మొసళ్లతో పోరాడి సోషల్ మీడియాలో వీడియో పెట్టిన 'ది రియల్ టార్జాన్'పై దర్యాప్తు

ఫొటో సోర్స్, Instagram
- రచయిత, కేటీ వాట్సన్ , టిఫనీ టర్న్‌బుల్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో మొసళ్లను పట్టుకున్నట్లు వీడియో తీసిన వ్యక్తిపై అధికారులు విచారణ ప్రారభించారు. మైక్ హోల్‌స్టన్ అనే ఆ వ్యక్తి అమెరికా పౌరుడు.
లక్షలాది ఫాలోయర్లు ఉన్న హోల్‌స్టన్, తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేసిన రెండు వీడియోలు విమర్శల పాలయ్యాయి. అందులో ఒకటి మంచినీటి మొసలితో పోరాడుతున్నట్లు ఉండగా, మరొకటి ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక జంతువులలో ఒకటైన ఉప్పునీటి మొసలిని ఆయన పట్టుకున్నట్లు ఉంది.
అయితే, ఈ వీడియోలను ‘‘అవగాహన" కోసం రూపొందించినట్లు హోల్‌స్టన్ చెబుతున్నారు. కానీ, ఆయన ప్రవర్తన క్రూరంగా ఉందని వన్యప్రాణుల నిపుణులు విమర్శిస్తున్నారు.
హోల్‌స్టన్ చర్య చాలా ప్రమాదకరమైనదని, చట్ట విరుద్ధమని క్వీన్స్‌లాండ్ అధికారులు అన్నారు. గరిష్టంగా రూ. 21.8 లక్షల వరకు జరిమానా పడవచ్చని చెప్పారు.
"ది రియల్ టార్జాన్" పేరుతో ఆన్‌లైన్‌లో పాపులరైన మైక్ హోల్‌స్టన్, గతవారం క్వీన్స్‌లాండ్‌లో మొసళ్లను వెంటాడి పట్టుకుంటున్నట్లు చూపించే వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
ఒక వీడియోలో, హోల్‌స్టన్ మంచినీటి మొసలిని పట్టుకోవడానికి లోతులేని నీటిలోకి దూకుతారు. మొసలిని పట్టుకోవడానికి ముందు, అది ఆయనను కరుస్తుంది. ఆయనకు రక్తం కారుతుంది.
"నా కల నిజమైంది" అని హోల్‌స్టన్ చెబుతూ, ఆస్ట్రేలియాను సందర్శించడం తన చిన్ననాటి కోరిక అని చెప్పారు.
ప్రపంచంలోని అత్యంత దూకుడుగా ఉండే సరీసృపాలలో ఒకటైన ఉప్పునీటి మొసలిని పట్టుకోవడానికి ఆయన చిత్తడి నేలలోకి వెళ్తున్నట్లు మరొక వీడియోలో ఉంది.
హోల్‌స్టన్ దాని మెడ పట్టుకుని కెమెరా కోసం దానిని పైకి ఎత్తారు. ఆ క్షణంలో మొసలి చాలా బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తుంది.

ఆస్ట్రేలియా ఏమంటోంది?
ఆ రెండు వీడియోలలో ఆయన మొసళ్లను తిరిగి అడవిలోనే వదిలేసినట్లు కనిపిస్తుంది. అయితే, కేప్ యార్క్‌లోని లాక్‌హార్ట్ నది వద్ద చిత్రీకరించినట్లు కనిపిస్తున్నఈ ఘటనలపై దర్యాప్తు చేస్తున్నట్లు క్వీన్స్‌లాండ్ ఎన్విరాన్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
"శిక్షణ, లైసెన్స్ లేకుండా క్వీన్స్‌లాండ్‌లో మంచినీటి లేదా ఉప్పునీటి మొసళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించకూడదు" అని అందులో తెలిపారు.
ఉప్పునీటి మొసలిని పట్టుకుంటే 8,345 ఆస్ట్రేలియన్ డాలర్లు ( సుమారు రూ. 4,87,329) జరిమానా విధించవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో జరిమానాలు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటాయి.
ప్రమాదకరమైన మొసళ్లతో పోరాటాల వంటి సంఘటనలను నిలువరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరుడు కొత్త చట్టాలను కూడా తీసుకువచ్చింది. 'మొసళ్లను ఆకర్షించే ఆహారాన్ని బహిరంగ ప్రదేశాల్లో ఉంచడం చట్టవిరుద్ధం' అన్నది ఇందులో ఒకటి.
ఓవైపు లైక్స్, మరోవైపు విమర్శలు
హోల్‌స్టన్ వీడియోలను ఆన్‌లైన్‌లో చాలామంది వీక్షించి, లైక్ చేసినప్పటికీ, ఆయన చర్యలపై విమర్శలు కూడా పెరుగుతున్నాయి.
మైక్ హోల్‌స్టన్ వీడియోలపై మొసళ్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియన్ నేచురలిస్ట్ స్టీవ్ ఇర్విన్ తండ్రి కూడా ఈ ఘటనను విమర్శించారు. ఆస్ట్రేలియన్ వన్యప్రాణులను గౌరవించని హోల్‌స్టన్ వంటి వ్యక్తులను "బయటకు పంపాలి" అని అన్నారు.
హోల్‌స్టన్ ప్రవర్తన తన కొడుకు పనిలాంటిది కాదని ఆయన నొక్కి చెప్పారు. 2006లో 44 సంవత్సరాల వయసులో స్టీవ్ ఇర్విన్ మరణించారు.
"ఇది స్టీవ్ ఇర్విన్ గురించి కాదు, ఇది రక్షిత జంతువులతో చట్టవిరుద్ధంగా ప్రవర్తించే వ్యక్తి గురించి. మొసళ్లతో ఎలా నడుచుకోవాలో తెలిసిన వాళ్లకు వాటిని పట్టుకుంటే సరిగా స్పందించవని తెలుసు. వాటికి ఒత్తిడిని కలిగించకుండా సురక్షితంగా పనిచేయడం ఒక ప్రత్యేక నైపుణ్యం. ఈ వ్యక్తికి తానేం చేస్తున్నాడో కూడా స్పష్టంగా తెలియదు" అని అన్నారు.
ప్రమాదకరమైన వన్యప్రాణులతో విన్యాసాలను సోషల్ మీడియా ప్రోత్సహిస్తోందని, కఠినమైన శిక్షలు విధించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, ప్రస్తుత జరిమానాలు ఆన్‌లైన్‌లో సంపాదించగల డబ్బుతో పోలిస్తే చాలా తక్కువని అభిప్రాయపడ్డారు.
"ఇలాంటి పోస్ట్‌లు మనుషులకు, జంతువులకు చాలా హానికరం" అన్నారాయన.
మొసళ్లను వదిలేశాను: హోల్‌స్టన్
హోల్‌స్టన్ తన ఉప్పునీటి మొసలి వీడియో కింద ఒక కామెంట్‌లో తనను తాను సమర్థించుకున్నారు. కొన్ని ఫోటోలు తీసుకున్న తర్వాత ఆ జంతువును వదిలేసినట్లు ఆయన తెలిపారు.
"ఈ వీడియోల వంటివి తీయాలని, అలా ప్రవర్తించాలని నేను ఎవరినీ ప్రోత్సహించను" అని హోల్‌స్టన్ అన్నారు.
'సోషల్ మీడియా ఫన్' కోసం జంతువులను ఇబ్బందుల పాలు చేసిన ఘటన ఆస్ట్రేలియాలో గతంలో కూడా జరిగింది.

ఫొటో సోర్స్, Socialmedia
కొన్నినెలల ముందు, అమెరికన్ ఇన్‌ఫ్లుయెన్సర్ సామ్ జోన్స్ రోడ్డు పక్కన నుంచి ఒక పిల్ల వొంబాట్‌ను తీసుకొని పరిగెత్తుతుండగా దాని తల్లి ఆమె వెంట పడింది. ఈ దృశ్యాన్ని సామ్ వీడియో తీశారు. ఆమె వొంబాట్‌తో నవ్వుతూ పరిగెత్తడం వీడియోలో కనిపించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఆ వీడియోపై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ కూడా స్పందించారు. ఎదురుతిరిగి పోరాడే జంతువులతో అలా చేసి చూడాలని సవాల్ చేశారు.
"తల్లి నుంచి ఒక మొసలి పిల్లను తీసుకొని ఎలా వెళ్లగలరో చూడండి" అని అన్నారు.
ఈ ఘటన తర్వాత, సామ్ జోన్స్ ఆస్ట్రేలియాను వదిలివెళ్లారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














