మల విసర్జన ప్రతి రోజూ సాఫీగా జరిగేందుకు నిపుణులు చెబుతున్న 4 సింపుల్ చిట్కాలు

ఆహారం, జీర్ణవ్యవస్థ, మలవిసర్జన

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రఫేల్ అబ్‌చైబ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ జూలియానా సారెజ్ సోషల్ మీడియాలో జీర్ణవ్యవస్థ గురించి పోస్ట్ చేయడం ప్రారంభించిన తర్వాత ఒక పెద్ద సమస్యను గుర్తించారు. అదేంటంటే.. తమ జీర్ణవ్యవస్థ పనితీరు గురించి మాట్లాడడం జనం అసౌకర్యంగా భావిస్తారు.

"వారు దానిని సిగ్గుపడే విషయంగా భావిస్తారు. తమకున్న లక్షణాల గురించి మాట్లాడటానికి ఇష్టపడరు" అని ఆమె బీబీసీతో అన్నారు.

"నేను గ్యాస్ట్రిటిస్, హెపటైటిస్, ప్యాంక్రియాటైటిస్, రిఫ్లక్స్ వంటి అనేక సమస్యల గురించి కూడా మాట్లాడటం మొదలుపెట్టాను. చాలా మంది గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అనే పదాన్ని కూడా సరిగ్గా ఉచ్ఛరించలేరు"

"అప్పుడే నేను మలం గురించి మాట్లాడటం మొదలుపెట్టాను. ప్రజలు సులభంగా అర్థం చేసుకోగలిగే డేటాను అందించాను. ప్రజలు నన్ను 'డాక్టర్ పూప్' అని పిలిచారు" అని కొలంబియాకు చెందిన జూలియానా తెలిపారు.

అప్పటి నుంచి, జూలియానా సువారెజ్ జీర్ణవ్యవస్థ ఎలా పనిచేస్తుంది, మలం గురించి ముఖ్యమైన విషయాలు తెలియజేయడానికి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీని (@ladoctorapopo_) ఉపయోగిస్తున్నారు.

ఆమె"ది ఆర్ట్ ఆఫ్ పూపింగ్: హెల్తీ డైజెషన్, ఏ హ్యాపీ లైఫ్" అనే ఇ-పుస్తకాన్ని కూడా ప్రచురించారు.

"చిన్నప్పుడు మలం గురించి మాట్లాడడం అంటే ఏదో అలర్జీ అన్న భావన మానసికంగా ఏర్పరుస్తారు. కానీ, ఇప్పుడు పెద్దయ్యాక అయినా దాని గురించి సహజంగా మాట్లాడుకోవాలి.''

జీర్ణవ్యవస్థ ఆరోగ్యం విషయంలో ప్రజలు చేసే ప్రధాన తప్పులు, మలవిసర్జన సాఫీగా జరగడానికి కొన్ని చిట్కాల గురించి ఆమె బీబీసీతో మాట్లాడారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆహారం, జీర్ణవ్యవస్థ, మలవిసర్జన

ఫొటో సోర్స్, Dr. Juliana Suárez

ఫొటో క్యాప్షన్, డాక్టర్ జూలియానా సారెజ్
ఆహారం, జీర్ణవ్యవస్థ, మలవిసర్జన

టెలివిజన్‌, మ్యాగజైన్‌లు, సోషల్ మీడియాలో "మిరాకిల్ డైట్‌" గురించి అనేక విషయాలు ప్రస్తావనకు వస్తుంటాయి. వాటన్నింటి సారాంశం ఏంటంటే, మన డైట్ నుంచి కొన్ని పదార్థాలను తొలగించడం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందని.

కానీ, జూలియానా దీనికి వ్యతిరేకంగా సలహా ఇస్తారు.

''ఆహారం ఒక్కటే సమస్య కాదని నేను జనానికి చెప్పా. ప్రతి వ్యక్తి శరీరంలో ఉండే సూక్ష్మజీవులు ముఖ్యమైనవి'' అని ఆమె అన్నారు.

మనం తినే ఆహారం జీర్ణం కావడానికి సహాయపడే అనేక బ్యాక్టీరియాలకు మన జీర్ణవ్యవస్థ నిలయం. సూక్ష్మజీవులు వివిధ వాతావరణాలలో వృద్ధి చెందుతాయి.

సోషల్ మీడియాలో ఆరోగ్యకరమైన ఆహారం గురించి సమాచారం తెలుసుకునే క్రేజ్‌తో చాలా మంది వారి డైట్ నుంచి కొన్ని ఆహారాలను తొలగిస్తున్నారు, ఇది మైక్రోబియోమ్‌(సూక్ష్మజీవులను)ను బలహీనపరుస్తుందని ఆమె వివరించారు.

ఆహారం, జీర్ణవ్యవస్థ, మలవిసర్జన

ఫొటో సోర్స్, Dr. Juliana Suárez

ఫొటో క్యాప్షన్, డాక్టర్ జూలియానా సారెజ్ రాసిన పుస్తకం

"ఇది పప్పు ధాన్యాలు లేదా గ్లూటెన్ (గోధుమ, మొక్కజొన్న వంటి ఆహారాలలో ఉండే జిగట పదార్థం) వల్ల కాదు. అవి చెడ్డవని భావిస్తున్నారు. వెల్లుల్లి కూడా కారణం కాదు, తగినంత ఫైబర్ లేని ఆహారం, వ్యాయామం లేకపోవడం ఈ సూక్ష్మజీవులను ప్రభావితం చేయొచ్చు."

" మళ్లీ తినడం మొదలుపెట్టాలని ఆ పుస్తకంలో చెప్పాను. అలా మైక్రోబయోమ్‌ని కొంచెం కొంచెం మాత్రమే సర్దుబాటు చేసుకోగలం."

ఆహారంలో సహజ ఆహారాలన్నింటినీ చేర్చుకునే ముందు వాటితో ప్రయోగాలు చేయాలని ఆమె సూచిస్తున్నారు.

''పాల ఉత్పత్తులు, మరిన్ని పండ్లు, కూరగాయలు, బీన్స్, చిక్కుళ్ళు, చిక్‌పీస్, గింజలు, విత్తనాలు మొదలైనవి చేర్చండి" అని చెబుతున్నారు.

ఆహారం, జీర్ణవ్యవస్థ, మలవిసర్జన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆరోగ్యానికి మంచి ఆహారం, నిద్ర అవసరం.
ఆహారం, జీర్ణవ్యవస్థ, మలవిసర్జన

మనం తినే ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంతో పాటు, ఈ సూక్ష్మజీవులు మన శరీరంలో జరిగే వివిధ క్రియలను నియంత్రిస్తాయని జూలియానా సారెజ్ చెప్పారు.

''అంటే, అవి మన మానసిక స్థితి నుంచి రోగనిరోధక వ్యవస్థ వరకు ప్రతిదానినీ నియంత్రిస్తాయి. కాబట్టి ఈ సూక్ష్మజీవులు ఆరోగ్యానికి ప్రధానమైనవి'' అని తెలిపారు.

"ఇవి జీవక్రియ ఆరోగ్యం, గుండె ఆరోగ్యం, హార్మోన్ల ఆరోగ్యం, చర్మ ఆరోగ్యాన్ని నియంత్రిస్తాయి. సూక్ష్మజీవులు వృద్ధి చెందాలంటే, ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం కాకుండా, పీచు ఎక్కువగా ఉండే పదార్థాలను తినాలి" అని చెప్పారు.

ఇంకా, సూక్ష్మజీవుల ఆవాసానికి అనేక విషయాలతో సంబంధముంటుంది. ఒత్తిడి, యాంటీబయాటిక్స్ దీర్ఘకాలిక వినియోగం, కదలకుండా కూర్చోవడం వంటి అనేక అంశాలతో ఇది ముడిపడి ఉంటుంది.

ఆహారం, జీర్ణవ్యవస్థ, మలవిసర్జన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మంచి ఆహారం ఎంచుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.

"వైవిధ్యమైన సూక్ష్మజీవులు ఉన్న వ్యక్తులు మంచి జీర్ణవ్యవస్థను కలిగి ఉంటారు, వారు అనేక రకాల ఆహారం తీసుకుంటారు. బాగా నిద్రపోతారు" అని జూలియానా తెలిపారు.

ఏమి తినాలి, ఏమి తినకూడదు అనే దానిపై ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల ఆందోళన కలుగుతుందని, ఆహారాన్ని ఆస్వాదించడం కష్టమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

"ఇది పరిపూర్ణమైన ఆహారం గురించి కాదు, మంచివాటిని ఎంచుకోవడం గురించి.. దీనికెప్పుడూ మినహాయింపులుంటాయి''

తాను చూసే చాలా మంది రోగులు గట్ మైక్రోబయోమ్‌ను తీవ్రంగా దెబ్బతీశారని, మిగతావన్నీ ప్రమాదకరమని భావించి వారు చికెన్‌ను క్యారెట్‌తో తింటారని ఆమె చెప్పారు.

"ఆహారం వల్ల ఇలాంటి లక్షణాలు కలిగినప్పుడు, జీర్ణక్రియ కష్టమవుతుంది, అప్పుడు ప్రజలు సోషల్ మీడియా, మీడియాలో ఆహారాన్ని విమర్శిస్తారు. అది తెలియని ఆందోళనకు కారణమవుతుంది. రోజువారీ ఆహారం నుంచి మరిన్ని పదార్థాలను తొలగించడానికి దారితీస్తుంది. ఈ విషయం గ్రహించే సమయానికి, ఆరోగ్యకరమైన సూక్ష్మజీవులకు అవసరమైన అనేక పదార్థాలను వారి ఆహారం నుంచి అప్పటికే తొలగించి ఉంటారు'' అని ఆమె వివరించారు.

ఆహారం, జీర్ణవ్యవస్థ, మలవిసర్జన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బొమ్మల రూపంలో ఇస్తే పిల్లలు పండ్లు, కూరగాయలు తింటారని డాక్టర్లు చెప్పారు.
ఆహారం, జీర్ణవ్యవస్థ, మలవిసర్జన

"ఈ సమస్యలలో చాలా వరకు బాల్యంలోనే ప్రారంభమవుతాయి" అని డాక్టర్ జూలియానా అంటున్నారు.

"పిల్లల పెంపకంలో కొన్ని విషయాలుంటాయి. ఉదాహరణకు.. పాటీ శిక్షణ, ఇది పిల్లలకు చాలా బాధాకరమైనది. లేదా, పిల్లల ఆహారంలో పండ్లు, కూరగాయలను చేర్చడం. ఇది కూడా అంత సులభం కాదు"

పిల్లలకు చిన్నప్పటి నుంచే పండ్లు, కూరగాయలు తినడం తల్లిదండ్రులు అలవాటు చేయలేకపోతున్నారు. వాటిని బొమ్మల రూపంలో అందించడం బాగా ఉపయోగపడుతుంది.

"ఉదాహరణకు, ఒక బొమ్మకు అవకాడోతో ఒక మాస్క్ వేయొచ్చు. దానిని పిల్లలు తినరు. కానీ అది పిల్లలకు అవకాడోను పరిచయం చేస్తుంది. పెద్దయ్యాక డైట్‌లో దాన్నిచేర్చుకోవానికి వీలు కలుగుతుంది'' అని ఆమె తెలిపారు.

కొత్త వాసనలు, అభిరుచులు, ఆకారాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జూలియానా చెప్పారు. ఇది జీవితంలో ఏ దశలోనైనా చేయొచ్చని, ఇలా తాను చేశానని అన్నారు.

"నాకు వంకాయ ఇష్టం ఉండదు, కానీ రెండేళ్ల క్రితమే నేను దాన్ని తినడం నేర్చుకున్నా. నాకు అవకాడో ఇష్టం లేదు. కానీ ఆ రుచికి అలవాటు పడకపోతే, ఇక మనం దానిని తినలేం'' అని చెప్పారు.

''మన జీర్ణవ్యవస్థలోని సూక్ష్మజీవులను ఈ కొత్త ఆహారాలకు అలవాటు చేయడం ద్వారా మన టేస్ట్ బడ్స్‌‌కు కూడా శిక్షణ ఇస్తాం. సూక్ష్మజీవులను బట్టి రుచి తేడా ఉంటుంది" అని జూలియానా తెలిపారు.

ఆహారం, జీర్ణవ్యవస్థ, మలవిసర్జన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మనకు ఏం కావాలో మన శరీరం చెబుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఆహారం, జీర్ణవ్యవస్థ, మలవిసర్జన

మనకు అందుబాటులో చాలా సమాచారం ఉన్నప్పటికీ, ప్రజలు తమ శరీరాల గురించి ఎంత తక్కువగా తెలుసుకున్నారో , ప్రశ్నలు అడగడం వల్ల వారు ఎంత అసౌకర్యంగా భావిస్తున్నారో చూసి తాను ఆశ్చర్యపోతున్నానని డాక్టర్ చెప్పారు.

"సరిగ్గా మలవిసర్జన చేయని వ్యక్తులు శరీరాన్ని శుభ్రపరచడం గురించి అడుగుతారు. మనుషులుగా, మన శరీరంలో వివిధ పనులు చేసే అవయవాలు ఉన్నాయి. మనకు మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, వ్యర్థాలను నిర్వహించే పెద్దప్రేగు ఉన్నాయి"

"మనకు దాని గురించి తెలిస్తే, మన శరీరాలను శుభ్రపరచుకోవాల్సిన అవసరం లేదని అనిపించదు. దీనికి బదులు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తింటాం, వ్యాయామం చేస్తాం, బాగా నిద్రపోతాం, మలవిసర్జన సరిగ్గా జరిగేలా చూసుకుంటాం" అని డాక్టర్ జూలియానా అన్నారు.

''మీ శరీరం చెప్పేది వినండి. మనకు ఏది అవసరమో శరీరమే మొదటగా చెప్తుంది.

జిమ్‌కి లేదా పనికి వెళ్లడానికి ఉదయాన్నే నిద్రలేచి అల్పాహారం మానేసే చాలా మందిని మనం చూస్తుంటాం, కాబట్టి ఉదయం పూట మలవిసర్జన చేయాల్సిన అవసరం తరచుగా ఆఫీసులో వస్తుంటుంది. కానీ, ఎవరో ఏదో అనుకుంటారన్న భావనతో ఆపుకుంటారు.

జీర్ణవ్యవస్థ నోటిని, మలద్వారాన్ని కలిపే చాలా ప్రత్యేకమైన ట్యూబ్ అని గ్రహించలేం. దాని ద్వారానే పోషకాలు గ్రహించి వ్యర్థాలు విడుదలవుతాయి. ప్రతిరోజూ వ్యర్థాలను తొలగించకపోతే, మలవిసర్జన చేయడానికి తగినంత సమయం తీసుకోకపోతే, సమస్యలను ఎదుర్కొంటారు" అని జూలియానా సువారెజ్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)