ఐఫోన్: మొబైళ్లు దొంగిలించే ఇంటర్నేషనల్ గ్యాంగ్‌ను ఈ ఫోన్ సాయంతో పట్టుకున్నపోలీసులు

- రచయిత, సిమా కోటేచా సీనియర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గతేడాది 40,000 మొబైల్ ఫోన్లను చోరీ చేసి బ్రిటన్ నుంచి చైనాకు అక్రమంగా తరలించినట్లు అనుమానిస్తున్న ఓ అంతర్జాతీయ ముఠాను పోలీసులు కనిపెట్టారు.
ఫోన్ చోరీల నిరోధానికి బ్రిటన్‌లో చేపట్టిన ఆపరేషన్లలో ఇదే ఇప్పటివరకు అతిపెద్దదని మెట్రోపాలిటన్ పోలీసులు చెప్పారు.
ఇందులో భాగంగా..18 మంది అనుమానితులను అరెస్టు చేసి, వారిదగ్గరి నుంచి 2,000 వరకు దొంగిలించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
లండన్‌లో చోరీకి గురైన ఫోన్లలో సగం మేర ఈ గ్యాంగే కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
బ్రిటన్‌లో అత్యధిక సంఖ్యలో మొబైల్ ఫోన్ల చోరీలు లండన్ నగరంలో జరిగాయి.

ఆపరేషన్ ఎలా మొదలైంది?
అనుమానితుల వివరాలు, వారి పద్ధతులు సహా లండన్, హెర్ట్ ఫోర్డ్ షైర్ నగరాల్లో 28 ప్రాంతాల్లో చేపట్టిన ఈ ఆపరేషన్ వివరాలు తెలుసుకునేందుకు బీబీసీకి అనుమతి లభించింది.
గతేడాది దొంగిలించిన తన ఫోన్‌ను ఓ బాధితుడు ట్రేస్ చేసిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
"ఆరోజు క్రిస్మస్. చోరీకి గురైన తన ఐఫోన్‌ను ఎలక్ట్రానికల్‌గా ట్రాక్ చేసి, హీత్రూ విమానాశ్రయం సమీపంలోని ఓ గోడౌన్‌లో ఉన్నట్లు బాధితుడు కనిపెట్టాడు" అని డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ మార్క్ గెవిన్ తెలిపారు.
"అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆ ఫోన్ కనిపెట్టడానికి సహకరించారు. ఆ ఫోన్‌ను వారు ఓ పెట్టెలో ఉన్నట్లు, అక్కడే మరో 894 ఫోన్లు కూడా ఉన్నట్లు వారు గుర్తించారు" అని గెవిన్ వెల్లడించారు.

కారును రోడ్డు మధ్యలో అడ్డుకుని పట్టుకున్నారు..
ఆ ఫోన్లన్నీచోరీ చేసినవే అని పోలీసులు గుర్తించారు. వాటిని వారు హాంగ్‌కాంగ్‌కు రవాణా చేస్తున్నట్లు తెలుసుకున్నారు. అలాగే మరిన్ని షిప్‌మెంట్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
అక్కడ ఇద్దరు పురుషులను గుర్తించడానికి ఆ ప్యాకేజీలపై ఫోరెన్సిక్ కెమికల్స్‌ను ఉపయోగించారు.
ఆ ఇద్దరు వ్యక్తులపై దర్యాప్తును మొదలుపెట్టిన క్రమంలో పోలీసులు పలు నాటకీయ పరిణామాలను ఎదుర్కొన్నారు.
టేజర్‌లు (తుపాకులున్న జాకెట్ల వంటి డ్రెస్సు) ధరించి ఉన్న అధికారులు ఒక కారును రోడ్డు మధ్యలో అడ్డుకున్నట్లుగా వారి బాడీక్యామ్‌లో క్యాప్చర్ అయిన ఫుటేజీలో కనిపించింది.
లోపల వారు ఫాయిల్‌తో చుట్టి ఉన్న మొబైల్ ఫోన్లను కనుగొన్నారు. దొంగిలించిన డివైజ్‌లను గుర్తించకుండా రవాణా చేయడానికి వారు ఆ విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు.
కొంతమంది వ్యక్తులు తుపాకులున్న దుస్తులు ధరించి, రోడ్డు మధ్యలో కారును అడ్డుకున్నట్లుగా పోలీసుల బాడీక్యామ్‌లో ఫుటేజీ క్యాప్చర్ అయింది.

ఆ ఇద్దరు 30 ఏళ్ల వయసు ఉన్న అఫ్గాన్ జాతీయులుగా గుర్తించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు.
ఆ ఇద్దరు వ్యక్తులను పోలీసులు అడ్డుకున్నప్పుడు వారి కారులో డజన్లకొద్దీ ఫోన్లను పోలీసులు గుర్తించారు. కాగా, పట్టుబడ్డ వారిలో మరో వ్యక్తి...29 ఏళ్ల భారతీయుడు. ఆయనపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
"ఈ ఫోన్ల తరలింపును అడ్డుకోవడం ఈ దర్యాప్తులో స్టార్టింగ్ పాయింట్. దాని ద్వారానే అంతర్జాతీయ స్మగ్లింగ్ గ్యాంగ్ ను కనిపెట్టగలిగాం. వీరు లండన్‌లో 40శాతం ఫోన్ చోరీలకు బాధ్యులని భావిస్తున్నాం" అని డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ గవిన్ పేర్కొన్నారు.
గతవారం చోరీ, చోరీ చేసిన వస్తువులను రవాణా చేయడం, చోరీకి కుట్రపన్నడం వంటి ఆరోపణలతో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ఓ బల్గేరియన్ జాతీయురాలు సహా పట్టుబడిన వారందరూ మహిళలే. ఉదయం వేళలో చేసిన దాడులలో దాదాపు 30 ఫోన్లను పోలీసులు పట్టుకున్నారు.

లండన్ లో పెరుగుతున్న చోరీ కేసులు
గత నాలుగేళ్లలో లండన్‌లో చోరీకి గురైన ఫోన్ల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. 2020లో 28,609గా ఉన్నఈ చోరీల సంఖ్య 2024లో 80,588కి చేరింది.
దొంగతనానికి గురైన ఫోన్లలో ముప్పావు వంతు ఒక్క లండన్ నగరానికి సంబంధించినవే.
ప్రతి ఏడాది లండన్ నగరాన్ని 2 కోట్ల మందికిపైగా సందర్శిస్తుంటారు. టూరిస్ట్ హాట్ స్పాట్లుగా ఉన్న వెస్ట్ ఎండ్, వెస్ట్ మినిస్టర్ ప్రాంతాల్లో ఫోన్ స్నాచింగ్, చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి.
నేషనల్ స్టాటిస్టిక్స్ తాజా డేటా ప్రకారం...వ్యక్తుల నుంచి ఫోన్‌లు కొట్టేసిన కేసులు ఇంగ్లండ్, వేల్స్ వ్యాప్తంగా 2025 మార్చితో ముగిసిన ఏడాది కాలం నాటికి దాదాపు 15శాతం పెరిగినట్లు తెలుస్తోంది. 2003 నుంచి ఇదే అత్యధిక స్థాయి.
బ్రిటన్ సహా విదేశాల్లో సెకండ్-హ్యాండ్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతుండడమే ఈ కేసుల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు మాత్రం తిరిగి వాటిని పొందలేకపోతున్నారు.

డ్రగ్స్ డీలింగ్స్ నుంచి ఫోన్ల చోరీ వైపు
"కొంతమంది నేరస్తులు.. డ్రగ్స్ డీలింగ్ మానేసి, ఫోన్ల వ్యాపారంలోకి దిగినట్లు మేం వింటున్నాం. ఎందుకంటే.. ఈ వ్యాపారం మరింత లాభదాయకమైనది" అని పోలీసింగ్ మినిస్టర్ సారా జోన్స్ అన్నారు.
"ఒక ఫోన్ ను చోరీ చేస్తే దాని విలువ వందల పౌండ్లలో ఉంటుంది. అందుకే క్రిమినల్స్ ఒక అడుగు ముందుకు వేసి, కొత్త నేర ప్రపంచం వైపు చూస్తున్నారని మీరు అర్థం చేసుకోవచ్చు"
ఈ క్రిమినల్ గ్యాంగ్ ప్రత్యేకంగా యాపిల్ ఉత్పత్తులనే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు సీనియర్ అధికారులు చెప్పారు. విదేశాల్లో వీటికి గిరాకీ ఉండడమే అందుకు కారణమని అన్నారు.
ఒక హ్యాండ్ సెట్‌కు దాదాపు 300 పౌండ్లు( సుమారు రూ.35,800) వరకు ఉంటుందని మెట్రో పోలీసుల దర్యాప్తులో తేలింది. చోరీ చేసిన ఆ ఫోన్లను చైనాలో 4,000 పౌండ్లు( సుమారు రూ.4.77 లక్షలు) వరకు అమ్ముతున్నారని వారు తెలిపారు.
"ఇది బ్రిటన్‌లో మొబైల్ ఫోన్ల చోరీ, దోపిడీలకు సంబంధించి అతిపెద్ద కేసు. ఇప్పటి వరకు మెట్రోపాలిటన్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్లలో అతిపెద్దది" అని ఈ చోరీలను ఛేదించిన మెట్రోపాలిటన్ పోలీసు బృందానికి నేతృత్వం వహించిన కమాండర్ ఆండ్రూ ఫీథర్ స్టోన్ అన్నారు.
"వీధి స్థాయి నుంచి అంతర్జాతీయ వ్యవస్థీకృత నేర సమూహాల వరకు ఉన్న నెట్‌వర్క్‌ను మేం ఛేదించాం. ప్రతిఏడాది వారు వేలాది ఫోన్లను తరలిస్తున్నారు" అని ఆండ్రూ అన్నారు.

వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు... నిస్సహాయతలో బాధితులు
మరోవైపు, ఫోన్ చోరీల్లో చాలామంది బాధితులు, మెట్రోపాలిటన్ పోలీసులు సహా అధికారులపై నమ్మకం పెట్టుకోవడం లేదు.
యాపిల్ 'ఫైండ్ మైఐఫోన్' లేదా ఇతర ట్రాకింగ్ సర్వీసుల సహాయంతో చోరీకి గురైన వారి ఫోన్ల కచ్చితమైన రియల్-టైం లొకోషన్లతో తరుచూ బాధితులు అనేకసార్లు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ అధికారులు సహాయం చేయలేకపోతున్నారు.
"మెట్రోపాలిటన్ పోలీసులు చేయాల్సింది మరింత ఉందని అనుకుంటాను. వారు మరిన్ని సీసీటీవీ నిఘాలను ఏర్పాటు చేయడం లేదా ఈ సమస్యను పరిష్కరించడానికి కొంతమంది అండర్ కవర్ పోలీసు అధికారులను నియమించడం వంటివి చేయాలి" అని గతేడాది సెంట్రల్ లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ స్ట్రీట్‌లో తన ఫోన్ పోగొట్టుకున్న నటాలీ మిచెల్ అనే మహిళ అభిప్రాయపడ్డారు.
మరోవైపు మెట్రోపాలిటన్ పోలీసులు...టిక్ టాక్ సహా ఇతర సామాజిక మాధ్యమాల వేదికల్లో గత నెలలో ఈ ఫోన్ స్నాచర్లను పట్టుకున్న వివిధ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.
లండన్‌లో ఈ ఏడాది వ్యవధిలో వ్యక్తిగత దోపిడీ (పర్సనల్ రాబరీ) కేసులు 13శాతం తగ్గాయని, దొంగతనాల కేసులు 14శాతం తగ్గాయని వారు ఆ వీడియోల్లో చెబుతున్నారు.
ఫోన్ రాబరీ వంటి నేరాలపై దృష్టి పెట్టేందుకు మరో 80 మంది అధికారులను నియమించుకుంటున్నట్లు అందులో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














