస్పీ బాలసుబ్రమణ్యం హెచ్చరించారు.

ఫొటో సోర్స్, UGC
కులాల సమస్య కాదు: మృతుని తండ్రి శ్రీనివాస్
"ఇది కులాల మధ్య సమస్య కాదు. మా అబ్బాయి లక్ష్మీ నాయుడు, హరిశ్చంద్ర ప్రసాద్.. ఇద్దరూ బాగానే ఉండేవారు. వ్యక్తిగత సమస్యలతోనే హరిశ్చంద్ర ప్రసాద్ మా అబ్బాయిని పొట్టన పెట్టుకున్నాడు. పెద్ద కొడుకు చనిపోగా, రెండో కొడుకు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంతకంటే దారుణం ఏముంటుంది" అని మృతుడి తండ్రి శ్రీనివాస్ బీబీసీతో అన్నారు.
"ఇది కులాల మధ్య ఘర్షణ కాకపోవచ్చు. కానీ, కుల ఆధిపత్యం మాత్రం చూపించారు. లేదంటే ఈ హత్య బయటి ప్రపంచానికి రెండు వారాల పాటు తెలియకుండా చేశారంటే ఏం చెప్పాలి" అని తెలగ, బలిజ, కాపు జేఏసీ నేత దాసరి రాము విమర్శించారు.
అయితే, తన భర్త ఆవేశంలో ఈ పని చేశాడు తప్ప ఇందులో కుట్రలు, ముందస్తు ప్రణాళికలు లేవని నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ నాయుడి భార్య రాధిక వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.
మరోవైపు నిందితుడు హరిచంద్ర ప్రసాద్ బాబాయ్ కాకర్ల మల్లికార్జున రావు కూడా ఈ ఘటనపై స్పందించారు. దీనిని కులాల మధ్య గొడవగా చిత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని ఇది సరికాదని ఆయన అన్నారు.
‘‘నా అన్న కుమారుడు హరిచంద్ర ప్రసాద్ చేసింది కచ్చితంగా తప్పే.. కానీ దీనికి కులం ఆపాదించడం అన్యాయం. కులం రంగు పులుముకున్న తర్వాత మీ మేం చెప్పినా అది తప్పుగా అనిపిస్తుంది. అందుకే మేము మాట్లాడటం లేదు. వాస్తవానికి లక్ష్మీ నాయుడు, హరిచంద్ర ప్రసాద్ ఇద్దరు స్నేహితులు. ఇద్దరు వేరే కులస్తులను పెళ్లి చేసుకున్నారు. వ్యక్తిగత తగాదాలను కొందరు కుల ఘర్షణగా మార్చారు’’ అని ఆయన అన్నారు.
కుల కోణంలో నిందితునికి ఎవరూ సపోర్ట్ చేయలేదు: ఎమ్మెల్యే
కులం కోణంలో నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్‌కి ఎవరూ సపోర్ట్ చేయలేదని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు బీబీసీతో చెప్పారు. నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు.
తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు హత్య కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారాయణ, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో సీఎం 21వ తేదీన సమావేశమయ్యారు.
మరోవైపు లక్ష్మీ నాయుడు హత్యతో జీవనాధారం కోల్పోయిన ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ ఘటనలో గాయపడిన వారికి కూడా ప్రభుత్వం సాయం ప్రకటించింది.
లక్ష్మీ నాయుడు భార్యకు 2 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదు పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. లక్ష్మీ నాయుడు ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, రూ.5 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాటిజ్ చేయాలని అధికారులకు సూచించారు. అంతే కాకుండా ఇద్దరు పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
ఇక దాడిలో గాయపడ్డ పవన్, భార్గవ్‌లకు కూడా పరిహారం అందించాలన్నారు. పవన్‌కు 4 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదుతో పాటు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని చెప్పారు. భార్గవ్‌కు కూడా రూ.3 లక్షల నగదు, ఆసుపత్రి ఖర్చులు చెల్లించాలని ఆదేశించారు.
అయితే, ఒక ప్రైవేటు వివాదానికి సంబంధించి ప్రభుత్వం ఈ స్థాయిలో పరిహారం ప్రకటించడంపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఓ మీడియాతో ఆయన మాట్లాడుతూ...
‘‘వ్యక్తిగత కక్షలకు సంబంధించిన హత్య కేసు బాధితులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వడం ఏంటి? అలాగైతే రాష్ట్రంలో జరిగిన ప్రతి హత్య బాధితులకు పరిహారం ఇవ్వాలి కదా’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














