ఆ శ్మశానంలో సమాధి కోసం స్థలాలు రిజర్వ్ చేసుకున్నారు

ఫొటో సోర్స్, Thulasi prasad Reddy/ BBC
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
- హోదా, బీబీసీ కోసం
ఆ క్రైస్తవ శ్మశాన వాటికలో ఓ షెడ్డులోని బండరాయిపై 71 ఏళ్ల వ్యక్తి కూర్చుని ఉన్నారు. ఆయన పక్కనే ఉన్న భార్య సమాధివైపు చూస్తున్నారు. అప్పుడప్పుడూ ఆయన అక్కడకు వచ్చి అలా కూర్చుని తన భార్య సమాధి వంక చూస్తుంటారు. భార్య సమాధి పక్కనే తన సమాధి కోసం ఆయన స్థలాన్ని రిజర్వు చేసుకున్నారు.
ఈ శ్మశానం పేరు క్రైస్తవుల సమాధుల తోట. ఆంధ్రప్రదేశ్‌లో కడపలోని రిమ్స్ ఆస్పత్రి సమీపంలో ఉంది.
శుభ్రంగా చదును చేసిన 4 ఎకరాల స్థలంలో ఇప్పటికే సగానికి పైగా సమాధులు నిర్మించి ఉన్నాయి. దానిలోపలకు ప్రవేశించగానే చివరి చూపు మందిరం ఉంటుంది.
మృతదేహాన్ని శ్మశానానికి తీసుకువచ్చాక చివరి చూపు చూసేందుకు ఆ ‘చివరిచూపు మందిరాన్ని’ నిర్మించారు. ఇక్కడ చివరి చూపు అయిపోయాక శవాన్ని తోటలో ఖననం చేసి సమాధి నిర్మిస్తారు.
ఆ 71 ఏళ్ల వ్యక్తి పేరు సీహెచ్ నెల్సన్. కడపలోనే ఉంటారు. 15 ఏళ్లపాటు ఇండియన్ ఎయిర్ ఫోర్సులో పనిచేశారు. తర్వాత కడపలోనే ఎల్ఐసీలో పనిచేశారు.
ఆయన భార్య పీపీ వేదామణి కుసుమకుమారి (61) 9 ఏళ్ల కిందట అనారోగ్యంతో మరణించారు.
పిల్లలు విదేశాల్లో స్థిరపడడంతో నెల్సన్ కడపలో ఒంటరిగా ఉంటున్నారు. తను చనిపోయాక భార్య సమాధి పక్కనే తన సమాధి నిర్మించడానికి వీలుగా ఆయన ఇక్కడ స్థలం రిజర్వ్ చేసుకున్నారు.


ఫొటో సోర్స్, Thulasi prasad Reddy/ BBC
పిల్లలు వెతుక్కోకూడదనే..
పిల్లలు స్థిరపడడంతో నెల్సన్ మూడంతస్తుల భవనంలో రెండు అంతస్తులు అద్దెకు ఇచ్చి ఒక అంతస్తులో నివసిస్తున్నారు. తన ఇంటికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సమాధుల తోటకు వచ్చి వెళ్తుంటారు.
భార్య చనిపోయినపుడు, కడపలోని రిమ్స్ దగ్గర ఉన్న సమాధుల తోటలో భార్య పక్కనే భర్త సమాధి నిర్మించుకోడానికి స్థలం రిజర్వ్ చేసుకోవచ్చని దాని నిర్వాహకులు చెప్పడంతో ఆయన అప్పట్లో 10 వేల రూపాయలు చెల్లించి భార్య సమాధి పక్కనే స్థలం రిజర్వ్ చేయించుకున్నాడు.
తన పిల్లలు ఎప్పుడైనా ఇక్కడకు వస్తే తమకు ఇద్దరికీ ఒకే చోట నివాళి అర్పించడానికి వీలుగా ఉంటుందని అందుకే ఇక్కడ స్థలం రిజర్వ్ చేసుకున్నట్లు నెల్సన్ చెప్పారు.
''పెళ్లైన 37ఏళ్ల తర్వాత నా భార్య హఠాత్తుగా చనిపోయింది. అది తొమ్మిదేళ్ల క్రితం జరిగింది. వాళ్లు పది వేలు కడితే స్థలం రిజర్వేషన్ చేస్తామని చెప్పారు. నేను వెంటనే 10 వేలు కట్టి రిజర్వేషన్ చేసుకున్నాను. ఎందుకంటే మా అమ్మాయి యూకేలో ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా వస్తే అమ్మ సమాధి ఒక చోట, నాన్న సమాధి మరోచోట ఉంటే వారికి కష్టమవుతుంది. ఇద్దరివీ పక్క పక్కన ఉంటే ఎప్పుడైనా వచ్చి పువ్వులేసి పోవచ్చని, మా బంధువులు వచ్చినా ఒకే దగ్గర ఉన్న మమ్మల్ని చూసి వెళ్తారనే ఇలా చేశాను" అన్నారు.
భార్య సమాధి పక్కనే తన స్థలం కోసం 2016లో రిజర్వేషన్ చేసుకున్న నెల్సన్, ఇప్పుడు అక్కడ సమాధులకు స్థలం రిజర్వేషన్ చేయడం లేదని చెప్పారు.

ఫొటో సోర్స్, Thulasi prasad Reddy/ BBC
ఎప్పటికైనా చనిపోవాల్సిందే..
తన సమాధికి స్థలం రిజర్వేషన్ చేసుకున్నప్పుడు ఎందుకిలా చేశావని అనేకమంది అడిగారు.
వాళ్లందరికీ నేను ఏం చెప్పానంటే..
''ఎందుకురా ఇలా ముందే కొనుక్కుంటావు అని అనేక మంది అడిగారు. మనం ఎప్పుడైనా చనిపోవాల్సిందే కదా. అందుకే మా ఆవిడ పక్కనే నాకు కూడా స్థలం కొనుక్కుంటే బాగుంటుంది అనుకున్నా. అక్కడి వాళ్లు నాకు ఆ అవకాశం ఇచ్చారు. అందుకే నేను కొనుక్కున్నాను. మొదట్లో నా పిల్లలు కూడా దీనికి ఒప్పుకోలేదు. ఎందుకు డాడీ అలా చేయకు అన్నారు. అది ఒక సెంటిమెంట్ అంతే.''

ఫొటో సోర్స్, Thulasi prasad Reddy/ BBC
సమాధిపైన రేకుల షెడ్డు
తర్వాత భార్య సమాధితోపాటూ పక్కనే తాను రిజర్వ్ చేసుకున్న స్థలం కూడా కవర్ అయ్యేలా రేకులతో నెల్సన్ ఒక షెడ్ వేయించారు.
తన సమాధి నిర్మించబోయే స్థలంలో కూర్చోవడానికి వీలుగా అరుగు లాంటి ఏర్పాటు చేశారు.
భార్యకు పచ్చదనం అంటే ఇష్టమని సమాధి చుట్టూ మొక్కలు నాటించారు.
వాటిలో మల్లెపూల మొక్కలు కూడా ఉన్నాయి.
''ఆమెకి చెట్లు అంటే చాలా ఇష్టం. అందుకే చుట్టూ మొత్తం చెట్లు పెంచి, తర్వాత షెడ్డు వేశాను. ఎవరైనా సమాధులు కడుతుంటే లోపల వచ్చి ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడే భోంచేస్తారు. నేను సమాధికి రిజర్వేషన్ చేసుకున్న చోట కూర్చోవడానికి ఒక బండ వేయించాను. ఇక్కడ చల్లగా ఉందని చెబుతారు" అని నెల్సన్ వివరించారు.
37 ఏళ్లు కలిసి జీవించిన భార్య హఠాత్తుగా చనిపోతుందని అనుకోలేదని, అందుకే అప్పుడప్పుడూ వెళ్లి తన భార్య సమాధిని చూసుకుంటూ ఉంటానని ఆయన చెప్పారు.
''అప్పుడప్పుడు నేను వెళుతూ ఉంటాను. ఆమె పుట్టిన రోజు, చనిపోయిన రోజు వెళ్తాను. మా పెద్దల పండుగ రోజున నవంబర్ 2న రెగ్యులర్‌గా వెళ్తుంటాను. అక్కడ మూడు సమాధులు ఒకే రంగులో ఉన్నాయి. అవి నా భార్య, వాళ్ల చెల్లి, వాళ్ల అన్నవి. నేను వీళ్ళతో పాటు కలిసి చదువుకున్నాను" అని నెల్సన్ చెప్పారు. '

ఫొటో సోర్స్, Thulasi prasad Reddy/ BBC
సమాధుల రిజర్వేషన్
కడపలో ప్రభుత్వమే 2016లో క్రైస్తవులకు 4 ఎకరాల్లో శ్మశానవాటిక కేటాయించింది. అప్పుడు కొంత మంది అక్కడ తమ సమాధులకు స్థలం రిజర్వేషన్ చేసుకున్నారు.
అయితే ఇప్పుడు అక్కడ స్థలం రిజర్వేషన్ చేయడం లేదు.
ఇటీవల సమాధుల రిజర్వేషన్ అనే ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
బీబీసీ కడపలోని క్రైస్తవుల సమాధుల తోటకు వెళ్లి పరిశీలించినపుడు అక్కడ నెల్సన్‌లాగే 26 మంది తమ సమాధి కోసం స్థలం రిజర్వ్ చేసుకున్న బోర్డులు కనిపించాయి.
ఈ సమాధుల స్థలం రిజర్వేషన్‌పై చాలామంది స్థానికులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అది కూడా కడపలో అలాంటిది చూడడం వింతగా అనిపించిందని స్థానికుడు విజయభాస్కర్ చెప్పారు.
''ప్రధానంగా కొన్ని నిర్మాణాలకు, అపార్టుమెంట్లు నిర్మించడానికి స్థలం రిజర్వేషన్ చేసుకోవడం గురించి మేం విన్నాం. కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమాధుల కోసం కూడా స్థలం రిజర్వ్ చేసుకోవడం అన్నది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. కడపలో ఇలా జరిగిందా అని ఆశ్చర్యంగా ఉంది'' అన్నారు ఆయన.

ఫొటో సోర్స్, Thulasi prasad Reddy/ BBC
అందుకే అలా చేశాం..
క్రైస్తవుల సమాధులతోట కడపలో ఉన్న సీఎస్ఐ చర్చి నిర్వాణలో ఉంది. దీనిపై బీబీసీ సీఎస్ఐ చర్చి సెక్రటరీ మనోహర్‌తో మాట్లాడింది.
2016లో కొంత మందికి తాము స్థలాల రిజర్వ్ చేశామని, అయితే తర్వాత ఆపేశామని ఆయన చెప్పారు.
''కడపలో బ్రిటిష్ కాలంలో దొరల ఘోరీలు అనే ఒక సమాధులతోట ఉండేది. అక్కడ రజాకార్ల సమయంలో చనిపోయిన వాళ్లు, విదేశీయులను సమాధి చేశారు. చనిపోయిన క్రైస్తవులను కూడా అక్కడే పూడ్చి పెట్టేవారు. 2015-16 మధ్యలో దొరలఘోరీలు అనే శ్మశాన వాటికలో స్థలం పూర్తిగా నిండిపోయింది. జిల్లా కలెక్టర్‌కు పరిస్థితి వివరించినపుడు ఆయన మాకు రిమ్స్ దగ్గర నాలుగు ఎకరాల ల్యాండ్ ఇచ్చారు. 2016 నుంచి చనిపోయిన వారిని అక్కడ ఖననం చేస్తూ వస్తున్నాం.''అని మనోహర్ వివరించారు.
అసలు సమాధికి స్థలం రిజర్వేషన్ చేయడం అనే ఆలోచన ఎలా వచ్చిందో, దానిని ఇప్పుడు ఎందుకు ఆపేశారో కూడా మనోహర్ చెప్పారు.
''మా పాత బిషప్ చనిపోయిన తర్వాత మొట్టమొదట ఆయనను, ఆయన భార్య సమాధి పక్కనే ఖననం చేశాం. భర్త చనిపోతే భార్య కూడా వారి సమాధి పక్కనే ఉంటే బాగుంటుందని క్రైస్తవులు భావిస్తారు. వారి జీవితంలో సగభాగం కదా అనే ఉద్దేశంతో వారికి కూడా స్థలం ఇస్తే బాగుంటుంది అని అలా ఇచ్చాం. అయితే కొన్నిరోజుల తర్వాత ఆపేశాం. ఇప్పుడు ఎవరికీ ఇవ్వడంలేదు. పూర్తిగా ఆపేశాం. ఎందుకంటే ఈ సెమెట్రీ నిర్వహణకు చాలా ఖర్చు అవుతోంది. ఉన్న స్థలం కూడా అయిపోవచ్చింది.''అని ఆయన అన్నారు.
ఇక్కడ రిజర్వ్ చేసుకున్న వారిలో తల్లిదండ్రులకు దగ్గరే ఉండాలని స్థలం రిజర్వ్ చేసుకున్నపిల్లలు కూడా ఉన్నారు.
మత విశ్వాసాలు, కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమానురాగానే అలా వారిని స్థలం రిజర్వ్ చేసుకునేలా చేశాయని స్థానికుడు విజయబాస్కర్ అన్నారు.
''సమాధికి ఈ స్థలం రిజర్వేషన్ చేసుకోవడం అనేది వాళ్ల మత విశ్వాసాలేనండి. వాళ్ళ వ్యక్తిగత ప్రేమ అనురాగాలు, వాళ్ల తల్లిదండ్రులతో గాని వాళ్ళ భార్య బిడ్డలతో గాని వాళ్లకు ఉన్న అనుబంధం అని ఏదైనా చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా బయట ప్రపంచానికి ఆశ్చర్యం కలిగించే విషయం. కానీ ఇది నమ్మలేని నిజం. అందులో నా మిత్రుడు ఉండడం, నాకు చెప్పకుండా రిజర్వేషన్ చేయించుకోవడం ఆశ్చర్యంగా ఉంది'' అని ఆయన చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














