ఖైదీలు, అధికారులు కలిసి జైలు ఖాతాకే కన్నం వేశారు, రూ. అరకోటి కాజేశారు

ఈ మోసంలో ఒక మాజీ ఖైదీ, శిక్ష అనుభవిస్తున్న మరో ఖైదీ, ఇద్దరు జైలు సిబ్బందికి భాగం ఉందని పోలీసులు చెప్పారు

ఫొటో సోర్స్, Manav Srivastava

ఫొటో క్యాప్షన్, ఈ మోసంలో ఒక మాజీ ఖైదీ, శిక్ష అనుభవిస్తున్న మరో ఖైదీ, ఇద్దరు జైలు సిబ్బందికి భాగం ఉందని పోలీసులు చెప్పారు
    • రచయిత, సయ్యద్ మోజిజ్ ఇమామ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్ జైలులో ఒక విచిత్రమైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

జైలులోని ఒక ఖైదీ, మాజీ ఖైదీ కలిసి మరో ఇద్దరు జైలు సిబ్బందితో కుమ్మక్కై జైలు ఖాతా నుంచి 52.85 లక్షల రూపాయల్ని వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

జైలు సూపరింటెండెంట్ సంతకం, నకిలీ సీల్‌ను ఉపయోగించి ఈ మోసానికి పాల్పడ్డారని ఆజంగఢ్ సిటీ ఎస్పీ మధుబన్ సింగ్ తెలిపారు. జైల్లో ఉంటూనే వారు ఈ మోసం ఎలా చేయగలిగారనేది ఇప్పుడు ప్రశ్న

''శివశంకర్, రామ్‌జీత్‌లు జైలు సీనియర్ అసిస్టెంట్ ముషీర్ అహ్మద్, వాచ్‌మెన్ అవధేష్ పాండేతో కలిసి పథకం పన్నారు. ఈ నలుగురు జైలు సూపరింటెండెంట్ నకిలీ సీల్‌ను, సంతకాన్ని తయారు చేశారు'' అని మధుబన్ సింగ్ వెల్లడించారు.

ఈ వ్యవహరం ఎలా బయట పడిందో జైలు సూపరింటెండెంట్ ఆదిత్య కుమార్ తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రామ్‌జీత్ యాదవ్ అనే ఖైదీ అకౌంట్‌లోకి ఈ డబ్బంతా బదిలీ అయింది

ఫొటో సోర్స్, Manav Srivastava

ఫొటో క్యాప్షన్, రామ్‌జీత్ యాదవ్ అనే ఖైదీ అకౌంట్‌లోకి ఈ డబ్బంతా బదిలీ అయింది

మోసాన్ని ఎలా గుర్తించారు?

''బీహెచ్‌యూలో చికిత్స కోసం పంపిన డబ్బులో మిగతాది ఇంకా ఎందుకు రాలేదు'' అని సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్ ఇన్‌చార్జ్) ముషీర్ అహ్మద్‌ను తాను అడిగిన ప్రశ్నతో ఒక్కొక్కటిగా నిజాలు బయటకొచ్చాయని మధుబన్ సింగ్ చెప్పారు.

తాను అడిగిన ప్రశ్నకు ముషీర్ అహ్మద్ నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చి, బ్యాంక్ ఖాతా వివరాలను అడిగానని ఆదిత్యకుమార్ చెప్పారు.

అక్టోబర్ 10న ఆజంగఢ్ పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు.

ఆయన చెప్పిన వివరాల ప్రకారం:

‘‘ఒక ఖైదీని బనారస్‌లోని మెడికల్ కాలేజీలో చేర్చారు. చికిత్స కోసం జైలు తరఫు నుంచి ఆసుపత్రికి డబ్బు పంపించారు. చెక్‌ను ఫోర్జరీ చేసి ఆ డబ్బును రామ్‌జీత్ ఖాతాకు బదిలీ చేశారు’’

జైలు ఖాతా నుంచి రూ. 2.60 లక్షలు ఒక ఖైదీ వ్యక్తిగత ఖాతాకు బదిలీ అయినట్లు కెనరా బ్యాంకు పత్రాల ద్వారా తెలిసింది.

‘‘ఒక ఖైదీ, మాజీ ఖైదీ, జైల్లోని ఒక ఉద్యోగి, గార్డు కుమ్మక్కై జైలు ఖాతా నుంచి రూ. 52.85 లక్షలు స్వాహా చేశారు. ఈ మొత్తాన్ని కొద్దికొద్దిగా ఎవరికీ తెలియకుండా డ్రా చేసుకున్నారు’’ అని ఆజంగఢ్ పోలీసులు తెలిపారు.

రామ్‌జీత్ యాదవ్ అనే ఖైదీ ఖాతాలో డబ్బు జమ అయినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. రామ్‌జీత్‌కు 2011లో వరకట్న హత్య (సెక్షన్ 304బీ), 498ఎ కేసుల్లో శిక్ష పడింది. శిక్ష పూర్తి కావడంతో 2024లో జైలు నుంచి విడుదలయ్యారు.

జైలులోనే కుట్ర

ముషీర్ అహ్మద్ వద్ద శివశంకర్ యాదవ్ అనే ఖైదీ ఒక రైటర్‌గా అంటే సహాయకుడిగా పనిచేస్తున్నారని పోలీసులు చెప్పారు. ఒక హత్య కేసులో శివశంకర్ యాదవ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

చదువుకున్న ఖైదీలను జైల్లో ఈ రకమైన పనుల్లో నియమిస్తారు. 2023 నుంచి జైల్లో ఆయన ఈ పని చేస్తున్నారు.

జైలు అకౌంటింగ్ విభాగాన్ని యాక్సెస్ చేసుకోవడానికి ఖైదీలకు ఇది ఉపయోగపడింది. చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు, సీళ్లు, సంతకాలు ఇలా మొత్తం అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లోని ప్రతీ ప్రక్రియ గురించి శివశంకర్ యాదవ్ పూర్తిగా తెలుసుకున్నారని పోలీసులు చెప్పారు.

''చెక్ బుక్, పాస్ బుక్‌ వ్యవహారాలు చూసుకునే ముషీర్ అహ్మద్, ఖాళీ చెక్‌లపై నకిలీ సంతకాలు సృష్టించారు'' అని ఆజంగఢ్ సిటీ ఎస్పీ మధుబన్ సింగ్ చెప్పారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, ఈ మోసం చాలా పకడ్బందీగా జరిగింది. రికార్డుల్లో ఎలాంటి అవకతవకలు కనిపించలేదు. పాస్‌బుక్, నగదు రిజిస్టర్‌లో డేటా సరిపోలేలా వారు చూసుకున్నారు.

''నా కింద పనిచేసే వ్యక్తులు ఇలా చేస్తారని నేను ఊహించలేకపోయాను'' అని జైలు సూపరింటెండ్ ఆదిత్య కుమార్ అన్నారు. ఈ ఘటనతో షాక్‌కు గురయ్యానని చెప్పారు.

''ఆ రోజు బ్యాంక్ స్టేట్‌మెంట్ అడగకపోతే, ఈ వ్యవహారం ఇలాగే కొనసాగి ఉండేది. ఈ కుట్ర జైలులో నాలుగు గోడల మధ్య జరిగింది. బయట ఉన్న వ్యవస్థ కూడా చూసీ చూడనట్లుగా వ్యవహరించింది'' అని ఆయన అన్నారు.

ఆజంగఢ్ జైలులో భద్రత గురించి చాలామంది సందేహాలు లేవనెత్తారు

ఫొటో సోర్స్, Manav Srivastava

ఫొటో క్యాప్షన్, ఆజంగఢ్ జైలులో భద్రత గురించి చాలామంది సందేహాలు లేవనెత్తారు

జైలు నుంచి బ్యాంక్ వరకు విస్తరించిన నెట్‌వర్క్

శిక్ష అనుభవించి 2024లో విడుదలైన రామ్‌జీత్ యాదవ్, హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న శివశంకర్ అనే ఖైదీ ముషీర్ అహ్మద్ వద్ద రైటర్లుగా పని చేసేవారని పోలీసులు చెప్పారు.

జైలు ఖాతాలకు చెందిన పాస్‌బుక్, చెక్‌బుక్‌లను ముషీర్ అహ్మద్ చూసుకుంటుండగా, రోజువారీ బ్యాంకు కార్యకలాపాలను అవధేష్ పాండే చూసుకుంటారు.

రామ్‌జీత్‌కు అవధేష్ పాండే నకిలీ చెక్కులను ఇచ్చేవారని, వాటిని ఆయన తనపేరు మీద నగదుగా మార్చుకునేవారని పోలీసులు చెప్పారు.

జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా రామ్‌జీత్ తన సహచరులతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

జైలు కాంట్రాక్టర్‌ను అని చెబుతూ బ్యాంకుకు వెళ్లి నకిలీ పత్రాలతో చెక్‌లను తన పేరు మీద డిపాజిట్ చేసుకునేవారు.

అనుమానం రాకుండా ఉండేందుకు మొదట్లో రూ.10,000-20,000 విత్‌డ్రా చేసుకున్నారని, బ్యాంకు ఉద్యోగుల నమ్మకం చూరగొన్న తర్వాత లక్షల్లో బదిలీ చేసుకున్నారని పోలీసులు చెప్పారు.

జైలు అధికారిక ఖాతా నుంచి ఇంత పెద్ద లావాదేవీలు క్రాస్ వెరిఫికేషన్ లేకుండా జరగవు. కాబట్టి ఇందులో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం లేదా వారి పాత్ర కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వారి ప్రమేయంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

జైలు డబ్బులతో చెల్లి పెళ్లి

జైలు ఖాతా నుంచి తీసుకున్న డబ్బుతో తన చెల్లి పెళ్లిని ఘనంగా చేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు రామ్‌జీత్ యాదవ్ చెప్పారు. ఈ పెళ్లికి దాదాపు రూ. 25 లక్షలు ఖర్చు చేశారు. నిందితుడు రూ. 3.75 లక్షల విలువైన బుల్లెట్ మోటార్ సైకిల్ కొన్నారు.

తన పాత అప్పులు తీర్చడానికి కొంతడబ్బును, మిగతాదాన్ని తన సహచరులకు పంచారు. ముషీర్ అహ్మద్‌ రూ. 7 లక్షలు, శివశంకర్‌ రూ. 5 లక్షలు, అవధేష్‌రూ. 1.5 లక్షలు తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారు.

ఈ కేసులో భారతీయ న్యాయ సంహితలోని 318(4), 61(2), 316(5), 338, 336(3) సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటున్నారు.

నలుగురు నిందితులను అక్టోబర్ 11 రాత్రి పోలీసులు అరెస్టు చేశారు.

ఈ కేసులో నిందితుల తరఫున వ్యక్తులతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ వారెవరూ మాట్లాడటానికి సిద్ధపడలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)