కేరళ: మెదడును తినేసే అమీబా సోకి ఇప్పటివరకు 19 మంది మృతి.. అసలేమిటీ ప్రమాదకర వ్యాధి, దీనికి చికిత్స ఉందా?

కేరళ, ఆరోగ్యం, వ్యాధులు, అమీబా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కేరళలో ఉత్సాహంగా జరుపుకునే ఓనమ్ పండుగకు ముందు, 45 ఏళ్ల శోభనను ఆమె కుటుంబ సభ్యులు అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. ఆమె వణికిపోతూ, నెమ్మదిగా స్పృహ కోల్పోయారు.

శోభన దళిత వర్గానికి చెందిన మహిళ. పొట్టకూటి కోసం మలప్పురం జిల్లాలోని ఒక గ్రామంలో పండ్లరసాలు(జ్యూస్) అమ్ముతూ జీవించేవారు. కొద్దిరోజుల కిందట తలతిరగడం, అధిక రక్తపోటుతో ఆసుపత్రికి వెళితే వైద్యులు ఆమెకు కొన్ని మందులు రాసి ఇంటికి పంపారు. కానీ, ఆ తర్వాత ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. జ్వరం వచ్చింది, భయంకరమైన వణుకుగా మారింది.

సెప్టెంబర్ 5న ఓనమ్ పండుగ రోజు ఆమె మరణించారు.

శోభన మరణానికి కారణం నెగ్లేరియా ఫౌలెరి అనే 'బ్రెయిన్ ఈటింగ్ అమీబా' (మెదడును తినేసే అమీబా) వల్ల కలిగే ఇన్ఫెక్షన్. ఇది చాలా అరుదైన వ్యాధి. చాలామంది డాక్టర్లు వారి మొత్తం కెరియర్‌లోనే ఇలాంటి కేసులను చూసి ఉండరు కూడా.

"మేం ఏమీ చేయలేకపోయాం. శోభన చనిపోయిన తర్వాతే మాకు ఆ వ్యాధి గురించి తెలిసింది" అని శోభన బంధువు, సామాజిక కార్యకర్త అజిత కతిరదత్ చెప్పారు.

ఈ ఏడాది కేరళలో 70 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడిగా, వారిలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 3 నెలల శిశువు నుంచి, 92 ఏళ్ల వృద్ధుడి వరకూ ఉన్నారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కేరళ, ఆరోగ్యం, వ్యాధులు, అమీబా

ఫొటో సోర్స్, Vivek R Nair

సాధారణంగా, వెచ్చని మంచినీటిలో ఉండే బ్యాక్టీరియాను తినే ఈ ఏకకణ అమీబా.. 'ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫలైటిస్' (పీఏఎం) అనే ప్రమాదకరమైన మెదడు ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. ఈత కొడుతున్నప్పుడు ముక్కు ద్వారా లోపలికి ప్రవేశించి వేగంగా మెదడు కణజాలాన్ని దెబ్బతీస్తుంది.

2016లో మొదటిసారి కేరళలో కేసులు నమోదవడం మొదలైంది. ఏటా ఒకటి రెండు కేసులే కనిపించినా, దాదాపుగా ప్రాణాంతకంగా మారాయి. 1962 నుంచి ప్రపంచవ్యాప్తంగా 488 కేసులు నమోదయ్యాయని తాజా అధ్యయనంలో తేలింది. వీటిలో ఎక్కువగా అమెరికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియాలో నమోదయ్యాయి. అయితే, ఈ వ్యాధి సోకిన వారిలో 95 శాతం మంది మరణించారు.

కేరళ, ఆరోగ్యం, వ్యాధులు, అమీబా

ఫొటో సోర్స్, Universal Images Group via Getty Images

ఫొటో క్యాప్షన్, నెగ్లేరియా ఫౌలెరి అనే మెదడును తినేసే అమీబా నీటిలో ఉంటుంది.

అయితే, కేరళలో పరిస్థితి కొంత మెరుగ్గా కనిపిస్తోంది. గతేడాది 39 కేసులు నమోదుకాగా, మరణాల రేటు 23 శాతంగా ఉంది. ఈ ఏడాది 70 కేసులు నమోదుకాగా, మరణాల రేటు 24.5 శాతం. అయితే, కేసులు పెరగడమనేది, అత్యాధునిక సదుపాయాలున్న ల్యాబ్‌ల ద్వారా ఈ కేసులను త్వరగా గుర్తించడానికి సంకేతంగా భావిస్తున్నాయని డాక్టర్లు అంటున్నారు.

"కేసులు పెరుగుతున్నప్పటికీ, మరణాల సంఖ్య తక్కువగా ఉంది. వెంటనే పరీక్షలు నిర్వహించడం, ముందస్తు రోగర్ధరణ వల్ల ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు పెరుగుతున్నాయి. ఇది కేరళలో అనుసరిస్తున్న ప్రత్యేకమైన స్ట్రాటజీ" అని తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఇన్ఫెక్షన్ డిసీజెస్ విభాగాధిపతి అరవింద్ రఘుకుమార్ అన్నారు. వ్యాధిని ముందుగానే నిర్ధరించగలిగితే, ప్రత్యేకమైన చికిత్స అందించవచ్చు. అంటే, అమీబా లక్ష్యంగా పనిచేసే యాంటీమైక్రోబియల్స్, స్టెరాయిడ్స్‌ మిశ్రమంతో ప్రాణాలు కాపాడొచ్చని ఆయన అన్నారు.

సైంటిస్టులు దాదాపు 400 రకాల 'ఫ్రీ లివింగ్ అమీబా'లను గుర్తించారు. వాటిలో కేవలం ఆరు రకాల అమీబా వ్యాధులకు కారణమవుతాయి. వీటిలో రెండు రకాలు నెగ్లేరియా ఫౌలెరి, అకేంతమీబా మెదడుకి సంక్రమిస్తాయి. కేరళలోని ల్యాబుల్లో 5 ప్రధానమైన పాథజెనిక్ అమీబాలను గుర్తించవచ్చని అధికారులు చెబుతున్నారు.

కేరళ ప్రధానంగా భూగర్భ జలాలు, సహజ నీటి వనరులపైనే ఎక్కువగా ఆధారపడడమే మరింత ప్రమాదకరంగా మారుతోంది. మరీముఖ్యంగా, చిన్నచిన్న బావులు, చెరువులు కలుషితమైనప్పుడు.

కేరళలో దాదాపు 55 లక్షల బావులు, 55,000 చెరువులు ఉన్నాయి. లక్షలాది మంది ఈ బావుల నీటినే నిత్యం వినియోగిస్తుంటారు. దీని కారణంగా బావులు, చెరువులను 'ప్రమాద కారకాలు'గా చెప్పడం కుదరదు. ఎందుకంటే, ఇవి రాష్ట్ర ప్రజల జీవనాధారం.

కేరళ, ఆరోగ్యం, వ్యాధులు

ఫొటో సోర్స్, Nebula NP

''చెరువుల్లో స్నానాలు చేయడం వల్ల కొందరికి ఇన్ఫెక్షన్లు సోకితే, మరికొందరికి స్విమ్మింగ్ పూల్స్ వల్ల, సంప్రదాయపరంగా ముక్కు శుభ్రం చేసుకునే పద్ధతి వల్ల కూడా ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. అది బావి అయినా, చెరువు అయినా.. కలుషితమైతే ప్రమాదకరమే'' అని ప్రముఖ ఎపిడమాలజిస్ట్ అనీష్ టీఎస్ అన్నారు.

దీంతో, ప్రజారోగ్య శాఖ అధికారులు స్పందించారు, ఆగస్ట్ చివర్లో ఒక కార్యక్రమం చేపట్టి దాదాపు 27 లక్షల బావులను క్లోరినేట్ చేశారు.

చెరువులు, బావుల వద్ద ఈత కొట్టొద్దంటూ స్థానిక పాలకవర్గాలు హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశాయి. అలాగే, ప్రజారోగ్య చట్టాన్ని కఠినంగా అమలు చేస్తూ స్విమ్మింగ్ పూల్స్, వాటర్ ట్యాంకులను తరచూ క్లోరినేట్ చేయిస్తున్నారు.

అయితే, ఇలాంటి చర్యలు చేపట్టినప్పటికీ.. చెరువులనున క్లోరినేట్ చేయడం అసాధ్యం. ఎందుకంటే, అలా చేస్తే చేపలు చనిపోతాయి. అంతేకాకుండా దాదాపు 3 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో ప్రతి నీటి వనరును పర్యవేక్షించడం కూడా సాధ్యం కాదు.

అందువల్ల, అధికారులు ఇప్పుడు నిషేధానికి బదులు అవగాహన కల్పించడంపై దృష్టిపెట్టారు.

కేరళ, ఆరోగ్యం, వ్యాధులు, అమీబా

ఫొటో సోర్స్, Abhishek Chinnappa/Getty Images

"నిజానికి ఇది చాలా క్లిష్టమైన సమస్య. ఇక్కడ అమీబా ఉండే అవకాశం ఉందని కొన్నిచోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ, ఇది అన్ని సందర్భాల్లోనూ ప్రయోజనకరం కాదు. ఎందుకంటే, ఏ కలుషిత నీటిలో అయినా అమీబా ఉంటుంది.(అవి సరస్సులైనా, చెరువులైనా, పూల్స్ అయినా)" అని జార్జియా యూనివర్సిటీలో ఇన్ఫెక్షస్ డిసీజెస్, సెల్యూలార్ బయాలజీ ప్రొఫెసర్ డెన్నిస్ కైలే బీబీసీతో అన్నారు.

"నియంత్రించగలిగిన ప్రదేశాల్లో తరచూ క్లోరినేషన్ చేయడం ద్వారా ఈ వ్యాధి సంక్రమించే అవకాశాలను నియంత్రించవచ్చు. పూల్స్ వంటి వాటిలో" అన్నారాయన.

వాతావరణ మార్పులు కూడా ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. వెచ్చని నీరు, ఎండలు ఎక్కువ కాలం ఉండడం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అమీబా పెరుగుదలకు అనుకూల పరిస్థితులను కల్పిస్తున్నాయని అంటున్నారు.

"కేరళ వంటి ఉష్ణమండల వాతావరణంలో కేవలం ఒక్క సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగినా ఈ అమీబా వ్యాప్తి పెరగొచ్చు, కలుషిత నీరు ఈ అమీబాకు ఆహారమైన బ్యాక్టీరియాను పెంచి, దీని పెరుగుదలను మరింత ప్రోత్సహిస్తుంది" అని ప్రొఫెసర్ అనీష్ చెప్పారు.

డాక్టర్ కైలే మరో హెచ్చరిక చేశారు. గతంలో కొన్ని కేసులను అమీబా కారణంగానే వచ్చినట్లు గుర్తించలేకపోయి ఉండొచ్చు.

''ఈ అనిశ్చితి చికిత్సను మరింత కష్టతరం చేస్తుంది. అందుబాటులో ఉన్న ఔషధాలు ప్రామాణికమైనవి కాదు. ఈ ఇన్ఫెక్షన్ నుంచి బతికి బయటపడిన వారికి అందించిన చికిత్సే ప్రామాణికంగా మారుతోంది" అని అన్నారు.

ఇప్పుడు వినియోగిస్తున్న ఔషధాలు ప్రామానికమైనవేనా కాదా అని తేల్చేందుకు సరిపడినంత డేటా అండుబాటులో లేదని కైలే చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)