గర్భిణులకు పారాసిటమాల్ హానికరమా? ట్రంప్ వ్యాఖ్యలపై చెలరేగిన చర్చ ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మాడెలిన్ హాల్పర్ట్, నడిన్ యూసిఫ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
గర్భిణులకు నొప్పి నివారిణి మాత్ర టైలెనాల్‌ను ఇవ్వొద్దని త్వరలోనే వైద్యులకు సూచిస్తామంటూ సోమవారం అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.
ఈ మాత్రకు, ఆటిజానికి సంబంధం ఉందంటూ ఆయన వ్యాఖ్యానించడం వైద్యవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
టైలెనాల్‌ను తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదని, విపరీతమైన జ్వరం వచ్చినప్పుడు మాత్రమే గర్భిణులు ఈ మాత్ర గురించి ఆలోచించాలని ట్రంప్ అన్నారు.
అమెరికాలో టైలెనాల్‌గా పిలిచే ఈ మాత్ర ఇతర దేశాల్లో పారాసిటమాల్‌గా ప్రసిద్ధి.
అయితే, ట్రంప్ వ్యాఖ్యలను వైద్య నిపుణులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి ప్రకటనలు ప్రమాదకరమని కొందరు అంటున్నారు.

గర్భిణులకు పారాసిటమాల్ అత్యంత సురక్షిత నొప్పి నివారిణి అని యూకేలోని వైద్య అధికారులు కూడా స్పష్టం చేశారు.
''ఈ విషయంలో నేను అధ్యక్షుడు ట్రంప్ కంటే డాక్టర్లనే నమ్ముతాను'' అని యూకే హెల్త్ సెక్రటరీ వెస్ స్ట్రీటింగ్ అన్నారు.
ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్‌స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ సంస్థ తీవ్రంగా వ్యతిరేకించింది.
ఆటిజానికి ఈ మందుకు మధ్య సంబంధం ఉందన్న వాదనకు శాస్త్రీయ ఆధారాల్లేవని ఈ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ స్టీవెన్ ఫ్లెష్‌మన్ అన్నారు.
గతంలో జరిగిన అధ్యయనాలను పరిశీలిస్తే, గర్భంతో ఉన్నప్పుడు ఏ త్రైమాసికంలోనైనా ఎసిటామినోఫెన్‌ను ఉపయోగించడం వల్ల పిండం పెరుగుదలలో సమస్యలు ఏర్పడినట్లు రుజువు కాలేదని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) డాక్టర్లకు పంపిన నోటీస్‌లో ట్రంప్ కంటే సరళమైన భాషను ఉపయోగించింది.
''గర్భిణుల్లో జ్వరం, నొప్పిని తగ్గించడానికి కౌంటర్‌లో కొనే టైలెనాల్ వాడకాన్ని వైద్యులు పరిమితం చేయాలి. ఇది గర్భిణులకు, శిశువు ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. ఎసిటామినోఫెన్, ఆటిజానికి మధ్య సంబంధం ఉన్నట్లు అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే, వీటిమధ్య సంబంధం ఇంకా నిరూపితం కాలేదు. సైంటిఫిక్ లిటరేచర్‌లో ఈ అంశంపై విభిన్నమైన అధ్యయనాలు ఉన్నాయి'' అని ఎఫ్‌డీఏ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
టైలెనాల్ అనేది అమెరికా, కెనడా, కొన్ని ఇతర దేశాల్లో నొప్పి ఉపశమనానికి వినియోగించే ప్రముఖ నొప్పి నివారిణి. ఇందులో ప్రముఖంగా ఎసిటామినోఫెన్ ఉంటుంది. ఇదే పారాసిటమాల్‌గా పేరు పొందింది.
ఈ మాత్రను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రభుత్వాలు, ప్రముఖ మెడికల్ గ్రూపులు సిఫార్సు చేస్తున్నాయి.
ఎసిటామినోఫెన్ తీసుకోవడం వల్ల ఆటిజం రాదని శాస్త్రీయ ఆధారాలు స్పష్టంగా చూపిస్తున్నాయని బీబీసీతో టైలెనాల్ తయారీదారు కెన్‌వ్యూ చెప్పింది.
ల్యూకోవోరిన్‌ను ఆమోదిస్తారా?
ఎఫ్‌డీఏ త్వరలోనే దశాబ్దాల నాటి సంప్రదాయ ఔషధం ల్యూకోవోరిన్‌ను ఆమోదిస్తుందని సోమవారం కెన్నెడీ అన్నారు. కీమోథెరపీ దుష్ప్రభావాల నుంచి క్యాన్సర్ రోగులను కాపాడే ఈ మందును ఆటిజం ఉన్న పిల్లల్లో చికిత్స కోసం వాడతారని పేర్కొన్నారు.
ఆటిజం కేసుల పెరుగుదలను భయంకరమైన సంక్షోభంగా ట్రంప్ అభివర్ణించారు. ఈ విషయంపై తనకు చాలా బలమైన అభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు.
దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నత సంక్లిష్టమైన సిండ్రోమ్ ఆటిజానికి కారణాలు కనుగొనడం అంత సులభం కాదని నిపుణులు హెచ్చరించారు.
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఆటిజానికి కేవలం ఒకే కారణం లేదు. జన్యు, పర్యావరణ కారకాల సంక్లిష్ట కలయికగా ఆటిజం సంభవించే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గర్భంతో ఉన్న సమయంలో టైలెనాల్ వాడితే పిల్లలకు ఆటిజం, ఇతర నాడీ సంబంధిత లోపాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండొచ్చని ఆగస్టులో హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ నేతృత్వంలో రీసర్చ్‌లపై జరిగిన సమీక్షలో తేల్చారు.
ఈ సమీక్షలో భాగమైన 46 అధ్యయనాల్లో 27 అధ్యయనాలు టైలెనాల్ వాడకం వల్ల పిల్లల్లో నాడీ సంబంధిత లోపాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సూచించాయి.
టైలెనాల్ వాడకానికి ఆటిజంకు మధ్య ఎటువంటి సంబంధం లేదని 2024లో మరో అధ్యయనం పేర్కొంది. స్వీడన్‌లో 1995 నుంచి 2019 మధ్య జన్మించిన 24 లక్షల మంది పిల్లల్ని ఒక నమూనాగా తీసుకొని ఈ అధ్యయాన్ని నిర్వహించారు.
టైలెనాల్‌పై వచ్చిన ప్రకటనతో తాను తీవ్ర ఆందోళనకు గురైనట్లు టెక్సస్‌కు చెందిన 29 ఏళ్ల హేలీ డ్రెనాన్ చెప్పారు. ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్. మూడో నెలలో తలనొప్పి తగ్గడం కోసం టైలెనాల్ వాడాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.
''సరైన సందర్భం లేకుండా ఇలాంటి ప్రకటనలు చేస్తే చాలా మందికి ఆందోళన కలుగుతుంది'' ఆమె అన్నారు.
2000 నుంచి ఆటిజం కేసుల నిర్ధరణలు బాగా పెరిగాయని, 2020 నాటికి 8 ఏళ్ల పిల్లల్లో ఈ వ్యాధి రేటు 2.77%కి చేరిందని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














