కరూర్‌: 7 pm టు 7 am.. ఈ 12 గంటల్లో అక్కడ ఏం జరిగింది?

తమిళనాడు, కరూర్, తొక్కిసలాట, విజయ్, దళపతి

తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 40 మంది మరణించారు.

విజయ్ వేదిక వద్దకు వచ్చినప్పటి నుంచి, శనివారం రాత్రంతా చాలా ఘటనలు వేగంగా జరిగిపోయాయి.

అంతకుముందు, కరూర్‌లో ప్రచార కార్యక్రమానికి సెప్టెంబర్ 27, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి కావాలని టీవీకే పార్టీ పోలీసులకు రాసిన లేఖలో కోరింది.

విజయ్ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కరూర్‌లోని వేలుసామిపురంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని టీవీకే అధికారిక ఎక్స్ పేజీలో తెలిపింది.

కరూర్‌లో ప్రచార కార్యక్రమానికి ముందు.. విజయ్ నామక్కల్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. దీని ప్రకారం, విజయ్ ఉదయం 8.45 గంటలకు నామక్కల్‌లోని కె.ఎస్. సినిమా థియేటర్ దగ్గర నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని ఆ పార్టీ ముందుగా ప్రకటించింది.

అయితే, నామక్కల్, కరూర్ రెండుచోట్ల షెడ్యూల్ చేసిన సమయానికి విజయ్ కార్యక్రమాలకు హాజరుకాలేకపోయారు.

విజయ్ వాహనం నామక్కల్‌లోని వేదిక వద్దకు చేరుకునే సమయానికి మధ్యాహ్నం 2.00 గంటలైంది.

అంటే, షెడ్యూల్ చేసిన సమయం కంటే దాదాపు 5 గంటలు ఆలస్యంగా.. విజయ్ అక్కడకు చేరుకున్నారు. దాదాపు 20 నిమిషాలు మాట్లాడి అక్కడి నుంచి కరూర్‌కు బయలుదేరారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తమిళనాడు, కరూర్, తొక్కిసలాట, విజయ్, దళపతి
ఫొటో క్యాప్షన్, తమ వారిని కోల్పోయి రోదిస్తున్న బాధిత కుటుంబ సభ్యులు

విజయ్ వచ్చేసరికి రాత్రయ్యింది..

విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు కరూర్‌ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ ప్రకటించినప్పటికీ, ఆయన వచ్చేసరికి రాత్రి 7 గంటల 40 నిమిషాలైంది.

ఉదయం 11 గంటల నుంచే ఆ ప్రదేశంలో జనం గుమిగూడారని తమిళనాడు డీజీపీ వెంకట్రామన్ తెలిపారు.

ఉదయం నుంచే వేదిక వద్ద ఉన్న జనంతోపాటు విజయ్‌ వెంట వచ్చిన జనం కూడా కలిసి పెద్దయెత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారని తెలిపారు.

ఇదిలా ఉండగా, ఉదయం 10 గంటల నుంచే ఆ ప్రాంతానికి జనం తరలివచ్చారని ఏడీజీపీ డేవిడ్సన్ తెలిపారు.

తమిళనాడు, కరూర్, తొక్కిసలాట, విజయ్, దళపతి

ఇక్కడ విజయ్ దాదాపు 20 నిమిషాల పాటు ప్రసంగించారు. తన ప్రసంగం మధ్యలో, అక్కడికి చేరుకున్న అంబులెన్స్‌కు దారి ఇవ్వమని స్వచ్ఛంద సేవకులను కోరారు.

ఆయన మాట్లాడుతున్న సమయంలోనే కొంతమంది స్పృహ కోల్పోతున్నట్లు లైవ్ ఫుటేజ్‌లో కనిపించింది.

విజయ్ స్వయంగా వాటర్ బాటిళ్లను జనంలోకి విసిరారు.

జనసమూహం, అంబులెన్సుల శబ్దం వంటి వివిధ కారణాల వల్ల విజయ్ తన ప్రసంగాన్ని 2-3 సార్లు ఆపాల్సి వచ్చింది.

అలాగే, తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత, జనసమూహం మధ్యలో తప్పిపోయిన ఒక అమ్మాయి పేరు చెప్పి, ఆమెను కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించమని కోరారు.

సుమారు 7.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరారు విజయ్. కరూర్ నుంచి కారులో తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. విలేఖరులతో మాట్లాడకుండానే విజయ్ వెళ్లిపోయారు.

తమిళనాడు, కరూర్, తొక్కిసలాట, విజయ్, దళపతి

నిమిషాల వ్యవధిలోనే..

విజయ్ అక్కడి నుంచి బయలుదేరిన నిమిషాల్లోనే, ఆ ప్రాంతంలో తొక్కిసలాట కారణంగా చాలామంది ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

బాధితులను వివిధ ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి సంఘటన స్థలం నుంచి 10కి పైగా అంబులెన్సులను పంపించారు.

రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తొక్కిసలాటలో అనేక మంది మరణించారని రిపోర్టులు రావడం మొదలైంది.

కరూర్ జిల్లా కలెక్టర్, డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే విజయభాస్కర్‌తో పాటు పలువురు కరూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు.

మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, పీఎంకే నాయకుడు అన్బుమణి రామదాస్, నామ్ తమిళర్ పార్టీ చీఫ్ కోఆర్డినేటర్ సీమాన్ సహా వివిధ రాజకీయ నాయకులు తొక్కిసలాటలో మరణించిన వారికి సంతాపం తెలిపారు.

అంబులెన్స్

రాత్రి 8.35: "తొక్కిసలాట కారణంగా స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో చేరిన క్షతగాత్రులకు తక్షణ వైద్యచికిత్స అందించాలని మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, మంత్రి ఎం. సుబ్రమణియన్, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించాను" అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

"యుద్ధ ప్రాతిపదికన అవసరమైన సహాయం అందించాలని సమీపంలోని తిరుచ్చి జిల్లాకు చెందిన మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమోళిని కూడా కోరాను. పరిస్థితిని వీలైనంత త్వరగా చక్కదిద్దడానికి చర్యలు తీసుకోవాలని అక్కడి ఏడీజీపీతో కూడా మాట్లాడాను."

"వైద్యులు, పోలీసు శాఖతో సహకరించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నా" అని ముఖ్యమంత్రి ఎక్స్‌లో రాశారు.

తమిళనాడు, కరూర్, తొక్కిసలాట, విజయ్, దళపతి

రాత్రి 10.57: ఈ ఘటనపై దర్యాప్తుకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. అలాగే, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. 1 లక్ష ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు.

రాత్రి 11.15 గంటలకు: "నాకు గుండె బద్దలైపోయింది, నేను భరించలేని, వర్ణించలేని దుఃఖంలో ఉన్నా" అని చెన్నై చేరుకున్న విజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు.

"కరూర్‌లో మరణించిన ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా" అని రాశారు.

తమిళనాడు, కరూర్, తొక్కిసలాట, విజయ్, దళపతి

రాత్రి 11.52: కరూర్‌లో జరిగిన ప్రమాదంలో బాధితుల గురించిన సమాచారం కోసం సంప్రదించేందుకు కరూర్ జిల్లా కలెక్టరేట్ అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను (04324 256306, వాట్సాప్: 7010806322) ఎంకే స్టాలిన్ ప్రకటించారు.

రాత్రి 12.19: కరూర్ సంఘటనకు సంబంధించి టీవీకే పార్టీ కరూర్ జిల్లా కార్యదర్శి మథిఅళగన్‌పై హత్యాయత్నం, మరణానికి, ప్రాణాపాయానికి కారణమవడం వంటి నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అర్ధరాత్రి 01.00: "సంఘటన జరిగిన వెంటనే, 2,000 మంది పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. టీవీకే వారు మొదట రెండు చిన్న ప్రదేశాల్లోనే సభ నిర్వహిస్తామని, కేవలం పది వేల మంది మాత్రమే వస్తారని చెప్పి అనుమతి అడిగారు" అని డీజీపీ వెంకట్రామన్ విలేఖరులకు తెలిపారు.

"టీవీకే చెప్పిన దాని ప్రకారం 500 మంది పోలీసులను భద్రత కోసం నియమించారు. వారి అభ్యర్థనను అంగీకరించి అనుమతి మంజూరు చేశారు. సమావేశం 12 గంటలకు జరుగుతుందని ప్రకటించారు. కానీ ఆలస్యమైంది. విజయ్ ఆలస్యంగా రావడంతో జనసందోహం పెరిగింది" అని ఆయన అన్నారు.

సెప్టెంబర్ 28, ఉదయం 6.37: మృతులకు నివాళులు అర్పించి, వారి కుటుంబాలకు సంతాపం తెలిపిన తర్వాత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు.

ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ఉదయం కరూర్‌కు బయలుదేరతారని గతంలో వార్తలు వచ్చినప్పటికీ, ఆయన నిన్న రాత్రి 12.30 గంటల ప్రాంతంలో బయలుదేరి తెల్లవారుజామున అక్కడికి చేరుకున్నారు.

నామ్ తమిళర్ పార్టీ చీఫ్ కోఆర్డినేటర్ సీమాన్, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, డీఎండీకే నాయకురాలు ప్రేమలత విజయకాంత్, శశికళతో పాటు పలువురు కరూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు.

ముఖ్యమంత్రి స్టాలిన్
ఫొటో క్యాప్షన్, గాయపడిన వారిని పరామర్శించారు ఎంకే స్టాలిన్.

ఉదయం 7.00 గంటలు : "నిన్న రాత్రి 7.45 గంటల ప్రాంతంలో, అధికారులతో మాట్లాడుతున్నప్పుడు, కరూర్‌లో ర్యాలీ సందర్భంగా చాలామంది ఊపిరాడక బాధపడుతున్నారని/ సృహ తప్పి పడిపోతున్నారని మాకు రిపోర్టులు అందాయి" అని ఎంకే స్టాలిన్ విలేఖరులతో చెప్పారు.

వెంటనే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని, తరువాత జిల్లా కలెక్టర్‌ను పంపించాను.

"మరణాల సంఖ్య పెరుగుతూనే ఉండటంతో, మంత్రులు ఎం.సుబ్రమణియన్, అన్బిల్ మహేష్, డీజీపీని సమీప జిల్లాలకు పంపాను" అని ఆయన అన్నారు.

సచివాలయంలో సీనియర్ మంత్రి ఇ.వి.వేలుతో చర్చలు జరిపినట్లు కూడా ఆయన పేర్కొన్నారు.

విజయ్‌ను అరెస్టు చేస్తారా అని ఒక విలేఖరి ముఖ్యమంత్రిని అడిగారు.

దానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందిస్తూ, " ఈ ఘటనపై విచారించేందుకు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటు చేశాం. ఆ కమిషన్ దర్యాప్తు చేసి పూర్తి నివేదిక ఇస్తుంది. ఈలోగా, మీరు అడుగుతున్నట్లుగా రాజకీయ ఉద్దేశ్యాలతో నేను ఏమీ చెప్పదలచుకోలేదు. ఇదే మళ్లీ మళ్లీ చెబుతాను" అని అన్నారు.

ఇదిలా ఉండగా, దుబయ్‌లో ఉన్న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ నిన్న రాత్రి బయలుదేరి ఈ ఉదయం చెన్నై చేరుకున్నారు. అక్కడి నుంచి కరూర్‌కు వెళ్లారు. మృతుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం, ఈ ఉదయం ఆయన మళ్లీ దుబయ్‌ వెళ్లారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)